ఎవరీ బర్రెలక్క..ఏమా కథ!

బర్రెలక్క... బర్రెలక్క.. బర్రెలక్క.. తెలంగాణ ఎన్నికల వేళ.. ఈ పదమే అందరి నోట్లో తెగ నానుతోంది. అంతేకాదు.. ఈ బర్రెలక్క వీడియోలు.. ఆమెపై పలు కథనాలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో   రచ్చ రంబోలా చేసి పారేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు అక్కడక్కడ వినిపించిన ఆమె పేరు ప్రస్తుతం   సునామీలాగా జనంలో ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. అలాంటి వేళ.. అసలు ఇంతకీ ఎవరీ బర్రెలక్క? అని ప్రపంచంలోని తెలుగు వారంతా ఆసక్తిగా ఆమె గురించి ఆరా తీస్తున్నారు.

నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామం బర్రెలక్క స్వస్థలం. బర్రెలక్క అసలు పేరు కర్నె శిరీష. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ నుంచి బీకాం డిగ్రీ పూర్తి చేసింది. అనంతరం ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతోంది. ఆ క్రమంలో టీపీఎస్‌సీ పరీక్షల్లో పేపరు లీకులు, కోర్టు కేసులు, పరీక్షలు వాయిదాలు మీద వాయిదాలు పడడంతో తీవ్ర నిరాశ చెందింది. ఆ క్రమంలో ఎన్ని డిగ్రీలు చదివినా.. ఉద్యోగాలు రావడం లేదని.. అందుకే బర్రెలు కాస్తున్నానంటూ.. నిరుద్యోగి శిరీష తీసిన వీడియో... సోషల్ మీడియాను షేక్ చేసింది... చేస్తోంది. అలా శిరీష.. బర్రెలక్కగా మారి.. కొల్లాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో దిగింది. ఆమెకు కేంద్ర ఎన్నికల సంఘం విజిల్  గుర్తు కేటాయించింది. 

రాజకీయమన్నా.. ఎన్నికలన్నా.. కోట్లాది రూపాయిల ఖర్చుతో కూడుకొన్న పని.. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. పార్టీకి ఫండ్ ఇవ్వడమే కాదు.. ఓటర్లను నోట్లతో కొనుగోలు చేసే కేపాసిటీ ఉన్న కోటీశ్వరులే ఎన్నికల బరిలో నిలవాలనే ఓ సంప్రదాయానికి రాజకీయ పార్టీలు ఎప్పుడో తెర తీశాయి. అలాంటి వేళ.. కేవలం బర్రెలు కాసుకొనే ఓ యువతి.. అదీ కూడా చాలా చిన్న వయస్సులోనే  ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయం తీసుకోవడం,  ఆ వెంటనే ఎటువంటి హంగు ఆర్బాటం లేకుండా.. నడిచి వెళ్లి ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేసింది బర్రెలక్క. ఆ క్రమంలో ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలంటూ పలువురు వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చినా అదరక బెదరక.. మొక్కవొని ధైర్యంతో నిలబడింది.


ఇక ఎన్నికల ప్రచారంలో  సైతం తన దైన శైలిలో ఈల వేస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఇక ఆమె చేసే ఈ ఈల శబ్దానికి దశాబ్దాల చరిత్ర ఉన్న రాజకీయ పార్టీల అభ్యర్థల గుండెల్లో గోల మొదలైంది. అలాగే నిరుద్యోగుల ప్రతినిధిగా శిరీష.. తన ప్రచారంలో భాగంగా యూట్యూబ్‌లో ఓ పాటను సైతం విడుదల చేసింది. కదిలే ఓ అడుగు .. యవతకు నువ్వు వెలుగు... కదిలింది మన బర్రెలక్క అదిగో లేవర యువత అంటూ సాగుతున్న పాట.. సోషల్ మీడియాను ఊపేస్తోంది. మరోవైపు మన కోసం ధైర్యంగా బరిలో నిలిచిన బర్రెలక్కకు మనం మద్దతుగా నిలుద్దామంటూ తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులు సైతం ఆమెకు బాసటగా నిలుస్తున్నారు. అదే విధంగా నియోజకవర్గంలో ప్రతీ మండలంలో ప్రజలు స్వచ్చందంగా ముందుకు .. ఆమెకు   మద్దతు తెలుపుతుండడం గమనార్హం.  

మరోవైపు.. ఇదే కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి అధికార బీఆర్ఎస్ అభ్యర్థిగా బీరం హర్షవర్థన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీజేపీ అభ్యర్థిగా సుధాకర్ బరిలో దిగారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ అంతా బీఆర్ఎస్, కాంగ్రెస్    అభ్యర్థుల మధ్యే ఉంటుందని తొలుత అంతా భావించారు. కానీ బర్రెలక్క సెడన్ ఎంట్రీతో.. నియోజకవర్గంలో పోలిటికల్ సీనేరియా ఒక్కసారిగా తారుమారు అయింది.  అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి పార్టీ అధినేతలు, అగ్రనేతలు, కీలక నేతలు ఎన్నికల ప్రచారాలు,  ర్యాలీలు నిర్వహించినా.. బర్రెలక్కకు వస్తున్న ప్రజాదరణ ముందు వారి ప్రచారం దిగదుడుపేనని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. 

ఇంకోవైపు బర్రెలక్క గురించి కేంద్రపాలిత ప్రాంతం యానం ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నారు. ఆ క్రమంలో ప్రచారం కోసం లక్ష రూపాయిల విరాళాన్ని ఆమెకు ఆయన అందజేశారు. అంతేకాకుండా.. ఈ నెల 27వ తేదీన ఆమెను కలుస్తున్నట్లు ఆయన ప్రకటించడమే కాకుండా.. ఆమె ప్రచారం కోసం మరింత విరాళం ఇవ్వనున్నట్లుతెలిపారు. అలాగే ఈ ఎన్నికల్లో ఫలితం ఎలా వచ్చిన నిరుత్సాహపడవద్దని.. బర్రెలక్కకు ఆయన సూచించారు.

  ఇక తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకొంది. అలాంటి వేళ.. దశాబ్దాల చరిత్ర కలిగిన రాజకీయ పార్టీల నుంచి కాకులు తీరిన యోధులు ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో అభ్యర్థుల మధ్య ఎన్నికల ప్రచారం హోరా హోరీగా నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. ప్రచారంలో భాగంగా రాజకీయ పార్టీలు అన్ని సాధనాలను ఉపయోగించుకొంటూ ముందుకు వెళ్తున్నాయి. అలాంటి వేళ.. డబ్బు, బ్యాక్ గ్రౌండ్, హంగు ఆర్బాటం లేకుండా ఎంట్రీ ఇచ్చిన ఈ బర్రెలక్క.. ఈ ఎన్నికల్లో గెలిస్తే మాత్రం.. ప్రపంచం ఆమెను పరిచయం చేసుకొంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.