ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరణ.. వద్దు బాబోయ్ అన్న అమెరికా మాజీ అధ్యక్షుడు
posted on Nov 21, 2022 6:33AM
ఎలాన్ మస్క్ పగ్గాలు చేపట్టడంతోనే ట్విట్టర్ ప్రతిష్ట మంటగలవడం మొదలైంది. అయన తీసుకునే నిర్ణయాలు అటు ట్విట్టర్ ఉద్యోగులనూ, ఇటు ట్వీట్టర్ యూజర్లనూ కూడా ఆందోళనకు, గందరగోళానికీ గురి చేస్తున్నాయి. గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ ట్విట్టర్ ట్రంప్ ఖాతాను బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడైనా ట్విట్టర్ ను తన వివాదాస్పద వ్యాఖ్యలకు వేదికగా చేసుకుంటానంటే అంగీకరించేది లేదంటూ అప్పట్లో ఆయన ఖాతాను బ్లాక్ చేసిన సంగతి తెలిసిదే.
అయితే ఇప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఖాతాను పునరుద్ధరిస్తున్నట్లు ట్విట్టర్ ప్రస్తుత అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ట్రంప్ ఖాతా పునరుద్ధరణపై నిర్వహించిన పోల్ లో ట్రంప్ అక్కౌంట్ పునరుద్ధరణకు 51.8శాతం మంది మద్దతు ఇచ్చారని మస్క్ పేర్కొన్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. తన ఖాతాను పునరుద్ధరించవద్దు బాబోయ్ అని ట్రంప్ పేర్కోనడమే. తనకు ట్విట్టర్ లోకి వచ్చే ఆసక్తి ఏమాత్రం లేదని ట్రంప్ స్పష్టం చేశారు.
తనను బహిష్కరించిన ట్విట్టర్ లోకి మళ్లీ రావడానికి తనకు ఇసుమంతైనా ఇష్టం లేదని పేర్కొంటూరావడానికి తన సొంత మీడియా అయిన ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (టీఎంటీజీ) స్టార్టప్ అభివృద్ధి చేసిన కొత్త ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్‌తో తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. ట్విట్టర్ కంటే టీఎంటీజీ మెరుగ్గా పనిచేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.
2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో గతేడాది జనవరిలో అమెరికాలో తీవ్రమైన హింసాకాండ చెలరేగింది. ఆందోళనకారులు క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్లి.. విధ్వంసం సృష్టించారు. ఈ ఆందోళనలకు కారణం ట్రంప్ చేసిన ట్వీట్లు, పోస్టులేనని వార్తలు రావడంతో.. అప్పట్లో ఆయన ఖాతాలను తొలగిస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ట్విట్టర్ పగ్గాలు చేజిక్కించుకున్న వెంటనే మస్క్.. ట్రంప్ ఖాతాను పునరుద్ధరించినా ట్రంప్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు.