పవన్ కళ్యాణ్ లో కొత్త కోణం ..గమనించారా?
posted on Jan 26, 2023 @ 10:54AM
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్య చేసిన సమయ, సందర్భాలు వేరు కావచ్చును. కానీ, ఎవరైనా వివక్షకు గురైనప్పుడే దాని గురించి తెలుస్తుందని అయన చేసిన వ్యాఖ్యలు, ఇక దేహి అంటే కుదరదని ఎస్సీ, ఎస్టీ లకు చేసిన హిత బోధ, అదే విధంగా వ్యక్తి ఆరాధన గురిచి ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆయనలో ఎక్కడో అక్కడ రగులుతున్న రాజకీయ ఆకాంక్షలకు అద్దం పడుతున్నట్లు ఉన్నాయి. నిజానికి, నిన్నమొన్న జరిగిన జనసేన తెలంగాణ కార్యకర్తలు, కార్య నిర్వాహకుల సభలోనే, పవన్ కళ్యాణ్ కొత్త ఆలోచనలకు ముసుగు తీశారు. పొత్తుల విషయంలో స్పష్టత ఇస్తూనే, రాజకీయ కొత్త కోణాన్ని అవిష్కరించారు. ఎక్కడా ఎక్కాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలనే నానుడి తిరగేసి, ఎక్కడ తగ్గాలోనే కాదు, ఎక్కడ ఎక్కాలో కూడా తెలియాలనే అర్థం వచ్చే విధంగా మాటల గారడీ చేశారు. పొత్తుల విషయంలో ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో ఆ ఇంటికి ఈ ఇల్లు అంత దూరం అనే సంకేతాలు ఇచ్చారు. ముఖ్యంగా ఏపీలో బీజేపీ పొత్తు వుంది, ఉంటుంది అంటూనే, అవసరం అయితే కొత్త పొత్తులు ఉంటాయని అన్నారు.
ఇక ప్రస్తుతానికి వస్తే, బుధవారం(జనవరి 25) మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వ్యక్తి ఆరాధన ఎంత మంచిదో.. అంతే ప్రమాదకరమన్నారు. అలాగే, ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో వివక్షకు గురవుతారని.. వివక్షకు గురైనప్పుడే దాని గురించి తెలుస్తుందని పేర్కొన్నారు.సమాజాన్ని కొన్ని కోణాల్లోనే కాదు.. సమగ్రంగా చూడాలని అన్నారు. జనాభాకు తగ్గట్టు బడ్జెట్‌లో కేటాయింపులు జరగాలని అభిప్రాయపడ్డారు. మన కష్టం, శ్రమకు తగ్గ ఫలితం ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీలు దాదాపు 22 శాతం జనాభా ఉన్నా.. నిధులు ఇవ్వాలని ఇంకా కోరాలా అని ప్రశ్నించారు. ఇకపై దేహి అంటే కుదరదని.. పోరాటాలు చేసి తీసుకోవాలన్నారు.
నిజమే పవన్ కళ్యాణ్ ఎస్సీ,ఎస్టీలను దృష్టిలో ఉంచుకునే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని అనుకోవచ్చును కానీ, అందులో రాజకీయ ధ్వనులున్నాయని, పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుకు సంబంధించి పవన్ కళ్యాణ్, బయటి శత్రువుల కన్నా మనతోటి ఉండే శత్రువులనే ముందుగా కనిపెట్టాలని.. మన హక్కులను కాలరాసే ఎవరినైనా ఎదుర్కోవాల్సిందేనని చేసిన వ్యాఖ్యలు, నమ్మిన సిద్ధాంతానికి నిలబడి ఉండేవాడే నాయకుడు అంటూ అయన చేసిన ముక్తాయింపు, పవన్ కళ్యాణ్ లో కొత్త కోణాన్ని అవిష్కరించాయని అంటున్నారు.
కాగా.. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ మరోమారు, వైసీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్ట్టీలకు చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన 27 పథకాలు తీసేశారని చెబుతుంటే చాలా బాధేసిందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మూడేళ్లలో రూ. 20 వేల కోట్లు రాకుండా చేశారంటే ఏమనాలని ప్రశ్నించారు. ఎన్ని గొప్ప చట్టాలు, సంస్కరణలు తెచ్చినా ఆచరణలో పెట్టాలి కదా అని నిలదీశారు. ఆచరణలో పెట్టకపోతే చట్టాలు తెచ్చినా ప్రయోజనం ఉండదన్నారు. ఏపీ ప్రభుత్వం పబ్లిసిటీ కోసం రూ. 15 వేల కోట్లు ఖర్చు చేసిందని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ నిధులు వారికి రాకుండా దారి మళ్లించి మోసం చేస్తారా అని పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అవును, పవన్ కళ్యాణ్ చేసిన విమర్శల్లో నిజం వుంది. అలాగే, ఆయన చేసిన వ్యాఖ్యల్లో అంతర్లీనంగా ధ్వనించిన రాజకీయ వ్యాఖ్యానం... పవన్ కళ్యాణ్ లో మరో కోణాన్ని అవిష్కరించిందని, సినిమా భాషలో చెప్పాలంటే, మరో నటుడిని రాజకీయ తెరకు పరిచయం చేసిందని అంటున్నారు.