బీఆర్ఎస్ కు ఎంపీ నామా రాజీనామా?.. రేవంత్ తో టచ్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు?
posted on Dec 5, 2023 @ 9:50AM
ఒక్క ఓటమి.. తెలంగాణ ఆవిర్భావం నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఒకే ఒక్క ఓటమితో కకావికలైపోతోందా? ఆ పార్టీ అధినేతే జనాలకు ముఖం చూపకుండా ఓటమి తరువాత ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. తప్పదన్నట్లుగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మీడియా ముందుకు వచ్చి మాట్టాడినా, బీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించినా.. అధ్యక్షుడు మీడియాకు ముఖం చాటేయడం మాత్రం ఓటమిని జీర్ణించుకోలేని తత్వాన్నే ఎత్తి చూపుతోంది.
ఇక ఇప్పుడు ఆ పార్టీ భవిష్యత్ ఏమిటి? అంటే పరిశీలకులు మాత్రం నేతల వలసలేనని అంటున్నాయి. నియోజకవర్గ అభివృద్ధి అంటూ ఒక్కరొక్కురుగా కారు దిగిపోవడం ఖాయమనే చెబుతున్నారు. కారు దిగిన వెంటనే ‘చేయి’ అందుకుంటారనీ, అందుకు వారు చెప్పే జవాబు నియోజకవర్గ అభివృద్ధి అని అంటున్నారు. గతంలో ఇదే మాట చెప్పి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కారెక్కేశారు. ఇప్పుడు అదే మంత్రం జపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగి చేయందుకోవడం ఖాయమని అంటున్నారు.
ఇప్పటికే దాదాపు 16 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి టచ్ లోకి వెళ్లారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అలా కాంగ్రెస్ కు టచ్ లోకి వచ్చిన వారిలో అత్యధికులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలేనని చెబుతున్నారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. ఆ జిల్లాలో గెలిచిన ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇప్పటికే రేవంత్ ను కలిసేశారు. ఇక ఆ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా కారు దిగి చేయందుకోవడానికి రెడీ అయిపోయారని జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. అదలా ఉంచితే.. ఇప్పటికే కాంగ్రెస్ తో టచ్ లోకి వచ్చిన 16 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో వ్యాపారాలు, కాలేజీలు, భూముల వివాదాలు, కేసులు, ప్రభుత్వ కాంట్రాక్టులతో సంబంధాలున్న వారే ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం, ఆయన కేబినెట్ కొలువుదీనిక తరువాత వీరి చేరికలు ప్రారంభమయ్యే అవకాశలున్నట్లు చెబుతున్నారు.
ఇక కాంగ్రెస్ కూడా వీరి చేరికలకు సానుకూలంగానే స్పందించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మ్యాజిక్ ఫిగర్ కంటే నాలుగంటే నాలుగే స్థానాలు అధికంగా ఉండటం, స్వతహాగా కాంగ్రెస్ లో ఉన్న గ్రూపుల సంస్కృతి, పార్టీలో రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకించే వారు అనివార్యంగా మౌనంగా ఉండటం వంటి కారణాలతో భవిష్యత్ లో ఏమైనా సమస్యలు తలెత్తినా ప్రభుత్వం స్థిరంగా ఉండాలంటే చేరికలపై దృష్టి సారించక తప్పని పరిస్థితి ఉందని కాంగ్రెస్ కూడా భావిస్తున్నట్లు చెబుతున్నారు. అంతే కాదు.. ఇలా బీఆర్ఎస్ తరఫున విజయం సాధించి ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరినా బీఆర్ఎస్ నుంచి విమర్శలు వచ్చే అవకాశం లేని పరిస్థితి. ఎందుకంటే అధికారంలో ఉన్న రెండు దఫాలూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యర్థి పార్టీల నుంచి చేరికలు ప్రోత్సహించడమే కాకుండా అటువంటి వారికి మంత్రిపదవులు ఇచ్చి మరీ గౌరవించారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎవరైనా అధికార కాంగ్రెస్ గూటికి చేరినా ఆయనకు మాట్లాడడానికి కానీ, విమర్శించడానికి కానీ అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గూటికి చేరేందుకు క్యూకడుతున్నారని అంటున్నారు.