సంసద్ రత్న కింజారపు రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు సంసద్ రత్న. ఔను ఎంపీల పనితీరు ఆధారంగా ఇచ్చే సంసద్ రత్న అవార్డుకు శ్రీకాకుళం తెలుగుదేశం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు ఎంపికయ్యారు.  పార్లమెంట్ సభ్యునిగా ఆయన కనబర్చిన ప్రతిభకు ఈ పురస్కారం దక్కింది. అంతే కాదు.. అతి పిన్న వయస్సులో ఈ పురస్కారం దక్కించుకున్న తొలి ఎంపీగా రామ్మోహన్ నాయుడు రికార్డు సృష్టించారు.   కాగా తాను సంసద్ రత్న పురస్కారం దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన కింజారపు రామ్మోహన్ నాయుడు ఈ పురస్కారాన్ని తెలుగుదేశం శ్రేణులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు.   సంసద్ రత్న అవార్డ్స్ 2020కి గానూ మొత్తం 10 మంది ఎంపీలను ఎంపిక చేశారు.   పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల జ్యూరీ  ఆధ్వర్యంలో ఈ ఎంపిక జరిగింది. ఈ అవార్డుకు ఎంపికైన వారిలో ఎనిమిది మంది లోక్‌సభ సభ్యులు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ సూచనతో 2010 నుంచి ఈ అవార్డులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. 

బీఆర్‎ఎస్ కు‎ షాక్‌ల‌మీద షాక్‌లు .. చేతులెత్తేసిన కేటీఆర్!

తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత బీఆర్ ఎస్ పార్టీలో లుక‌లుక‌లు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఆ పార్టీ అధికారంలో ఉన్న‌న్ని రోజులు ఇబ్బందులు ఎదురైనా భ‌రించుకుంటూ కారులోనే స‌ర్దుకుపోయిన నేత‌లు. ఇప్పుడు కారు దిగుతున్నారు. మ‌రికొంద‌రు దిగేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టికే ప‌లువురు బీఆర్ ఎస్ నేత‌లు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ప‌లువురు ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌జ‌రుగుతున్నది. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ హైక‌మాండ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే దాదాపు 20 మంది బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నార‌ని బీఆర్ ఎస్ వ‌ర్గాల్లోనే పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతున్నది. ప్ర‌స్తుతం గ్రేట‌ర్ ప‌రిధిలోని బీఆర్ ఎస్ పార్టీలో అసంతృప్తులు ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కొస్తున్నారు. వారంతా బీఆర్ ఎస్ ను వీడేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. దీంతో పార్టీ అగ్ర‌నాయ‌క‌త్వంలో క‌ల‌వ‌రం మొద‌లైంది. గ్రేట‌ర్ లోని ఎమ్మెల్యేలు, కార్పొరేట‌ర్లు చేజార‌కుండా కేటీఆర్ రంగంలోకి దిగిన‌ప్ప‌టికీ.. అసంతృప్తులు వెనక్కు తగ్గకపోవడంతో కేటీఆర్ సైతం చేతులెత్తేసిన‌ట్లు తెలిస్తోంది.   ఇటీవలి తెలంగాణ‌  అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ 64 నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధించి అధికార పీఠాన్ని ద‌క్కించుకుంది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అయితే, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం ద‌క్క‌లేదు. అయితే గ‌త రెండు నెల‌లుగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం పాల‌నా తీరును బీఆర్ ఎస్ పార్టీలోని నేత‌లు సైతం మెచ్చుకుంటున్న ప‌రిస్థితి. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రిగేలా రేవంత్ పాల‌న సాగిస్తున్నార‌ని ప‌లువురు బీఆర్ ఎస్ నేత‌లు బాహాటంగానే చెబెతున్నారు. ఈ క్ర‌మంలో గ్రేట‌ర్ బీఆర్ ఎస్ పార్టీలో అసంతృప్తులు కాంగ్రెస్ పార్టీలోకి వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు బీఆర్ ఎస్‌ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి ట‌చ్‌లోకి వెళ్లిన‌ట్లు స‌మాచారం. వీరికి తోడు బీఆర్ ఎస్‌ కార్పొరేట‌ర్లు సైతం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఆ పార్టీ తలుపు తడుతున్నారు. ఇప్ప‌టికే మాజీ డిప్యూటీ మేయ‌ర్ బాబా ఫ‌సీయుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్ర‌స్తుత‌ డిప్యూటీ మేయ‌ర్ తోపాటు ప‌లువురు బీఆర్ ఎస్ కార్పొరేట్లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలుస్తుంది.   గ్రేట‌ర్ ప‌రిధిలో బీఆర్ ఎస్ కార్పొరేట‌ర్లు భారీ సంఖ్య‌లో కాంగ్రెస్ వైపు వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌టంతో పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. హ‌డావుడిగా బీఆర్ ఎస్  కార్పొరేట‌ర్ల‌తో స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశానికి డిప్యూటీ మేయ‌ర్ హాజ‌రుకాక‌పోవ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆ మె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వ్వ‌డం వ‌ల్ల‌నే స‌మావేశానికి గైర్హాజరయ్యారని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.   ఆమె బాట‌లోనే మ‌రో 24 మంది కార్పొరేట‌ర్లు కాంగ్రెస్ గూటికి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది‌. అయితే కార్పొరేట‌ర్ల స‌మావేశంలో కేటీఆర్ ఎవ‌రూ పార్టీ వీడొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశార‌ట‌. అధికారంలోఉన్న స‌మ‌యంలో మ‌మ్మ‌ల్ని ప‌ట్టించుకోని మీరు.. ఇప్పుడు బీఆర్ ఎస్‌లోనే ఉండాల‌ని ఎలా అడుగుతార‌ని కొంద‌రు కార్పొరేట‌ర్లు ప్ర‌శ్నించిన‌ట్లు విశ్వసనీయ స‌మాచారం. కేటీఆర్‌ విజ్ఞ‌ప్తి చేసినా కొంద‌రు కార్పొరేట‌ర్లు బీఆర్ ఎస్ ను వీడేందుకే సిద్ధ‌మ‌వుతుండ‌టంతో గ్రేట‌ర్ ప‌రిధిలోని బీఆర్ ఎస్ శ్రేణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. ప‌లువురు ముఖ్య‌ నేత‌లు ఇదే విష‌యాన్ని కేటీఆర్ వ‌ద్ద ప్ర‌స్తావించ‌గా, నేను చెప్పినా వినే ప‌రిస్థితుల్లో కొంద‌రు కార్పొరేట‌ర్లు లేర‌ని, ఇంత‌కంటే నేనేం చేయాలంటూ  చేతులెత్తేశార‌ని గ్రేట‌ర్ బీఆర్ ఎస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.  సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత బీఆర్ ఎస్ ప‌దేళ్ల పాల‌న‌లో జ‌రిగిన అవినీతిపై యుద్ధం ప్ర‌క‌టించారు. ప్రాజెక్టులు, వివిధ శాఖ‌ల్లో అవినీతి, ఇత‌ర విభాగాల్లో అవినీతి అక్ర‌మాల‌ను వెలుగులోకి తెస్తున్నారు. దీనికితోడు అవినీతికి పాల్ప‌డిన నేత‌లు, అధికారుల‌పై చ‌ర్య‌లకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు అధికారుల‌పై రేవంత్ రెడ్డి వేటు వేశారు. మ‌రికొంద‌రు అధికారుల అవినీతిపై విచార‌ణ జ‌రుపుతున్నారు. ముఖ్యంగా కాళేశ్వ‌రం ప్రాజెక్టుతో పాటు ఇత‌ర ప్రాజెక్టుల విష‌యంలో రేవంత్ రెడ్డి బీఆర్ ఎస్ పార్టీని ఏకిపారేస్తున్నారు. రేవంత్ దూకుడుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీఆర్ ఎస్ అధిష్టానానికి ప్ర‌స్తుతం గ్రేట‌ర్ ప‌రిధిలో ప‌లువురు ఎమ్మెల్యేలు, కార్పొరేట‌ర్లు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుండ‌టం పెద్ద త‌ల‌నొప్పిగా మారింది.

