రూ. 10 కోట్ల ఆఫర్ ఇచ్చారన్న గంగాధర్ రెడ్డి.. వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్
posted on Nov 29, 2021 @ 2:55PM
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ను కలిశాడు గంగాధర్ రెడ్డి. సీబీఐ, వివేకా అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశాడు. తనకు రక్షణ కల్పించాలని ఎస్పీ ని కోరాడు గంగాధర్ రెడ్డి.
ఈ కేసులో తాము చెప్పినట్లే వాంగూల్మం ఇస్తే 10 కోట్ల రూపాయలు ఇస్తామని సీబీఐ ఆఫర్ చేసిందంటూ సంచలన ఆరోపణలు చేశారు గంగాధర్ రెడ్డి. వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి ప్రమేయం ఉందని చెప్పాలని సీబీఐ తనపై ఒత్తిడి చేసిందని ఎస్పీకి ఫిర్యాదు చేశాడు గంగాధర్ రెడ్డి. వారి ఒత్తిడి తో తానే వివేకాను చంపానని ఒప్పుకోవాలని సీబీఐ అధికారులు బెదిరింపులు చేశారని వాపోయాడు. వివేకా హత్య కేసులో తనకు సంబంధం లేదన్నారు గంగాధర్ రెడ్డి. లేని విషయాన్ని ఉన్నట్లు చెప్పేది లేదన్నారు.
గంగాధర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప స్పందించారు. వైఎస్ వివేకా హత్య కేసులో బెదిరింపులపై గంగాధర్ రెడ్డి ఫిర్యాదు చేశాడని చెప్పారు. గంగాధర్ రెడ్డి కి రక్షణ కల్పిస్తామన్నారు ఎస్పీ.సీబీఐ, వివేకా అనుచరులు, సీఐ శ్రీరాంపై ఫిర్యాదు చేశాడని తెలిపారు. గంగాధర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామని ఎస్పీ వెల్లడించారు.. తప్పుడు సాక్ష్యం చెప్పాలని బెదిరించినట్లు గంగాధర్ చెబుతున్నారని, ఆయన చెప్పిన అన్ని అంశాలపై విచారణ చేస్తామని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు.