జగన్‌ను టార్గెట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే.. మీకో రూల్ మాకో రూలా..?
posted on Aug 6, 2021 @ 12:20PM
ఆయన వద్దన్నారు. ఆయన అలా అనలేదని ఎమ్మెల్యే అంటున్నారు. కుదరదంటూ స్పష్టంగా ఉత్తర్వులు ఇచ్చారు. అవి పాతవి అంటూ పక్కన పడేస్తున్నారు. అక్కడ కాకపోతే ఇంకో దగ్గర అంటున్నారు. జగన్ చేస్తే ఒప్పు.. నేను చేస్తే తప్పా అన్నట్టు నిలదీస్తున్నారు. ఎలాగైనా ఆ పని చేసి తీరుతానంటున్నారు. ఇదంతా బీజేపీ నేతల డ్రామా అని తిట్టిపోస్తున్నారు. సోము వీర్రాజు, విష్ణువర్థన్‌రెడ్డిలపై మండిపడుతున్నారు. ఇలా, తిమ్మినిబమ్మి చేస్తూ.. జగన్‌నే ఇరకాటంలో పడేస్తూ.. వైఎస్సార్ విగ్రహాలతో పోలుస్తూ.. టిప్పు కోసం నానా తిప్పలు పడుతున్నారు వైసీపీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి.
కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై రాజకీయ రచ్చ కంటిన్యూ అవుతోంది. ముగిసినట్టే అనిపించిన రగడ.. మళ్లీ రాజుకుంటోంది. ఎమ్మెల్యే రచమల్లు పట్టు విడవడం లేదు. బీజేపీ నేతలు వెనక్కి తగ్గడం లేదు. మధ్యలో కలెక్టర్ ఉత్తర్వులు కాక రేపుతున్నాయి. టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టడానికి కలెక్టర్ అనుమతి నిరాకరించారు. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, జిల్లా కలెక్టర్ అనుమతి నిరాకరించారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని.. ఈ విషయంలో బీజేపీ నేతలు సోమువీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. త్వరలోనే ప్రభుత్వ అనుమతితోనే టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
ఒకవేళ ప్రభుత్వ స్థలంలో అనుమతి లభించకపోతే ప్రైవేటు స్థలంలో అయినా టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రాచమల్లు తెలిపారు. రాష్ట్రంలో ఏ విగ్రహానికి అనుమతులు లేవని, ఆయా సందర్భాలను బట్టి అధికారులు మౌనంగా ఉంటారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే చేసిన ఈ కామెంట్లే ఇప్పుడు కాక రేపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ విగ్రహాలు ఎక్కడపడితే అక్కడ ఇష్టారీతిలో ఏర్పాటు చేశారు. ఓదార్పు యాత్ర పేరుతో ఊరూరా తన తండ్రి విగ్రహాలు పెట్టారు జగన్. వాటిలో వేటికీ అనుమతులు లేవనేలా వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు చేసిన ఆరోపణలు పార్టీలో కలకలానికి కారణమవుతున్నాయి.
టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి నిరాకరిస్తూ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పటివి కాదని, జిల్లా ఎస్పీ అభ్యర్థన మేరకు గత నెల 24న ఇచ్చినవన్నారు ఎమ్మెల్యే. బీజేపీ నేతలు పాత ఉత్తర్వులను చూపించి అందరినీ మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రాచమల్లు మండిపడ్డారు. విగ్రహం ఏర్పాటు కోసం కౌన్సిల్ ఇచ్చిన తీర్మానాన్ని ప్రభుత్వ అనుమతి కోసం పంపామని, అనుమతి రాగానే ముందుకు వెళ్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిలు మతాల మధ్య చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని శివప్రసాద్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.