రాష్ట్రానికి రాజధాని అక్కర్లేదు కానీ.. సొంతానికి ప్యాలెస్ నిర్మాణమా?
posted on Nov 21, 2023 @ 1:42PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు. జగన్ అధికారం చేపట్టేనాటికి అమరావతి రాష్ట్ర రాజధానిగా అన్ని హంగులూ సంతరించుకుని.. ప్రపంచమేటి నగరంగా రూపుదాల్చడం ఖాయమన్న ఆశలను రాష్ట్రప్రజలలో రేకెత్తించింది. అయితే జగన్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచీ.. అమరావతి నీరుగారడం ప్రారంభమైంది. విధ్వంసం వినా, నిర్మాణం తెలియని జగన్ సర్కార్ అమరావతి విధ్వంసంతోనే పాలన ఆరంభించింది. ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన ఆ విధ్వంస పాలన అమరావతిని శ్మసానంతో పోల్చడం, నిర్వీర్యం చేయడం, మూడు రాజధానులంటూ కొత్త పల్లవి ఎత్తుకుని రాష్టాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చడం వరకూ సాగింది.
నాలుగున్నరేళ్లు గడిచిపోయింది. ఇప్పటికీ రాష్ట్రానికి రాజధాని ఏదన్నది జగన్ సర్కార్ తేల్చలేకపోయింది. మూడు రాజధానులు అంటూ మొదలు పెట్టి చివరకు విశాఖ వద్దకు వచ్చి ఆగింది. న్యాయరాజధాని కర్నూలు అసలు మా యోచనలోనే లేదని కోర్టులకు చెప్పేసింది. శాసన రాజధాని అని చెప్పిన అమరావతిని నిర్వీర్యం చేసేసింది. విశాఖ నుంచైనా పాలన సాగిస్తారో లేదో తేలలేదు కానీ.. ప్రజలు అధికారం ఇచ్చింది తాను ప్యాలస్ లను నిర్మించుకోవడానికే అన్నట్లుగా జగన్ ప్రజా ధనంతో రుషికొండకు బోడి గుండు కొట్టేసి మరీ ప్యాలెస్ నిర్మించుకున్నారు. ఆ భవన నిర్మాణం విషయంలో ఆది నుంచీ కోర్టులకు, ప్రజలకు అన్నీ అబద్ధాలే చెబుతూ వచ్చారు. పర్యాటక భవనాలే అంటూ కోర్టులకు సైతం అసత్యాలు చెప్పారు. ఆ నిర్మాణాలకు అయిన వ్యయం ఎంతన్నది బయటకు తెలీయకుండా రహస్యంగా ఉంచారు. జీవోలను పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు.
కానీ హైకోర్టు ఆదేశాలతో జగన్ సర్కార్ గత్యంతరం లేని పరిస్థితుల్లో రుషికొండ ప్యాలెస్ నిర్మాణ వ్యయం వెలుగులోనికి వచ్చింది. రుషికొండపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నిర్మాణానికి సంబంధించి ఇంత కాలం రహస్యంగా ఉంచిన పది జీవోలనూ కోర్టు ఆదేశాల కారణంగా బయట పెట్టక తప్పని పరిస్థితి జగన్ సర్కార్ కు ఏర్పడింది. దీంతో రుషికొండపై ప్యాలెస్ నిర్మాణానికి 433 కోట్ల రూపాయలు వ్యయం అయ్యిందన్న విషయం తేటతెల్లమైంది. అంచనా వ్యయానికి మించి ఖర్చు చేసినట్లు తేటతెల్లమైంది. పర్యాటక అభివృద్ధి అంటూ మొదలు పెట్టి పర్యావరణ విధ్వంసానికి సైతం వెరవకుండా పచ్చటి రుషికొండకు గుండు కొట్టి మరీ నిర్మించిన భవనానికి ప్రజాధనం ఎంత వ్యయం అయ్యిందన్నది తెలిపే పది జీవోలు ఇప్పుడు ప్రభుత్వ వెబ్ సైట్ లో దర్శనమిస్తున్నాయి. పర్యాటక అభివృద్ధికి అంటూ ఆరంభించిన నిర్మాణాలకు కొండ చుట్టూ నో ఎంట్రీ బోర్డులు ఎందుకు?.. అంటూ ఇంత కాలం ప్రజలు, విపక్షాలు నిలదీస్తున్నా లెక్క చేయకుండా రుషి కొండ ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా అనధికారికంగా ప్రకటించేసి ఒక రహస్యోద్యమంలా పని కానిచ్చేసిన జగన్ రెడ్డి రుషికొండ ప్యాలెస్ నిర్మాణం బండారం ఇప్పుడు బయటపడిపోయింది.
విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అద్దె భవనంలో నివాసం ఉండి ఏపీ ప్రజలకు రాజధాని నిర్మించాలని ఆరాటపడితే.. తరువాత సీఎం అయిన జగన్ నిర్మాణంలో ఉన్న రాజధానిని నిర్వీర్యం చేసేసి.. రాజధాని లేని రాష్ట్రంగా మార్చేసి సొంత ప్యాలస్ ల నిర్మాణాలపై దృష్టి పెట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెలనెలా ప్రభుత్వోద్యోగులకు సమయానికి జీతాలివ్వలేని ఆర్థిక దుస్థితిలో రాష్ట్రాన్ని ముంచేసిన జనగ్ రెడ్డి.. ప్రజాధనంతో సొంతానికి రుషికొండ ప్యాలెస్ నిర్మాణం చేసుకోవడం, ఆ ప్యాలస్ లో ఫర్నిచర్ కే 14 కోట్లు ఖర్చు చేయడం బయటపడిన జీవోల ద్వారా వెలుగులోకి వచ్చింది. గడిచిన నాలుగున్నరేళ్లలో అమరావతిలో కనీసం ఒక్క ఇటుక కూడా వేయని జగన్ కోట్ల ప్రజా ధనాన్ని ఇలా ప్యాలెస్ నిర్మించుకోవడానికి వెచ్చించడం ఏమిటని జనం నిలదీస్తున్నారు.