నాడు జర్నలిస్టు.. నేడు సీఎం!
posted on Dec 4, 2023 @ 2:25PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. రాష్ట్రం ఇచ్చిన పార్టీ అయినా దాదాపు పదేళ్లు అధికారానికి దూరంగానే ఉండిపోవాల్సి వచ్చింది. దాదాపు దశాబ్దం తరువాత అధికారంలోకి వచ్చింది. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్, విశ్లేషకులు పేర్కొన్నట్లే, తొలి నుండి అనుకున్నట్లే హాంగ్ కు ఆస్కారమే లేకుండా కాంగ్రెస్ 64 స్థానాల్లో సంపూర్ణ మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. రెండుసార్లు అధికారం అనుభవించిన బీఆర్ఎస్ పార్టీ కేవలం 39 స్థానాలకు పరిమితమైంది. ప్రధాన ప్రతిపక్షం అవుతామని ఆశపడిన బీజేపీ ఎనిమిది స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎమ్ఐఎమ్ ఏడు స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేసి తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఇక బీఆర్ఎస్‌లో దాదాపు ఆరుగురు మంత్రులతో పాటు మహామహులు కూడా ఓటమి పాలయ్యారు. తెలంగాణ మూలాల నుండి పుట్టుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీని ఓడించడం అంటే సామాన్య విషయం కాదు. రాష్ట్రంలో పాతాళానికి పడిపోయిన ట్లుగా కనిపించిన కాంగ్రెస్ బీఆర్ఎస్ ను ఓడించి అధికారంలోకి తీసుకురావడంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలకపాత్ర పోషించారనడంలో ఎలాంటి సందేహానికీ తావులేదు. కాంగ్రెస్ పార్టీ కురువృద్దులే ఈ విషయాన్నీ తేల్చి చెప్పేశారు.
కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలుపొందడం.. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తరువాయి. ఈ నేపథ్యంలో సీఎం ఎవరు అనేదానిపై కాంగ్రెస్ లో కసరత్తు జరుగుతుంది. టీపీసీసీ చీఫ్‌గా కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించడం వెనుక రేవంత్ రెడ్డి పాత్ర కీలకం కాబట్టే రేవంత్ రెడ్డే సీఎం అని కాంగ్రెస్ శ్రేణులూ, పార్టీ తరఫున గెలిచిన మెజారిటీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి ఎవరన్నది హైకమాండ్ నిర్ణయానికి వదిలేసినా, సమావేశంలో రేవంత్ రెడ్డే సీఎల్పీ నేత అన్న విషయాన్ని దాదాపుగా ఖరారు చేసినట్లే చెబుతున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రేవంత్ వ్యక్తిగత జీవితం నుండి రాజకీయ అరంగేట్రం, ఆయన ఫైర్ బ్రాండ్ గా మారిన తీరు, తెలుగుదేశం పార్టీలో ఆయన పోషించిన పాత్ర, ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు రేవంత్ ను ప్రోత్సహించిన తీరు, కాంగ్రెస్ లో చేరిన నాటి నుండి నేడు అధికారం దక్కించుకునే స్థాయికి పార్టీని చేర్చిన వైనం ఇలా ఎన్నోరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇందులో ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇప్పుడు సీఎం కాబోతున్న రేవంత్ రెడ్డి గతంలో జర్నలిస్ట్‌గా పనిచేశారు. ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం ‘జాగృతి’అనే వార పత్రికలో రేవంత్ జర్నలిస్టుగా పని చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నిజానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాకే ఆ పార్టీకి మళ్ళీ ఊపు వచ్చింది. రేవంత్ తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ లోకి చేరిన తర్వాతే ఆ పార్టీకి జవసత్వాలు వచ్చాయి. స్వతహాగా దూకుడు స్వభావం కలిగిన రేవంత్ మాటల తూటాలు సూటిగా కేసీఆర్ గడీలను తాకాయి. అదే కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. అందుకే రేవంత్ పార్టీలోకి వచ్చాడనగానే కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ కనిపించింది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నుండి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక రేవంత్ జోరు ఇంకాస్త పెరిగింది. అయితే తనను ఆక్షేపించేలా సీనియర్లంతా ముప్పేట దాడి చేస్తున్నా రేవంత్ ఏమాత్రం తగ్గలేదు. ముందుగా యూత్ కాంగ్రెస్ ను టార్గెట్ చేసి చైతన్యవంతం చేసి ముందుండి నడిపించారు. నిరుద్యోగుల్లో ఆశలను రగిలించారు. అలకబూనిన నేతల ఇళ్లకి తానే స్వయంగా వెళ్లి మాట్లాడి తన పట్ల వ్యతిరేకత లేకుండా చేసుకున్నారు. గాడినపడుతున్న పార్టీని చూసి మెల్లగా ఒక్కొక్క సీనియర్లు కలిసి వచ్చారు. ఎన్నికలకు ముందే మొత్తం రాష్ట్ర పార్టీని రేవంత్ తన చేతుల్లోకి తీసుకున్న రేవంత్ ఎక్కడా, ఎన్నడూ హద్దు మీరతేదు. సీనియర్లను నొప్పించలేదు. సరికదా వారిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు.
