బందర్ లో పేర్ని కిట్టూ... అంత వీజీ కాదు!

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఉమ్మడి కృష్ణాజిల్లా కేంద్రం బందరులో రాజకీయం రూపు రేఖలు ఒక్కసారిగా మారి పోయాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పేర్ని కృష్ణమూర్తి అలియాస్ పేర్ని కిట్టు బరిలో దిగనున్నారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు. కుమారుడి కోసం తాను పోటీ నుంచి తప్పుకున్నట్లు పేర్ని నాని చెబుతున్నారు. అయితే అంత త్యాగం చేసినా బందర్ లో పేర్ని కిట్టు.. గెలుపు అంత వీజీ కాదని రాజకీయవర్గాలు అంటున్నాయి. తొలిసారిగా ఎన్నికల బరిలో  దిగుతున్న కిట్టూ విజయం ఏమాత్రం సులువు కాదని అంటున్నారు.    జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత , అలాగే  కిట్టూ  తండ్రి ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని  జగన్ కేబినెట్‌లో రవాణ, సినిమాటోగ్రఫీ మంత్రిగా పని చేసినా.. ఆయన.. ఆయా శాఖల మంత్రిగా ఏంచేశారో ఏమో కానీ, నియోజకవర్గానికి ఒరగబెట్టిందేమీ లేదని స్థానికులు అంటున్నారు. అంతే కాదు పేర్ని నాని తండ్రి అంటే.. పేర్ని కిట్టు తాత.. పేర్ని కృష్ణమూర్తి సైతం.. బందరు ఎమ్మెల్యేగానే కాకుండా.. మంత్రిగా కూడా పని చేశారని.. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బందరు ఎలా ఉందో.. ఇప్పటికీ ఏమాత్రం అభివృద్ధికి నోచుకోకుండా అలాగే ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.  ఇక వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి వెళ్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఆయా పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కొల్లు రవీంద్ర పోటీ చేయనున్నారు. ఆయన గతంలో అంటే.. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి.. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా  పని చేశారు. అదే విధంగా బందరు లోక్‌సభ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి బరిలో దిగనున్నారనే ఓ ప్రచారం నడుస్తోంది. మరోవైపు బందరు ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే సింహాద్రి రమేష్ బాబు పేరును జగన్ పార్టీ ఖరారు చేసింది. ఇక బందరుకు కూత వేటు దూరంలోని పెడన అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా కొనకళ్ల నారాయణను బరిలో నిలిపే అంశాన్ని తెలుగుదేశం అధిష్టానం పరిశీలిస్తోంది. అదీకాక జగన్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత చాలా బలంగా ఉండటం, ప్రతిపక్ష నేతగా ఆయన పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చానా..   ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత వాటిని తుంగలోకి తొక్కి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక పేర్ని నాని ఎమ్మెల్యేగా ఉన్నా.. మంత్రిగా ఉన్నా..   సీఎం వైయస్ జగన్‌పై ఈగ కూడా వాలనియకుండా ఉండేందుకు చూపించిన శ్రద్దాసక్తులలో వందో వంతు  బందరు నియోజకవర్గ అభివృద్ధిపై పెట్టినా.. ఎంతో కొంత మేలు జరిగేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదీ ఏమైనా వచ్చే ఎన్నికల్లోవిజయం సంగతి అలా ఉంచితే బందరులో పేర్ని కిట్టు విజయం మాత్రం అంత సులువు కాదని అంటున్నారు.  

కెసిఆర్ కు కలిసి రాని యాగం.. మరి జగన్ హాజరవుతారా?

ప్ర‌తి ఏటా  విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు ఐదు రోజులు పాటు నిర్వహిస్తారు.  అందులో భాగంగా ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు వార్షికోత్సవాలను నిర్వహించనున్నారు. చివరి రోజు రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు.  2014 - 2023 మధ్యలో మూడు సార్లు తెలంగాణ మాజీ సి.ఎం. కేసీఆర్ రాజశ్యామల యాగం చేశారు.  1. 2015లో కేసీయార్ యాగం చేశారు. అప్పట్లో ఆయన ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలని యాగం చేశారు.  2. 2018లో ముందస్తు ఎన్నికల ముందు మరోసారి రాజశ్యామల యాగం చేశారు. అప్పుడు ఆయన విజయవంతంగా రెండవసారి ముఖ్యమంత్రి అయిపోయారు.  3. 2023 నవంబర్లో మూడవసారి రాజశ్యామల యాగం చేశారు. మూడవసారి ముఖ్యమంత్రిగా గెలిచి దక్షిణ భారత దేశంలో వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా  సరికొత్త రికార్డు క్రియేట్ చేయాలన్న లక్ష్యంతో కేసీఆర్   తన సొంత వ్యవసాయ క్షేత్రంలో   కేసీఆర్ ఈ యాగం చేశారు.  ఇక‌.....ఏపీలో చూసుకుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా 2019 లో రాజశ్యామల యాగం నిర్వహించారు. బంపర్ మెజారిటీతో సీఎం అయ్యారు. అంతే కాదు ఆ ఏడాది విజయవాడలో వారం పది రోజుల పాటు రాజశ్యామల అమ్మవారి యాగంతో పాటు దేవీ దేవతలకు హోమాలు పూజలు జరిగాయి. దేవాదాయ శాఖ ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు.  2024లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి.  ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు జ‌రిగే వార్షికోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మ నందేంద్ర స్వామి సీఎం జగన్ ను కలిసి ఆహ్వాన పత్రం అందించారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ ఈ వార్షికోత్సవ వేడుకలకు హాజరవుతూ వచ్చారు. ఈ ఏడాది కూడా హాజరు అవుతారా? లేదా అనే చ‌ర్చ జ‌రుగుతోంది.  ఎందుకంటే కెసిఆర్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తారని చెప్పి స్వరూపానందేంద్ర స్వామి  రాజశ్యామల యాగం చేయించారు. అయితే ఆయ‌న ఓడిపోయారు. అధికారం కోల్పోయారు.  స్వరూపానందేంద్ర స్వామి అంటే  కెసిఆర్ కు ప్రత్యేక అభిమానం, న‌మ్మ‌కం వుంది.  కానీ స్వామి  చెప్పినట్టుగా కెసిఆర్ అధికారంలోకి రాలేకపోయారు. స్వామీజీ ఒకలా దీవిస్తే.. ప్రజలు మరోలా తీర్పు ఇచ్చారు. స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులతో అధికారంలోకి వస్తారు అనుకున్న కెసిఆర్ ప్రగతి భవన్ ను వీడాల్సి వచ్చింది. దీంతో స్వామీజీ జోష్యానికి కాస్త ఇబ్బందులు వచ్చాయి.  ఈ నేపథ్యంలో రెండోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న జగన్… స్వామీజీని నమ్ముతారా? నమ్మి వార్షికోత్సవ వేడుకలకు హాజరవుతారా?  మరోసారి రాజశ్యామల యాగాన్ని జరిపి.. అధికారాన్ని అందుకోగలరా?  అన్న చర్చ ఏపీలో  జరుగుతోంది.  మరో వైపు తెలుగుదేశం పార్టీ కూడా సరైన సమయం చూసి రాజశ్యామల యాగం చేస్తుందంటున్నారు.  చూడాలి మరి ఏమి జరుగుతుందో.

భగీరథలోనూ భారీ అవినీతి.. ఫిర్యాదులపై రేవంత్ సర్కార్ నజర్

బీఆర్ఎస్ ప్రభుత్వం తన హయాంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా  చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో కూడా భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి భగీరద అవినీతిపై ఫిర్యాదులు అందాయి.  నేరుగా సీఎంవోకే ఈ ఫిర్యాదులు చేరడంతో ప్రభుత్వం వీటిపై సీరియస్ గా దృష్టి సారించిందని తెలుస్తోంది.  ముఖ్యంగా పైపులైన్ల ఏర్పాటులో భారీ స్కాం జరిగిందనీ, ఈ స్కాం విలువ 7 వేల కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంటున్నారుగ్రామాల మధ్య ఏర్పాటు చేసిన పైపు‌లైన్లలో రూ.వేల కోట్లు కొల్లగొట్టున్నట్టు సీఎంఓకు కంప్లయింట్స్ వెళ్లాయి. ఇందులో దాదాపుగా రూ.7వేల కోట్ల అవినీతి జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భగీరథ అవినీతిపై వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ దర్యాప్తునకు సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది.   మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించే పథకాన్నిగత బీఆర్ఎస్ ప్రభుత్వం అట్టహాసంగా ఆరంభించింది. ఒక  కార్పొరేషన్ ఏర్పాటు చేసి సుమారు రూ.30 వేల కోట్ల మేరకు ఇందు కోసం అప్పులు చేసింది. ఈ పథకంలో భాగంగా ప్రతి ఊరికి కొత్తగా పైపు లైన్లు ఏర్పాటు చేసి ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇవ్వాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.  వాస్తవానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి  90 శాతానికి పైగా గ్రామాలకు తాగునీటి సరఫరా సౌకర్యం ఉంది. ఇక్కడే భారీ అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాలకు కొత్త పైపు లైన్లు వేయకుండానే వేసినట్లుగా కాంట్రాక్టు సంస్థ పెట్టిన బిల్లులకు చెల్లింపులు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.    మెటీరియల్ కొనకుండానే  కోట్ల రూపాయల బిల్లులు సృష్టించి దండుకున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి.  అప్పటికే ఓవర్ హెడ్ ట్యాంకులు, ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఉన్నా.. లెక్కల్లో మాత్రం కాంట్రాక్టర్లు వాటిని కొత్తగా ఏర్పాటు చేసినట్టు చూపించినట్టు ఫిర్యాదులు ఉన్నాయి.   ఇప్పడు వీటిపైనే విజిలెన్స్ దర్యాప్తు చేపట్టినట్లు చెబుతున్నారు. 

