ట్రంప్ లైవ్ కట్ చేసిన టీవీ చానెళ్లు! పదేపదే అబద్ధాలు చెబుతున్నారని ఫైర్
posted on Nov 6, 2020 @ 12:04PM
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వెనుకంజలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎన్నికల్లో డెమాక్రాట్లు అక్రమాలకు పాల్పడుతున్నారని, న్యాయ పోరాటం చేస్తానని చెబుతున్న ట్రంప్ కు.. సోషల్ మీడియా సంస్థలు, అమెరికా టీవీ చానెళ్లు కూడా దిమ్మతిరిగే షాకులిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ తరువాత డొనాల్డ్ ట్రంప్ తొలిసారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మాట్లాడుతుండగా, పలు టీవీ చానెళ్లు, ఆ ప్రసారాన్ని మధ్యలోనే నిలిపివేశాయి.
ట్రంప్ ప్రసంగాన్ని 17 నిమిషాల పాటు ప్రత్యక్ష ప్రసారం చేసిన అనంతరం ఎంఎస్ఎన్బీసీ చానెల్ అర్ధాంతరంగా కట్ చేసింది. ట్రంప్ మాట్లాడుతుండగానే... అ టీవీ చానెల్ యాంకర్ బ్రియాన్ విలియమ్స్ కల్పించుకుని, "సరే... మనం ఇప్పుడు అధ్యక్షుడి ప్రసంగానికి అంతరాయం కల్పించాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నాం" అని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే ఆయన ప్రసంగాన్ని టీవీ చానెల్ నిలిపివేసింది. ఎన్బీసీ, ఏబీసీ న్యూస్ టీవీ చానెళ్లు కూడా ట్రంప్ లైవ్ కవరేజ్ ని నిలిపివేశాయి. "ఎంత దురదృష్టకరమైన రాత్రి? అమెరికా అధ్యక్షుడే స్వయంగా ప్రజలపై విమర్శలు గుప్పిస్తున్నారు. అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారు" అని సీఎన్ఎన్ యాంకర్ జేక్ టాపర్ వ్యాఖ్యానించారు. ఆయన ఆరోపణలకు ఒక్క సాక్ష్యం కూడా లేదని ఆయన అన్నారు.
మరోవైపు వైట్‌హౌస్‌లో మీడియా సమావేశంలో ఎన్నికల్లో డెమొక్రాట్లు మోసానికి పాల్పడుతున్నారని మరోసారి ఆరోపించారు డొనాల్డ్ ట్రంప్. మెయిల్-ఇన్ ఓటింగ్ ఒక అవినీతి వ్యవస్థ అన్నారు. మీడియా, టెక్ జోక్యం ఉన్నప్పటికి నేను ఇప్పటికే అనేక నిర్ణయాత్మక రాష్ట్రాలను గెలుచుకున్నాను. వారంతా ఊహించినట్టు ఎక్కడా బ్లూ వేవ్ లేదు, దానికి బదులుగా రెడ్ వేవ్ ఉంది. సెనేట్ విషయంలో అద్భుతమైన పనితీరు కనబర్చాం. మరింత మంది రిపబ్లికన్ మహిళలు కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు’ అని ట్రంప్ కామెంట్ చేశారు. మెయిల్-ఇన్ బ్యాలెట్లను అవినీతి వ్యవస్థగా అభివర్ణించారు. ‘మెయిల్-ఇన్ ఓటింగ్ ఒక అవినీతి వ్యవస్థ. వారికి ఎన్ని ఓట్లు అవసరమో తెలుసుకుని.. ఆగి.. ఆ ఓట్లను కనుగొంటున్నారు. వారు అకస్మాత్తుగా బ్యాలెట్లను కనుగొంటున్నారు.. అవన్నీ ఏకపక్షంగా ఉన్నాయి’ అని అన్నారు. పెన్సిల్‌వేనియాలోని మెషీన్లు డెమొక్రాట్ల అవినీతి రాజకీయ వ్యవస్థలో భాగమని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.