లోకేష్ రెడ్ బుక్‌.. వాళ్లందరూ వణికిపోతున్నారు!

తెలుగుదేశం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ చేతిలో రెడ్ బుక్ ఉంటుంది. ఏపీ రాజ‌కీయాల్లో అవ‌గాహ‌న ఉన్న ఎవ‌రికైనా ఈ రెడ్ బుక్ లోకేష్  వ‌ద్ద ఎందుకుందో తెలిసే ఉంటుంది. ఈ రెడ్ బుక్ ను చూస్తే ప‌సుపు ద‌ళంలో ఏదో తెలియని కొ్త్త ఉత్సాహం ఉరకలెత్తుతుంటే,  కొంద‌రు అధికారులు, పోలీస్ వ‌ర్గాల్లో మాత్రం వ‌ణుకు పుడుతోంది. గ‌త ఏడాది కాలంగా ఈ రెడ్ బుక్ ను ఉప‌యోగిస్తున్న లోకేష్,    తాజాగా ఈ రెడ్ బుక్ గురించి   మ‌రోసారి కీల‌కంగా ప్ర‌స్తావించారు. దీంతో ఇంత‌కీ ఆ రెడ్ బుక్ లో ఎవ‌రెవ‌రి పేర్లున్నాయ‌న్న విష‌యంపై ఏపీ అధికార వ‌ర్గాల్లో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతున్నది. ప‌లువురు అధికారులు ఓ అడుగు ముందుకేసి లోకేష్ కు ద‌గ్గ‌ర‌గా ఉండే నేత‌ల వ‌ద్ద ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తున్నారు‌. ఐదారు నెల‌ల క్రితం వ‌ర‌కు లోకేష్  రెడ్ బుక్ గురించి లైట్ తీసుకున్న అధికారులు సైతం ప్ర‌స్తుతం రెడ్ బుక్ పేరెత్త‌గానే వ‌ణికిపోతున్నారు. ఇంత‌కీ వారిలో అంత‌భ‌యం ఎందుకు పుట్టుకొచ్చింద‌నే విష‌యం  ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయ్యింది.  ఏపీలో జ‌గ‌న్ స‌ర్కార్ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి తెలుగుదేశం నేత‌ల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించ‌డం పోలీసుల‌కు అల‌వాటుగా మారిపోయింది. జ‌గ‌న్ తీసుకుంటున్న ప్ర‌జావ్య‌తిరేక నిర్ణ‌యాల‌పై ప్ర‌శ్నించినా పోలీసుల‌తో కొట్టించ‌డం, అక్ర‌మ కేసులు పెట్టి స్టేష‌న్ కు తీసుకెళ్ల‌డం ఏపీలో నిత్య‌కృత్యంగా మారింది. కొంద‌రు పోలీసులైతే ఏకంగా వైసీపీ నేత‌లుగా మారిపోయిన ప‌రిస్థితి. దీంతోతెలుగుదేశం శ్రేణుల్లో సైతం ఆందోళ‌న మొద‌లైంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై ప్ర‌శ్నించేందుకు భ‌య‌ప‌డే ప‌రిస్థితి ఏర్ప‌డింది. నియోజ‌క‌వ‌ర్గం, ఎమ్మెల్యే స్థాయి నేత‌లపై సైతం పోలీసులు జులం ప్ర‌ద‌ర్శించారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల స‌మ‌యంలో కొన్ని ప్రాంతాల్లో పోలీసులు ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించ‌డంతోతెలుగుదేశం అభ్య‌ర్థులు నామినేష‌న్లు సైతం వేయ‌లేక పోయారు. ఒక్క తెలుగుదేశం అనే కాదు.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప్ర‌జావ్య‌తిరేఖ విధానాల‌పై ఎవ‌రు ప్ర‌శ్నించినా అక్ర‌మ కేసుల‌తో స్టేష‌న్ ల‌కు త‌ర‌లించ‌డ‌మే   కొంద‌రు పోలీసు అధికారుల‌కు డ్యూటీగా మారిపోయింది.  ప్ర‌భుత్వ అక్ర‌మ కేసుల‌కు బాధితులుగా మారుతున్న తెలుగుదేశం శ్రేణుల ప‌క్షాన నారా లోకేశ్ పోరాటం సాగిస్తున్నారు. పార్టీ  శ్రేణుల్లో ధైర్యాన్ని నింపే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో మ‌రింత రెచ్చిపోయిన అధికారుల పేర్ల‌ను నోట్ చేసుకునేందుకు ఓ రెడ్ బుక్ ను లోకేశ్ ఏర్పాటు చేసుకున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల వారిగా టీడీపీ నేత‌ల ప‌ట్ల అనుచితంగా ప్ర‌వ‌ర్తిస్తున్న పోలీసులు, పోలీస్ అధికారుల పేర్ల‌తో పాటు, ప‌లు శాఖల అధికారుల పేర్ల‌ను రెడ్ బుక్ లో లోకేష్  న‌మోదు చేస్తున్న‌ట్లు తెలుగుదుశం వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. వ‌చ్చేది తెలుగుదేశం ప్ర‌భుత్వ‌మేన‌ని, అధికారంలోకి వ‌చ్చాక వీరంద‌రి అంతు చూస్తామ‌ని లోకేశ్ హెచ్చ‌రిస్తూ వ‌స్తున్నారు. లోకేశ్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో లోకేశ్ ప‌దేప‌దే ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించారు. అయితే, చంద్రబాబు కేసుల్లో దర్యాప్తు అధికారులను రెడ్ బుక్ పేరుతో లోకేష్  బెదిరిస్తున్నారని ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ మెమో సైతం దాఖలు చేసిన సంద‌ర్భాలున్నాయి. లోకేశ్ రెడ్ బుక్ అన‌గానే ఇన్నాళ్లు లైట్ గా తీసుకున్న అధికారులు.. ప్ర‌స్తుతం వ‌ణిపోతున్నారు‌. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఉంది. త్వరలో అసెంబ్లీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రానుంది. రాబోయే ఎన్నిక‌ల్లో వైసీపీ ఓట‌మి ఖాయ‌మ‌న్న భావ‌న‌కు అంద‌రూ వ‌చ్చేశారు. జ‌గ‌న్ త‌న హ‌యాంలో ఎలాంటి అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌క‌పోవ‌డంతో పాటు, అధికారులు, పోలీసుల‌ను అడ్డుపెట్టుకొని ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై క‌క్ష‌పూరిత విధానాల‌కు పాల్ప‌డడంతో సమాజంలోని ఏ వ‌ర్గానికీ జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో న్యాయం జ‌ర‌గ‌లేద‌న్న భావ‌న‌కు ఏపీ ప్ర‌జ‌లు వ‌చ్చేశారు. దీనికి తోడు ఈ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీలు కూట‌మిగా పోటీ చేస్తున్నాయి. ఈ కూట‌మి విజ‌యం ఖాయ‌మ‌న్న భావ‌న అధికార వ‌ర్గాల్లోనూ ఏర్ప‌డింది. దీంతో ఇన్నాళ్లు వైసీపీ నేత‌ల మాట‌లు విని టీడీపీ నేత‌ల‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురిచేసిన అధికారులు, పోలీసుల్లో ప్ర‌స్తుతం వ‌ణుకు ప‌డుతున్నది‌. తాజాగా శంఖారావం యాత్ర‌లో నారా లోకేశ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రెడ్ బుక్ ను చూపిస్తూ టీడీపీ శ్రేణుల‌ను ఇబ్బంది పెట్టిన ఎవ‌రినీ వ‌ద‌లం.. వడ్డీతో సహా చెల్లిస్తాం. జ్యూడీషియల్ ఎంక్వైరీ వేసి సర్వీస్ నుండి డిస్మిస్ చేస్తాం అని లోకేష్  హెచ్చరించారు. దీంతో ఇన్నాళ్లూ తెలుగుదేశం శ్రేణుల‌పై క‌క్ష‌ పూరితంగా వ్య‌వ‌హ‌రించిన అధికారుల్లో వ‌ణుకు మొద‌లైంది. కొంద‌రు ఓ అడుగు ముందుకేసి లోకేష్ కు ద‌గ్గ‌రి వ్య‌క్తుల‌ను సంప్ర‌దించి ఎర్ర‌బుక్ లో ఎవ‌రెవ‌రి పేర్లు ఉన్నాయ‌న్న విష‌యంపై ఆరా తీస్తున్నారని పార్టీ వర్గాల ద్వారానే తెలుస్తోంది..

ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణాలు? మోడీ విందుకు రామ్మోహన్ నాయుడు!

ఎన్నికల నగారా ఇంకా మోగలేదు.. కానీ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు మాత్రం వేగంగా మారిపోతున్నాయి. తాజాగా ఢిల్లీ వేదికగా చోటు చేసుకొంటున్న వరుస పరిణామాలను నిశీతంగా పరిశీలిస్తే మాత్రం ఈ విషయం క్లియర్ కట్‌గా అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. శుక్రవారం  (ఫిబ్రవరి 9) ప్రధాని మోదీ 8 మంది ఎంపీలతో కలిసి పార్లమెంట్ క్యాంటీన్‌లో భోజనం చేశారు. వారిలో టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. అదీకూడా ముందుగా సమాచారం లేకుండా.. అప్పటికప్పుడు ఎనిమిది మంది ఎంపీలకు ప్రధాని కార్యాలయం ఫోన్ చేసి.. ప్రధాని మోదీ మీతో విందు చేసేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పడంతో.. వారంతా హుటాహుటిన పార్లమెంట్ క్యాంటన్ వైపు పరుగులు తీశారు.  ఆ మరునాడే శనివారం (ఫిబ్రవరి 10) న్యూఢిల్లీలో ఓ సదస్సులో కేంద్ర హోం  మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, ఏపీలో పొత్తులు త్వరలోనే కొలిక్కి వస్తాయని.. అయితే ఆ పొత్తులపై ఇప్పుడేమి మాట్లాడలేమని చెప్పారు. అలాగే త్వరలోనే ఎన్డీయేలోకి కొత్త మిత్రులు వస్తున్నారంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే తమ మిత్రులను తామంతట తాముగా ఎప్పుడూ బయటకు  పంపలేదనీ,  ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాలు, పరిస్థితులు, అవసరాలను దృష్టిలో ఉంచుకొని బయటకు వెళ్లి ఉండవచ్చని అమిత్ షా చెప్పారు. అయితే రాష్ట్రీయ లోక్‌దళ్, శిరోమణి అకాలీదళ్ వంటి ప్రాంతీయ పార్టీలు ఎన్డీయేలో చేరతాయా? అనే ప్రశ్నకు మేము ఫ్యామిలీ ప్లానింగ్ నమ్ముతాం కానీ.. రాజకీయాల్లో మాత్రం కాదని ఆయన తనదైన శైలిలో స్పష్టం చేశారు.  ఇక ఇటీవల తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఏపీలో ఎన్నికల వేళ .. పొత్తులపై ఢిల్లీ వెళ్లి.. కేంద్ర మంత్రి అమిత్ షాతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో  చర్చించారు. ఆ వెంటనే.. వైసీపీ అధ్యక్షుడు, సీఎం  జగన్.. ఆగమేఘాల మీద ఢిల్లీ వెళ్లి.. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైయ్యారు.  ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ... ఏపీలో రాజకీయం మార్పులు చేర్పులకు గురవుతుందనేది సుస్పష్టమని.. అలాంటి వేళ చంద్రబాబు ఢిల్లీ వెళ్లడం... ఆ వెంటనే సీఎం జగన్ కూడా అదే బాట పట్టడం.. మరోవైపు ఏనిమిది మంది ఎంపీలకు ప్రధాని మోడీ విందు ఇవ్వడం, అందులో శ్రీకాకుళం ఎంపీ కె. రామ్మోహన్ నాయుడు ఉండడం.. ఆ మరునాడే కేంద్ర మంత్రి అమిత్ షా.. ఏపీలో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే.. ఎన్నికల వేళ.. ఏపీలో రాజకీయ సమీకరణాలు కీలకంగా మారతాయని.. అలాగే అవి ప్రజలనే కాదు.. విజయాన్ని సైతం ప్రభావితం చేసేందుకు దోహదపడతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అదీకాక తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 42 మంది లోక్ సభ సభ్యులు ఉంటే... వారిలో కె. రామ్మోహన్ నాయుడిని మాత్రమే ప్రధాని మోదీ విందుకు ఆహ్వానించడం పట్ల పోలిటికల్ సర్కిల్‌లో సైతం ఓ విధమైన చర్చకు తెర తీసింది. 

