బీజేపీలోకి తీగల కృష్ణారెడ్డి? గులాబీకి గ్రేటర్ షాక్!
posted on Nov 6, 2020 @ 12:13PM
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ముందు అధికార టీఆర్ఎస్ కు భారీ షాక్ తలగబోతున్నట్లు కనిపిస్తోంది. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే, హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి బీజేపీలో చేరబోతున్నారని తెలుస్తోంది. టీఆర్ఎస్ లో కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్న తీగల... పార్టీ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనడం లేదు. దీంతో తీగలను తమ పార్టీలో చేర్చుకునేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు రాయబారాలు చేశారని తెలుస్తోంది. తీగలతో కమలం నేతల చర్చలు ఫలించాయని.. ఈ రెండు ,మూడు రోజుల్లోనే తీగల కృష్ణారెడ్డి కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమని చెబుతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో హైదరాబాద్ మేయర్ గా పని చేశారు తీగల కృష్ణా రెడ్డి. 2014 ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి కారు గుర్తుపై పోటీ చేసి ఓడిపోయారు. తీగలపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించారు. తర్వాత రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి గులాబీ పార్టీలో చేరారు. తర్వాత ఆమెను మంత్రివర్గంలోకి తీసుకున్నారు కేసీఆర్. సబిత టీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి తీగల అసంతృప్తిగానే ఉన్నారు. సబితకు మంత్రి పదవి ఇచ్చాక ఆయన రాజకీయాల్లో సైలెంట్ గా మారిపోయారని చెబుతున్నారు
సబితకు మంత్రి పదవి వచ్చాకా మహేశ్వరం నియోజకవర్గంలో తీగల హవా పూర్తిగా తగ్గిందని చెబుతున్నారు. ప్రభుత్వంతో పాటు పార్టీలోనూ పెత్తనమంతా సబిత చేతిలోకి వెళ్లడంతో ఆయన టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు కూడా అంటిముట్టనట్లుగానే హాజరవుతున్నారు. ఈ సంవత్సరం ఆరంభంలో జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆయన యాక్టివ్ గా పని చేయలేదు.తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. సంగతి తెలిసిందే. మహేశ్వరం టీఆర్‌ఎస్ జడ్పీటీసీగా ఉన్న తీగల అనితారెడ్డి.. జెడ్పీ చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి గట్టి పోటీని ఎదుర్కొవాల్సి వచ్చింది. మహేశ్వరం నియోజరవర్గం పరిధిలోని మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్లన్ని సబిత సూచించిన వారికే వచ్చాయని తెలుస్తోంది. దీంతో పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవడం తీగల కృష్ణా రెడ్డి పూర్తిగా మానేశారని చెబుతున్నారు.
గ్రేటర్ ఎన్నికలు డిసెంబర్ లోనే జరిగే అవకాశం ఉండటంతో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. గెలుపే లక్ష్యంగా పోటాపోటీ ఎత్తులు వేస్తున్నాయి. ఇతర పార్టీల్లోని బలమైన నేతలను తమవైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. మంత్రి కేటీఆర్ స్కెచ్ లో భాగంగా ఇటీవలే జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ శ్రీధర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. గ్రేటర్ లోని మరికొందరు కమలం నేతలపై కారు పార్టీ నేతలపై ఆకర్ష్ వల వేసినట్లు చెబుతున్నారు. దీంతో అప్రత్తమైన కమలం నేతలు.. అధికార పార్టీకి కౌంటర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే టీఆర్ఎస్ లో కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న తీగలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది తీగల కృష్ణారెడ్డితో సంజయ్ టీమ్ జరిపిన చర్చలు ఫలించాయని, త్వరలోనే ఆయన బీజేపీలో చేరుతారని చెబుతున్నారు.
గతంలో హైదరాబాద్ మేయర్ గా పనిచేసిన తీగలకు నగర వ్యాప్తంగా కేడర్ ఉంది. మహేశ్వరంతో పాటు శివారు నియోజకవర్గాల్లోనూ ఆయన భారీగా అనుచరులు ఉన్నారు. తీగలతో పాటు వారంతా బీజేపీ లో చేరుతారని తెలుస్తోంది.తీగల కృష్ణారెడ్డి చేరికతో గ్రేటర్ లో తమకు భారీగా ప్రయోజనం కల్గుతుందని కమలం నేతలు ఆశిస్తున్నారు.