8 ఓవర్లున్నా చివరి వికెట్ తీయని బౌలర్లు.. కాన్పూర్ టెస్ట్ డ్రా
posted on Nov 29, 2021 @ 3:25PM
భారత్, న్యూజీలాండ్ తొలి టెస్టు నాటకీయ పరిణామాల మధ్య డ్రాగా ముగిసింది. చివరి ఎనిమిది ఓవర్లలో విజయానికి వికెట్ తీయాల్సి ఉండగా.. భారత బౌలర్లు విఫలమయ్యారు. తీవ్ర ఉత్కంఠగా సాగిన చివరి 8 ఓవర్లను కివీస్ బ్యాట్స్ మెన్ అజాజ్ పటేల్, రవీంద్ర అద్భుతంగా ఎదుర్కొన్నారు. భారత బౌలర్లు ఎంతగా శ్రమించినా వికెట్ పడకపోవడంతో కాన్పూర్ టెస్టుగా డ్రాగా ముగిసింది.
న్యూజీలాండ్ కు విజయానికి చివరి రోజు 280 పరుగుల అవసరం ఉండే. వికెట్ నష్టానికి 4 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ తొలి సెషన్ లో మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడింది. దీంతో మ్యాచ్ డ్రా అవుతుందని అంతా భావించారు. కాని సెకండ్ సెషన్ లో భారత బౌలర్లు ప్రతాపం చూపించారు. 79/1తో రెండో సెషన్‌ను కొనసాగించిన న్యూజిలాండ్.. ఉమేశ్ యాదవ్ వేసిన తొలి బంతికే సోమర్ విలే (36) ఔటయ్యాడు. ఆపై లాథమ్ (52), విలియమ్సన్ (24*) నిలకడగా ఆడి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అయితే లాథమ్ అర్ధశతకం తర్వాత అశ్విన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అప్పటికి జట్టు స్కోర్ 118/3. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాస్ టేలర్ (2) పరుగులు తీసేందుకు ఇబ్బంది పడ్డాడు. ఆడిన 23వ బంతికి రెండు పరుగులు తీశాడు. అయితే, టీ బ్రేక్‌కు ముందు అతడు జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్యూగా వెనుదిరిగాడు. దీంతో న్యూజిలాండ్ 125 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది
ఇక చివరి సెషన్‌లో భారత్ విజయం సాధించాలంటే ఆరు వికెట్లు పడగొట్టాల్సి ఉండగా.. . అదే న్యూజిలాండ్ గెలుపొందాలంటే 159 పరుగులు సాధించాలి. అయితే బౌలర్లు అద్భుతంగా రాణించి వరుసగా వికెట్లు పడగొట్టారు. అశ్విన్ ఓవర్ లో బ్లెండల్ రెండు పరుగుల దగ్గర ఏడో వికెట్ గా వెనుదిరిగాడు. తర్వాత ఎనిమిదో వికెట్ కాస్త ఆలస్యమైంది. రవీంద్ర జడేజా వేసిన 86 ఓవర్ లో ఐదు పరుగులు చేసిన జమీసన్ అవుటయ్యాడు. దీంతో మ్యాచ్ పై భారత్ పట్టు సాధించింది.
మరో నాలుగు పరుగులు జోడించాకా 155 పరుగుల దగ్గర 90 ఓవర్ లో టీమ్ సౌధీ తొమ్మిదో వికెట్ గా పెవిలియన్ చేరాడు. దీంతో మ్యాచ్ విజయానికి చివరి ఎనిమిది ఓవర్లలో భారత్ కు మరో వికెట్ అవసరం పడింది. అయితే అజాజ్ పటేల్, రవీంద్ర జాగ్రత్తగా చివరి ఎనిమిది ఓవర్లు ఆడటంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు పడగొట్టాడు.