ప్రజా బంధు, త్యాగశీలి కాకాని వెంకటరత్నం
posted on Aug 6, 2021 @ 10:55AM
ఉక్కు కాకానిగా పిలుచుకునే కాకాని వెంకటరత్నం జీవితమంతా త్యాగమయమే. ఈ మహానేత దివికేగి సుమారు 50 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా ఆయన ప్రజల మనసుల్లో నిలిచే ఉన్నారు. రైతు కుటుంబంలో పుట్టి, 5వ తరగతి మాత్రమే చదివిన కాకాని.. స్వాతంత్ర సంగ్రామంలో గాంధీ చేపట్టిన ప్రతి ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. పలుమార్లు జైలు కెళ్లారు. స్వాతంత్ర్య సాధన అనంతరం జిల్లా బోర్డ్ అధ్యక్షునిగా , ఏపి కాంగ్రెస్ అధ్యక్షునిగా పని చేశారు. ఏపీ ఏర్పడ్డాకా మంత్రిగా పని చేసిన కాకాని వెంకటరత్నం.. 1972లో ఎగసిపడిన జై ఆంద్రా ఉద్యమంలో మంత్రి పదవి త్యదించారు. ఉద్యమ బాట పట్టి , పోలీస్ కాల్పులకు నేల కొరిగిన విద్యార్ధులకు కోసం సమరశంఖం పూరించారు. బాధిత ఆర్త నాదాలకు గుండెపగిలి అసువులు బాసిన త్యాగధనుడు, ప్రజాబంధు కాకాని వెంకటరత్నం.
1900, ఆగస్టు 3న ఇప్పటి ఉయ్యూరు మండలం లోని ఆకునూరు గ్రామంలో చినతాతయ్య, సీతమ్మ దంపతులకు కాకాని వెంకటరత్నం జన్మించారు. సీతమ్మ చనిపోవడంతో శేషమ్మను ద్వితీయ వివాహం చేసుకున్నాడు చిన తాతయ్య. వ్యవసాయ భూమి ఎక్కువ ఉండడం , పాడి పశువులు ఉండడం వల్ల సీతమ్మ అందరినీ ప్రేమగా ఏ లోటూ లేకుండా పెంచింది. చిన్న తనం నుండి భయం లేకుండా, పిల్లల్ని పోగుచేసి అల్లరి చేసేవాడు కాకాని. ఏదైనా తప్పు చేస్తే నిర్బీతిగా చెప్పేవాడు. ఊరిలో పాఠశాల లేని కారణాన వణుకూరు నుండి పెద్దిబొట్ల నర్సయ్య గారు వచ్చి దేవాలయ ఆవరణలో ప్రైవేటు పాఠాలు చెప్పేవాడు. కాకాని కూడా అక్కడే చదివాడు. చదువులోనూ ముందుండే వాడు. శతకాలు, నామ వాచకం లాంటివి చదివాక తెలుగు భాష మీద పట్టు కుదిరింది. 5వ తరగతి పూర్తయ్యింది. ఆరోజుల్లో విద్య కంటే వ్యవసాయానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు. సోదరులతో పాటు వ్యవసాయంలో దిగి పోయాడు కాకాని. ఎడ్లు, గేదెలు, ఆవులతో ఎప్పుడూ ఏదో ఒక పని ఉండేది. వ్యవసాయ మెళకువలు తెల్సుకుని , నాగలి దున్నేవాడు. కొత్తగా బోదెలు తవ్వించి , తనదైన శైలిలో వ్యవసాయం చేసి అధిక దిగుబడి పొంది అందరిచేతా శభాష్ అనిపించుకున్నాడు కాకాని వెంకటరత్నం.
1920 లో వెంకట సుబ్బమ్మ తో కాకానికి వివాహం జరిగింది. కుమారుడు రామమోహన రావు జన్మించాడు. గాంధీ సత్యాగ్రహ ఉద్యమం ఊపందుకుంది. వ్యవసాయానికి మాత్రమే పరిమితమైన కాకాని , గాంధీ బాట పట్టి శిష్యునిగా మారాడు. చీరాలలో దుగ్గిరాల గోపాల కృష్ణయ్య రామదండు సేవాదళం, జగ్గయ్యపేటలో సాధు రామ కృష్ణయ్య బాలభట సంఘ సేవా దళాలు ఏర్పడితే కాకాని ఉయ్యూరు కేంద్రంగా బాలభట సంఘాన్ని స్థాపించాడు. ఆకునూరులో గ్రంధాలయం ఏర్పాటు చేసి ఉయ్యూరు నుండీ దిన పత్రికలు తీసుకు వచ్చేవారు. హిందీ భాష అవసరాన్ని గుర్తించి ఉత్తర భారతం నుండీ హిందీ పండితుణ్ణి రప్పించి కుందేరులో పాలడుగు శేషాచలం బ్రహ్మచర్య ఆశ్రమంలో హిందీ విద్య ప్రారంభించి తనూ నేర్చు కున్నాడు. 1921 లో విజయ వాడలో అఖిలభారత కాంగ్రెస్ సమావేశాలు 2 లక్షల మంది తో జరిగితే మితృలను 15 మందిని తీసుకుని వంట సరుకులు భుజాన వేసుకుని నడిచి విజయవాడ చేరారు . సమావేశాలకు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 500 మంది రామదండు సైన్యం బారులు తీరి కవాతు చేస్తూ వేదికకు వచ్చిన దృశ్యం చూసి ఉత్తేజి తుడైనాడు. ఎందరో దేశ నాయకులు వచ్చిన ఆ సభకు పింగళి వెంకయ్య త్రివర్ణ పతాకాన్ని మొదటగా రూప కల్పన చేసి ప్రదర్శించాడు. సమావేశ అనంతరం ఖద్దరు ప్రచారం కోసం, తిలక్ స్వరాజ్య నిధి కోసం గాంధీ కృష్ణా జిల్లా పర్యటనకు వస్తే కాకాని తమ స్వగ్రామానికి ఆహ్వానించి ఖద్దరు నిధికి, తిలక్ నిధికి విరాళాలు ఇప్పించాడు.
