సక్సెస్‌కి బ్రాండ్ అంబాసిడర్ మల్లన్న!
posted on Nov 22, 2023 @ 12:06PM
మంత్రి చామకూర మల్లారెడ్డి.. ఈ పేరు గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మల్లన్న సభలు, సమావేశాలు, ప్రసంగాలకు ఎక్కడ లేని డిమాండ్ ఏర్పడింది. ఔను.. పూలమ్మినా.. పాలమ్మినా అంటూ మంత్రి మల్లారెడ్డి చేసిన ఒక్క ప్రసంగం.. సోషల్ మీడియాలో దుమారమే రేపింది. పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడిన.. సక్సెస్ అయినా అంటూ తన జీవితంలోని సక్సెస్ మంత్రను ఓ సభలో మల్లారెడ్డి వివరించిన తీరు ఆయనకి ఎక్కడలేని ఫేమ్ ను తీసుకొచ్చింది.
డిగ్రీ చదువుని మధ్యలోనే ఆపేసినట్లు చెప్పుకొనే మల్లారెడ్డి.. హైదరాబాద్ వేదికగా పలు విద్యాసంస్థలను స్థాపించి బడా బిజినెస్‌మ్యాన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. నిజానికి 2014 ముందు మల్లారెడ్డి రాజకీయాలలో ఎవరికీ తెలియదు. 2014లో టీడీపీ తరపున మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ తరపున ఎంపీగా ఎన్నికైన ఏకైక వ్యక్తి మల్లారెడ్డే. ఆ తర్వాత 2016లో మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి టీఆర్ఎస్(ఇప్పుడు బీఆర్ఎస్)లో చేరారు. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా మేడ్చల్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిచి.. కేసీఆర్ కేబినెట్ లో స్త్రీ, శిశు సంక్షేమ, కార్మిక, ఉపాధి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన మళ్లీ మేడ్చల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సభలు, ర్యాలీలు, మీడియా డిబేట్లతో ఆయన బిజీగా ఉన్నారు.
పూలమ్మినా, పాలమ్మినా మల్లారెడ్డి అలా కష్ట పడే విజయానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎదిగారు. తెలుగు రాష్ట్రాలకు ఎందరో యువ ఇంజనీర్లను, వైద్యులను అందిస్తున్నారు. ఆయన స్థాపించిన కాలేజీలలో చదివిన ఎందరో విద్యార్థులు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. నేటికీ ఆయన కాలేజీలంటే ఒక బ్రాండ్.. ఆయన కాలేజీలలో సీటు పొందడం విద్యార్థులకు ఒక క్రేజ్. ఐటీ ఇండస్ట్రీ నుండి కార్పొరేట్ హాస్పటిల్స్ వరకూ.. ప్రపంచ పారిశ్రామిక రంగం నుండి.. అంతర్జాతీయ విమానయానం వరకూ.. ఆయన కాలేజీ విద్యార్థులంటే పిలిచి కొలువులు ఇవ్వాల్సిందే. ఇదీ విద్యారంగంలో ఆయన సెట్ చేసిన ట్రెండ్. ఆయన విద్యాసంస్థలలో విద్యార్థులే కాదు.. పనిచేసే ఉద్యోగులకు ఒక క్రేజ్ ఉంటుంది. ఆయన కాలేజీ సిబ్బందిగా ఉద్యోగం సంపాదిస్తే లైఫ్ సెటిల్ అయినట్లే అనే టాక్ ఉంటుంది. అందుకే ప్రభుత్వ ఉద్యోగంతో సమానంగా మల్లారెడ్డి కాలేజీలలో ఉద్యోగాలకు పోటీ ఉంటుంది.
ఇక రాజకీయాలలో కూడా అంతే. ఆయన మాట తీరు ఫన్నీగా ఉండొచ్చు కానీ ఆయన పనితీరులో వంకలు పెట్టాల్సిన పనిలేదంటారు రాజకీయ విశ్లేషకులు. ఆయన ఏ పార్టీలో ఉన్నా మనసు పెట్టి పనిచేస్తారు. ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా పని చేస్తారు. అందుకే మల్లారెడ్డి అంటే అన్ని పార్టీల నేతలకు దగ్గరి మనిషి అనే భావన ఉంటుంది. కష్టాన్ని నమ్ముకోని ఎదిగిన మనిషి కదా దాని విలువ తెలుసు కనుకనే తన కష్టాన్ని పదిమందికి చెప్పుకుంటారు. ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్ మాత్రం ఆయనను విజనరీ ఉన్న వ్యక్తిగా గుర్తించింది. ఈ ఏడాది ఆగస్టులోనే మల్లారెడ్డికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ విజనరీ మ్యాన్ అవార్డ్ దక్కింది. సైకిల్ మీద పాలమ్మిన వ్యక్తి నేడు ఇండియన్ బుక్ అఫ్ రికార్డ్స్ లో విజనరీ మ్యాన్ గా చోటు దక్కించుకున్నారంటే సక్సెస్ కి అసలు సిసలైన నిదర్శనం ఇదే అని చెప్పడానికి సందేహించాల్సిన అవసరమేముంటుంది?!