కరీంనగర్ లో బండి నడక నల్లేరు మీద కాదు!

తెలంగాణలో బీజేపీ ప్రస్థానం ఆశలు, నిరాశల మధ్య కొనసాగుతోంది. అధికారం తథ్యం అంటూ ఆత్మవిశ్వాసంతో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి దిగిన ఆ పార్టీకి నిరాశ తప్పలేదు. ఇప్పుడు మళ్లీ వచ్చే లోక్ సభ ఎన్నికలలో అత్యధిక స్ఖానాలలో విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది.  బీజేపీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో సింగిల్ డిజిట్ దాటకపోయినా ఎనిమిది అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని గౌరవ ప్రదమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే ఆ ఎన్నికలలో అధికారమే తరువాయి అన్నంతగా ఆ పార్టీ చేసిన, చేసుకున్న ప్రచారం కారణంగా ఆ పార్టీ తెలంగాణలో సింగిల్ డిజిట్ పార్టీయే అంటూ ప్రత్యర్థులు చేసిన విమర్శలు నిజమయ్యాయి.  ఇక ఇప్పుడు ఆ పార్టీ రానున్న సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించింది. 2019 సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలలో నాలుగింటిలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికలలో ఆ స్కోరును అధిగమించాలన్న పట్టుదలతో ఉంది. వీలైతే అసెంబ్లీ ఎన్నికలలో సాధించలేని డబుల్ డిజిట్ ను ఈ సార్వత్రిక ఎన్నికలలో సాధించాలని ఆశపడుతోంది.  అయితే ఆ ఆశ నెరవేరుతుందా? లేదా అన్నది పక్కన పెడితే.. గత సార్వత్రిక ఎన్నికలలో గెలుచుకున్న స్థానాలను నిలబెట్టుకుంటుందా? అంటే పరిశీలకులు అదంత ఈజీ కాదంటున్నారు. ముఖ్యంగా గత ఎన్నికలలో కరీంనగర్ లోక్ సభ స్థానంలో విజయం సాధించిన బండి సంజయ్ కు ఈ సారి అక్కడ ఎదురు గాలి వీస్తోందని, ఆయన విజయం నల్లేరు మీద బండి నడక ఇంకెంత మాత్రం కాదనీ చెబుతున్నారు.   అయితే అయోధ్య రామమందిరం ప్రభావం పడితే మాత్రం రాష్ట్రంలో బీజేపీ పలు లోక్ సభ స్థానాలలో గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు. బండి సంజయ్ కు అది కలిసి వస్తే కనుక భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని చెబుతున్నారు.  అయితే బండి సంజయ్ విజయాని కాంగ్రెస్ రూపంలో గండం ఉందని కూడా చెబుతున్నారు.  అయితే ఇక్కడ బీఆర్ఎస్ బలహీనంగా ఉండటం, అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట ప్రభావాన్ని పరిగణనలోనికి తీసుకుంటే తెలంగాణ మొత్తంలో బీజేపీకి గ్యారంటీ అని చెప్పడానికి  కరీంనగర్ స్థానం ఒక్కటే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల ముందు బండి సంజయ్ ను బీజేపీ అధిష్టానం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో పార్టీలోనే కాకుండా సామాన్య జనంలో కూడా ఆయన పట్ల సానుభూతి వ్యక్తం అవుతోంది. అయితే ఆ సానుభూతి ఆయనకు అసెంబ్లీ ఎన్నికలలో పెద్దగా ఉపయోగపడలేదు. ఆయన పోటీ చేసిన కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పరాజయం పాలు కావడమే ఇందుకు నిదర్శనం.  అదే విధంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్రంలో బీజేపీ శ్రేణులు బాగా డీలా పడ్డాయి. అదే సమయంలో ఎన్నికల ముందు బండి సంజయ్ కు పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన బీజేపీ హైకమాండ్ వైఖరి పట్ల కూడా గుర్రుగా ఉన్నారు. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాడి, జైలు పాలై, పలు కేసులలో ఉన్న బండి సంజయ్ విషయంలో బీజేపీ అధిష్ఠానం తీరు కారణంగానే గెలుపు తథ్యమనుకున్న పలు స్థానాలలో గత అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు ఓటమిని మూటగట్టుకున్నారన్న అసంతృప్తి క్యాడర్ లో ఉంది.   ఆ కారణంగానే బీజేపీలో పెద్దగా జోష్ కనిపించడం లేదు.   

ఏపీలో ఎన్నికలు ఎప్పుడంటే..?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి పీక్స్ కు చేరి చాలా కాలమైంది. అక్షర క్రమంలోనే కాదు, అభివృద్ధిలోనూ ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామిగా నిలపాలన్న తపనతో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ మరో సారి అధికారంలోకి రాకూడదు, ఈ అవినీతి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపి తీరాలన్న పట్టుదలతో జనసేనాని పవన్ కల్యాణ్ ఉన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీలో పొత్తు పెట్టుకుని మరీ ఎన్నికల బరిలోకి దిగాయి. తాజాగా బీజేపీ కూడా వీరితో కలిసేందుకు రెడీ అయిపోయింది. ఈ సారి ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కలిసే పోటీ చేస్తాయన్నది దాదాపుగా ఖరారైపోయింది. అటు అధికార పార్టీ కూడా విజయం కోసం నానా ప్రయత్నాలూ చేస్తోంది. సిట్టింగుల మార్పు అంటూ సొంత పార్టీలోనే అసమ్మతి సెగ రాజేసుకుంది. అసెంబ్లీ అని కూడా చూడకుండా నేతలు రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు. స్వయానా జగనే అసెంబ్లీ వేదికగా సభలో లేని విపక్ష నేతపై విషం చిమ్ముతూ విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇంతగా ఎన్నికల సెగ రేగుతున్న నేపథ్యంలో అసలు రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న ఆసక్తి సహజంగానే అందరిలో ఉంటుంది. సార్వత్రిక ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి. ఈ నెల చివరి వారంలో లేదా మార్చి మొదటి  వారంలో  నోటిఫికేషన్ వెలువడనున్నదని అంటున్నారు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు మార్చి 16న నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే రాష్ట్రంలో ఒకే విడతలో ఏప్రిల్ 15న ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది.  రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు, పాతిక లోక్ సభ స్థానాలకూ ఒకే విడతలో ఏప్రిల్ 16న ఎన్నికలు జరగనున్నాయని చెబుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే  ఇందుకోసం సన్నాహాలలో మునిగిపోయింది. ఎన్నికల సిబ్బందికి మార్చి చివరి వారంలో మొదటి విడత శిక్షణ ఇవ్వనున్నారు. రెండో విడతగా జిల్లాల్లోని దిగువ తరగతి ఉద్యోగ వర్గాలకు ఏప్రిల్  మొదటి వారంలో శిక్షణ ఇవ్వనున్నారు.   ఈ సారి ఎలక్షన్ విధుల కోసం కలెక్టరేట్ వర్గాలు కొత్త సాఫ్ట్ వేర్ ను ఉపయోగించనున్నాయి. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా  ఎన్నికలు జరుగనున్నాయి.  సిబ్బంది ఎపిక్ ఇన్ఫర్మేషన్ ను అత్యంత త్వరగా అందుబాటు లో ఉంచుకోవాలని కలెక్టరేట్ వర్గాలు తెలుపుతున్నాయి. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి వాటికి భారీ భద్రత ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సారి వికలాంగులు మరియు 80 ఏళ్లు  పై బడిన వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కలిపిచనున్నారు.  