ఉయ్యూరు లోనూ, కుమ్ముమూరు లో గాంధీ సభలు ఏర్పాటు చేసి భూరి విరాళాలు ఇప్పించాడు కాకాని. 1923 కాకినాడ సభలో బాల భట సంఘ సభ్యులతో సభ అధ్యక్షుడు కొండా వెంకటప్పయ్య అనుమతితో సభ నిర్వహణలో పాల్గొని నేరుగా రాజకీయ సభలో పాల్గొన్నాడు. ఆ సభలో కాకానికి టంగుటూరి ప్రకాశం పై అభిమానం పెరిగింది . టంగుటూరికి కాకాని వెంకట రత్నం మీద సధభిప్రాయం ఏర్పడినది. బులుసు సాంబమూర్తి కాకానిని ఎంతో మెచ్చు కున్నాడు. నాయకుల ప్రసంగాల ప్రభావంతో గ్రామం లో, ఇతర గ్రామాల్లో సేవా కార్య క్రమాలు , హిందీ ప్రచారం మొదలు పెట్టాడు. 1930 లో ఉప్పు సత్యాగ్రహంలో తయారీ ఉప్పుని గ్రామల్లో పంచుతున్నా డని అరెస్ట్ చేసి 2 సం.లు కఠిన కారాగార శిక్ష విధించారు. 1931 లో గాంధీ - ఇర్విన్ వడంబడికలో కాకానిని విడుదల చేసారు. 1930 లో దేశంలో ఆర్ధిక మాంద్యంతో ధరలు పడిపోతే రైతులొక పక్క ఇబ్బందులు పడుతుంటే భూమి శిస్తును పెంచారు. అదనపు శిస్తు రద్దుకు ఆచార్య రంగా చేస్తున్న ఆందోళనలో పాల్గొని ఉద్యమాన్ని ఉదృతం చేసాడు. 1932 లో శాసనోల్లం ఘన ఉద్యమం తో కాంగ్రెస్ వారిని అరెస్ట్ చేస్తుంటే కాకాని వెంకతరత్నం ను పశ్చిమ కృష్ణా సమన్వయ కర్తగా నియమించారు. మితృలతో ఉద్యమాన్ని తీవ్రతరం చెయ్యడంతో 16 జూన్ 1932 న అరెస్ట్ చేసి 6 నెలలు శిక్ష వేసి తంజావూరు జైలుకు తరలించగా అక్కడ కామరాజ్ నాడార్ తో పరిచయ మయ్యింది. డిసెంబర్ లో విడుదలైనాడు. అస్పృశ్యతా నిర్మూలన కార్యక్రమం చేపడితే హరిజన వాడల్లో సహపంక్తి భోజనాలు, బావుల్లో నీళ్ళు తోడించడం, దేవాలయ ప్రవేశాలు చేయించాడు. అడ్డు వస్తే ఎదిరించాడు. గాంధీ అస్పృశ్యత గురించి యాత్ర చేసేందుకు కృష్ణా జిల్లా వస్తే సభలకు అన్ని సౌకర్యాలను కల్పించి గాంధీ సమక్షంలో హరి జనులను దేవాలయ ప్రవేశం చేయించాడు.
