ప్రతిపక్ష శిబిరంలో మమత మంటలు...
posted on Dec 3, 2021 @ 9:30AM
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ విపక్ష శిబిరంలో అగ్గి రాజేశారు. ప్రశాంత్ కిశోర్ పెట్రోల్ పోశారు. ప్రతిపక్ష కూటమిలో మంటలు భగ్గుమంటున్నాయి. అందరి లక్ష్యం ఒక్కటే, ‘బీజేపీని ఓడించాలి... మోడిని గద్దె దిచాలి’. అయినా, ఆలు లేదు .. చూలు లేదు .. కొడుకు పేరు సోమలింగం, అన్నట్లుగా, మోడీ దిగిన (?) కుర్చీలో ఎవరు కుర్చోవాలనే విషయంలో, కిస్సా కుర్సీకా’ ఆట మొదలైంది. మాటల యుద్ధం సాగుతోంది. ప్రత్యర్ధిని పక్కన పెట్టి, విపక్షాలు తమలో తాము కుస్తీపట్లు పడుతున్నాయి. నాయకుకులు ఒకరిపై ఒకరు విరుచుకు పడుతున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించి ముచ్చటగా మూడవ సారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, జాతీయ రాజకీయాలపై మనసు పారేసుకున్నారు. మమతా బెనర్జీ ఆశకు, కిరాయి వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తోడయ్యారు. మమతా బెంనేర్జీ గతాన్ని మరిచి పోయి, దేశాన్ని మన్మోహన్ సింగ్ సారధ్యంలో పదేళ్ళు పాలించిన, అందులో స్వయంగా తాను రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి (యూపీఏ),అది ఎక్కడుంది... అదిప్పుడు లేదంటూ చేసిన వ్యాఖ్య ప్రతిపక్ష పార్టీల మధ్య, ముఖ్యంగా కాంగ్రెస్ , తృణమూల్ కాంగ్రెస్ మధ్య చిచ్చు పెట్టింది. ప్రతిపక్ష కూటమి నాయకత్వం కోసం సిగపట్లకు తలపడేలా చేసింది.
ఇంతకాలం మమతా బెనర్జీ, కాంగ్రెస్ నాయకులను ఎగరేసుకు పోతున్నా,అంతగా పట్టించుకోని కాంగ్రెస్ అధినాయకత్వం, మమతా బెనర్జీ తాజా వ్యాఖ్యలతో ఇక ఉపేక్షించి లాభం లేదనే నిర్ణయానికి వచ్చింది. మమతకు గతాన్ని గుర్తు చేసి ఎదురు దాడికి దిగింది. చివరకు కాంగ్రెస్ పార్టీలో జీ 23 అసమ్మతికుంపటి రాజేసిన కపిల్ సిబల్ కూడా, ‘కాంగ్రెస్ లేని ప్రతిపక్ష కూటమి ఆటం లేని శరీరం వంటిద’ని ఘాటుగా స్పందించారు. మరో వంక ప్రశాంత కిశోర్, కూడా కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. విపక్షాలకు నాయకత్వం వహించడం..ఆ పార్టీకి దేవుడు ఇచ్చిన హక్కుగా కాంగ్రెస్ భావిస్తుందని ఆరోపించారు. విపక్షాలకు ఎవరు నేతృత్వం వహించాలో వారే నిర్ణయించుకుంటారని ట్వీట్ చేశారు.దీంతో, రెండు కాంగ్రెస్ మధ్య దూరం మరింత పెరిగింది.
అయితే, మమతా బెనర్జీ కాంగ్రెస్ ముక్త విపక్ష కూటమి కోసం ఆశపడితే పడవచ్చును కానీ, కాంగ్రెస్ లేకుండా, ఆమె కలలు కంటున్నప్రాంతీయ పార్టీల కూటమి బీజేపీని ఎదుర్కోవడం అయ్యే పని కాదని, రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దేశం మొత్తంలో, ఐదు పది అటూ ఇటుగా 190 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది. బీహార్ , తమిళనాడు సహా మరికొన్ని రాష్ట్రాలలోని వందకు పైగా స్థానాల్లో కాంగ్రెస్ భాగస్వామ్య పార్టీగా ఉన్న కూటమి ప్రధాన ప్రతిపక్ష భూమికను పోషిస్తోంది. ప్రస్తుతం ఈ 190 స్థానాల్లో ... కాంగ్రెస్ పార్టీ కేవలం 15 స్థానాలకు పరిమితం అయ్యింది. మొత్తంగా చూసినా జతేఅయ్ స్థాయిలో తృణమూల్ కంటే కాంగ్రెస్ ‘స్పేస్’ ఎక్కువగా ఉందనేది కాదన లేని నిజం. మధ్య ప్రదేశ్, రాజస్థాన్,గుజరాత్, కొంతవరకు కర్ణాటక, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాలలో పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల మధ్యనే ఉంటుంది.కాబట్టి, కాంగ్రెస్ పక్కన పెట్టి, బీజేపీ మీద పై చేయి సాధించడం అయ్యే పనికాదు. నిజానికి, మమతా బెనర్జీని ముందుండి నడిపిస్తున్న వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, కూడా రెండుమూడు నెలల క్రితం కాంగ్రెస్ లేకుండా ఏర్పడే ఫ్రంట్ ఏదీ బీజేపీని ఎదుర్కోలేదని అన్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా ఇంచుమించుగా ఇదే, అభిప్రాయం వ్యక్త పరిచారు.సో.. మమతా బెనర్జీ ప్రదాని కావాలని ఆశ పడితే ఆశ పడవచ్చును కానీ,అత్యాశకు పోతే మాత్రం భంగపాటు తప్పదని అంటున్నారు.