జగన్ సర్కార్ కు షేమ్..! అవార్డు తిరస్కరించిన మరో జర్నలిస్ట్
posted on Aug 6, 2021 @ 11:56AM
ఆంధ్రప్రదేశ్ లోని జగన్ రెడ్డి ప్రభుత్వానికి అన్నింటా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలపై న్యాయ స్థానాలు ఎన్నోసార్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కొన్నింటిని రద్దు చేశాయి. మరికొన్నింటిని కోర్టు హెచ్చరికలతో ప్రభుత్వమే వెనక్కి తీసుకుంది. తాజాగా జగన్ రెడ్డి ప్రభుత్వానికి దారుణమైన పరాభవం ఎదురైంది. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన అవార్డును తిరస్కరించి షాకిచ్చారు ఓ సీనియర్ జర్నలిస్ట్. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, మీడియాపై ఆంక్షలకు నిరసనగా తాను అవార్డును స్వీకరించడం లేదని ప్రకటించారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాలకు చెందిన సంస్థలు, ప్రతిభ కనబర్చిన వ్యక్తులు, కళాకారులకు వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్, అచీవ్‌మెంట్ పురస్కారాలను ప్రకటించింది. 31 మంది లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్, 32 మంది అచీవ్‌మెంట్ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఇందులో జర్నలిస్టుల విభాగంలో సీనియర్ జర్నలిస్టు తెలకపల్లి రవికి అవార్డు ప్రకటించింది. అయితే, ఈ అవార్డును తిరస్కరిస్తున్నట్లు తెలకపల్లి రవి ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలోనూ స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఉన్న వివాదాస్పద రాజకీయ మీడియా, సామాజిక మాధ్యమాల వాతావరణంలో ఈ అవార్డును స్వీకరిండం లేదని తెలకపల్లి రవి తెలిపారు. అయితే, ఈ పురస్కారం తనకు ఇస్తానని ప్రకటించిన తన పట్ల గౌరవాదరణ కనబర్చిన ఏపీ ప్రభుత్వం, కమిటీ మిత్రులకు, ధన్యవాదాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వం అవార్డులను ప్రకటించిన రోజే మరో సీనియర్ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్ కూడా ఈ అవార్డును తిరస్కరించారు. ఇప్పుడు తెలకపల్లి రవి కూడా తిరస్కరించడం ఏపీ ప్రభుత్వానికి షాకింగ్ గా మారింది. లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ కింద రూ.10 లక్షలు, అచీవ్‌మెంట్ కింద రూ.5 లక్షలు, జ్ఞాపిక అందజేసి ఆగస్టు 14న లేక 15న సత్కరించనుంది ఏపీ ప్రభుత్వం.