ప్రజాక్షేత్రంలో భువనేశ్వరి.. బ్రహ్మరథం పడుతున్న జనం

నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి సతీమణి, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ తల్లి,  పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ కుమార్తె అయిన భువనేశ్వరి ఇంత కాలం ప్రజాక్షేత్రంలో పని చేసింది లేదు. రాజకీయాల్లోకి అడుగుపెట్టింది లేదు.  కుటుంబ వ్యాపారాలను చూసుకుంటూ  ఉన్నారు. అయితే అధికార వైసీపీ కుట్ర, కక్ష పూరిత విధానాలతో  తన భర్త, తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడి అరెస్టుతో ఆమె జనం మధ్యకు వచ్చారు. తన కుటుంబాన్ని కక్షపూరిత విధానాలతో అధికార జగన్ పార్టీ వేధిస్తోందని గళమెత్తారు.  స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె తొలి సారి ప్రజల మధ్యకు వచ్చారు.   14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, దాదాపు అంతే కాలం విపక్ష నేతగా, గత నాలుగు దశాబ్దాలుగా దేశ రాజకీయాలలో   ప్రతి మలుపులోనూ క్రియాశీలంగా వ్యవహరించి , దార్శనికుడిగా దేశ, విదేశాల గుర్తింపు పొందిన నాయకుడు చంద్రబాబును కనీసం నోటీసులు లేకుండా, చార్జిషీట్ లో పేరు లేకుండా అర్ధరాత్రి అరెస్టు చేసిన తీరు పట్ల సర్వత్రా నిరసనలు, ఆగ్రహ జ్వాలలూ వ్యక్తం అయ్యాయి. ఆయన అరెస్టుకు కలత చెంది రాష్ట్రంలో పలువురు అసువులు బాశారు. అటువంటి వారి కుటుంబాలను పరామర్శించేందుకు నారా భువనేశ్వరి  నిజం గెలవాలి పేరుతో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు విడతలుగా నిజం గెలవాలి యాత్ర చేసిన భువనేశ్వరి.. చంద్రబాబు అరెస్టుతో కలత చెంది ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఆర్థిక సమాయం అందజేశారు.  మూడో విడత యాత్రలో భాగంగా నారా భువనేశ్వరి మంగళవారం  మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. ఆమెకు నియోజకవర్గంలో ఘనస్వాగతం లభించింది.  భువనమ్మ పరామర్శించే ప్రతి కార్యకర్త కుటుంబం వద్ద పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్దఎత్తున భువనమ్మకు ఘన స్వాగతం పలికారు. నిజం గెలవాలి….నిజమే గెలవాలి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. మంగళగిరి పట్టణంలో మహిళలు భువనమ్మకు హారతులు పట్టారు. పెనుమాక గ్రామంలో భువనమ్మకు మహిళలు బ్రహ్మరథం పట్టారు. పెనుమాక సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి భువనమ్మ పూలమాల వేసి నివాళులు అర్పించారు. తనకు పెద్దఎత్తున సంఘీభావం తెలిపిన పెనుమాక గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. భువనమ్మ పర్యటన ప్రారంభం నుండి ముగింపు వరకు యువత పెద్దఎత్తున కేరింతలు కొడుతూ భువనమ్మకు తోడుగా  నడిచారు. భువనమ్మ పర్యటించిన 7 గ్రామాలతో పాటు పెదవడ్లపూడి, దుగ్గిరాల, రేవేంద్రపాడు, మంగళగిరి పట్టణం, పెనుమాక గ్రామాల ప్రజలు భువనమ్మకు ఘనస్వాగతం పలికారు. మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన భువనమ్మ తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువతకు కృతజ్ఞతలు తెలుపుతూ ముందుకు సాగారు.  అయితే వాస్తవానికి భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర కంటే ముందే ప్రజల ముందుకు వచ్చారు. పార్టీ ముఖ్యులతో చర్చలు జరిపారు. అదెప్పుడంటే..  స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు ,  ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు అంటూ నారా లోకేష్ ను వేధింపులకు గురి చేస్తుంటే.. ఆ సమయంలో పార్టీని ముందుండి నడిపించేందుకు, ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ఆమె కొంగు బిగించారు.   అరెస్టులు, కేసులు, వేధింపుల కారణంగా అప్పట్లో చంద్రబాబు కానీ, లోకేష్ కానీ ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు కొంత సమయం పడుతునందన్న ఊహాగానాల నేపథ్యంలో  నారా భువనేశ్వరి ముందుకు దూకారు. పార్టీని ముందుండి నడిపించేందుకు సంసిద్ధు రాలయ్యారు. ఆమెతో పాటు కోడలు అంటే నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి సైతం మీడియా ముందుకు వచ్చి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై అనర్గళంగా ప్రసంగించారు. అలాగే నారా భువనేశ్వరి పార్టీ నేతలతో సమాలోచనలు జరిపారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ర్యాలీకి సైతం రెడీ అయ్యారు. చంద్రబాబు నిర్బంధంలో ఉన్న సమయంలో రాజమహేంద్రవరం వేదికగా నారా భువనేశ్వరి పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించారు.   కుటుంబ వ్యాపారం చూసుకోవడం తప్ప   గతంలో ఎన్నడూ రాజకీయాలతో సబంధం లేకుండా ఉన్న భువనేశ్వరి పార్టీ సమావేశాలలో పాల్గొన్నారు. అలాగే చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ దీక్షలు, ఆందోళనలు చేస్తున్న వారిని కలిసి వారితో మాట్లాడారు. రొటీన్ రాజకీయ ప్రసంగాలకు భిన్నంగా  సూటిగా  తడబాటు, తొట్రుపాటు లేకుండా చంద్రబాబు అరెస్టు ఎంత అక్రమమో, ఎంత అప్రజాస్వామికమో వివరించారు. అదే సమయంలో జగన్ సర్కార్ అకృత్యాలు, అక్రమాలను ధైర్యంగా ఎండగట్టారు. తెలుగుదేశం పార్టీకి నాయకత్వ సమస్య రాదనీ, తాను ఉన్నాననీ పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. మాటలకే పరిమితం కాకుండా  చేతలలో కూడా కూడా పార్టీకి అండదండగా ఉంటామన్న ధైర్యాన్నీ, ధీమాను ఇచ్చారు.   ఇప్పుడు ఏకంగా ప్రజాక్షేత్రంలో పర్యటనలు చేస్తున్నారు. వారితో ముఖాముఖీ మాట్లాడుతున్నారు. సౌమ్యంగానే అయినా సూటిగా జగన్ ప్రభుత్వం అరాచకాలు, అకృత్యాలు, అవినీతి, అక్రమాలను ఎండగడుతున్నారు. 

అసెంబ్లీలో బాబు గ్యారంటీలకు ప్రచారం!.. ఓటమి భయంతో జగన్ లో అయోమయం!

ఏపీలో మ‌రికొద్ది నెల‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.. ఈ స‌మ‌యంలో మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేది మేమేనంటూ ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌భ‌ల్లో గొంతెత్తి అరుస్తున్నాడు.. వైసీపీ శ్రేణులు జ‌గ‌న్ మాట‌ల‌కు చ‌ప్ప‌ట్లు కొడుతున్నారు. కానీ, వారిలో సగం మందికి పైగా  వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ గ‌ద్దెదిగ‌డం ఖాయ‌మ‌ని తెలుసు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌భ‌ల్లో పాల్గొని బ‌య‌ట‌కొచ్చే స‌మ‌యంలోనే కొంద‌రు ఈ విష‌యాన్ని చ‌ర్చించుకుంటూ వ‌స్తున్నారు. ఏదో తప్పని పరిస్థితుల్లో జగన్ సభలకు  రావ‌డ‌ం త‌ప్పితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ గెల‌వ‌డు అన్న చర్చ వైసీపీ శ్రేణుల్లో జోరుగా నడుస్తోంది.  అసలు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని వాళ్లూ వీళ్లూ చెప్పడం కాదు.. స్వయంగా జగనే అంగీకరించేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను అధికారంలోకి రాకపోయినా బాధపడనని చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా అసెంబ్లీ స‌మావేశాల్లో జ‌గ‌న్ ప్రసంగం  చూస్తే రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న ఉన్న ఎవ‌రికైనా జ‌గ‌న్ ఓట‌మిని ఒప్పుకున్నారని స్ప‌ష్టంగా అర్థ‌మైపోతుంది. అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌భుత్వం ఏ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది, ఎన్నికోట్లు ఖ‌ర్చు చేసింది, ఎంత‌మందికి ల‌బ్ధి చేకూరింది. అనే విష‌యాల‌ను ఏ ముఖ్య‌మంత్రి అయినా ప్ర‌స్తావిస్తారు. కానీ, జ‌గ‌న్ మాత్రం అసెంబ్లీలో ఉన్నామ‌న్న విష‌యం మ‌రిచి..  ఓ బహిరంగ సభలో మాట్లాడిన‌ట్లు ప్ర‌తిప‌క్షాల‌పై  విమ‌ర్శ‌లు చేయడం ఆయ‌న‌లోని ఓట‌మి భ‌యాన్ని తేట‌ తెల్లం చేస్తున్నద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.  ఏపీలో అసెంబ్లీలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌సంగం కోసం అంతా అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూశారు. సుమారు నాలుగున్న‌రేళ్లు అధికారంలో ఉన్న జ‌గ‌న్.. త‌న పాల‌న తీరును ఏ విధంగా స‌మ‌ర్థించుకుంటారు. అసలు సమర్ధించుకోవడానికి ఏముంది అంటూ ఆయన ప్రసంగం కోసం ఆసక్తిగా చూశారు.   కానీ, జ‌గ‌న్ మాత్రం నాలుగున్న‌రేళ్లు ప్ర‌జ‌ల‌కు ఏం చేశాం.. రాష్ట్రంలో అభివృద్ధి ఏ స్థాయిలో జ‌రిగింది? ఎన్నికొత్త కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టాయి? ఎంత మందికి ఉపాధి దొరికింది అనే అంశాల‌ను ప్ర‌స్తావించ‌కుండా.. రెండు ప‌త్రిక‌లు, ఓ టీవీ చానెల్ పేరును ప‌దేప‌దే ప్ర‌స్తావించ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ఒకానొక ద‌శ‌లో టీవీల ముందు జ‌గ‌న్ స్పీచ్ ను వీక్షించిన ప‌లువురు వైసీపీ శ్రేణులు సైతం జ‌గ‌న‌న్నా.. మీరు ఉన్నది అసెంబ్లీలో, ప‌బ్లిక్ మీటింగ్ లో కాద‌న్నా అని మొత్తుకోవ‌టం గ‌మ‌నార్హం. మ‌రోవైపు క‌రోనా వ‌ల్ల న‌ష్ట‌పోయామ‌ని, ప్ర‌తీ రాష్ట్రానికి ఓ ప‌వ‌ర్ హౌస్ లా ఉండే మ‌హాన‌గ‌రం లేక‌పోవ‌డం వ‌ల్ల ఇంకా న‌ష్ట‌పోయామ‌ని.. అందువ‌ల్ల ఏమీ చేయ‌లేక పోయామ‌న్న‌ట్లుగా జ‌గ‌న్ వివ‌ర‌ణ ఇచ్చుకోవ‌టం అసెంబ్లీలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల‌తోపాటు బయట ఉన్న వైసీపీ శ్రేణులు  కంగుతినేలా చేసింది. జ‌గ‌న్ త‌న స్పీచ్‌లో ప్ర‌తీ రాష్ట్రానికి ఓ ప‌వ‌ర్ హౌస్ ఉండాల‌ని, అలాంటి ప‌వ‌ర్ హౌస్ విశాఖ అవుతుంద‌ని అనేక‌ సార్లు ప్ర‌స్తావించారు. కానీ, ఐదేళ్ల‌లో విశాఖ అభివృద్ధికి ఏం చేశామ‌నే విష‌యాల‌ను ప్ర‌స్తావించ‌లేదు.  టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌ను అసెంబ్లీలో స్క్రీన్ వేసి మ‌రీ చూపించారు. ఆ ప‌థ‌కాల‌ను ఒక్కొక్క‌టిగా వివ‌రిస్తూ ఇన్ని నిధులు ఎలా తెస్తారు? ఎలా అమ‌లు చేస్తారు? అంటూ సీఎం జ‌గ‌న్ ప్ర‌స్తావించారు. అసెంబ్లీలో జ‌గ‌న్ స్పీచ్ చూసిన వైసీపీ శ్రేణులు సైతం జ‌గ‌న‌న్నా.. అస‌లు రాష్ట్రానికి మీరేం చేశారు..? మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే ఏం చేస్తారు? అని చెప్ప‌కుండా చంద్ర‌బాబు ప‌థ‌కాలు ఎందుకు ప్ర‌చారం చేస్తున్నావ‌న్నా అంటూ త‌ల‌లు ప‌ట్టుకున్న ప‌రిస్థితి. అసెంబ్లీలో జ‌గ‌న్ ప్ర‌సంగం మొత్తం వీక్షించిన వారికి చిరికి అర్థ‌మ‌య్యేది ఒక్క‌టే.. వైసీపీ మ‌ళ్లీ అధికారంలోకి రాద‌న్న విష‌యాన్ని జ‌గ‌న్  స్వ‌యంగా చెప్పేశార‌ని. ఇప్ప‌టికే తెలుగుదేశం. జ‌న‌సేన పొత్తుతో అసెంబ్లీ ఎన్నిక‌ల ర‌ణ‌రంగంలోకి దిగుతుండ‌టంతో జ‌గ‌న్ అండ్ కో బెంబేలెత్తిపోతున్న విష‌యం తెలిసిందే. తెలుగుదేశం, జ‌న‌సేన పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు ఆ పార్టీ అధినాయ‌క‌త్వం ప‌డ‌రాని పాట్లు ప‌డుతుంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నాలు చేస్తున్నది. కానీ,  జ‌గ‌న్ అండ్ కో ఆట‌లు సాగ‌డం లేదు.  ఇన్నాళ్లు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అండ‌గా ఉంటూ వ‌చ్చిన కేంద్రంలో బీజేపీ పెద్ద‌లు సైతం వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఓడిపోతుంద‌న్న అంచ‌నాకు వ‌చ్చేశారు‌. ప‌లు ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా జ‌గ‌న్ ఓట‌మి ఖాయ‌మ‌ని తేల్చిశాయ‌ని ప‌లువురు బీజేపీ నేత‌లు పేర్కొంటున్నారు.  దీంతో బీజేపీ కూడా తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మిలో చేరేందుకు సిద్ధ‌మైందని పరిశీలకులు అంటున్నారు.  నేడో రేపో  చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్ద‌ల‌ను క‌ల‌బోతున్నారు. మ‌రోవైపు గ‌తంలో జ‌గ‌న్ గెలుపులో కీల‌క పాత్ర పోషించిన ఆయన సొంత సోదరి వైఎస్ ష‌ర్మిల  ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలి హోదాలో జ‌గ‌న్ పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్ర‌మంలో అంద‌రూ క‌లిసి న‌న్ను ఒంటిరివాడిని చేశారు.  నేను మిమ్మ‌ల్నే న‌మ్ముకున్నా అంటూ ప్ర‌జ‌ల్లో మ‌రోసారి సానుభూతి అస్త్రాన్ని జ‌గ‌న్ ప్ర‌యోగిస్తున్నారు. కానీ, ఏపీ ప్ర‌జ‌లు మాత్రం చీద‌రించుకుంటున్న ప‌రిస్థితి. ఒక‌సారి సానుభూతి చూపి రాష్ట్రాన్ని, మా జీవితాల‌ను నాశ‌నం చేసుకున్నాం.  ఈసారి నిన్ను ఇంటికి పంపిస్తామంటూ ఏపీ ప్ర‌జ‌లు నిన‌దిస్తున్నారు. దీంతో జ‌గ‌న్ అండ్ కో మీడియా ముందు మేకపోతు గాంభీర్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నా ఓటమి తథ్యమన్న  విష‌యం  వారికికూడా అర్థ‌మైంది. ఇందుకు తాజాగా అసెంబ్లీలో జ‌గ‌న్ ప్రసంగమే నిదర్శనం.

ఏపీ పోలీసులపై హైకోర్టు ఫైర్

ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ కు కోర్టులంటే లెక్క లేదు. తన ఇష్టారాజ్యంగా పాలన సాగించేందుకు అధికారులను తొత్తులుగా మార్చుకుంది. మాట వినే వారే కీలక పదవులలో నియమించుకుంది. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలో కీలక అధికారులంతా విధినిర్వహణలో కంటే జగన్ సేవలోనే తరిస్తున్నారని చెప్పడంలో ఇసుమంతైనా అతిశయోక్తి లేదు. కోర్టులు ఎన్ని సార్లు చీవాట్లు పెట్టినా దులిపేసుకుంటున్నారు. తాజాగా ఏపీ హైకోర్టు పోలీసుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో పోలీసుల పని తీరు మెరుగుపడాలంటే.. ఓ ఉన్నతాధికారిని జైలుకు పంపక తప్పదా అని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించిందంటే.. ఏపీలో పోలీసులు ఎంత సుందరముదనష్టంగా పని చేస్తున్నారన్నది ఇట్టే అర్ధమౌతుంది. రాష్ట్రంలో కిడ్నాపర్నకు అండ, గంజాయి స్మగ్లర్లకు మద్దతు,  విధినిర్వహణలో రాజ్యాంగ ఉల్లంఘనలు.. అమాయకులపై వేధింపులు, అక్రమ కేసుల నమోదు ఇలా పోలీసు వ్యవస్థ పనితీరు పూర్తిగా లోపభూయిష్టంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీ వారు చేసిన తప్పులకు కూడా విపక్షాల కార్యకర్తలు, నేతలపై కేసులు నమోదు చేస్తూ మొత్తంగా ఏపీలో పోలీసులు వైసీపీ హార్డ్ కోర్  కార్యకర్తలుగా పని చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా పర్చూరు ఎమ్మెల్యే  ఏలూరి సాంబశివరావు అరెస్టునకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పర్చురులో క్వారీలపై మైనింగ్ శాఖ అధికారుల సోదాలలో కొందరు ప్రైవేటు వ్యక్తులు సైతం పాల్గొన్నారు. దీనిపై ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గట్టిగా ప్రశ్నించారు. అంతే ఏపీలోని ప్రైవేటు రాజ్యాంగం జూలు విదిల్చింది. పోలీసులు రంగంలోని దిగి ఆయనపై కేసు నమోదు చేశారు. అరెస్టు చేయడానికి రెడీ అయిపోయారు. దీంతో ఆయన ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. నోటీసులు కూడా ఇవ్వకుండా తనను అరెస్టు చేయడానికి పోలీసులు చూస్తున్నారనీ, రాష్ట్రంలో పోొలీసులు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ కోర్టుకు వెళ్లారు. ఆయన యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ విచారణ చేసిన హైకోర్టు పోలీసుల తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో ఎంపీలు, ఎమ్మెల్యేలే పోలీసులు అరెస్టు చేస్తారంటూ భయపడుతున్నారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. ఏడు సంవత్సరాల లోపు శిక్షలు పడే కేసులలో 41 ఏ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని చట్టం స్పష్టంగా చెబుతుంటే అరెస్టు ఎలా చేస్తారని నిలదీసింది. అలా అరెస్టు చేస్తే అందుకు బాధ్యులైన వారు తీవ్రపరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించింది. ఏపీలో పోలీసుల తీరు మారాలంటే ఎవరో ఒక ఉన్నతాధికారిపై చర్యలకు ఆదేశించాల్సి వచ్చేటట్లు ఉందని వ్యాఖ్యానించింది. ఇక ఏలూరి సాంబవివరావు కేసు విషయంలో వివరాల సమర్పణకు ప్రభుత్వ న్యాయవాది సమయం కోరడంతో కేసు విచారణను వాయిదా వేసింది. కోర్టు వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఏపీలో పోలీసులు ప్రభుత్వ పెద్దల కనుసైగల మేరకు వ్యవహరిస్తున్నారని అవగతమౌతుంది. వారికి ఇష్టం లేనివారిపై అక్రమ కేసుల బనాయించి ఏదో ఒక విధంగా అరెస్టు చేస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రసంగించారనీ, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారనీ, అవినీతికి పాల్పడ్డారనీ ఆరోపిస్తూ కనీస సాక్ష్యాలు కూడా లేకుండా అరెస్టు చేస్తున్నారు. ఈ తీరు ఇప్పడు తార స్థాయికి చేరింది. ఎన్నికల ముందు విపక్షాలకు చెందిన నేతలు ప్రజల మధ్య ఉండకూడదన్న ఏకైక లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం పోలీసులను ఉపయోగించుకుని అక్రమ అరెస్టులకు తెరతీస్తున్నది. దీనిపైనే హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అయితే కోర్టుల అక్షింతలను పట్టించుకునే పరిస్థితి ఏపీలో లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అయితే  డీజీపీని జైలుకు పంపినా జగన్ అధికారంలో ఉన్నంత వరకూ ఏపీలో పోలీసులు మారరని  అంటోంది. 

ఓటమి తర్వాత తొలిసారి తెలంగాణ భవన్ కు  వచ్చిన కెసీఆ ర్ 

బిఆర్ఎస్ కు మళ్లీ జవసత్వాలు నింపాలన్న ఉద్దేశ్యంతో ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ పావులు కదుపుతున్నారు. కెసీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సన్నాహక చర్యలు చేపట్టారు.వాటర్ వార్ అంశమే ఆయనకు ప్రధాన అస్త్రంగా ఎంచుకున్నారు.  కేడర్ లో జోష్ నింపి లోకసభ ఎన్నికలలో జోష్ నింపాలని కెసీఆర్ యోచిస్తున్నారు. అబద్దాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలో వచ్చిందని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ నాయకత్వానికి ఆయన  దిశానిర్దేశం చేశారు.   రాష్ట్ర ఆవిర్బావం తర్వాత పదేళ్లు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న బిఆర్ ఎస్ అధ్యక్షుడు కెసీఆర్  ఓటమితర్వాత తొలిసారి  తెలంగాణ భవన్ లో అడుగుపెట్టారు. తెలంగాణ ఎన్నికలలో ఘోర పరాజయం చవి చూసిన తర్వాత తన స్వంత వ్యవసాయక్షేత్రంలోని బాత్ రూంలో కాలుజారిపడటంతో ఆయన  తుంటి ఎముక విరిగింది. శస్త్ర చికిత్స అనంతరం ఇటీవల అసెంబ్లీకి మొదటి సారి వచ్చి తన ఎమ్మెల్యే పదవికి ప్రమాణ స్వీకారం  చేశారు.  తెలంగాణ భవన్ కు ఆయన మూడు నెలల తర్వాత రావడం గమనార్హం. ఈ సందర్భంగా మహిళా ప్రజాప్రతినిధులు ఆయనకు హారతి ఇచ్చి ఆహ్వానం పలికారు. కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాట్లను కేసీఆర్ సమీక్ష చేశారు.  కృష్ణా బేసిన్ లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించడంపై పోరుబాటకు సంబంధించిన కార్యాచరణపై నేతలకు కేసీఆర్ మార్గనిర్దేశం చేశారు కేసీఆర్ సమీక్షా సమావేశానికి ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీశ్ రావు కూడా తెలంగాణ భవన్ కు వచ్చారు. అసెంబ్లీ సమావేశాలు, రాష్ట్ర కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై కూడా చర్చించారు.  .  రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు.  క్యాడర్ లో జోష్ నింపేందుకు నేతలు సమాయత్తం కావాలని ఆయన వారికి ఉద్భోదించారు.  నేతలకు నిరాశ చెందాల్సిన పనిలేదని, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో ఇప్పుడిప్పుడే వ్యతిరేకత మొదలయిందని, దానిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించేలా అందరూ కష్టపడి పనిచేయాలని కేసీఆర్ నేతలకు హిత బోధ చేశారు.  యాక్టివ్ గా లేని నేతలను పార్టీ బాధ్యతల నుంచి తప్పిస్తానని కూడా ఆయన హెచ్చరించారు.   

మహిళతో అసభ్య ప్రవర్తన...మియాపూర్ సిఐ సస్పెండ్ 

 కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఈ నాలుగో సింహం పోలీస్‌ అంటూ ఓ మూవీలో సాయి కుమార్ చెప్పిన డైలాగ్‌ని ఎవ్వరూ అంత ఈజీగా మర్చిపోరు. ఆ తరువాత ఈ డైలాగ్‌ని ఎన్నో సినిమాల్లోనూ వాడుకున్నారు. అయితే ఇప్పుడు ఆ డైలాగ్‌ని మరో వెర్షన్‌లో చెప్పారు ఈ పోలీస్ అధికారి. తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్ వెళ్లిన  ఓ మహిళకు  ఓ ఖాకి అన్యాయం చేశాడు.  తెలంగాణ పోలీసు శాఖలో ఈ  కీలక పరిణామం చోటు చేసుకుంది.  ఒక మహిళతో అమర్యాదకరంగా ప్రవర్తించిన కారణాలతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ సీఐ ప్రేమ్ కుమార్ ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు వివరాల్లోకి వెళ్తే... తన భర్త వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసేందుకు ఓ మహిళ మియాపూర్ పీఎస్ కు వచ్చింది. అయితే ఆమె పట్ల సీఐ ప్రేమ్ కుమార్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయంపై పోలీస్ ఉన్నతాధికారులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారులు విచారణ జరుపగా ప్రేమ్ కుమార్ భాగోతాలు బయటపడ్డాయి. దీంతో, ఆయనను సస్పెండ్ చేస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు.  

గంటా శ్రీనివాసరావ్  రాజీనామా ఆమోదించాం: అసెంబ్లీలో  స్పీకర్ 

టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించినట్టు అసెంబ్లీ వేదికగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగా చర్చకు కారణమైంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ 2021, ఫిబ్రవరి 6న ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేయగా ఎట్టకేలకు స్పీకర్ కార్యాలయం  ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. మంగళవారం అసెంబ్లీ వేదికగా గంటారాజీనామా ఆమోదించినట్టు ప్రకటించారు.  అసలు తన రాజీనామా ఆమోదం సాంకేతికంగా చెల్లదని గంటా చెప్పుకొచ్చారు.తన రాజీనామా అమోదం పైన గంటా శ్రీనివాస రావు కీలక వ్యాఖ్యలు చేసారు. తనను అడగకుండానే.. కుట్ర కోణంతో రాజీనామాను ఆమోదించారని ఫైర్ అయ్యారు. విశాఖ స్టీల్‌ పరిరక్షణకు మూడు సంవత్సరాల క్రితం తాను ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ప్రస్తుత పరిస్థితుల్లో స్పీకర్‌ ఆమోదించడం సాంకేతికంగా చెల్లదని విశ్లేషించారు. రాజీనామాను స్పీకర్‌ ఆమోదించడంపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నానని వెల్లడించారు. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో మూడు సీట్లను కైవం చేసుకోవడానికి వైసీపీ పన్నిన కుట్రలో భాగంగానే తన రాజీనామా ఆమోదించారని చెప్పుకొచ్చారు. ఇప్పటికే రెండు సీట్లు గెలిచేందుకు వైసీపీకి అవకాశాలుండగా మూడో స్థానాన్ని టీడీపీకి దక్కకుండా చేయడానికి రాజకీయ విలువలను పక్కన పెట్టి రాజీనామాను ఆమోదించారని గంటా దుయ్యబట్టారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను రద్దు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఏనాడు కూడా ప్రధాని మోదీతో మాట్లాడక పోవడం వల్ల వేలాది మందికార్మికులు, ఉద్యోగులు రోడ్డున పడ్డారని ఆరోపించారు. తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికే ప్రధానితో జగన్‌ గట్టిగా మాట్లాడలేకపోయారని గంటా విమర్శించారు. రాజీనామా తరువాత స్పీకర్‌ను ఎన్నిసార్లు కలిసినా రాజీనామాను ఆమోదించలేదన్నారు. రాజీనామా లేఖను కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచారని... ఇప్పుడు కుట్ర కోణంతో ఆమోదించారని మండిపడ్డారు.

రెండో రోజు  ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. అంతలోనే తెలుగుదేశం ఎమ్మెల్యేలు సస్పెండ్ 

నిరసన మన రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలు నిరసన వ్యక్తం చేయడానికి ఎలాగూ ఆస్కారం లేదు. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి ప్రజల గొంతుకగా మారి అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేయడమే పాపమైంది. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు వాకౌట్ చేసిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు రెండో రోజు మాత్రం ప్రజాస్వామ్య బద్దంగా చర్చను చేపట్టాలని నిరసస వ్యక్తం చేయడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. జగన్ ప్రభుత్వ హాయంలో స్పీకర్ పదవికి విలువే లేకుండా పోయింది. రాజ్యాంగపదవిలో ఉన్న స్పీకర్ మాత్రం ముఖ్యమంత్రి జగన్ భజన చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.  ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ఈరోజు సభ ప్రారంభమైన వెంటనే నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో, వాయిదా తీర్మానంపై చర్చను చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యలు ఆందోళన చేపట్టారు. పెరిగిన ధరలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని... ఈ అంశంపై చర్చించాల్సిందేనని పట్టుపట్టారు. అయితే, టీడీపీ సభ్యుల అరుపులను స్పీకర్ పట్టించుకోలేదు.  మరోవైపు, టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే మంత్రులు పలు బిల్లులను ప్రవేశ పెట్టారు. దీంతో, టీడీపీ సభ్యులు పోడియంలోకి దూసుకుపోయారు. పోడియం ఎక్కి మరీ నినాదాలు చేశారు. స్పీకర్ ఛైర్ వద్దకు దూసుకొచ్చిన టీడీపీ సభ్యులు... బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో శాసనసభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. దీంతో, టీడీపీ సభ్యులను అసెంబ్లీ నుంచి ఒక రోజు స్పీకర్ సస్పెండ్ చేశారు.

ధ‌ర్మ‌వ‌రం జంక్ష‌న్‌లో ప‌రిటాల శ్రీరామ్‌ 

అనంతపుర్‌ పాలిటిక్స్‌ ఎప్పుడూ హాట్‌హాట్‌గా ఉంటాయి.   అయితే జిల్లాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా వున్న‌ ధర్మవరం....  ఫ్యాక్షన్ రాజకీయాలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌.  ధర్మవరం నియోజకవర్గంలో పట్టు నిలుపుకోవడానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి,  టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఇద్దరూ ఎక్కడా తగ్గడం లేదు. అయితే టీడీపీ అధిష్టానం పరిటాల శ్రీరామ్ విష‌యంలో నాన్చుడు ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తోంది. ధర్మవరం టికెట్ ను తాను వదులుకునేది లేదని తెగేసి చెబుతున్నా, శ్రీరామ్ ఆశ‌ల‌పై టీడీపీ నీళ్లు చ‌ల్లుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. శ్రీరామ్ కు ఆ టికెట్ లేన‌ట్టేనా..! టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించుకుని తీరాల‌నే క‌సితో ముందుకు సాగు తున్నారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ ప్ర‌స్తుతం అందివ‌చ్చిన ఛాన్స్‌ను మిస్ చేసుకోకుండా ముందుకు సాగాల‌ని ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో అవ‌స‌ర‌మైతే.. రెండు మెట్లు దిగి ముందుకు సాగాల‌ని చూస్తున్నారు. ఇది రాజ‌కీయంగా బాగానే ఉన్న‌ప్పటికీ..  స్థానికంగా నాయ‌కులు పెట్టుకున్న ఆశ‌ల‌పై మాత్రం నీళ్లు చ‌ల్లుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఎందుకు చెబుతున్నానంటే.... ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంపై ప‌రిటాల కుటుంబం చాలానే ఆశ‌లు పెట్టుకుంది.  గ‌తంలో ప‌రిటాల ర‌వి ధ‌ర్మ‌వ‌రం నుంచి పోటీ చేశారు. గ‌త ఎన్నిక‌ల్లోనూ.. ఇప్పుడు కూడా ఇక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని భావిస్తోంది.  కానీ, గ‌త ఎన్నిక‌ల్లోనూ ఇప్పుడు కూడా.. ఒకే ఒక్క టికెట్‌ను ఈ కుటుంబానికి కేటాయిస్తున్నారు.  మ‌రోవైపు ఇత‌ర కుటుంబాల‌కు .. ఇదే జిల్లాలో రెండేసి టికెట్‌లు ఇస్తున్నారు.  ఇదే ప‌రిటాల ఫ్యామిలీకి మింగుడు ప‌డటం లేద‌ట‌. గ‌త ఎన్నిక‌ల్లో రాప్తాడు నియోజ‌కవ‌ర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే క‌మ్ మంత్రిగా ఉన్న ప‌రిటాల సునీత‌.. త‌న కుమారుడు.. శ్రీరాంను తెర‌మీదికి తెచ్చారు. రాప్తాడు, ధ‌ర్మ‌వ‌రం రెండు నియోజ‌క‌వర్గాలు కావాల‌ని కోరారు.  కానీ, అప్ప‌ట్లోనూ రాప్తాడు ఒక్క‌టే ఇచ్చారు.  ఎవ‌రైనా ఒక్క‌రే అంటూ.. ఒక నియోజ‌క‌వ‌ర్గం ఇవ్వ‌డంతో శ్రీరాం పోటీ చేశారు.  గెలుపుపై భారీగానే అంచ‌నాలు వ‌చ్చినా.. వైసీపీ హ‌వాలో ఆయ‌న ఓడిపోయారు. ఇక‌,  ధ‌ర్మవ‌రం టికెట్ నుంచి పోటీచేసిన వ‌రదాపురం సూరి ఓడిపోయిన త‌ర్వాత‌..  బీజేపీతీర్థం పుచ్చుకున్నారు. దీంతో ధ‌ర్మ‌వ‌రంలోనే పాగా వేసిన శ్రీరాం..  గ‌త రెండేళ్ల నుంచి ఇక్క‌డ పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రెండు నెల‌ల‌పాటు పాద‌యాత్ర కూడా చేశారు.  అయితే.. ఇప్పుడు కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గం ఇచ్చే అంశంపై పార్టీలో చ‌ర్చ సాగుతోంది.  ప్ర‌స్తుతం రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గాన్ని మాత్ర‌మే ప‌రిటాల కుటుంబానికి క‌న్ఫ‌ర్మ్ చేశారు.  అది కూడా సునీత‌కు మాత్ర‌మే కేటాయించాల‌ని తేల్చి చెప్పారు.  గతంలో టీడీపీ హయాంలో ఎప్పుడూ గన్మెన్లు మందీమార్బలంతో కనిపించిన వరదాపురం సూరి ఉరఫ్ సూర్యనారాయణ.. గత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత.. అనూహ్యంగా అన్నీ సర్దుకుని బీజేపీలోకి వలసపోయారు. తీవ్రమైన భూ ఆక్రమణల ఆరోపణలున్న నేపథ్యంలో ఆయా కేసుల నుంచి తప్పించుకునేందుకే ఆయన బీజేపీలోకి జంప్ చేశారనే వాదన ఉంది. పోనీ.. బీజేపీలో చేరిన తర్వాతైనా ఆ పార్టీ నాయకులకు అందుబాటులో ఉంటున్నారంటే అదీ లేదట. తన మానాన తాను ఉంటున్నారు. గత నాలుగేళ్లుగా ఆయన అసలు అందుబాటులో లేరట. మొత్తానికి ఆయన తెరచాటున చక్రం తిప్పుతున్నారా? అనే సందేహాలు లేకపోలేదు. 2024 ఎన్నికల్లో తిరిగి టీడీపీ తరఫున పోటీ చేయాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది..  ఆయ‌న త‌ర్వ‌లోనే వ‌స్తార‌ని.. ఆయ‌న‌కు టికెట్ ఇస్తున్నార‌ని అంటున్నారు.  దీంతో టీడీపీ యువ నాయకుడు పరిటాల శ్రీరాం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.   ఈ విష‌య‌మే ఇప్పుడు ప‌రిటాల కుటుంబంలోఆవేద‌న‌ను మిగుల్చుతోంది.  ఎందుకు చంద్ర‌బాబు శ్రీరామ్ విష‌యంలో నిర్ణ‌యం తీసుకోవ‌డం లేదు.... ధ‌ర్మ‌వ‌రం టౌన్లో టీడీపీ క్యాడ‌ర్ కు ఉత్సాహం వ‌స్తుందేమో కానీ, స్థానిక వ్యాపారులు ఎలా ఆలోచిస్తార‌నేది కీల‌క‌మైన అంశం. ఎలాంటి ఫ్యాక్ష‌న్ త‌గాదాలు, బెదిరింపులు, కిడ్నాపుల లేకుండా ధ‌ర్మ‌వ‌రం టౌన్ దాదాపు 15 యేళ్ల నుంచి ప్ర‌శాంతంగా ఉంది. వ‌ర‌దాపురం సూరి, కేతిరెడ్డిల మ‌ధ్య‌న 15 యేళ్లుగా పోటీ సాగుతూ ఉంది. పోటీ రాజ‌కీయం వ‌ర‌కే! ఇలాంటి నేప‌థ్యంలో ప‌రిటాల అంటే స్థానికుల్లో కూడా ఒక క‌ల‌క‌లం! శ్రీరామ్ పోటీ చేస్తే గ్రామాలు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలం అవుతాయి.  ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో  శ్రీరామ్ కు బ‌హుశా ధ‌ర్మ‌వ‌రం టికెట్ ద‌క్క‌క‌పోవ‌చ్చ‌ని, ప‌రిటాల ఫ్యామిలీ కేవ‌లం రాప్తాడుకే ప‌రిమితం కావాల్సి రావొచ్చ‌నేది నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో జ‌రుగుతున్న ప్ర‌చారం. అంతే కాదు   ప‌రిటాల శ్రీరామ్ అయితే  స్థానికేత‌రుడిని జ‌నం ఆమోదించే అవ‌కాశం లేదు,  సూరి అయితే పార్టీ క్యాడ‌రే స‌హ‌క‌రించ‌దు.. ఇలాంటి నేప‌థ్యంలో వీరిద్ద‌రూ కాకుండా పార్టీ కొత్త వారికి అవ‌కాశం ఇస్తారా? అస‌లు చంద్ర‌బాబు మ‌న‌స్సులో ఏముంది? వ‌ర‌దాపురం సూరికే అవ‌కాశాలున్నాయ‌ని, ఆయ‌న తెలుగుదేశం పార్టీలో చేరిన వెంట‌నే అభ్య‌ర్థిత్వం ఖ‌రారు కావొచ్చ‌నే ప్ర‌చార‌మే ఉంది.   ధ‌ర్మ‌వ‌రం టికెట్ త‌న‌కు కాద‌ని మ‌రొక‌రికి ఇస్తే టీడీపీకి గుడ్ బై చెప్పి శాశ్వ‌తంగా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటా శ్రీరామ్ గ‌తంలో ప్ర‌క‌టించారు.  ధర్మవరం టికెట్ ను తాను వదులుకునేది లేదని స్పష్టం చేశారు.  ఆ నేప‌థ్యంలో చంద్ర‌బాబు నిర్ణ‌యం ఎలా ఉండ‌బోతోంద‌నేది ఉత్కంఠ‌గా మారింది.

జగన్ ది సైకోయిజం.. ఆయనవి నీచ రాజకీయాలు.. కుండబద్దలు కొట్టిన వసంత కృష్ణ ప్రసాద్

అప్ప‌టి నేత‌లు అస‌భ్య‌క‌ర ప‌ద‌జాలం చాలా త‌క్కువ‌గా వాడేవాడు.. ఒక‌వేళ అస‌భ్య‌క‌ర ప‌దాలు ఏ రాజ‌కీయ నాయకుడైనా ఉప‌యోగిస్తే వారికి త‌రువాత అధినేతలు మందలించేవారు. క్లాస్ పీకేవారు.  దీంతో ప్ర‌తిప‌క్షంలోని నేత‌లు, అధికార ప‌క్షంలోని వారు రాజ‌కీయ ప్ర‌సంగాల్లో అస‌భ్యక‌ర‌ ప‌ద‌జాలం ఉప‌యోగించాలంటే భ‌య‌ప‌డేవారు. ఒక‌ విధంగా చెప్పాలంటే ఎన్టీఆర్, చంద్ర‌బాబు, వైఎస్ ఆర్ హ‌యాంలో చాలావ‌ర‌కు క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన రాజ‌కీయాలే న‌డిచాయ‌న‌డంలో సంకోచం అక్క‌ర్లేదు. కానీ, ప్ర‌స్తుతం వైఎస్ జ‌గ‌న్ హ‌యాంలో రాజ‌కీయాల‌కు అర్థ‌మే మారిపోయింద‌న్న భావన ఏపీ ప్ర‌జ‌లలో బలంగా వ్య‌క్త‌మ‌వుతుంది.  జ‌గ‌న్ హ‌యాంలో కొంద‌రు మంత్రుల‌కు ఏపీ ప్ర‌జ‌లు బూతుల మంత్రులుగా పేర్లు పెట్టారంటే జ‌గ‌న్ త‌ర‌హా రాజ‌కీయం ఏ విధంగా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. దేశం మొత్తం ప్ర‌స్తుతం ఏపీ వైపు చూస్తోంది.. ఇలాకూడా రాజ‌కీయాలు చేస్తారా? ఇంత దారుణంగా అస‌భ్య‌క‌ర ప‌దజాలాన్ని రాజ‌కీయ ప్ర‌సంగాల్లో ఉప‌యోగిస్తారా?  కుటుంబ స‌భ్యుల్లోని ఆడ‌వారిపై సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు ప్ర‌చారాలు ఇంత దారుణంగా చేస్తారా అని ఆశ్చ‌ర్య పోతున్నారు. ఏపీలోని కొంద‌రు మంత్రులు ప్రెస్ మీట్లు, స‌మావేశాలు టీవీల్లో ప్ర‌సారం అవుతున్నాయంటే పిల్ల‌లు చూడ‌కుండా త‌ల్లిదండ్రులు టీవీలు ఆపేసే ప‌రిస్థితి ఏర్ప‌డిందంటే అతిశయోక్తి కాదు. ఇంత‌లా ఏపీలో రాజ‌కీయాలు దిగ‌జారిపోవ‌డానికి సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డే కార‌ణ‌మ‌ంటున్నారు పరిశీలకులు.  ఆ పరిశీలకులు చెబుతున్నదే వాస్తవమని తాజాగా నిర్ద్వంద్వంగా వెల్లడైపోయింది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ జ‌గ‌న్ ప్ర‌వ‌ర్త‌న గురించి సంచ‌న‌ల విష‌యాల‌ను వెల్ల‌డించారు.  వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి  త‌ర‌హాలో జ‌గ‌న్ పాల‌న ఉంటుంద‌ని అనుకున్నా.. కానీ, వైఎస్ఆర్ పాల‌న‌కు ప్ర‌స్తుత జ‌గ‌న్ పాల‌న‌కు ఏమాత్రం పోలిక లేద‌ని వసంత కృష్ణ‌ప్ర‌సాద్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. కక్షసాధింపు చర్యలు వద్దు, వై ఎస్ లా పాలించండ‌ని ప‌లుసార్లు తాను ఆయనకు చెప్పే ప్ర‌య‌త్నం చేశానన్నారు. తాను రెండు  మూడుసార్లు జగన్ ను కలిసిన సందర్భంలో ఆయన లోకేష్ , చంద్రబాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను తిట్టవు నిన్నెలా నమ్మాలని అన్నారని చెప్పారు. అన్నారు. జగన్ దృష్టిలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌ను బండ‌బూతులు తిడితేనే రాజ‌కీయ నేత‌, వాళ్ల‌కే మంత్రి ప‌ద‌వులు ఇస్తారు. తిట్టని వాళ్లకి ఎమ్మెల్యే , పార్లమెంటు సీట్లు ఇవ్వనని జ‌గ‌న్ స్వ‌యంగా చెప్పారని వసంత కృష్ణ ప్రసాద్ వెల్లడించారు.   తాను హుందా రాజకీయం మాత్రమే నేను చేస్తాన‌ని  జగన్ కు స్పష్టంగా చెప్పానని కృష్ణ ప్రసాద్ అన్నారు.  స్వ‌యంగా వైసీపీ ఎమ్మెల్యే  కృష్ణ‌ప్ర‌సాద్ చెప్పిన మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే, జ‌గ‌న్ రెడ్డివి ముమ్మాటికీ నీచ రాజ‌కీయాలేన‌ని తేటతెల్లమౌతోంది.  వ‌సంత మాట‌లు విన్న‌త‌రువాత జ‌గ‌న్ నీది సైకో రాజ‌కీయం కాదా? అంటూ జనం ప్రశ్నిస్తున్నారు.  ఇలాంటి సైకో రాజ‌కీయాల‌తో ఏపీ ప‌రువు తీస్తున్నారంటూ బాహాటంగా విమర్శిస్తున్నారు.

ఫార్మాసిటీ కథ కంచికి... లాభ‌ప‌డిందెవ‌రు?రేవంత్ యూట‌ర్న్ వెనుక ఆంధ్ర రియ‌ల్ ఎస్టేట్‌

ఫార్మాసిటీ స్థానంలో మెగా టౌన్‌షిప్‌లతో కొత్త సిటీని ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.  ఇప్పటివరకు సేక‌రించిన‌ 12,300 ఎకరాల భూముల్లో మెగా టౌన్‌షిప్‌ల నిర్మాణం చేపట్ట‌నున్నారు. మ‌రో ప‌క్క  ఫార్మాసిటీ స్థానంలో 10 ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఎయిర్‌పోర్టుకు అనుసంధానం ఉండేలా ఓఆర్‌ఆర్‌, రీజినల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) మధ్య ఇవి రూపుదిద్దుకుంటాయి. ఒక్కో ఫార్మా విలేజ్‌ రెండు వేల నుంచి మూడు వేల ఎకరాల్లో ఉంటుంది. వంద శాతం కాలుష్యరహితంగా ఉండే పరిశ్రమలతో పాటు వాటిలో పనిచేసేవారి నివాస సముదాయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, వినోద(ఎంటర్‌టైన్‌మెంట్‌) విభాగాలు సహా అన్నీ ఫార్మా విలేజ్‌లో ఉంటాయి.  ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఫార్మాసిటీని ఎందుకు ర‌ద్దు చేయం. స‌రి చేస్తున్నార‌ట‌. అందులో భాగంగానే 10 ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. సి.ఎం. నిర్ణ‌యం వెనుక మ‌త‌ల‌బు ఏమిటి? ఫార్మా సిటీ మాటున పెద్దల భూదందా, ఇన్‌సైడ్ ట్రేడింగ్ జ‌రిగింద‌ట‌. తక్కువకు కొని అధిక ధరకు ప్ర‌భుత్వానికే అమ్ముకున్నార‌ట‌.  2017లో హైదరాబాద్‌ గ్రీన్‌ ఫార్మాసిటీ ఏర్పాటు ప్రతిపాదనను తెరపైకి వచ్చింది.  రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూర్, కడ్తాల్, ఆమన్‌గల్‌ మండలాల్లోని పది గ్రామాల పరిధిలో 19,333 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు ఇప్పటికే 12,300 ఎకరాల భూసేకరణ కూడా పూర్తైంది.  ఇందులో సుమారు 9,400 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉన్నది.  మిగిలిన పట్టా, అసైన్డ్‌ భూములకు ప్రభుత్వం పలు మార్గాల్లో పరిహారం ఇచ్చింది.  పట్టా భూములు ఇచ్చిన వారికి ఎకరాకు రూ.18 లక్షలతో పాటు అభివృద్ధి చేసిన 121 గజాల ప్లాటు (ఒక గుంట), ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది.  కోర్టును ఆశ్రయించిన కొందరు రైతులకు ఎకరాకు గరిష్ఠంగా రూ.26 లక్షలు వచ్చాయి.  అసైన్డ్‌ భూములు కోల్పోయినవారికి ఎకరాకు రూ.7.50-8.00 లక్షలు ప్రభుత్వం చెల్లించింది.  వీరికి ఎకరాకు అభివృద్ధి చేసిన 121 గజాల ప్లాటుతోపాటు ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది.  ఈ మేరకు నగదు పరిహారం గతంలోనే చెల్లించింది.  సేకరించిన భూముల్లోనే 600 ఎకరాల మేర లేఅవుట్‌ను అభివృద్ధి చేసి, భూములు ఇచ్చిన వారికి ప్లాట్లను పంపిణీ కూడా చేశారు.  ఫార్మాసిటీ వాసన పసిగట్టిన ‘పెద్ద గద్దలు’ చురుగ్గా కదిలాయి. దాని చుట్టూ వాలిపోయాయి. స్థానిక రైతుల్ని కాలుష్యం పేరిట, ప్రభుత్వం భూమి సేకరించబోతుందంటూ మభ్యపెట్టాయి. ప్రభుత్వంలోని పలువురు ఉన్న తాధికారులతో పాటు పలువురు ప్రభుత్వ పెద్దలు ప్రతిపాదిత ఫార్మాసిటీ చుట్టూ పెద్ద ఎత్తున భూములు తక్కువ ధరకు కొనుగోలు చేశారు. పట్టా భూములు పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను కూడా వారి ఖాతాల్లో జమ చేసుకున్నారు. ఆ తర్వా త ఈ భూములనే ఫార్మాసిటీ భూ సేకరణలో భాగంగా ప్రభుత్వానికి అధిక ధరకు అప్పగించి పెద్దెతున లబ్ధి పొందారు. అప్పటివరకు తమ చేతు ల్లో ఉన్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేసుకున్నా రు. మాజీ సీఎస్‌ సోమేష్‌కుమార్‌, అత‌ని కుటుంబ‌స‌భ్యులు 300 ఎక‌రాలు కొనుగోలు చేశార‌ట‌. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో టీఎస్‌ఐఐసీ విశాలమైన రహదారులు, భూగర్భ డ్రైనేజీ, ఇతరత్రా మౌలిక వసతుల కల్పనతో అభివృద్ధి పనులు చేశారు.  కందుకూరు పరిధిలో 180 ఎకరాలు సబ్‌ స్టేషన్‌కు కేటాయించారు.  30 ఎకరాలకు ప్రభుత్వ వైద్య కళాశాలకు కేటాయించారు.  48 ఎకరాలను అమెజాన్‌ డాటా సెంటర్‌కు ఇచ్చారు. ఇందులో రూ.5,809 కోట్లతో డాటా సెంటర్‌ ఏర్పాటవుతున్నది. మిగిలిన భూముల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటుకుగాను సుమారు 300-350 కంపెనీలు ముందుకొచ్చాయి.