కాంగ్రెస్ పార్టీలో ఈ స్థాయి క్రమశిక్షణ కనిపించడం ఇదే తొలిసారని ఆ పార్టీ సీనియర్లే అంగీకరించారు. గతంలో మహానేతని చెప్పుకున్న వాళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీలో బహిరంగంగానే వ్యతిరేకించిన వారుండగా.. ఈసారి ఎన్నికల సమయం వచ్చేసరికి ఏ కాంగ్రెస్ నేతా ఎక్కడా ధిక్కార స్వరం వినిపించలేదంటే.. పార్టీ రాష్ట్రనాయుడిగా రేవంత్ ఏ స్థాయి క్రమశిక్షణను తీసుకువచ్చారో ఇట్టే చేప్పేయవచ్చు.
రెండు చోట్ల పోటీచేసిన రెండు నియోజకవర్గాల బాధ్యతను తన సోదరులకు అప్పగించి.. రేవంత్ మాత్రం రాష్ట్రాన్ని చుట్టేసి తన అధ్యక్ష పదవికి పూర్తి స్థాయి న్యాయం చేశారు. ప్రచార భారాన్ని ఒంటి చేత్తో మేశారు. రాష్ట్ర పార్టీలో అతిరథ మహారథులుగా గుర్తింపు పొందిన సీనియర్ నేతలంతా తమ తమ నియోజకవర్గాలకే పరిమితమై ప్రచారం చేస్తే, చేసుకుంటే.. టీపీసీసీ చీఫ్ గా, నిజమైన నేతగా రాష్ట్ర ప్రచార సారథ్యాన్ని ఆయన చేపట్టి పూర్తి న్యాయం చేశారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందంటే దానికి రేవంతే కారణమనడంలో సందేహం లేదు. అందుకే ఫలితాల తర్వాత కూడా ఏ ఒక్కరూ కూడా రేవంత్ సీఎం అంటే అభ్యంతరం చెప్పడం లేదు. వీహెచ్ వంటి నేతలు ఒక వైపు ఫలితాలు వెలువడుతుండగానే తెలంగాణ కాబో యే సీఎం రేవంత్ రెడ్డే అని ప్రకటనలు చేశారు.
కాంగ్రెస్ పార్టీని రేవంత్ అధికారంలోకి తీసుకురావడం గురించి చెప్పాలంటే ఓ మనుభావుడి కవితను గుర్తు చేసుకోవాలి. చుట్టూ కారు చీకట్లు.. చేతిలో దీపం లేదు.. వెళ్లాల్సిందేమో దూరం.. దారంతా గోతులు.. కానీ, మనసు నిండా ధైర్యం. ఆయన ధైర్యమే ఓ మహాద్భుత కవచంగా పని చేసింది. ఆయన లక్ష్యమే ఓ కాంతిపుంజమై మిరుమిట్లు గొలిపేలా ‘కారు ’మబ్బులను పంటాపంచలు చేసింది. ఫలితం.. తెలంగాణ గడ్డ మీద సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. మహోజ్వల చరిత్ర సృష్టించి తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరేశారు రేవంత్. ఒక్కడిగా మొదలైన రేవంత్ ప్రయాణం మహా శక్తిగా మారి దొరల గడీలను బద్దలు కొట్టింది. ఫలితంగా ఇప్పుడు ఆ ఒక్కడే జనంతో జయహో అనిపించుకున్నాడు. శత్రువు ఎంతటి బలవంతుడైనా మనో ధైర్యమనే ఆయుధంతో కదనరంగంలో దిగి విజేతగా నిలిచారు రేవంత్ రెడ్డి.