బీఆర్ ఎస్ హ‌యాంలో అవినీతిపై రేవంత్ వార్.. బ‌ట‌య‌కొస్తున్న లొసుగులు

గులాబీ బాస్ కేసీఆర్ ఊహించ‌ని ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జాతీయ స్థాయిలో పార్టీని విస్త‌రించాల‌ని టీఆర్ ఎస్ పేరును కాస్తా బీఆర్ ఎస్‌గా మార్చేసిన కేసీఆర్‌కు తెలంగాణ ఓట‌ర్లు గ‌ట్టి షాకిచ్చి అధికారాన్ని దూరం చేశారు. ప్ర‌స్తుతం అటు కేంద్రంలో చ‌క్రం తిప్పుడేమో కానీ, రాష్ట్రంలో త‌న వ‌ర్గీయుల‌ను కాపాడుకొనేందుకు ప‌డ‌రానిపాట్లు ప‌డాల్సి ప‌రిస్థితి ఏర్ప‌డింది. బీఆర్ ఎస్ హ‌యాంలో కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో ప‌లు ప్రాజెక్టుల నిర్మాణాలు జ‌రిగాయి. వాటిలో ముఖ్య‌మైంది కాళేశ్వ‌రం ప్రాజెక్టు. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జ‌రిగింద‌ని గ‌తంలో ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్  నేత‌లు గొంతు చించుకున్నారు. కానీ, కేసీఆర్ అధికారంలో ఉండటంతో కాంగ్రెస్ నేత‌లవి కేవ‌లం ఆరోప‌ణ‌లు మాత్ర‌మేన‌ని కొట్టి పారేశారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం, సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో గ‌త ప్ర‌భుత్వం హ‌యాంలో ప్రాజెక్టుల నిర్మాణాల్లో జ‌రిగిన అవినీతిపై గురి పెట్టారు. ముఖ్యంగా కాళేశ్వ‌రం ప్రాజెక్టులో జ‌రిగిన అవినీతిని తేల్చేందుకు జ్యూడీషియ‌ల్‌, విజిలెన్స్ విచార‌ణ‌కు ఆదేశించారు.  అసెంబ్లీ స‌మావేశాల్లో ఇరిగేష‌న్ డిపార్ట్మెంట్ పై ప్ర‌భుత్వం శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మైంది. సోమ‌వారం అసెంబ్లీలో ప్ర‌భుత్వం శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయ‌నుంది. ఈ సంద‌ర్భంగా ప్రాజెక్టుల నిర్మాణాల్లో గ‌త ప్ర‌భుత్వం హ‌యాంలో చోటు చేసుకున్న అవినీతి, అక్ర‌మాల‌పై స‌భ‌లో చ‌ర్చించ‌నున్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టుతో పాటు, పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్ల‌క్ష్యంపై అధికార ప‌క్షం అసెంబ్లీ వేదిక‌గా బీఆర్ ఎస్ ను టార్గెట్ చేసేందుకు సిద్ధ‌మైంది. ఇదిలా ఉంటే.. మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ చందంగా సీఎం రేవంత్ రెడ్డి మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఈనెల 13న మేడిగ‌డ్డ ప‌ర్య‌ట‌న‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. ఈ మేర‌కు అసెంబ్లీ వేదిక‌గా రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. 119 మంది ఎమ్మెల్యేల‌తో పాటు శాస‌న మండ‌లి స‌భ్యుల‌ను సైతం 13న ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక బ‌స్సులను ఏర్పాటు చేసి ప్రాజెక్టు సంద‌ర్శ‌న‌కు తీసుకెళ్తామ‌ని రేవంత్ చెప్పారు. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కూడా సంద‌ర్శ‌న‌కు రావాల‌ని, ఈ మేర‌కు కేసీఆర్ ను ఆహ్వానించాల‌ని ఇరిగేష‌న్ శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి రేవంత్ సూచించారు.  దీంతో, బీఆర్ ఎస్ హ‌యాంలో ప్రాజెక్టుల్లో జ‌రిగిన అవినీతిని ఎమ్మెల్యేలంద‌రి స‌మ‌క్షంలో ప్ర‌జ‌ల‌కు వివ‌రించేలా చేసేలా రేవంత్ ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది.   తాజా ప‌రిణామాల‌పై బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించారు.. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో ఒక మేడిగ‌డ్డ మాత్ర‌మే కుంగింద‌ని, దాన్ని భూత‌ద్దంలో పెట్టి చూపిస్తున్నార‌ని అన్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌ది.. చూడాల‌నీ అనుకుంటే కాంగ్రెస్ నేత‌లు వెళ్లి చూడొచ్చ‌ని కేటీఆర్ అన్నారు. త‌ద్వారా, ప్రాజెక్టు సంద‌ర్శ‌న‌కు ప్ర‌భుత్వం ఆహ్వానాన్ని బీఆర్ ఎస్ తిర‌స్క‌రించిన‌ట్లేన‌ని చెప్ప‌క‌నే చెప్పారు. అంతే కాక‌, ప్రాజెక్టులో చిన్న చిన్న లోపాలు ఉంటే ఎత్తిచూపాల‌ని, అంతే కానీ దాన్ని రాజ‌కీయం కోసం వాడుకుంటున్నార‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఉద్దేశిస్తూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి చూస్తే.. కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా లొసుగులు ఉన్నాయ‌ని, అవినీతి జ‌రిగింద‌ని ఒప్పుకున్న‌ట్లేన‌ని కాంగ్రెస్ నేత‌లు పేర్కొంటున్నారు. ఇప్ప‌టికే ప్రాజెక్టుల్లో అవినీతిని వెలికితీస్తూ బీఆర్ ఎస్ నేత‌ల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తున్న రేవంత్‌.. తాజాగా మ‌రో బాంబు పేల్చారు.  సెక్ర‌టేరియ‌ట్‌, అమ‌ర‌వీరుల స్థూపం, అంబేద్క‌ర్ విగ్రహం నిర్మాణంలో అవినీతిపై విచార‌ణ జ‌రిపిస్తామ‌ని సీఎం రేవంత్ అన్నారు. మొత్తానికి, బీఆర్ ఎస్ హ‌యాంలో జ‌రిగిన ప్రాజెక్టులు, ఇత‌ర నిర్మాణాల‌పై అవినీతి జ‌రిగింద‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన ప్ర‌భుత్వం.. వాటిపైన విచార‌ణ జ‌రిపేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో బీఆర్ ఎస్ శ్రేణుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్నది. మ‌రోవైపు అసెంబ్లీ స‌మావేశాల‌కు కేసీఆర్ హాజ‌రుకాక‌పోవ‌టంకూడా బీఆర్ ఎస్ శ్రేణుల‌ను క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం పేర్కొంటున్న‌ట్లు బీఆర్ ఎస్ హ‌యాంలో అతిపెద్ద స్థాయిలో అవినీతి జ‌రిగిందా? ఒక‌వేళ అదే జ‌రిగితే అధికార పార్టీ నేత‌ల‌ను ఎదుర్కోవ‌టం ఎలాఅనే ఆందోళ‌న‌లో బీఆర్ ఎస్ ముఖ్య‌నేత‌ల నుంచి ద్వితీయ శ్రేణి నేత‌ల వ‌ర‌కు ఉన్నారు‌. ప్రాజెక్టుల‌పై అవినీతిని రేవంత్ స‌ర్కార్ ప్ర‌స్తావిస్తుంటే.. కౌంట‌ర్‌గా.. కేసీఆర్ మాత్రం  కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి రేవంత్ ప్ర‌భుత్వం అప్పగించి తెలంగాణ‌కు తీవ్ర అన్యాయం చేస్తున్నద‌ని ప్ర‌జ‌ల్లో బ‌లంగా తీసుకెళ్లేలా ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు కనిపిస్తోంది. ఈ మేర‌కు న‌ల్గొండ జిల్లాలో 13న బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేశారు. ఈ బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ ఏం మాట్లాడుతారు?  రేవంత్ ప్ర‌భుత్వం కాళేశ్వ‌రం ప్రాజెక్టుల‌పై చేస్తున్న వాద‌న‌ల‌కు ఏవిధంగా స‌మాధానం చెబుతార‌నే అంశం తెలంగాణ ప్ర‌జ‌ల్లో ఆస‌క్తినిరేపుతోంది.

జగన్ గెలుపుపై కేసీఆర్ కూ నమ్మకం లేదా?

