గంటా శ్రీనివాసరావ్ రాజీనామా ఆమోదించాం: అసెంబ్లీలో స్పీకర్
posted on Feb 6, 2024 @ 11:15AM
టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించినట్టు అసెంబ్లీ వేదికగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.
ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగా చర్చకు కారణమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ 2021, ఫిబ్రవరి 6న ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేయగా ఎట్టకేలకు స్పీకర్ కార్యాలయం ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. మంగళవారం అసెంబ్లీ వేదికగా గంటారాజీనామా ఆమోదించినట్టు ప్రకటించారు. అసలు తన రాజీనామా ఆమోదం సాంకేతికంగా చెల్లదని గంటా చెప్పుకొచ్చారు.తన రాజీనామా అమోదం పైన గంటా శ్రీనివాస రావు కీలక వ్యాఖ్యలు చేసారు. తనను అడగకుండానే.. కుట్ర కోణంతో రాజీనామాను ఆమోదించారని ఫైర్ అయ్యారు. విశాఖ స్టీల్ పరిరక్షణకు మూడు సంవత్సరాల క్రితం తాను ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ప్రస్తుత పరిస్థితుల్లో స్పీకర్ ఆమోదించడం సాంకేతికంగా చెల్లదని విశ్లేషించారు. రాజీనామాను స్పీకర్ ఆమోదించడంపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నానని వెల్లడించారు. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో మూడు సీట్లను కైవం చేసుకోవడానికి వైసీపీ పన్నిన కుట్రలో భాగంగానే తన రాజీనామా ఆమోదించారని చెప్పుకొచ్చారు.
ఇప్పటికే రెండు సీట్లు గెలిచేందుకు వైసీపీకి అవకాశాలుండగా మూడో స్థానాన్ని టీడీపీకి దక్కకుండా చేయడానికి రాజకీయ విలువలను పక్కన పెట్టి రాజీనామాను ఆమోదించారని గంటా దుయ్యబట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను రద్దు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఏనాడు కూడా ప్రధాని మోదీతో మాట్లాడక పోవడం వల్ల వేలాది మందికార్మికులు, ఉద్యోగులు రోడ్డున పడ్డారని ఆరోపించారు. తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికే ప్రధానితో జగన్ గట్టిగా మాట్లాడలేకపోయారని గంటా విమర్శించారు. రాజీనామా తరువాత స్పీకర్‌ను ఎన్నిసార్లు కలిసినా రాజీనామాను ఆమోదించలేదన్నారు. రాజీనామా లేఖను కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచారని... ఇప్పుడు కుట్ర కోణంతో ఆమోదించారని మండిపడ్డారు.