హేయ్.. మళ్లీ సలహాదారును అప్పాయింట్ చేసేశారు!
posted on Nov 21, 2022 9:10AM
ఏపీలో జగన్ సర్కార్ సలహాదారుల నియామకం విషయంలో తగ్గేదే లే అన్నట్లుగా ముందుకు పోతున్నది. సలహాదారుల నియామకంపై హైకోర్టు గతంలోనే తప్పుపట్టింది. అయినా కోర్టులను జగన్ సర్కార్ ఎప్పుడు పట్టించుకుంది కనుక. సర్వత్రా విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. అయినా ఖాతరే లేనట్టుగా జగన్ సర్కార్ వ్యవహరిస్తోంది.
తాజాగా ఒక కొత్త సలహాదారును నియమించింది. అదీ అలాంటిలాంటి సలహాదారును కాదు. ఏకంగా జాబ్ మేళాల సలహాదారట. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గతంలో ఒక సారి రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోనూ మూడు జాబ్ మేళాలు ఏర్పాటు చేశారు. అయితే అవి ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసినవి కావు. తన సొంతంగా అంటే విజయసాయి ట్రస్ట్ అంటూ ఆ జాబ్ ఫెయిర్స్ ఏర్పాటు చేశారు. ఆ తరువాత అవి కూడా పీకల్లోతు వివాదాల్లో ఇరుక్కున్నాయనుకోండి అది వేరే సంగతి.. కానీ ఇప్పటి వరకూ ప్రభుత్వం ఆధ్వరంలో ఎక్కడా జాబ్ మేళాలు జరిగిన దాఖలాలు లేవు. అలాంటిది జగన్ ఏకంగా వీటి కోసం అంటూ ఓ సలహాదారుడిని నియమించి పారేశారు.
గాడి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తిని ప్రభుత్వ జాబ్ మేలా సలహాదారుగా నియమిస్తూ జీవో విడుదలయ్యింది. ఈ గాడి శ్రీధర్ రెడ్డికి సలహాదారు పదవి… విజయసాయిరెడ్డి కోటా. గాడి శ్రీధర్ రెడ్డి విశాఖపట్నంలో వైసీపీ ఐటీ వింగ్ ఇన్ చార్జి అంటున్నారు. తనను ప్రభుత్వ సలహాదారుగా నియమించారనీ, ఈ పదవిలో తాను శక్తివంచన లేకుండా.. యువతలో స్కిల్ డెవలప్ మెంట్ , ఉద్యోగ కల్పనకు పాటుపడతానంటూ సామాజిక మాధ్యమంలో ఓ రేంజ్ లో ప్రకటనలు గుప్పించేసుకుంటున్నారు.
తన పనితీరుతో ప్రజా మన్నననలు పొందుతానని చెప్పుకుంటున్నారు. సలహాదారు పదవుల నియామకాలలో ఇటీవలి కాలంలో వైసీపీ సర్కార్ స్పీడ్ పెంచేసింది. వారానికో సలహాదారుడ్ని నియమించేస్తోంది. ప్రజాధనాన్ని సలహాదారులంటూ నియమిస్తున్న పార్టీ నేతలకు నెలవారీగా వేతనాలుగా పందేరం చేసేస్తోంది.