ఏపీ సీఎం జగన్ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి అవుతారన్న నమ్మకం అందరిలోనూ కనుమరుగౌతోంది. ప్రజలు, ప్రతిపక్షాలు, ఆఖరికి సొంత పార్టీ క్యాడర్ కూడా జగన్ ఓటమి ఖాయమన్న నిర్ణయానికి వచ్చేసినట్లు కనిపిస్తోంది. చివరాఖరికి జగన్ కు అత్యంత విశ్వసనీయ రాజకీయ మిత్రుడిగా గుర్తింపు పొందిన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జగన్ లో నమ్మకం కోల్పోయారు. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ విజయానికి దోహదపడేందుకు సాగర్ జలాల వివాదాన్ని అసందర్భంగా తెరమీదకు తీసుకువచ్చి నవ్వుల పాలయ్యారన్న కనీస అభిమానం కూడా కేఃసీఆర్ కు ఇప్పుడు జగన్ మీద లేకుండా పోయింది. 2019 ఎన్నికలలో జగన్ పార్టీకి విజయం దక్కడం కోసం కేసీఆర్ చేసిన సహాయానికి కృతజ్ణతగా కేసీఆర్ మడిచి మూలన పడేసిన తెలంగాణ సెంటిమెంటును బయటకు తీసి రగిల్చేందుకు ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగన్ తనకు చేతనైనంత చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలై.. ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది.  ఆ తరువాత కూడా జగన్ కేసీఆర్ పట్ల తన అభిమానాన్ని ఇసుమంతైనా దాచుకోలేదు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో జారిపడి యశోదా ఆస్పత్రిలో తుంటి ఎముకకు శస్త్ర చికిత్స చేయించుకుని చికిత్స పొందుతున్న సమయంలో హైదరాబాద్ వెళ్లి ఆయనను పరామర్శించి వచ్చారు జగన్. కేసీఆర్ ను పరామర్శించేందుకు సమయం చిక్కిన జగన్ కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి అభినందనలు తెలియజేయడానికి కానీ, కనీసం సామాజిక మాధ్యమం ద్వారానైనా విషెస్ చెప్పడానికి కానీ సమయం చిక్కలేదు. మనసు రాలేదు. జగన్, కేసీఆర్ మధ్య రాజకీయ స్నేహం అంత చిక్కటిది మరి. అయితే ఇప్పుడు కేసీఆర్ కు ఏపీలో జగన్ పార్టీ విజయం సాధించి మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంటుందన్న నమ్మకం పూర్తిగా పోయినట్లైంది.  అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలలో జగన్ ను విశ్వాసం లోకి తీసుకోలేదు. రేవంత్ ను ఇబ్బంది పెట్టడానికి కేసీఆర్ ప్రయత్నాలకూ జగన్ ను విశ్వాసంలోకి తీసుకోకపోవడానికీ సంబంధం ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం. రేవంత్ పై ఉన్న ఓటుకు నోటు కేసు విషయంలో రేవంత్ ను ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో ఈ కేసు దర్యాప్తును తెలంగాణ నుంచి బదిలీ చేయాలంటూ కేసీఆర్ కు అత్యంత నమ్మకస్తుడైన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన కేసును సాటి తెలుగు రాష్ట్రమైన ఏపీకి కానీ, పొరుగున ఉన్నకర్నాటకకు కానీ బదిలీ చేయాలని కోరలేదు. ఎందుకంటే కర్నాటకలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఉంది. ఇక ఏపీలో వచ్చే ఎన్నికలలో జగన్ మరో సారి అధికారంలోకి వస్తారన్న నమ్మకం కేసీఆర్ లో లేదు. అందుకే ఈ కేసును కాంగ్రెస్సేతర సర్కార్ కొలువుదీరి ఉన్న మహారాష్ట్ర కు బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్ వేశారు. వాస్తవానికి ఏపీలో మరోసారి జగన్ సర్కారే అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఏ మూలనైనా కేసీఆర్ లో ఉండి ఉంటే.. రేవంత్ ను ఇరుకున పెట్టడానికి కేసును ఏపీకి బదిలీ చేయాలనే జగదీశ్ రెడ్డి సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్ లో కోరి ఉండేవారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఉండటం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఆయన ఈ కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలున్నాయంటూ జగదీశ్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు.  మామూలుగా ఏపీలో జగన్ కు విజయావకాశాలు లేశమాత్రమైనా ఉండి ఉంటే రేవంత్ రెడ్డిపై ఉన్న ఓటుకు నోటు కేసును ఏపీకి బదిలీ చేయమనే జగదీశ్ రెడ్డి కోరి ఉండేవారనీ, ఆ నమ్మకం లేకపోవడం వల్లే కేసు దర్యాప్తును మహారాష్ట్రకు మార్చాలని కోరారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   జగదీశ్ రెడ్డి పిటిషన్ పై జస్టిస్ బీఆర్ గవాయ్,జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది.

బిజెపి గుప్పిట్లో జగనన్న: షర్మిల 

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత తన అన్న, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై దూకుడు పెంచారు ఎపిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. గత ఎన్నికలలో తన పాదయాత్ర ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుపుకు దోహదపడ్డ  షర్మిల ఈ  ఎన్నికల ప్రచారంలో దూసుకుకెళుతున్నారు.  ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఇవ్వాళ  అల్లూరి జిల్లా చింతపల్లిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సభలో ఆమె ప్రసంగిస్తూ, సీఎం జగన్ పై ధ్వజమెత్తారు.  నాడు జగనన్న సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారని, మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతానన్నారని ప్రస్తావించారు. రాష్ట్రంలో ఇప్పుడు మద్యపాన నిషేధం జరిగిందా? అని షర్మిల ప్రశ్నించారు. ఇప్పుడు ప్రభుత్వమే మద్యం అమ్ముతోందని ఎత్తిపొడిచారు.  జగనన్న బీజేపీ గుప్పిట్లో చిక్కుకున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు... మరి జగనన్న ప్రత్యేక హోదాపై పోరాటం చేశారా? అని షర్మిల ప్రశ్నించారు. పులి, సింహం అని చెప్పుకునే మీరు బీజేపీ ముందు పిల్లిలా మారారని ధ్వజమెత్తారు.  నాడు అల్లూరి సీతారామరాజు తెల్లదొరలను ఎలా తరిమికొట్టారో, రాష్ట్రంలో నియంత పాలకులను కూడా అలాగే తరిమికొట్టాలని అన్నారు. ప్రజల పక్షాన నిలబడని పాలక పక్షం, ప్రజలకు  మద్దతుగా నిలవని ప్రతిపక్షం మనకు వద్దు అని పిలుపునిచ్చారు.

బడ్జెట్ ప్రసంగానికీ గైర్హాజర్.. ఇక కేసీఆర్ పొలిటికల్ గా ఇనేక్టివ్ అయినట్లేనా?

అనుమానాలే నిజమయ్యాయి. బీఆర్ఎస్ నాయకులు, మరీ ముఖ్యంగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎంత నమ్మకంగా చెప్పినా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనీసం బడ్జెట్ రోజున కూడా అసెంబ్లీకి హాజరు కాలేదు. ఆయన ముఖ్యమంత్రిగా, సభానాయకుడిగా ఉన్న సభలో విపక్ష నేతగా కూర్చునేందుకు ఇష్టపడటం లేదని ఆయన అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టడంతో ఇక ఎలాంటి సందేహాలకూ తావులేకుండా రుజువైపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత తొలి సారిగా జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కాకపోవడానికీ, అసెంబ్లీలోనే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకపోవడానికీ ఆయన గాయపడి ఇంటి వద్ద చికిత్స పొందుతుండటం కారణమని బీఆర్ఎస్ అప్పట్లో సమర్ధించుకుంది. అది నిజమే కూడా. కానీ బడ్జెట్ సమావేశాలకు కూడా ఆయన గైర్హాజర్ కావడం మాత్రం కేసీఆర్ విపక్షనేతగా అసెంబ్లీలో అడుగు పెట్టడానికి సుముఖంగా లేరనే భావించాల్సి వస్తోంది. నిన్నటి వరకూ బీఆర్ఎస్ వర్గాలు కేసీఆర్  విపక్ష నాయకుని హోదాలో తొలిసారిగా శనివారం అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెప్పాయి. అయితే ఆయన శనివారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో కూడా సభకు హాజరు కాలేదు.  బడ్జెట్ ప్రసంగానికి   ఆయన దూరంగా ఉన్నారు. బడ్జెట్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ, శాసన మండలి సోమవారానికి వాయిదా పడ్డాయి.  సోమవారం సభలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ జరగనుంది. ఆ రోజునైనా కేసీఆర్ సభకు హాజరౌతారా అన్న విషయంపై స్పష్టత లేదు.    అసలు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత ఆయన ఇంత వరకూ ప్రజల ముందుకు వచ్చి మాట్లాడింది లేదు. కనీసం మీడియా ముఖంగానైనా ఓటమిని అంగీకరించి, కొత్త ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపింది లేదు. అసలు బీఆర్ఎస్ పరాజయం తరువాత ఆయన ఎవరికీ మఖం చూపకుండా రాత్రికి రాత్రి ప్రగతి భవన్ ఖాళీ చేసి ఫామ్ హౌస్ కు వెళ్లడమే ఆయన ఓటమిని జీర్ణించుకోలేక ముఖం చాటేశారన్న విమర్శలకు అవకాశం ఇచ్చింది. అప్పట్లోనే ఆయన ఇక రాజకీయాలకు దూరంగా ఉంటారన్న చర్చ కూడా పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఆ తరువా బీఆర్ఎస్ఎల్పీ నాయకుడి ఎన్నిక విషయంలో పార్టీలో తీవ్ర విభేదాలు తలెత్తడం, గెలుపొందిన ఎమ్మెల్యేలలోనే స్పష్టమైన చీలిక వచ్చే పరిస్థితి ఏర్పడటంతో అనివార్యంగా ఆయన బీఆర్ఎస్ఎల్పీ నాయకత్వ బాధ్యతలు చేపట్టారని పార్టీ వర్గాలే అంటున్నాయి. కేసీఆర్ కాకుంటే బీఆర్ఎస్ఎల్పీ నేత ఎన్నిక ఏకగ్రీవమయ్యే పరిస్థితి లేకపోవడంతోనే ఆయన అయిష్టంగానే ఆ పదవిని చేపట్టారని అంటున్నారు. అయితే తాను సభా నాయకుడిగా చక్రం తిప్పిన సభలో విపక్ష నేతగా కూర్చునేందుకు కేసీఆర్ వెనుకాడుతున్నారా అన్న చర్చ అయితే పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్నది. కేసీఆర్ ఇదే ఒరవడి కొనసాగిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీఆర్ఎస్ భారీగా నష్టపోక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి గైర్హాజర్ కావడంపై అధికార కాంగ్రెస్ మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య వాదులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఓటమి తరువాత ఇంత వరకూ ప్రజలకు ముఖం చూపని కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొట్టి, వచ్చే సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ప్రజల ముందుకు ఏ విధంగా రాగలుగుతారని ప్రశ్నిస్తున్నారు.  

పెంపుడు కుక్కకు తులాభారం.. మేడారంలో చిత్రం విచిత్రం

కొత్త ఒక వింత పాత ఒక రోత అనే సామెత ఇక్కడ మరో సారి గుర్తు చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం మేడారంలో జరిగిన  ఈ వింత పలువురిని ఆకర్షించింది. మనుషుల ఆరోగ్యం కుదుటపడితే మొక్కులు చెల్లించుకునే పద్దతి చూశాం. కానీ పెంపుడుకుక్క అనారోగ్యపాలైతే తమ మొక్కు తీర్చుకోవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.  మేడారంలో రెండేళ్లకు ఒకసారి కొలువుదీరే వనదేవతలకు భక్తులు బంగారం (బెల్లం) తో మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ.. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసమో, కష్టాలు తొలగాలనో కోరుకుంటూ భక్తులు మొక్కుకుంటారు. మేడారం జాతరలో ఆ మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది.  హనుమకొండకు చెందిన బిక్షపతి, జ్యోతి దంపతులు మాత్రం తమ పెంపుడు కుక్క ఆరోగ్యం కోసం మొక్కుకున్నారు. జాతర సందర్భంగా ఆ మొక్కు తీర్చుకున్నారు. పెంపుడు కుక్కకు తులాభారం వేసి అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. ఈ తులాభారం ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.బిక్షపతి, జ్యోతి దంపతులు ప్రేమగా పెంచుకుంటున్న కుక్క ‘లియో’ గతేడాది అనారోగ్యం పాలైంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తిండి కూడా మానేసింది. వైద్యులకు చూపించినా ఫలితం కనిపించలేదు. దీంతో ఆ కుటుంబం సమ్మక్క సారలమ్మకు మొక్కుకుంది. లియో ఆరోగ్యం కుదుటపడితే వచ్చే జాతరలో నిలువెత్తు బంగారం సమర్పించుకుంటామని మొక్కుకున్నట్లు జ్యోతి చెప్పారు. ఆ తర్వాత రెండు రోజులకు లియో ఆరోగ్యం కుదుటపడిందని, లేచి తిరగడం మొదలు పెట్టిందని వివరించారు. దీంతో ఈ జాతర సందర్భంగా మొక్కు చెల్లించుకున్నట్లు తెలిపారు.

శాఖల వారీ కేటాయింపులు ఇలా..!

మల్లు బడ్జెట్ లో వివిధ శాఖల కేటాయింపులు ఇలా ఉన్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.40,080 కోట్లు   కేటాయించారు. అలాగే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీకి కార్యాచరణ వ్యవసాయ శాఖకు 19,746 కోట్లు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కు రూ.1,000 కోట్లు రైతులకు ఎకరాకు రూ.15,000 రైతు భరోసా: డిప్యూటీ సీఎం భట్టి కౌలు రైతులకు రైతు భరోసా సాయంపై మార్గదర్శకాలు 6 గ్యారెంటీల అమలుకు రూ.53,196 కోట్లు కేటాయింపు పరిశ్రమల శాఖకు రూ.2,543 కోట్లు ఐటీ శాఖకు రూ.774 కోట్లు పురపాలక శాఖ రూ.11,692 కోట్లు  ఎస్సీ, ఎస్టీ గురుకుల భవనాల కోసం రూ.1250 కోట్లు.  గృహ నిర్మాణానికి రూ.7740 కోట్లు.  నీటి పారుదల శాఖకు రూ.28024 కోట్లు.  బీసీ సంక్షేమానికి ఎనిమిది వేల కోట్లు. స్సీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ.1,000 కోట్లు ఎస్టీ గురుకులాల భవనాల నిర్మాణాలకు రూ.250 కోట్లు బీసీ గురుకులాల స్వంత భవనాల నిర్మాణాలకు రూ.1,546 కోట్లు బీసి సంక్షేమం రూ.8,000 కోట్లు విశ్వవిద్యాలయాలలో మౌలిక సదుపాయాలకు రూ.500 కోట్లు విద్యా రంగం రూ.21,383 కోట్లు విద్యుత్ - గృహ జ్యోతికి రూ.2,418కోట్లు విద్యుత్ సంస్థలకు రూ.16,825 కోట్లు నీటిపారుదల శాఖకు రూ.28,024 కోట్లు గృహ నిర్మాణానికి రూ.7,740 కోట్లు