గడల శ్రీనివాసరావు రూటే సెపరేటు.. పార్టీ ఏదని కాదు.. పోటీ చేశానా లేదా అనేదే ముఖ్యం!

తెలంగాణ ప్రజారోగ్య శాఖ మాజీ డైరెక్రర్  డాక్టర్‌ గడల శ్రీనివాస్‌ రావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్పిన అవసరం లేదు. బాధ్యత గలిగిన పదవిలో ఉండి ఆయన చేసిన విన్యాసాలు అందిరీ తెలిసినవే.  రాజకీయాల్లో ప్రవేశించి పాపులర్ అయిపోవాలన్న తహతహతో.. ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ గా తన హోదాను, బాధ్యతనూ మరికి ఫక్తు బీఆర్ఎస్ కార్యకర్తగా ఆయన వ్యవహరించిన తీరు అప్పట్లో పత్రికల్లో పతాక శీర్షికల్లో ప్రముఖంగా వచ్చింది.  బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కొత్తగూడెం శాసనసభ సీటు ఆశించి ఆయన భంగపడ్డారన్న సంగతి బహిరంగ రహస్యమే. ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ గా ఆయన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌  కాళ్లు మొక్కి వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న సంగతి కూడా తెలిసిందే. ఇక కరోనాకు మందులు, వ్యాక్సిన్ల అవసరం లేదనీ, ఏసుక్రీస్తును నమ్ముకుంటే చాలనీ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లె పెను సంచలనం సృష్టించాయి.  వివాదంగా మారింది.   వాస్తవానికి హెల్త్ డైరెక్టర్ గా ఆయన ఉన్నంత కాలం వివాదాలు ఆయన వెంట పడతాయో.. వివాదాల వెంట ఆయన పడతారా అన్నట్లుగా ఆయన వ్యవహార తీరు ఉండేది.    శ్రీనివాస్ రావు ఏసుక్రీస్తు దయతోనే దేశంలో కరోనా కేసులు తగ్గాయనీ, కరోనా నుంచి విముక్తి చెందామనీ ఆయన చేసిన వ్యాఖ్యలు, అంతటితో ఊరుకోకుండా..    క్రైస్తవం వల్లే దేశం అభివృద్ధి చెందిందంటూ చేసిన ఉద్బోధ ఎంత వివాదాస్పదమయ్యాయో తెలిసిందే. ఆఫ్కోర్స్ అది ఆయన వ్యక్తి గత విశ్వాసం కావచ్చు. కానీ, ఆయన ఒక అధికారిగా ఉండి చేసిన వ్యాఖ్య అలాగే క్రైస్తవ మత ప్రచారానికి నడుంబిగించాలంటూ ఇచ్చిన పిలుపుపై పెద్ద ఎత్తున విమర్శలూ వచ్చాయి. అలాగే  అంతకు ముందు ఆయన బహిరంగంగా అప్పటి  ముఖ్యమంత్రి కేసీఆర్  కాళ్లు మొక్కి, వివాదాస్పద అధికారిగా పతాక శీర్షికలకు ఎక్కారు. అలా కాళ్లు మొక్కడంపై వచ్చిన విమర్శలకు ఆయన కేసీఆర్ తన తండ్రిలాంటి వారు, ఆయన కాళ్లు మొక్కడం తప్పెలా అవుతుందంటూ సమర్ధించుకున్నారు. ఆ వెంటనే ఎన్నికల ముందు రాష్ట్రంలో ఆదర్శవంతమైన ఎమ్మెల్యే అంటూ ఎవరైనా ఉంటే అది మంత్రి హరీష్ రావేనని మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు.  దీంతో   ప్రభుత్వోద్యోగా, బీఆర్ఎస్ కార్యకర్తా అంటూ అప్పట్లో సామాజిక మాధ్యమంలో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే అప్పట్లో ఆయన కొత్త గూడెం నుంచి ఎన్నికల బరిలో దిగాలన్న ఆకాంక్షతో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ తో అంటకాగి అప్రతిష్ట పాలయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం రాగానే ఆయనకు స్థాన భ్రంశం కలిగింది అది వేరే విషయం. అటువంటి డాక్టర్‌ గడల శ్రీనివాస్‌ రావు.. తాజాగా తనకు ఖమ్మం లేదా సికిందరాబాద్ లోక్ సభ స్థానం కేటాయించాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన పోటీ చేస్తానని చేసుకున్న దరఖాస్తు బీఆర్ఎస్ పార్టీకి కాదు. తన తండ్రి వంటి వారు అని చెప్పుకున్న కేసీఆర్ గద్దె దిగగానే గడల శ్రీనివాసరావుకు ఆయన చేదైపోయారు. అందుకే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కు దగ్గరవ్వడానికి తన వంతు ప్రయత్నాలు ప్రారంభించేశారు. ఎన్నికలలో పోటీకి అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెఃస్ పార్టీకి తన దరఖాస్తును అనుచరుల ద్వారా పంపించారు. అయితే ఇక్కడా ఆయన ఆశలు నెరవేరే అవకాశాలు ఇసుమంతైనా కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన ఖమ్మం లేదా వరంగల్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నారు. ఆ రెండింటిలో ఖమ్మం ఎంపీ స్థానం కోసం కాంగ్రెస్ లో  చాలా చాలా గట్టి పోటీ ఉంది. ఆ స్థానం నుచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని, సీనియర్ నాయకుడు వీహెచ్, మాజీ ఎంపీ రేణుకా చౌదరి రేసులో ఉన్నారు. వారు ముగ్గురినీ కాదని కాంగ్రెస్ ఈయనకు టికెట్ ఇవ్వడం దాదాపు అసాధ్యం.  అయినా సర్వీసులో ఉంటూ  అప్పటి అధికార బీఆర్ఎస్ తో అంటకాగడంతో అప్పట్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నశ్రీనివాసరావు ప్రస్తుతం సెలవులో ఉన్నారు. సెలవులో ఉన్న ఆయన ఇటీవల ఒక మీడియా సంస్థతో మాట్లాడారు.  . తాను ప్రజాజీవితంలో ఉండాలని ఎల్లవేళలా కోరుకున్నానని, అందువల్ల ఎమ్మెల్యే టికెట్‌ కోసం ప్రయత్నించానని, కానీ గత ప్రభుత్వం తనకు అవకాశం ఇవ్వలేదన్నారు. ఈసారి కాంగ్రెస్‌ టికెట్‌ లభిస్తే ప్రజలకు సేవ చేస్తానని ఆయన అన్నారు.  తనకు కాంగ్రెస్‌ టికెట్‌ లభిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తాననీ లేకపోతే తిరిగి ఉద్యోగంలో చేరిపోతాననీ పాపం ఏ బేషజం లేకుండా చెప్పేసుకున్నారు. 

సుప్రీంలో కవిత పిటిషన్ వాయిదా 

జాతీయస్థాయిలో  ఇండియా  కూటమిని దెబ్బకొట్టడానికి బిజెపి, బిఆర్ఎస్  కల్సిపోయినట్లు వస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితురాలైన కల్వకుంట్ల కవిత మీద తమ దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చేత ఒత్తిడి పెంచుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని చవిచూసిన బిఆర్ఎస్ తో జతకడితే మొదటికే మోసం వస్తుందని బిజెపి భావించినట్లుంది. కవితపై ఈడీ  సమన్లు జారీ చేసింది. ఈ సమన్ల పై తను  దాఖలు చేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 16న విచారిస్తామని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ల ధర్మాసనం తెలిపింది. గత విచారణలో కవిత పిటిషన్ ను నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో కలిపి విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. సోమవారం విచారణ మొదలుకాగా.. ఈ పిటిషన్ పై తుది విచారణ చేపట్టాలని కవిత తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది కపిల్ సిబల్ న్యాయస్థానాన్ని కోరారు. అయితే, గతంలో వేర్వేరు కేసుల్లో ఇచ్చిన ఉత్తర్వులతో పాటు రికార్డులను పరిశీలించాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే విచారణను వాయిదా వేసింది.ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత విచారణకు రావడంలేదంటూ ఈడీ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. సమన్లు స్వీకరించడంలేదని చెప్పారు. దీనిపై కపిల్ సిబల్ కల్పించుకుంటూ.. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని అన్నారు. గత విచారణలో కవితకు సమన్లు జారీచేయబోమని కోర్టుకు ఈడీ తెలిపిందని గుర్తుచేశారు. అయితే, అది కేవలం ఒకసారికి మాత్రమేనని, ప్రతిసారీ కాదని ఈడీ న్యాయవాది బదులిచ్చారు. ఈ క్రమంలో అన్ని అంశాలను ఈ నెల 16న జరిగే విచారణలో వింటామని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.