హుజురాబాద్‌లో ఉద్రిక్తత.. బీజేపీ జెండా గద్దె కూల్చివేత..
posted on Aug 6, 2021 @ 11:28AM
ఇన్నాళ్లూ మాటల తూటాలు పేలాయి. సవాళ్లు-ప్రతిసవాళ్లతో ప్రకంపణలు పుట్టాయి. ఆకర్ష్-వికర్ష్‌లతో రాజకీయ సెగ ఎగిసింది. ఇంకా ఎన్నికల నగారానే మోగలేదు.. అప్పుడే రాజకీయం హద్దులు దాటుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా హుజురాబాద్ ఎలక్షన్ నువ్వా-నేనా అన్నట్టు వాడి-వేడిగా సాగుతోంది.
మాటల మంటలు రేపుతూనే.. చేతలకూ దిగుతున్నారు ప్రత్యర్థులు. తాజాగా, హుజురాబాద్ మండలం సింగపూర్‌లో బీజేపీ జెండా గద్దెను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కూల్చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇన్నాళ్లూ విమర్శలు, ఆరోపణలకే పరిమితమైన వైరి వర్గాలు.. ఇప్పుడిలా జెండా గద్దె కూల్చే వరకూ రావడంతో పరిస్థితి అదుపు తప్పుతోంది.
తమ పార్టీ జెండా గద్దె కూల్చడంపై.. స్థానిక బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. సింగపూర్‌లో బీజేపీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. విషయం జిల్లా స్థాయి నేతలకు తెలిసింది. జెండా గద్దెను కూల్చడాన్ని నిరసిస్తూ ‘ఛలో సింగపూర్’కు పిలుపునిచ్చారు బీజేపీ నేతలు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.
వారం రోజులుగా హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఈటల రాజేందర్ గురువారం హఠాత్తుగా హుజురాబాద్ వచ్చారు. ఈటల రాక గురించి తెలుసుకున్న హుజూరాబాద్ నియోజకవర్గంలోని అభిమానులు, బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఇందుకు కౌంటర్‌గా అన్నట్టు.. గుర్తు తెలియని వ్యక్తులు సింగపూర్‌లో బీజేపీ జెండా గద్దెను కూల్చేయడం కలకలం రేపుతోంది. స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.