బాబుకి బెయిలు.. జగన్‌కి జైలు!
posted on Nov 21, 2023 6:00AM
స్కిల్ కేసులో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ టి. మల్లిఖార్జునరావు తీర్పు వెలువరించారు. ఈ నెల 28వ తేదీన రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు వెళ్లవలసిన అవసరం లేదని ఆ తీర్పులో న్యాయమూర్తి స్పష్టం చేశారు. అలాగే మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సమయంలో విధించిన షరతులు ఈ నెల 28వ తేదీ వరకు మాత్రమే వర్తిస్తాయని పేర్కొన్నారు. ఆ తరువాత 29వ తేదీ నుంచి రాజకీయ ర్యాలీలు, సభల్లో చంద్రబాబు పాల్గొన వచ్చని తెలిపారు. అదే విధంగా ఈ నెల 30వ తేదీన ఏసీబీ కోర్టుకు చంద్రబాబు హాజరుకావాలని.... ఆయన చికిత్సకు సంబంధించిన నివేదికను ఆ కోర్టుకు సమర్పించాలని జస్టిస్ టి. మల్లిఖార్జునరావు తన తీర్పులో వివరించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడం బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. సెప్టెంబర్ 9వ తేదీన ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును జగన్ ప్రభుత్వం నంద్యాలలో అరెస్ట్ చేసింది. అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా.. రిమాండ్ విధించడంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. మరోవైపు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టిన ఆయన తనయుడు నారా లోకేశ్.. తన తండ్రి అరెస్ట్‌తో తన పాదయాత్రను అర్థాంతరంగా నిలిపివేశారు. ఆ క్రమంలో తన తండ్రికి బెయిల్ కోసం.. నారా లోకేశ్ ఢిల్లీ వేదికగా న్యాయవాదులతో సుదీర్ఘ సంప్రదింపులు జరిపారు.
మరోవైపు జైల్లో ఉన్న చంద్రబాబు పలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. అలాంటి సమయంలో ఆయనకు ప్రభుత్వ వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. ఆ క్రమంలో ఆయన కంటికి శస్త్ర చికిత్స చేయవలసి ఉందంటూ వైద్యులు స్పష్టం చేశారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులే కాదు.. సైకిల్ పార్టీ శ్రేణులు సైతం చంద్రబాబు ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన చెందాయి. మరోవైపు చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో 105 మంది ప్రాణాలు విడిచారు. మృతుల కుటుంబాలను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పరామర్శించారు.
ఇందు కోసం ఆమె చేపట్టిన నిజం గెలవాలి యాత్రకు అపూర్వ జనస్పందన వచ్చింది. మరో వైపు హైకోర్టు .. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన అనారోగ్యం కారణంగా.. పలు వైద్య పరీక్షలు చేయించుకొన్నారు. ఆ క్రమంలో కంటి శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నారు. మరోవైపు తన తండ్రి చంద్రబాబు అరెస్ట్‌తో ఆపేసిన యువగళం పాదయాత్రను నారా లోకేశ్.. నవంబర్ 24వ తేదీ అంటే.. శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభించనున్నారని సమాచారం. అలాగే ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు సైతం.. మరికొద్ది రోజుల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే.. తాజాగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో నవంబర్ 29వ తేదీ నుంచి రాజకీయ ర్యాలీలు, సభల్లో చంద్రబాబు పాల్గొన వచ్చని స్ఫష్టం చేసింది. దీంతో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని ఆయన మళ్లీ తిరిగి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బాబు ఆరోగ్యం కుదురుకున్న తర్వాత.. సాధ్యమైనంత త్వరలో ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని సమాచారం.
అలాగే మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సమయంలో విధించిన షరతులు ఈ నెల 28 వరకు వర్తిస్తాయని హైకోర్టు న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేయడంతో.. నవంబర్ 29వ తేదీ నుంచి చంద్రబాబు యధావిధిగా తన కార్యచరణను ప్రకటించే చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే నవంబర్ 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో ఎన్నికల ప్రచారం నవంబర్ 28వ తేదీ సాయంత్రంతో ముగియనుంది.
అదీకాక.. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదు. దీంతో చంద్రబాబు తన ఫోకస్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మీదే పెట్టనున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. అలాంటి వేశ.. జగన్ పార్టీ ఓటమి దాదాపుగా ఖరారు అవుతుందనే ఓ ప్రచారం సైతం జన బాహుళ్యంలో దూసుకుపోతుంది. అదే జరిగితే.. ఆ పార్టీ అధినేత వైయస్ జగన్‌కు మళ్లీ శ్రీకృష్ణ జన్మస్థానం తథ్యమనే ఓ ప్రచారం సైతం ప్రజల్లో వైరల్ అవుతోంది.