కాంగ్రెస్ గూటికి నటి దివ్యవాణి
posted on Nov 22, 2023 @ 11:20AM
ఎన్నికల సమయం దగ్గరపడుతున్నా పార్టీలలో చేరికల జోష్ తగ్గలేదు. వరుస చేరికలతో కాంగ్రెస్ కళకళలాడుతోంది. తాజాగా నటి దివ్యవాణి కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో సినీ కళ కూడా కాంగ్రెస్ కు తోడైందని అంటున్నారు. నటి దివ్యవాణి రాజకీయ అరంగేట్రం తెలుగుదేశం పార్టీతో ఆరంభమైంది. ఆమె 2019లో తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితు ఆ తరువాత ఆమె పార్టీకి రాజీనామా చేశారు. 2022లో పార్టీకి రాజీనామా చేసిన దివ్యవాణి అప్పటి నుంచీ ఏ పార్టీలోనూ చేరకుండా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమె కాంగ్రెస్ గూటికి చేరారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే సమక్షంలో దివ్యవాణి పార్టీ కండువా కప్పుకున్నారు. వరుస చేరికలతో ఇప్పటికే మాంచి జోష్ మీద ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు నటి దివ్యవాణి చేరికతో సీనీ గ్లామర్ కూడా సంతరించుకున్నట్లైంది. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీలో అసంతృప్తి, అసమ్మతి నేతలు కాంగ్రెస్ బాట పట్టిన సంగతి తెలిసిందే.
ఇటీవలే టాలీవుడ్ లో లేడీ అమితాబ్ గా తిరుగులేని గుర్తింపు ఉన్న నటి విజయశాంతి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆమె వాగ్ధాటితో బీజేపీ, బీఆర్ఎస్ లపై చేస్తున్న విమర్శలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయం నుంచీ రాజకీయాలలో చురుకుగా ఉన్న విజయశాంతి చేరిక ఎన్నికల వేళ కాంగ్రెస్ కు అదనపు బలంగా మారిందనడంలో సందేహం లేదు. అదే విధంగా నటి దివ్యవాణి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం పార్టీలో సినీగ్లామర్ అదనపు ఆకర్షణగా మారిందని పరిశీలకులు అంటున్నారు.