తెలంగాణలో కాంగ్రెస్ విజయం తెలుగుదేశం పుణ్యమేనా!
posted on Dec 5, 2023 9:23AM
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. అధికారానికి కావాల్సిన పూర్తి మెజార్టీని హస్తం పార్టీకి అందించారు. కాంగ్రెస్ అధికారం చేపట్టేందుకు టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్న రేవంత్ రెడ్డి.. అన్ని తానై పార్టీని విజయ తీరాలకు తీసుకొచ్చారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రత్యర్థి పార్టీల నుంచే కాకుండా సొంత పార్టీ నేతల నుంచి కూడా వచ్చిన విమర్శలను తట్టుకుని నిలబడి కాంగ్రెస్ ను విజయతీరానికి చేర్చారు. ఒకవైపు పార్టీని నడిపించే నాయకుడిగా ఉంటూనే మరోవైపు స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్రమంతా చుట్టేశారు.
ఇక ప్రభుత్వంపై పోరాటం చేసే ప్రతిపక్ష పార్టీ నేతగా నూటికి వెయ్యి శాతం న్యాయం చేశారు. ఒక్కమాటగా చెప్పాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానై నిలిచి గెలిపించారు. కాంగ్రెస్ రాష్ట్ర సారథి రేవంత్ రెడ్డి కావడం వల్ల ఆ పార్టీకి ఎన్నో అంశాలు కలిసి వచ్చాయి. పార్టీ సీనియర్ నేతలలో ఎవరైనా ఈ స్థాయిలో పని చేయడం కష్టమేనని సొంత పార్టీ నేతలే చెప్తారు. అలాగే సీనియర్ నేతలలో ఎవరైనా అధ్యక్ష పదవిలో ఉంటే మిగతా వాళ్ళు గళం విప్పి సొంత పార్టీలోనే కుమ్ములాటలు జరిగేది. కానీ, రేవంత్ అందరినీ కలుపుకున్నారు.. రేవంత్ వల్లే అందరూ కలిసి వచ్చారు. రేవంత్ వల్లే సెటిలర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలలో ఆంధ్రా సెటిలర్లున్నారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలలో ఉద్యోగులు, వ్యాపారాలు ఉంటే.. ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ ఉమ్మడి జిల్లాలలో వ్యవసాయం, ఉపాధితో పాటు వ్యాపార వర్గాలున్నాయి. వీరిలో ఎక్కువ శాతం తెలుగుదేశం సానుభూతిపరులు, చంద్రబాబు అభిమానులే అనడంలో సందేహం లేదు. అదే సమయంలో అదే కారణంతో వీరంతా రేవంత్ రెడ్డినీ అభిమానిస్తారు. అందుకే ఈ సెటిలర్లంతా గంపగుత్తాగా కాంగ్రెస్ కి జై కొట్టారు. స్థానికంగా అభ్యర్థి ఎవరన్నది చూడకుండా రేవంత్ రెడ్డిని చూసే తెలుగుదేశం జెండాను చేతబట్టి అండగా నిలిచారు. రేవంత్ రెడ్డిని చూసే హస్తంకు చేయూత అందించారు.
ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ కు అనుకున్న స్థాయిలో విజయం దక్కలేదు. దీనికి కారణం చాలా స్థానాలలో ఓటింగ్ శాతం 50కి మించలేదు. గురువారం ఎన్నికలు జరగడం.. శని, ఆదివారాలు వీకెండ్ సెలవులు కాగా.. ఒక్క శుక్రవారం సెలవు పెడితే నాలుగు రోజులు వీకెండ్ కలిసి వస్తుంది. ఇదే ఇక్కడ కొంపముంచింది. సీమాంధ్ర సెటిలర్లు, స్థానికులు ఓట్లేసినా.. మిగతా రాష్ట్రాల సెటిలర్లతో పాటు మరికొన్ని వర్గాలు ఓటింగ్ కి దూరంగా ఉండిపోయాయి. పైగా ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులకు కూడా టీడీపీ వర్గాలతో మంచి సంబంధాలు ఉండడంతో స్వల్ప అధీక్యంతోనే అయినా ఎక్కువ స్థానాలను బీఆర్ఎస్ దక్కించుకోగలిగింది. అదే నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో ఓటింగ్ శాతం భారీగా నమోదవడంతో పాటు తెలుగుదేశం వర్గాలు మద్దతివ్వడంతో కాంగ్రెస్ కు ఇక్కడ బంపర్ మెజార్టీతో అత్యధిక సీట్లు దక్కాయి. ఏపీతో సరిహద్దు పంచుకోవడంతో ఈ జిల్లాలలో సామాజికవర్గాల సమీకరణాలు, తెలుగుదేశం మద్దతు కాంగ్రెస్ కు సంపూర్ణ విజయాన్ని అందించింది.
నిజానికి తెలుగుదేశం తెలంగాణ ఎన్నికలలో పోటీ చేసి ఉంటే తెలంగాణ ఫలితాలు కచ్చితంగా తారుమారయ్యేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం పోటీ చేస్తే పోటీ చేస్తే బీఆర్ఎస్ కు తెలంగాణ సెంటిమెంట్ రగిలించేందుకు ఉపయోగపడడంతో పాటు.. టీడీపీ అభిమానులు కాంగ్రెస్ కు దూరంగా ఉండాల్సి వచ్చేది. దీంతో కాంగ్రెస్ పార్టీకి సీట్లు తగ్గి బీఆర్ఎస్ కు పెరిగేవి. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థానాలు దక్కకపోవడం లేదా హాంగ్ పరిస్థితి ఉండేది. ఎంఐఎంతో కలిసి బీఆర్ఎస్ చక్రం తిప్పేసే అవకాశాలు ఉండేవి. కాంగ్రెస్ కు ఈ స్థాయి విజయం దక్కిందంటే.. తెలుగుదేశం శ్రేణుల మద్దతుతో పాటు చంద్రబాబుతో రేవంత్ అనుబంధం కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. ఈ లెక్కలన్నీ గ్రహించే చంద్రబాబు తెలుగుదేశం పార్టీని తెలంగాణ ఎన్నికలలో పోటీ నుంచి దూరంగా ఉంచారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.