ఏడదాగున్నావ్ ఎన్టీఆర్?.. మేనత్తను తిట్టినా స్పందించవా?
posted on Nov 20, 2021 @ 1:34PM
జూనియర్ ఎన్టీఆర్. నందమూరి వారసుడు. బాలయ్య తర్వాత ఆ ఫ్యామిలీలో అంతటి క్రేజ్ ఉన్నోడు. బుడ్డోడు.. చిచ్చరపిడుగే. గతంలో ఓసారి పార్టీ జెండా పట్టుకొని.. ఖాకీ డ్రెస్ వేసుకొని.. చైతన్యరథంపై పర్యటించి.. టీడీపీని గెలిపించే ప్రయత్నం చేశారు. కానీ, విఫలమయ్యారు. అప్పటినుంచీ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సినిమానే జీవితంగా గడుపుతున్నారు. ఫ్యాన్స్ మాత్రం అప్పుడప్పుడూ జూనియర్ రావాలంటూ ఫ్లెక్సీలు, నినాదాలతో ఆయన్ను గుర్తు చేస్తుంటారు. ఎన్టీఆర్ మాత్రం మౌనంగా తిరస్కరిస్తూనే ఉంటారు. ఇదంతా ఓకే. గతమంతా వదిలేద్దాం. ప్రస్తుతానికి వద్దాం.
నందమూరి కుటుంబంలో బాలకృష్ణ తర్వాత ఫైర్‌బ్రాండ్ ఎవరంటే జూనియర్ ఎన్టీఆరే. స్వతహాగా ఆవేశపరుడు. ఫుల్ ఎమోషనల్. మాటంటే పడరు. మాటకు మాట గట్టిగా జవాబిచ్చే సత్తా ఆయన సొంతం. అలాంటి ఎన్టీఆర్.. తన నందమూరి కుటుంబ సభ్యురాలిని, స్వయానా మేనత్తను.. వైసీపీ మూకలు అంతేసి మాటలు అంటుంటే.. బయటకొచ్చి ఖండించడమే లేదు. నందమూరి ఫ్యామిలీ అంతా మూకుమ్మడిగా ముందుకొచ్చి.. మీడియా సమావేశం పెట్టినా.. అందులో జూనియర్ లేడు. కల్యాణ్‌రామ్ కూడా రాలేదు. ఎన్టీఆర్ నందమూరి కుటుంబం కాదా? ఆయనకు బాధ్యత లేదా? కల్యాణ్‌రామ్‌కు ఏమైంది? ఆయనెందుకు రాలేదు? హరికృష్ణ ఫ్యామిలీ నందమూరి ఇంటిపేరును త్యజించేసిందా? కుటుంబంతో తెగదెంపులు చేసేసుకుందా? అలా ఏమీ లేదు కదా? మరి, ప్రెస్‌మీట్‌కు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ రావొచ్చుకదా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వస్తారు? గతంలో ఎప్పుడూ మీడియాకు కనిపించని చైతన్యకృష్ణ, శ్రీనివాస్‌లాంటి వాళ్లే ముందుకొచ్చి.. భువనేశ్వరికీ మద్దతుగా నిలిస్తే.. ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లకు అంత ఇగో ఎందుకు? ఫ్యామిలీతో కలవరెందుకు? ఇప్పుడుకాక ఇంకెప్పుడు?
ఓహో అందుకా... భువనేశ్వరిపై పిచ్చి వాగుడు వాగుతున్న కొడాలి నాని, వల్లభనేని వంశీలు తన మిత్రులు కాబట్టే జూనియర్ ఎన్టీఆర్ స్పందించడం లేదా? మేనత్తను అంతేసి మాటలు అంటుంటే.. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటే.. నోరు మూసుకొని.. మౌనంగా ఊరుకుంటున్నవాడు నందమూరి కుటుంబ సభ్యుడు ఎలా అవుతాడు? రాజకీయాలకు తాను దూరం అని ఎన్టీఆర్ సమర్థించుకోడానికి కూడా లేదు. ఇది రాజకీయం కాదే? కుటుంబ వ్యవహారం.. కుటుంబ పరువు, ప్రతిష్ట, మర్యాదలకు సంబంధించిన మేటర్. కుటుంబం లేనిది ఆయన ఎక్కడ? నందమూరి ఇంటిపేరు లేకపోతే.. ఎన్టీఆర్‌కు గుర్తింపేముంది.. విలువేముంది? ఏ కుటుంబం వల్లనైతే అతనికి ఇంతటి హోదా, గౌరవం లభిస్తుండే.. ఇప్పుడు ఆ కుటుంబమంతా కలిసి.. భువనేశ్వరికి మద్దతుగా నిలబడితే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు రాకపోవడం తప్పుకాదా? పాలిటిక్స్ వద్దంటూనే పాలిటిక్స్ చేస్తున్నారా? ఎన్టీఆర్ బ్రదర్స్ స్పందించకపోవడాన్ని ఎలా చూడాలి? అంటూ తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు.. కాదు కాదు నిలదీస్తున్నారు.