ఇరిగేషన్ అధికారిపై గరంగరం! మంత్రి వారించినా వినని ఎమ్మెల్యే
posted on Nov 6, 2020 @ 4:02PM
ఇరిగేషన్ అధికారులపై అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. సమీక్షా సమావేశంలోనే ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. సమావేశంలో పాల్గొన్న మంత్రి వారిస్తున్నా వినలేదు ఆ ఎమ్మెల్యే. అధికారులపై ఆయన ఆగ్రహంగా ఊగిపోయారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు హన్మకొండ హరిత కాకతీయ హోటల్‌లో నిర్వహించిన దేవాదుల ఎత్తిపోతల పథకంపై రివ్యూ సమావేశానికి హాజరయ్యారు. రివ్యూ మీటింగ్‌లో ఇరిగేషన్ అధికారులపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ జిల్లాలో కలెక్టర్ తో కలిసి నీళ్లు కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తుంటే అధికారులు సహకరించడం లేదంటూ బిగ్గరగా అరిచారు. పక్కనే కూర్చున్న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కూల్ చేయాలని చూసినా శాంతించలేదు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.
దేవాదుల ప్రాజెక్టు ఎస్ఈ బంగారయ్య పనులను కనీసం పరిశీలించకుండా సమస్యను జఠిలం చేస్తున్నారని ముత్తిరెడ్డి ఆరోపించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డిలు కూడా ఈ విషయంలో ఆందోళన చేస్తున్నారన్నారు. అధికారుల నిర్లక్ష్యం వలన ఎమ్మెల్యేల మధ్య గొడవలు అవుతున్నాయని.. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆరోపించారు.
అయితే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తీరుపై ఉన్నతాధికారులు అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. సమావేశంలో అసలు విషయం చర్చించడానికి కూడా అధికారులకు సమయం ఇవ్వకుండా అలా అరవడమేంటనీ వారు మంత్రికి చెప్పారని తెలుస్తోంది. గతంలోనూ ముత్తిరెడ్డి అధికారుల విషయంలో వివాదాలు ఎదుర్కొన్నారు. చెరువు భూమి విషయంలో గత కలెక్టర్ తోనూ ఓసారి ఆయన గొడవ పడ్డారు. తాజా ఘటనపైనా అధికారులు ఆగ్రహంగా ఉండటంతో .. ఇది ఎంత వరకు వెళుతోందని జనగామ జిల్లాలో చర్చ జరుగుతోంది.