పీసీసీ పగ్గాలు సరే.. కారు, కాంగ్రెస్ కలిస్తే? రేవంత్ దారేది..?
posted on Jun 23, 2021 @ 3:40PM
రేపోమాపో పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పేరు ప్రకటన. ఇప్పటికే ఖరారైనా ఎందుకో ఆలస్యం అవుతోంది. హస్తినలోనే మకాం వేసిన రేవంత్.. తన పేరు ప్రకటించే దాకా ఢిల్లీని వీడేలా లేరు. కోమటిరెడ్డి నుంచి గట్టి పోటీ వస్తున్నా.. వర్కింగ్ ప్రెసిడెంట్‌నే ఫుల్‌రేంజ్ ప్రెసిడెంట్‌గా చేసేందుకు హైకమాండ్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. సీనియర్లు అసంతృప్తితో రగిలిపోతున్నా.. వారిని ఏదో ఒక పదవితో సంతృప్తి పరిచేలా కసరత్తు జరుగుతోంది. అందుకే మరింత ఆలస్యం అవుతోందని సమచారం.
లేటైనా.. లేటెస్ట్‌గా జెట్ స్పీడ్‌తో దూసుకురాబోతున్నారు రేవంత్‌రెడ్డి. ఆయన టార్గెట్ ఒక్కటే. తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడం.. అనేకన్నా.. తాను ముఖ్యమంత్రి కావడం.. కేసీఆర్‌ను ఒక్కరోజైనా జైల్లో కూర్చోబెట్టడం. ఇదే ఆ డైనమిక్ లీడర్ జీవితలక్ష్యం. ఆ టార్గెట్‌ను రీచ్ అవడానికి ఆయన ముందున్న బెస్ట్ ఆప్షన్ కాంగ్రెస్. అందుకే, ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నాక.. ఇక టీడీపీతో వర్కవుట్ కాదని.. హస్తం పార్టీని ఆశ్రయించారు. అనతికాలంలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. ఇప్పుడు పీసీసీ చీఫ్ పోస్ట్‌కు అడుగు దూరంలో ఉన్నారు. పదవి పట్టి.. కేసీఆర్‌ను కొట్టాలనేది రేవంత్ టార్గెట్. కానీ....
రాజకీయాల్లో ఈ 'కానీ' కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. 'కానీ' అనే పదం కనిపించిందో ఏదో తేడా ఉన్నట్టే. రేవంత్ లెక్కంతా బాగానే ఉంది. సమర్థుడు, సరైనోడు, సత్తా ఉన్నోడు.. రేవంత్‌రెడ్డితో కాంగ్రెస్‌కు అన్నీ అడ్వాంటేజీలే. కానీ, అది ప్రాంతీయ పార్టీ కాకపోవడం.. రేవంత్ నిర్ణయమే ఫైనల్ కాకపోవడం.. ప్రతీదానికీ హైకమాండ్ పర్మిషన్ తప్పనిసరి కావడం.. ఆయనకు పెద్ద మైనస్. ఎంత స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాలనుకున్న.. ఆ స్వతంత్రత అధిష్టానం ఆలోచనలకు అనుగుణంగానే ఉండాలి. అంతేకానీ, కేసీఆర్‌ను జైల్లో పెడతా.. కేసీఆర్‌ను కుమ్మేస్తా.. అంటేకూడా దానికి 10-జన్‌పథ్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలి. ఇక్కడే యవ్వారం బెడిసికొట్టేలా ఉంది. రేవంత్‌రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టాక.. కేసీఆర్‌పై దూకుడుగా ముందుకెళ్లాక.. చివరాఖరును వ్యూహం బెడిసికొడితే? మాయల మరాఠి కేసీఆర్.. రేవంత్ ఎదురుదాడిని కాచుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి నరుక్కొస్తే..? అప్పుడు రేవంత్‌రెడ్డి పరిస్థితి ఏంటనేది చెప్పడం