1934 నుండి 37 వరకు ఆకునూరు గ్రామ పంచాయితీ అధ్యక్షుని గా పనిచేసి, మరుగుదొడ్లు, కొత్త రోడ్లు నిర్మించాడు. ప్రాధమిక పాఠశాల అభివృద్ధి, ఆసుపత్రి ఏర్పాటు చేసాడు. 1937 లో మద్రాస్ ప్రాన్సిస్ లో స్థానికపాలన మంత్రి బెజవాడ గోపాలరెడ్డి ని ఆకునూరు తీసుకు వచ్చి సన్మానించాడు. 1937 ఎన్నిక లప్పుడు జస్టీస్ పార్టీ కృష్ణా జిల్లాలో బలంగా ఉన్నందున , బలమైన నేత కావాలని పశ్చిమ కృష్ణా కు ఎన్నికల నిర్వ హకునిగా కాకాని వెంకటరత్నం ను నియమించగా విజయాన్ని చేకూర్చగా , పేట బాపయ్య పార్టీ అద్యక్షునిగా, కాకానిని సెక్రటరీగా నియమించారు. Ng రంగా ప్రోత్సాహంతో రైతు సంఘాలను ఏర్పరచి రైతు హక్కుల కోసం పోరాడాడు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అధ్యక్షునిగా భోగరాజు తో Ng రంగా , సెక్రటరీకి గొట్టిపాటి బ్రహ్మయ్య, పుచ్చలపల్లి సుందరయ్యలు పోటీపడితే కాకాని వర్గం Ng రంగా, పుచ్చలపల్లి కి మద్దతిస్తే వారు ఓటమి చెందారు. పార్టీ సభ్యత్వాల చేర్చడంలో గొడవలు జరిగి భోగరాజు 2 సం.లు కాకానిని పార్టీ నుండి సస్పెండ్ చేసాడు. అప్పుడు కాకాని వర్గం నిరుత్సాహంలో ఉండగా కమ్యూనిస్ట్ లు ఈ అవకాశాన్ని వాడుకుని సుందరయ్య , చండ్ర రాజేశ్వర రావు, కాట్రగడ్డ రాజగోపాల రావు, కడియాల గోపాల రావు, పిల్లలమర్రి , కంభంపాటి ఇంకా అనేకులు కమ్యూనిస్ట్ పార్టీలో చేరిపోయారు. కాని కాకాని వారితో వెళ్ళలేదు. 1938 లో జిల్లా బోర్డ్ ఎన్నికలు వస్తే పోటీ అభ్యర్దులను నిలిపాడు కాకాని. ఇది తెల్సిన టంగు టూరి ఇద్దరికీ రాజీ చేస్తే పోటీ లేకుండా 10 సీట్లు కాకానికి వచ్చాయి.
ఫార్వర్డ్ బ్లాక్ ను స్థాపించి సుభాస్ చంద్ర బోస్ ఏలూర్ వస్తే ఆ సభలో కాకాని పాల్గొన్నాడు. బోస్ మార్గంలో నడిచాడు. ప్రపంచ యుద్ధం లో పాల్గొనే విషయంలో బోస్ వ్యతిరేకం కనుక విభజించు పాలించు ప్రకారం కమ్యూనిస్ట్ లపై విధించిన నిషేదాన్ని బ్రిటీష్ ప్రభుత్వం ఎత్తి వేసింది. దానితో వారు బ్రిటీష్ ప్రభుత్వా నికి మద్దతు దారులుగా మారిపోయారు . బోస్ ను అరెస్ట్ చేసి గృహ నిర్భంధంలో ఉంచితే మాయమయ్యాడు. అందుకు మద్దతుగా విజయ వాడలో పోస్టర్స్ వేస్తే కాకాని వర్గం పోస్టర్లు వేసిందని వెదికితే కాకాని దొరక లేదు. బాపయ్య ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 1942 ఆగస్ట్ బొంబాయిలో జరిగిన సమావేశంలో బ్రిటీష్ వారు దేశం వదలి వెళ్ళాలి అని క్విట్ ఇండియా ఉద్యమంతో మారు మోగించారు. కాకాని దొరకగుండా ఆ ఉద్యమాని తీవ్రతరం చేసాడు. ఒక రోజు రాత్రి కలువపాముల లో బస్సు టాపు పై ఎక్కి విజయవాడ చేరితే , ఆ సమాచారం తెల్సు కుని బస్ దిగగానే పట్టుకుని విజయవాడ పోలీస్ స్టేషన్లో ఉంచితే వారం అయినా ఆధారాలు చూపలేక పోయినా వదలగుండా రాయ వెల్లూర్ జైలుకు తరలించారు. అప్పటికే బాపయ్య అక్కడ ఉన్నాడు. అప్పుడే కాకాని సోదరుడు కోటయ్య కలరాతో చనిపోయాడని తెలిసి పెరోల్ పై విడుదలై , సోదరుడు గ్రామంలో కట్టించే స్కూల్ ను పూర్తి చేయించి మరలా జైలుకు వెళ్ళాడు. 1946 తుఫాన్ కు కోస్తా కకావికలమయితే మంత్రిగా ఉన్న ప్రకాశం ను తీసుకువచ్చి చూపించాడు కాకాని. ఊరూరా విరాళాలు వసూలు చేసి బాధితులకు అందించి, వాటి వివరాలూ ఆడిటింగ్ చేయించి ప్రకాశంకు అందించాడు. 1946 మద్రాస్ శాసన సభ ఎన్నికల్లో పశ్చిమక్రిష్ణా 2 సీట్లు తన వారికి ఇవ్వకున్నా కృషి చేసి వారిని గెలిపిం చాడు. ఇది స్వాతంత్యం వచ్చే నాటికి కాకాని చరిత్ర.