సంజుశాంసన్ పట్ల వివక్ష ఎందుకు?
posted on Nov 20, 2022 @ 10:16PM
టీమ్ ఇండియాలో కొందరు వరుసగా విఫలమౌతున్నా అవకాశాలు వస్తూనే ఉంటాయి. మరి కొందరు అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని రాణించినా అవకాశాలు దక్కవు. ముఖ్యంగా సంజు సాంశన్ విషయం తీసుకుంటే.. అతడి పట్ల టీమ్ ఇండియా మేనేజ్ మెంట్ కు ఏదైనా ప్రత్యేకమైన కోపం ఉందా అనిపిస్తుంది. భారత క్రికెట్ ఒక్క సంజు కే అవకాశాలు రావడం లేదు. సీనియర్లు లేనప్పుడు ఎంపిక చేయడమే తప్ప టీమ్ లో ఆడే అవకాశం ఇవ్వడం లేదు.
ఎప్పుడో ఓ సారి అవకాశం ఇచ్చినట్టు ఇఛ్చి మళ్లీ పక్కన పెట్టేస్తారు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని రాణించినా పట్టించుకోరు. మరో అవకాశం ఇవ్వరు. అదే పదే పదే విఫలం అవుతున్న ఆటగాళ్లకు మాత్రం.. లెక్కకు మిక్కిలి అవకాశాలు ఇస్తున్నారు. ప్రస్తుతం కివీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. వర్షం కారణంగా రద్దు అయిన తొలి టీ20లో చోటు దక్కించుకోలేక పోయిన సంజుకు ఆదివారం(నవంబర్ 20) జరిగిన రెండో టీ20లోనూ నిరాశే ఎదురైంది. సీనియర్లు లేని ఈ సిరీస్‌లో శాంసన్ తుది జట్టులో ఆడటం ఖాయమని అంతా భావించారు. అయితే సంజుకు అవకాశం ఇవ్వలేదు. పోనీ సంజు ప్లేస్‌లో జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ , దీపక్ హుడాలు బ్యాట్‌తో రాణించారా..? అంటే అదీ లేదు.
ఇక మిగిలిన ఆఖరి టీ20 మ్యాచ్‌లోనైనా సంజును ఆడిస్తారా..? అంటే అది చెప్పలేని పరిస్థితి. రిషబ్ పంత్ పదే పదే విఫలం అవుతున్నా అతడికి అండగా నిలుస్తున్నారు అలాంటి మద్దతు సంజు శాంసన్‌కు ఎందుకు ఇవ్వడం లేదంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సంజూ విషయంలో టీమ్ ఇండియా మాజీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. శాంసన్ అవకాశాలు ఇచ్చి ఆ తరువాత ఒక అంచనాకు రావాలే తప్ప.. ఒకటి రెండు మ్యాచ్ లు ఆడించి పక్కన పెట్టేయడం సరికాదంటున్నారు.