ఏపీపై మిచాంగ్ తుపాను పడగ
posted on Dec 5, 2023 9:05AM
ఏపీపై మిచాంగ్ తుపాను పడగ విప్పింది. దివిసీమ వణికిపోతోంది. నెల్లూరు మునిగిపోతోంది. మొత్తంగా రాష్ట్రంలోని 11 జిల్లాలలో రెడ్ అలెర్ట్ జారీ అయ్యింది. ప్రస్తుతం నెల్లూరుకు 20కి.మీ, బాపట్లకు 110 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ తుపాను కారణంగా కోస్తాంధ్రతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో గంటకు 110 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తీరానికి అత్యంత దగ్గరగా తుపాను కదులుతోందని, తుపాను కొంతభాగం సముద్రంలో.. మరికొంత భూమిపై ఉందనీ వాతావరణ శాఖ తెలిపింది. తుపాను తీరం వెంబడి నెమ్మదిగా కదులుతుండటంతో తీరప్రాంతాలకు ఉప్పెన ముప్పు ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.
మిచాంగ్ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఉమ్మడి గుంటూరు, జిల్లా, కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి వర్షం పడుతోంది. 1977 దివిసీమ ఉప్పెన నాటి రోజులు గుర్తుకువస్తున్నాయంటూ దివిసీమ వాసులు వణికి పోతున్నారు.
ఇక తిరుమలలో పాపవినాశనం, గోగర్భం జలాశయాలు పూర్తిగా నిండిపోవడంతో గేటును ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలతో పంటపొలాల్లోకి వరదనీరు చేరి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు వేలాది ఎకరాల్లో వరి, ఇతర పంటలు నేలవాలాయి.
రాష్ట్రంపై మిచాంగ్ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ అయ్యింది.