కష్టం. ఎందుకంటే, జాతీయ స్థాయిలో పరిణామాలు అంత వేగంగా మారుతున్నాయి కాబట్టే.. ఇలాంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మోదీని గద్దె దింపేందుకు, రాహుల్‌ను ప్రధాని చేసేందుకు... పాపులర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే శరద్‌పవార్‌తో పాటు పలు పార్టీల అధినేతలు, ముఖ్యమంత్రులతో ఓ దఫా చర్చలు కూడా జరిపారు. అందులో భాగంగా యూపీఏ కూటమిలో భాగస్వామ్యం చేసేందుకు కేసీఆర్‌నూ లైన్లో పెట్టారని అంటున్నారు. అదే నిజమైతే.. అది రేవంత్‌రెడ్డికి ఇబ్బందికర పరిణామమే. రాహుల్‌గాంధీని ప్రధాని చేయడమే కాంగ్రెస్ ఏకైక లక్ష్యం. ఆ గోల్ రీచ్ అవడానికే రేవంత్‌రెడ్డిలాంటి లీడర్లను వాడుకుంటుంది కానీ.. రేవంత్‌కు మంచి చేయాలనేది కాంగ్రెస్ ఉద్దేశ్యం కానేకాదు. ఆ లెక్కన.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ కూటమికి కేసీఆర్ సపోర్ట్ అవసరమైతే.. ఆ రెండు పార్టీలు నిస్సందేహంగా కలిపిపోతాయని అంటున్నారు. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చరిత్ర కేసీఆర్‌ది కాబట్టి.. మరోసారీ అలా జరిగే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు.
మరి, ఆ అంచనానే నిజమైతే.. రేవంత్‌రెడ్డి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా మారే ప్రమాదం ఉంది. పీసీసీ చీఫ్‌గా రానున్న రెండున్నరేళ్లు కేసీఆర్‌తో యుద్ధం చేసి.. క్లైమాక్స్‌లో అంతా తూచ్.. మనం మనం ఒకటే అనే పరిస్థితే వస్తే..? హైకమాండ్‌ను ఎదిరించనూ లేడు.. అలాగని కేసీఆర్‌తో చేతులు కలపనూ లేడు.. అస్సలు కాంప్రమైజ్ అయ్యే రకం కానేకాదు రేవంత్‌రెడ్డి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అంటారు కాబట్టి.. తప్పనిసరి అయితే అటు కాంగ్రెస్ కేసీఆర్ మద్దతు తీసుకోవచ్చు.. ఇటు కేసీఆర్ సైతం కాంగ్రెస్‌కు జై కొట్టొచ్చు. మధ్యలో రేవంత్‌రెడ్డే ఆగమయ్యేలా ఉన్నాడని అంటున్నారు. అందుకే, పీసీసీ చీఫ్ కాగానే పండగ కాదని.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించడం ఎంతముఖ్యమో.. టీఆర్ఎస్-కాంగ్రెస్ కలవకుండా ఉండటమూ అంతే ముఖ్యం. అందుకే, రేవంత్‌రెడ్డి భవిష్యత్తు ఆయన చేతుల్లో కాకుండా.. కేసీఆర్-రాహుల్‌గాంధీ అవసరాలను బట్టి ఉండబోతోందని అంచనా వేస్తున్నారు. అసలు జరుగుతుందో లేదో తెలీని ఊహాత్మక అంచనాలను పట్టించుకోకుండా.. కేవలం వర్తమానాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని తన పని తాను చేసుకుపోతున్నాడు రేవంత్‌రెడ్డి. అందులో భాగంగా తన ఫస్ట్ టార్గెట్ పీసీసీ చీఫ్ పగ్గాలు చేపట్టేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఇక రేవంత్ నెక్ట్స్ టార్గెట్.. కేసీఆర్‌ను ఢీ కొట్టడమే.. దేత్తడి.. పోచమ్మ గుడి....