కాక రేపుతున్న ఖమ్మం.. తెలుగు తమ్ముళ్ల స్పెషల్ ఫోకస్!
posted on Nov 20, 2023 9:16AM
తెలంగాణ ఎన్నికలు ఇక రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీ ప్రచారంలో మునిగిపోయాయి. అభ్యర్థుల మధ్య, పార్టీల మధ్యా మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఈ ఎన్నికలను చావో రేవో అన్నట్లుగా మారిపోయాయి. దీంతో మూడు పార్టీలూ విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రజలలో నెలకొన్న అసంతృప్తి ని కాంగ్రెస్ పార్టీ ఓట్లుగా మలచుకోవడంతో ఎంతమేర సఫలీకృతం అవుతుందన్నది ఈ ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేయనుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా కాంగ్రెస్ జోరుమీద ఉందని అంటున్నారు. అధికారం దక్కించుకుంటుందా లేదా అన్నది పక్కన పెడితే గెలుపు ధీమా మాత్రం కాంగ్రెస్ లో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా కొన్ని జిల్లాలలో అయితే ప్రజా నాడి కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతోందని సర్వేలు చెబుతున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలతో పాటు తెలుగుదేశం బలంగా ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగు తమ్ముళ్ల మద్దతుతో ఇప్పుడు కాంగ్రెస్ బలంగా మారింది. అలాంటి ప్రాంతాలలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒకటి.
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆంధ్రా ప్రాంతానికి అనుకోని ఉండడంతో పాటు తొలి నుండి ఇక్కడ బీఆర్ఎస్ సొంతంగా నిలదొక్కుకోలేకపోవడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. ఇక్కడ కమ్మ, రెడ్డి సామజిక వర్గాలు బలంగా ఉండడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇక్కడ ఆయా సామాజికవర్గాలకు చెందిన ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకున్నారు. అయితే బీఆర్ఎస్ లో వాళ్లకి తగిన గౌరవం దక్కలేదన్న అసంతృప్తితో వాళ్లలో పలువురు ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ కు దూరమయ్యారు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలలో కాకలు తీరిన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ ఇందుకు ఉదాహరణ. తెలుగుదేశంలో ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాలలో కీలకమైన శాఖలు నిర్వహించిన తుమ్మల 2014 వరకూ టీడీపీలోనే ఉన్నారు. రాష్ట్ర విభజన తరువాత టీఆర్ఎస్ గూటికి చేరిన తుమ్మల మంత్రి కూడా అయ్యారు. కానీ 2018లో ఓటమి తర్వాత కేసీఆర్ అండ్ కో ఆయన్ను పట్టించుకోవడం మానేసింది.
దీంతో ఈ ఎన్నికల సమయానికి తుమ్మలను కాంగ్రెస్ పార్టీ దరి చేర్చుకుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తుమ్మల తెలుగుదేశం మాజీ నేత కావడం, ఇప్పటికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో అనుబంధం ఉండడంతో ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు తుమ్మలకు అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ ఇస్తున్నారు. అసలే చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో తెలుగుదేశం క్యాడర్ బీఆర్ఎస్ మీద గుర్రుగా ఉండగా.. తమ్ముల తెలుగుదేశంతో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ ప్రచారంలో మైలేజీ పొందుతున్నారు. నాడు తెలుగుదేశంలో కేసీఆర్ కు మంత్రి పదవిని ఇప్పించింది తానేనని, అంతెందుకు 2014 తర్వాత తన వల్లనే టీఆర్ఎస్ కు ఖమ్మంలో కళాకాంతులు దక్కాయని చెబుతున్నారు. మరోవైపు ఇదే జిల్లాలో బీఆర్ఎస్ మాజీ నేత, ప్రస్తుత కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ కూడా రెడ్డి సామాజికవర్గంతో పాటు పాత కాంగ్రెస్ క్యాడర్ ను ఆకర్షిస్తూ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఆర్ధికంగా బలమున్న నేత కావడంతో పొంగులేటి బీఆర్ఎస్ నుండి బయటకి వచ్చిన నాటి నుండే క్యాడర్ ను కాపాడుకుంటూ వస్తున్నారు.
ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి పోటీ చేస్తున్న పొంగులేటి పాత కాంగ్రెస్, బీఆర్ఎస్ లో తన అనుచర గణాన్ని, తెలుగుదేశం సానుభూతిపరులను కూడా కలుపుకొనిపోతూ బీఆర్ఎస్ నేతలకు సవాళ్లు విసురుతున్నారు. సీఎం కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్‌ను రెడీ చేశామని డైరెక్ట్ గా హెచ్చరిస్తున్న పొంగులేటి.. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వీస్తోందని కాస్కోండి అంటూ చాలెంజ్ విసురుతున్నారు. కమ్మ సామజిక వర్గం నుండి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నా.. ఆ సామాజికవర్గాన్ని ఆకట్టుకునేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా.. ఏపీలో చంద్రబాబు అరెస్ట్ అంశంతో తమ్ముళ్లు అందరూ ఇప్పుడు అజయ్ పై పోటీ చేసిన తుమ్మల వైపు మళ్లారు. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూస్తే తెలుగుదేశం మాజీ నేతలు, తెలుగు తమ్ముళ్లే రాజకీయాన్ని మలుపు తిప్పుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీనికి పాత కాంగ్రెస్ నేతలు తోడై ఖమ్మం జిల్లాలో కాక రేపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లలో టీడీపీ జెండాలు రెపరెపలాడడంతో ఇక్కడ బీఆర్ఎస్ నేతలకు సినిమా క్లైమాక్స్ ఏమిటన్నది క్లియర్ కట్ గా అర్ధమై ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.