వరదలతో సీమ విలవిల.. ఎవరిదీ ముంపు పాపం?
posted on Nov 20, 2021 @ 11:24AM
కుండపోత వర్షంతో వరద పోటెత్తింది. రాయలసీమ అతలాకుతలమైంది. చిత్తూరు, కడప, అనంతపురంతో పాటు నెల్లూరు జిల్లాలో వరద విలయం స్పష్టించింది. వందలాది గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రాణ నష్టం కూడా ఇటీవల కాలం ఎప్పుడు లేనంతగా జరిగింది. అసలు ఎవరూ ఊహించని రీతిలో అపార నష్ఠం జరిగింది. దీంతో వరద ముంపునకు అసలు కారణమేంటీ అన్న చర్చ సాగుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ముంపు పెరిగిందనే విమర్శలు వస్తున్నాయి.
మూడు రోజులుగా వాయుగుండం ప్రభావంతో విస్తారంగా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందస్తుగానే హెచ్చరించింది. దీంతో క్షేత్ర స్థాయిలో జలాశయాల పరిధిలో, నది పరివాహక ప్రాంతాల్లో అనుక్షణం అప్రమత్తం చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది. జలాశయాల్లోకి చేరే నీటిని ఎప్పటికప్పడు అంచనా వేయాలి. వరద ముంపు, ముప్పును తప్పించాల్సి ఉంది. కాని అధికారులు ఇవేమి చేసినట్లు కనిపించలేదు. ఎన్ని క్యూసెక్కుల వరద వస్తోంది, ఎంత వదలాలి. ఎంత నీరు వదిలాలి అన్న లెక్కలను చూసుకోలేదు. దీంతో జరగరాని నష్టం జరిగిపోయింది. నది పరివాహకంలో గ్రామాల్లోకి నీరు దూసుకెళుతుందని ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటే ఇంత విషాదం ఉండేది కాదని చెబుతున్నారు.
కడప జిల్లాలోని అన్నమయ్య జలాశయం ప్రమాదంలో పడింది. ఎప్పుడు లేనంతగా కట్ట కోతకు గురైంది. అన్నమయ్య జలాశయం నిల్వ సామర్థ్యం 2.239 టీఎంసీలు కాగా, గరిష్ఠంగా 2.48 లక్షల క్యూసెక్కుల నీటిని బయటకు వదిలే వెసులుబాటు ఉంది. అయిదో గేటు సాంకేతిక లోపంతో మొరాయించింది. కొన్నిరోజులుగా మరమ్మతులు చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నా నిధులు ఇవ్వలేదు. మిగతా 4 గేట్ల సామర్థ్యం మేరకు పూర్తిస్థాయిలో పనిచేయలేదు. వరద ఎక్కువగా వస్తుందని భయపడి అధికార యంత్రాంగం పూర్తిగా ఎత్తలేదని తెలిసింది. దీంతో మట్టి కట్టపైకి నీరు చేరడానికి కారణమైంది. ఎగువన పింఛ జలాశయంలోకి ఎంత నీరు వస్తుంది. తాత్కాలిక కట్ట తెగితే వరద ప్రవాహం ఎలా ఉంటుంది అని దిగువన ఉన్న వారికి సమాచారం చేరవేయాల్సి ఉంది. విపత్తు జరిగితే జిల్లా కీలక అధికారులు ముందుగానే సిద్ధంగా ఉండాలి. క్షేత్రస్థాయిలో విపత్తులు తలెత్తితే ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలి. సమర్థంగా పనిచేసేలా అధికారులకు బాధ్యతలు అప్పగించాలి. వెంటనే కార్యాచరణలోకి దిగాలి. ఇక్కడ అది చేయలేదనే మాట సర్వత్రా వినిపిస్తోంది. ముందుచూపు కొరవడంతోనే వరద ముంపు ముంచేసినట్లు బాధితులు ఆక్రోశిస్తున్నారు.
వరద ఉద్ధృతికి కోతకు గురైన అన్నమయ్య జలాశయం కట్ట.. ఎందరికో కడుపు కోత మిగిల్చింది. జలాశయాన్ని బద్ధలుకొట్టుకుని చెయ్యేరులోకి దూసుకొచ్చిన వరద నీరు.. ఏరూ ఊరును ఏకం చేసింది. పదుల సంఖ్యలో గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. నీటి ప్రవాహ ఉద్ధృతికి.. నిస్సహాయ స్థితిలో ఉన్న ఎందరో కొట్టుకుపోయారు. ముళ్లపొదల్లో.. ఇళ్ల శిథిలాల్లో శవాలై తేలారు. వందలాది మూగజీవాలు సైతం ఏటి పాలయ్యాయి. కనీవిని ఎరుగని స్థాయిలో కల్లోలం సృష్టించిన తుపాను జన జీవనాన్ని కకావికలం చేసింది. ప్రశాంతంగా ఉన్న పల్లెల బతుకు చిత్రాన్ని తారుమారు చేసింది.
వరదనీరు పోటెత్తుతున్న వేళలో రాజంపేట డిపో నుంచి ఆర్టీసీ బస్సులను ఎందుకు పంపారో ఎవరికి అంతుపట్టడంలేదు. ఉదయం డిపో నుంచి అనంతపురానికి బయలుదేరిన బస్సు రామాపురం చెక్‌పోస్టు వద్దకు వెళ్లేసరికి వరద నీరు ఒక్కసారిగా వచ్చేసింది. దీంతో ముందుకు వెళ్లలేక వెనక్కి తిప్పుకుని వస్తున్న సమయంలో వరదతాకిడి ఎక్కువై వరదలో చిక్కుకుంది. రెండు, మూడు గంటల తరువాత పోలీస్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. రెండో బస్సులో ఆరుగురు ఉంటే వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వరద తాకిడికి ఆర్టీసీ అద్దె బస్సు మునిగిపోయింది. ఇందులోని ఏడుగురిలో డ్రైవరు, మరో ప్రయాణికుడు మాత్రం బస్సు పైకి ఎక్కారు. మిగిలిన వారు బస్సులోనే చిక్కుకున్నారు.