కాంగ్రెస్ టార్గెట్ @90!
posted on Nov 20, 2023 @ 11:24AM
తెలంగాణలో కాంగ్రెస్ జోష్ మామూలుగా లేదు. తెలంగాణ ఆవిర్భావం తరువాత వరుసగా రెండు ఎన్నికలలో పరాజయం పాలై అధికారానికి దూరమైన ఆ పార్టీ ఈ సారి అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. కర్నాటకలో విజయం తరువాత.. తెలంగాణలో వైనాట్ పవర్ అన్న పట్టుదలతో అడుగులు వేస్తున్నది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ పార్టీ పగ్గాలు అందుకున్న నాటి నుంచీ కూడా రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులలో కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తూ వచ్చింది. అయితే సీనియర్లు తొలుత రేవంత్ నాయకత్వం పట్ల విముఖతతో అసమ్మతి రాగం ఆలపించినా.. ఆ తరువాత అధిష్ఠానం జోక్యంతో అంతా సర్దుకున్నట్లు కనిపిస్తున్నది. అక్కడక్కడా అసమ్మతి గళం గొణుగుడు వినిపించినా.. క్యాడర్ దానిని పట్టించుకోకుండా ఉత్సాహంగా ప్రచారంలో ముందుకు దూకుతున్నారు. ఇక పోలింగ్ తేదీ రోజుల వ్యవధిలోకి వచ్చేయడంతో మరింత పకడ్బందీగా, ప్రణాళికా బద్ధంగా ప్రచార వ్యూహాన్ని రచించుకున్న కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలలో కనీసం 90 స్థానాలలో విజయం సాధించడమే టార్గెట్ గా పెట్టుకుంది. అందుకు అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా గెలుపు అవకాశాలు ఉన్నట్లు గుర్తించిన 90 నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆ 90 నియోజకవర్గాలలోనూ విస్తృత ప్రచారానికి కార్యాచరణ రూపొందించింది.
ప్రచారం తుది దశకు చేరుకున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ అగ్రనాయకులంతా రంగంలోకి దిగే విధంగా ప్లాన్ చేసింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, భూపేష్ పటేల్, చిదంబరంతో పాటు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ సీఎంలు కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఇక ఇటీవలే బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్, మాజీ ఎంపీ విజయశాంతి కూడా కాంగ్రెస్ తరఫున ముమ్మరంగా ప్రచారం చేయనున్నారు. ఇక కేంద్ర మాజీ మంత్రులు, మాజీ సీఎంలు కూడా తెలంగాణలో ప్రచార పర్వంలో పాల్గొనేందుకు రానున్నారు. ఈ నెల 22 నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణ ప్రచారంలో పాల్గొనేందుకు సుడిగాలి పర్యటనలకు షెడ్యూల్ ఖరారైంది.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అలంపూర్, నల్లగొండలో ఈ నెల 22న ప్రచారం చేయనున్నారు. అలాగే విజయశాంతి ఖమ్మం, మహబూబ్ నగర్‌తో పాటు గ్రేటర్ హైదరాబాద్ నియోజకవర్గాల్లో పర్యటించి కాంగ్రెస్ లో జోష్ నింపనున్నారు. అదే విధంగా ఇతర అగ్రనేతల పర్యటన షెడ్యూల్ కూడా ఖరారైంది. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, మేనిఫెస్టోలోని కీలకాంశాలనూ చేరవేయడమే లక్ష్యంగా పార్టీ ప్రచార కార్యక్రమం రూపొందించినట్లు పార్టీ రాష్ట్ర నాయకత్వం చెబుతోంది. ప్రస్తుత టెంపో ఏ మాత్రం సడలకుండా కొనసాగేలా ప్రచారపర్వాన్ని కొనసాగించేలా కాంగ్రెస్ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నది. పార్టీ హామీలనే కాకుండా.. గత తొమ్మదేళ్ల కేసీఆర్ పాలనా వైఫల్యాలను కూడా ప్రజలలో ఎండగట్టే విధంగా కాంగ్రెస్ ప్రచారం ఉండాలన్న నిశ్చయంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగానే తెలంగాణ ఇచ్చిన అమ్మగా సోనియా గాంధీని కూడా రాష్ట్రంలో ప్రచారానికి తీసుకురావాలని యోచిస్తున్నది. పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రతిపాదనకు సోనియా కూడా సానుకూలంగా స్పందించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఒక వేళ ఏ కారణం చేతనైనా సోనియా రాష్ట్ర పర్యటనకు రాలేని పరిస్థితి ఏర్పడితే.. ఆమె ఒక ప్రత్యేక వీడియో ద్వారా తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక్క చాన్స్ ఇవ్వండి అంటూ సోనియాగాంధీ చేత రాష్ట్ర ప్రజలకు ఓ పిలుపు ఇచ్చేలా కాంగ్రెస్ ప్రణాళిక రచిస్తోంది.