ఎంపీ అవినాశ్ అజ్ణాతంలోకి?!
posted on Jan 26, 2023 @ 11:25AM
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. అజ్ణాతంలోకి పారిపోయేందుకు పక్కాగా ప్లాన్ చేసుకున్నారా? అన్న సందేహాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. ఆ ప్లాన్ తోనే ఆయన.. సీబీఐ విచారణకు హాజరు కావాలంటూ ఇచ్చిన నోటీసులకు అయిదు రోజుల బిజీ షెడ్యూల్ ఉంది.. ఆ తర్వాత హాజరవుతానంటూ .. సమాచారం ఇచ్చారని అంటున్నారు?
అయితే ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన సీబీఐ.. అప్రమత్తమై.. ఆగమేఘాల మీద కోర్టును ఆశ్రయించి.. వైఎస్ ఆవినాష్ రెడ్డి అరెస్ట్‌కు వారెంట్ తీసుకుని అరెస్ట్ చేసి... హైదరాబాద్‌కు తీసుకు వచ్చి... విచారించేందుకు సీబీఐ తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందని అంటున్నారు. ఈ విచారణలో భాగంగానే వైయస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.
2019 మార్చిలో మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అయితే వివేకా గుండెపోటుతో మరణించారంటూ వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి తొలుత మీడియా సాక్షిగా ప్రకటించారు. ఆ తర్వాత వైయస్ వివేకానందరెడ్డిని గోడ్డలితో అత్యంత దారుణంగా నరికి చంపారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
వివేకా హత్య కేసులో.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైయస్ జగన్ ప్రభుత్వం అనుసరించిన వైఖరి వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో తన తండ్రి వివేకా హత్య కేసులోని పాత్రదారులు, సూత్రధారులు ఎవరో తేల్చాలంటూ.. ఆయన కుమార్తె సునీత.. న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో సీబీఐ దర్యాప్తునకు న్యాయస్థానం ఆదేశించింది. ఆ క్రమంలో సీబీఐ విచారణలో వివేకా మాజీ కార్ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారి.. వైఎస్ అవినాష్, ఆయన తండ్రి భాస్కరరెడ్డితోపాటు పలువురు పేర్లను వెల్లడించారు.
ఆ తర్వాత వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపై కేసులు పెట్టేందుకు పలువురు వ్యక్తులు రంగంలోకి దిగడం.. అలాగే వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర రెడ్డిల ప్రమేయం ఉందంటూ పలువురు ఆరోపణలు గుప్పించడం.. వంటి ఘటనలు వరుసగా చోటు చేసుకున్నాయి. అలాగే ఈ హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు సైతం బెదిరింపులు కూడా వచ్చాయి. దీంతో సీబీఐ దర్యాప్తు వేగం నెమ్మదించింది.
ఈ నేపథ్యంలో తన తండ్రి హత్య కేసు విచారణ.. మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ.. సునీత.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసు విచారణను తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి సుప్రీం కోర్టు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసులో సీబీఐ స్పీడ్ పెంచింది. ఈ విషయాన్ని గమనించిన అవినాశ్ .. విదేశాలకు చెక్కేసేందుకు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఓ వేళ.. అతడిని అరెస్ట్ చేయకున్నా... అతడి పాస్‌పోర్ట్‌ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేసే అవకాశం ఉందని చర్చ సైతం కడప జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది.
కాగా అవినాష్ విజ్ణప్తి మేరకు సీబీఐ విచారణకు మరో తేదీని నిర్ణయించింది. ఈ నెల 28న అంటే శనివారం విచారణకు రావాలంటూ రెండో సారి నోటీసులు జారీ చేసింది. సీబీఐ దూకుడు చూస్తుంటే అవినాష్ అరెస్టు ఖాయమన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతోంది. ఈ నేపథ్యంలోనే సీబీఐ విచారణ తప్పించుకునేందుకు ఆయన అజ్ణాతంలోకి వెళతారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. ఆయన విదేశాలకు వెళ్లిపోయే అవకాశాలను కూడా కొట్టి పారేయలేమని అంటున్నారు. ఏది ఏమైనా వివేకా హత్య కేసులో అవినాష్ చుట్టూ ఉచ్చు గట్టిగానే బిగుసుకుందని చెబుతున్నారు.