పవన్ తొందరపాటు నిర్ణయం.. జనసేనకు తీవ్ర నష్టం!
posted on Dec 4, 2023 @ 9:52AM
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు అంటూ పవన్ కల్యాణ్ సూపర్ హిట్ సినిమా అత్తారింటికి దరేది సినిమాలో ఓ డైలాగ్ ఉంది. అయితే జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ మాత్రం.. ఆ డైలాగ్ సారాన్ని వంటపట్టించుకోలేదని అనిపిస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేనను పోటీకి దింపి ఆయన తీసుకున్న తొందరపాటు నిర్ణయం పార్టీకి తీరని నష్టాన్ని మిగిల్చింది. ఒక్కోసారి ఎన్నికల్లో పోటీ కూడా పార్టీకి నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే ఎప్పుడు బరిలో నిలవాలి? ఎప్పుడు పోటీ నుంచి తప్పుకోవాలి? అనేది రాజకీయ పార్టీలకు, ఆ పార్టీల అధినేతలకు తెలిసుండాలి. లేదంటే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. తాజాగా జనసేన పార్టీకి అలాంటి అనుభవమే ఎదురైంది.
రీసెంట్ గా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి తప్పుకొని మరీ గెలుపోటములను నిర్ణయించేలా ప్రభావం చూపి శభాష్ అనిపించుకుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ మిత్రపక్షంగా ఉన్న జనసేన మాత్రం, తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేసింది. పొత్తులో భాగంగా 119 సీట్లకు గాను ఎనిమిది సీట్లు మాత్రమే కేటాయించింది బీజేపీ. ఆ ఎనిమిదిలో కూడా బీజేపీ నుంచి వచ్చిన వారు, కొత్తగా పార్టీలో చేరినవారు ఉన్నారు.
ఇక ఫలితాలు వచ్చాక తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పెద్ద తప్పిదం చేశారని జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 8 స్థానాల్లో ఒక్క కూకట్ పల్లిలో మినహా మిగిలిన ఏడు చోట్లా జనసేన నోటాతో పోటీ పడింది. డిపాజిట్లు కోల్పోయింది.
అది అక్కడితో ఆగిపోదు.. తెలంగాణ ఫలితాలు ఏపీలో కూడా జనసేనకి తీవ్ర నష్టం కలిగించే అవకాశముంది. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను కేవలం ఒక్క సీటే గెలిచింది జనసేన. తర్వాత ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా అక్కడ అధికారంలో ఉన్న వైసీపీ గూటికి చేరాడు. దాంతో వైసీపీ నేతలు జనసేనని సింగిల్ సీట్ అని, పవన్ ఎమ్మెల్యేగా ఓడిపోయాడని పదే పదే ఎద్దేవా చేస్తున్న సంగతి విదితమే. ఇప్పుడు తెలంగాణ ఫలితాలను పట్టుకొని మరింత హేళన చేస్తారనడంలో సందేహం లేదు. మరోవైపు త్వరలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలుగుదేశంతో కలిసి ఆ ఎన్నికలకు వెళ్తున్న జనసేన.. తెలంగాణ ఫలితం కారణంగా సీట్ల విషయంలో పట్టుబట్టలేదు. టీడీపీ చెప్పిన సంఖ్యకు సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలనే పవన్ కళ్యాణ్ నిర్ణయం జనసేనకు నష్టం కలిగించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.