బీఆర్ఎస్ కు ప్రచారాస్త్రాలు కరవు.. కర్నాటక కాంగ్రెస్ ఆదరవు
posted on Nov 21, 2023 @ 12:26PM
తెలంగాణ ఎన్నికల ముంగిట అధికార బీఆర్ఎస్ కు కర్నాటక కష్టాలు ఎదురౌతున్నాయి. కర్నాటకలో కాంగ్రెస్ విజయం తరువాత తెలంగాణలో బీఆర్ఎస్ జోరుకు బ్రేకులు పడ్డాయనే చెప్పాలి. అంతే కాదు.. కర్నాటకలో కాంగ్రెస్ విజయం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కూడా పెద్ద థ్రెట్ గా మారిపోయింది. కర్నాటకలో కాంగ్రెస్ విజయాన్ని ఏదో గాలివాటం గెలుపుగా కొట్టి పారేయాలని ప్రయత్నించిన తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ కూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వరుస ఝలక్ లు తగులుతూ వస్తున్నాయి. కర్నాట ఎన్నికల తరువాత దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రంగం రెండీ అయ్యింది. షెడ్యూల్ విడుదలైంది. నోటిఫికేషన్ వచ్చింది. విడతల వారీగా పోలింగ్ కూడా మొదలైపోయింది. అయినా కూడా తెలంగాణలో బీఆర్ఎస్, మిగిలిన ఐదు రాష్ట్రాలలో బీజేపీ కర్నాటక షాక్ నుంచి ఇప్పటికీ తేరుకోలేదనే అనిపిస్తున్నది. అదే సమయంలో కర్నాటక ఫలితాల జోష్ తో ఐదు రాష్ట్రాలలో కాంగ్రెస్ జోష్ మామూలుగా లేదు. అదే సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్, మిగిలిన నాలుగు రాష్ట్రాలలో బీజేపీలో నిర్లిప్తత, నైరాశ్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.
ప్రధానంగా తెలంగాణ విషయానికి వస్తే.. తెలంగాణలో బీజేపీ వెనుకబాటు తొలి నుంచీ బీఆర్ఎస్, బీజేపీల రహస్య బంధంపై వస్తున్న విమర్శలు, ఆరోపణలూ వాస్తవమేనని జనం కూడా నమ్మే పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ తో విభేదించి కేసీఆర్ సర్కార్ ను దీటుగా ఎదుర్కోగలిగే పార్టీగా బీజేపీని నమ్మి వచ్చి చేరిన సీనియర్లంతా ఉక్కపోతకు గురయ్యారు. బీఆర్ఎస్ ను బీజేపీ గట్టిగా వ్యతిరేకించడం లేదన్న అసంతృప్తితో ఒక్కరొక్కరుగా పార్టీ నుంచి బయటకు వచ్చారు. అలా రాలేని వారు ఈ సారి ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండేందుకే మొగ్గు చూపారు.
ఇక అధికార బీఆర్ఎస్ విషయానికి వస్తే.. రాష్ట్రంలో తనకు ప్రత్యర్థి బీజేపీ మాత్రమే అన్నట్లుగా ఆ పార్టీపై విమర్శలు గుప్పించి, సవాళ్లు విసిరి కమలం పార్టీ గ్రాఫ్ ను పెంచేసిన బీఆర్ఎస్.. తీరా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత నుంచీ ప్లేట్ ఫిరాయించేసింది. ఆ పార్టీ విమర్శలన్నీ కాంగ్రెస్ వైపే మళ్లాయి. అదే సమయంలో బీజేపీ కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కంటే.. కాంగ్రెస్ ను లక్ష్యం చేసుకునే ఎక్కవగా విమర్శలు గుప్పిస్తోంది. ఈ పరిస్థితే బీఆర్ఎస్, బీజేపీల మధ్య రహస్య మైత్రిపై అనుమానాలను పెంచేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సాధారణంగా ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా.. తమకు మరో సారి అధికారంలోకి వస్తే ఏం చేస్తాం... అధికారంలో ఉన్న కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమాల గురించి ప్రచారం చేసుకుంటుంది. అయితే బీఆర్ఎస్ మాత్రం ఈ ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమాన్ని చెప్పుకోవడంలో ఎందుకో తడబడుతోంది. డబుల్ బెడ్ రూం వంటి వాగ్దానాలను మరో సారి విజయం కోసం తెరమీదకు తెస్తున్నది. ఏవైతే తన ఫ్లాగ్ షిప్ ఘనతలుగా కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ చెప్పుకుంటున్న వాటినే టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతోంది.
అదే సమయంలో బీఆర్ఎస్ తమ ఘనతలను చాటుకోవడం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం కర్నాటకలో వైఫల్యం చెందిందని చెప్పడానికే ఎక్కువగా తాపత్రేయ పడుతోంది. పరాయి రాష్ట్రం ఊసు మనకెందుకు, పరాయి రాష్ట్రంలో చంద్రబాబు అరెస్టయితే ఇక్కడ ఆందోళనలు ఏమిటి? అంటూ రుసరుసలాడిన కేసీఆర్, కేటీఆర్ లు ఇప్పడు ఆ విషయాన్ని మరచిపోయి లేదా ఉద్దేశ పూర్వకంగా విస్మరించి కర్నాటకలో కాంగ్రెస్ వైఫల్యాలను తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. ఇది సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల సమయంలో చేసే పని కాదు. అధికారంలో ఉన్న పార్టీ తమ హయాంలో జరిగిన అభివృద్ధి-సంక్షేమ పథకాలు ప్రచారం చేసుకుంటుంది. మరో సారి అవకాశం ఇస్తే ఇంకెంత చేస్తామన్నది చెప్పుకుంటుంది. అయితే తెలంగాణలో అధికారంలో ఉన్నబీఆర్ఎస్ మాత్రం కర్నాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను చెప్పి ఈ రాష్ట్రంలో తమకు ఓటు వేయాలని ప్రచారం చేసుకుంటున్నది. ఎన్నికల ప్రచార సభల్లోనే కాదు.. పార్టీ పరంగా పత్రికలకు ఇచ్చే ప్రకటనలో కూడా కర్నాటకలో కాంగ్రెస్ పాలన గురించే పేర్కొటుండంపై రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. కర్నాటకలో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటిని అమలు చేయడం లేదంటూ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు చేస్తున్నది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ప్రచారాన్ని గమనిస్తే.. రాష్ట్రంలో తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రానికి తాము ఏం చేశామో చెప్పుకునే అవకాశాలేమీ లేకపోవడంతో.. పక్క రాష్ట్రంలో ఇక్కడ తమ ప్రత్యర్థి పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపి.. రాష్ట్రంలో మాకు ఓటేయండి అని అడుగుతోందని అవగతమౌతుంది. అయితే కర్నాటక బూచిని చూపి తెలంగాణలో లబ్ధి పొందాలన్న బీఆర్ఎస్ వ్యూహం ఫలించే అవకాశాలు లేవనీ, ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్నది తెలంగాణ అసెంబ్లీకనీ ప్రజలకు స్పష్టంగా తెలుసునని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.