బడ్జెట్ సమావేశాలకూ కెసీఆర్ డుమ్మా 

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రధాన ప్రతిపక్ష నేత కెసీఆర్ మాత్ర ఈ సమావేశాలకు వచ్చి సలహాలు , సూచనలు ఇస్తారని అధికార  కాంగ్రెస్ పార్టీ అంచనా వేసింది. ఆరునెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని మళ్లీ కెసీఆర్ ముఖ్యమంత్రి కానున్నారని బిఆర్ఎస్ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో  ఆయన బడ్జెట్ సమావేశాలకు హాాజరుకాలేదు.  రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క  శనివారం అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సమావేశాలకు  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు గైర్హాజరు అయ్యారు. ఇటీవల అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ లో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.అదే రోజు తెలంగాణ భవన్ కు వెళ్లి బిఆర్ఎస్ నాయకత్వానికి దిశా నిర్దేశం చేశారు.  దీంతో, ఆయన అసెంబ్లీ సమావేశాలకు వస్తారని అందరూ భావించారు.  అయితే, ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై ప్రసంగానికి కానీ, ఆమె ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్భంగా కానీ సభకు కేసీఆర్ రాలేదు. ఈరోజు బడ్జెట్ సందర్భంగానైనా ఆయన వస్తారని భావించినప్పటికీ... ఆయన రావడం లేదనే సమాచారం అందింది. ఈ నెల 13న నల్గొండలో నిర్వహించనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగసభ ఏర్పాట్లపై కీలక నేతలతో కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. కేసీఆర్ ప్రస్తుతం బంజారాహిల్స్, నంది నగర్ లోని తన నివాసంలోనే ఉన్నారు. శాసనసభ బడ్జెట్‌ సమావేశాల రెండో రోజు కూడా మాజీ సీఎం కేసీఆర్‌ గైర్హాజరయ్యారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం చర్చ జరగ్గా.. బీఆర్‌ఎస్‌ తరఫున కేసీఆర్‌ మాట్లాడతారని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఆయన సభకు హాజరుకాలేదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక తొలి శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు తుంటికి గాయం కారణంగా ఆస్పత్రిలో చేరిన కేసీఆర్‌ సభకు హాజరుకాలేదు. ఇటీవలే ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బడ్జెట్‌ సమావేశాలకు హాజరుకానున్నారని పెద్దఎత్తున బీఆర్‌ఎస్‌ వర్గాలు ప్రచారం చేశాయి. కానీ సమావేశాలు ప్రారంభమైన రెండోరోజు కూడా సభకు రాకుండా ఆయన ముఖం చాటేశారు. తొలిరోజు అమావాస్య కావడంతో హాజరుకాలేదని భావించగా.. మర్నాడు ఇదే పరిస్థితి నెలకొంది. అయితే బడ్జెట్‌ సందర్భంగా శనివారం కేసీఆర్‌ సభకు వచ్చే అవకాశాలున్నాయని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్పాయి. కానీ బడ్జెట్ సమావేశాలకు సైతం మాజీ ముఖ్యమంత్రి , ప్రధాన ప్రతిపక్ష నేత ఎగ్గొట్టడం చర్చనీయాంశమైంది. చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తీసుకొచ్చాననే చెప్పుకునే కెసీఆర్ కీలకమైన బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టడం శోచనీయమని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. 

శాఖల వారీ కేటాయింపులు ఇలా..!

మల్లు బడ్జెట్ లో వివిధ శాఖల కేటాయింపులు ఇలా ఉన్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.40,080 కోట్లు   కేటాయించారు. అలాగే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీకి కార్యాచరణ వ్యవసాయ శాఖకు 19,746 కోట్లు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కు రూ.1,000 కోట్లు రైతులకు ఎకరాకు రూ.15,000 రైతు భరోసా: డిప్యూటీ సీఎం భట్టి కౌలు రైతులకు రైతు భరోసా సాయంపై మార్గదర్శకాలు 6 గ్యారెంటీల అమలుకు రూ.53,196 కోట్లు కేటాయింపు పరిశ్రమల శాఖకు రూ.2,543 కోట్లు ఐటీ శాఖకు రూ.774 కోట్లు పురపాలక శాఖ రూ.11,692 కోట్లు  ఎస్సీ, ఎస్టీ గురుకుల భవనాల కోసం రూ.1250 కోట్లు.  గృహ నిర్మాణానికి రూ.7740 కోట్లు.  నీటి పారుదల శాఖకు రూ.28024 కోట్లు.  బీసీ సంక్షేమానికి ఎనిమిది వేల కోట్లు. 

2.76 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్!

తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ  తన తొలి బడ్జెట్‌ను శనివారం (ఫిబ్రవరి 10) ప్రవేశ పెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా బడ్జెట్ రూపొందించినట్లు తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న భట్టి విక్రమార్క, తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చుందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.  బడ్జెట్‌లో 6 గ్యారంటీల అమలుకు ప్రాధాన్యత అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని, అలాగే . విద్య, వైద్యం, వ్యవసాయ రంగానికి సముచితంగా నిధులు కేటాయించామని వివరించారు.  2,75,891   కోట్లతో తెలంగాణ ఓట్‌ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మల్లు భట్టివిక్రమార్క ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు,  మూలధన వ్యయం రూ.29,669 కోట్లుగా పేర్కొన్నారు.  మల్లు తన బడ్జెట్ ప్రసంగంలో  మార్పును కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించకున్నారన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ రూపొందించామన్నారు. తెలంగాణ త్యాగమూర్తులు ఏ ఆశయాలతో ఆత్మారణ చేశారో వాటిని ఆచరణలోకి తీసుకొస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాతే ప్రజలు ప్రజాస్వామ్యంలో ఉన్న నమ్మకాన్ని పొందారని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. కాగా శాసన మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. 

బంజారాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ జన్మ దినోత్సవం రోజు సెలవుదినం 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలల పూర్తయ్యింది.  గ్యారెంటీ పథకాల అమలుతో బాటు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తోంది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. తాజాగా ఫిబ్రవరి 15వ తేదీన సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే జయంతి నాటికి హైదరాబాద్ లో సేవాలాల్ మహరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. ట్యాంక్ బండ్ పై సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ప్రభుత్వాన్ని కోరగా... కోమటిరెడ్డి ఈ మేరకు స్పందించారు.   సేవాలాల్ మహరాజ్ అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని గొల్లలదొడ్డి సమీపంలోని సేవాగఢ్ లో 1739 ఫిబ్రవరి 15న జన్మించారు. ఆయన జన్మదినాన్ని బంజారాలు పండుగలా చేసుకుంటారు.  ఆయన ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాకుండా గొప్ప సంఘ సంస్కర్త కూడా. 18వ శతాబ్దంలో బంజారాలు బ్రిటీష్, ముస్లిం పాలకుల ప్రభావంతో ఇతర మతాల్లోకి మారకుండా సేవాలాల్ కీలక పాత్ర పోషించారు. బ్రహ్మచారి అయిన సేవాలాల్ తన బోధనలతో బంజారాలను తీవ్రంగా ప్రభావితం చేశారు. ప్రతి సంవత్సరం ఆయన జయంతిని బంజారాలు ఘనంగా జరుపుకుంటారు. ఇప్పుడు ఆయన జయంతిని సెలవు దినంగా ప్రకటించడంపై బంజారాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బంజారాలు ప్రతి ఏడు జరుపుకునే జన్మదినం ఫిబ్రవరి 15 నాడు సెలవు దినంగా ప్రకటించడంతో బంజారాలు కాంగ్రెస్ కు మరింత చేరువవుతారని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. 

జ‌గ‌న్ ఆశ‌లు ఆవిరి.. వైసీపీ నేతలకు సలపని ఊపిరి!

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న చ‌ప్ప‌గా ముగిసింది. జ‌గ‌న్ ప్ర‌ధానితో భేటీ అయ్యార‌న్న ఒక్క సంతోషం త‌ప్పితే ఢిల్లీలో జ‌రిగిన ప‌రిణామాలు ఏఒక్క‌టీ వైసీపీ నేత‌లకు మింగుడు ప‌డ‌టం లేదు. జ‌గ‌న్ అలా వెళ్లారు..ఇలా వ‌చ్చారు అని సోష‌ల్ మీడియాలో సెటైర్లు  పేలుతున్నాయి. ప్ర‌ధానితో జగన్ భేటీ  కేవ‌లం విన‌తి ప‌త్రం అంద‌జేయ‌డానికే మాత్ర‌మే పరిమితమైంది. దాదాపు గంట పాటు ప్ర‌ధానితో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భేటీ సాగిందనీ,  ఈ సందర్భంగా   మోడీ ప‌లు అంశాల‌పై చ‌ర్చించారంటూ ప్ర‌చారం జ‌గ‌న్ అనుకూల మీడియా ఎంతగా బాకాలు ఊదుకున్నా.. వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉందని ఢిల్లీ వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం. ఆ వర్గాల సమాచారం మేరకు. పార్ల‌మెంట్ లోని ప్ర‌ధాని కార్యాల‌యంలో  ప్ర‌ధానిని క‌లిసేందుకు జ‌గ‌న్ వెళ్ల‌గా.. అప్ప‌టికే బీజేపీ పెద్ద‌లు మోడీతో భేటీలో ఉన్నారు‌. దీంతో జ‌గ‌న్ దాదాపు  అర‌గంట‌ సేపు బయటే  వెయిటింగ్ రూంలో ఉండాల్సి వ‌చ్చింది‌. ఆ త‌రువాత జ‌గ‌న్ వెళ్లి మోడీకి రాష్ట్రానికి సంబంధించిన ప‌లు స‌మ‌స్య‌ల‌పై విన‌తి ప‌త్రాలు ఇవ్వ‌డం, ఆ త‌రువాత మోడీతో నామ‌మాత్రంగా రెండుమూడు మాట‌లు మాట్లాడారు. అప్పటికే  స‌మ‌యం మించిపోవ‌టంతో ఇరువురి భేటీ ముగిసింది.   ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ ప‌డింది.  ఎన్నిక‌ల స‌మ‌యం ముంచుకొస్తుండ‌టంతో మ‌రోసారి అధికారం ద‌క్కించుకునేందుకు జ‌గ‌న్ శ‌త‌విధాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే  మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డం అంత ఈజీ కాద‌ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి సైతం ఇప్ప‌టికే బోధ‌ప‌డింది. ఐదేళ్ల పాల‌న‌లో రాష్ట్రంలో ఎక్క‌డా అభివృద్ధి జ‌ర‌గ‌లేదు. అమ‌రావ‌తి రాజ‌ధానిని నిర్వీర్యం చేశారు. ఉపాధి లేక యువ‌త‌, రోజువారి కూలీలు ఇత‌ర రాష్ట్రాల‌కు వ‌ల‌స‌ బాట ప‌ట్టారు. వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో ఏ  వ‌ర్గానికీ మేలు జ‌ర‌గ‌లేదు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ కు ఓటు ద్వారా బుద్ధి చెప్పేందుకు ఏపీ ప్ర‌జ‌లు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మిగా ఏర్ప‌డ‌టం జ‌గ‌న్, వైసీపీ శ్రేణుల్లో ఓట‌మి భ‌యాన్ని క‌లిగించింది. తాజాగా కాంగ్రెస్ ఏపీ అధ్య‌క్షురాలి హోదాలో ష‌ర్మిల ఏపీ రాజ‌కీయాల్లో యాక్టివ్ అయ్యారు. ఆమె తన సొంత అన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తుండ‌టం వైసీపీకి మూలిగేన‌క్క‌పై తాటిపండు ప‌డ్డ చందంగా మారింది.  దీనికి తోడు ఇన్నాళ్లు బీజేపీ మద్దతు ఉందన్న ధీమాతో ఉన్న జగన్ కు  గ‌ట్టి షాక్ త‌గిలింది.తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మితో క‌లిసి ఏపీలో ఎన్నిక‌ల బ‌రిలోకి దిగేందుకు బీజేపీ రెడీ అయిపోయింది. ఇప్ప‌టికే సీట్ల పంప‌కం విష‌యంపై అమిత్ షా, జేపీ న‌డ్డాల‌తో ఢిల్లీలో చంద్ర‌బాబు భేటీ చర్చించారు. తెలుగుదేశం, జ‌న‌సేన‌, బీజేపీ క‌లిసి పోటీలోకి దిగ‌డం దాదాపు ఖాయ‌మైంది.  ఇలాంటి ప‌రిస్థితుల్లో ఢిల్లీకి వెళ్లిన సీఎం జ‌గ‌న్ ప్ర‌ధాని మోడీతో భేటీ అయ్యారు. అస‌లు జ‌గ‌న్ ఢిల్లీకి వెళ్లింది మోడీతో రాజ‌కీయ అంశాల‌పై చ‌ర్చించేందుక‌ని, కానీ మోడీ ఆ అవ‌కాశం  ఇవ్వ‌లేద‌ని వైసీపీ నేత‌లే చెబుతున్నారు. టీడీపీ ఎన్డీయేలోకి చేర‌డం ఖాయ‌మ‌న్న వార్త‌లు రావ‌డంతో.. అలా జ‌ర‌గ‌కుండా అడ్డుకునేందుకే జ‌గ‌న్ ఢిల్లీకి వెళ్లార‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ వ‌చ్చారు. ఆ చ‌నువుతో ఎన్డీయేలో మేం చేరతాం.. తెలుగుదేశం పార్టీని  ప‌క్క‌న పెట్టండ‌ని మోడీని కోరేందుకే జగన్ ఢల్లీ పర్యటన లక్ష్యమని,  అలా కుద‌ర‌ని ప‌క్షంలో ఏపీలో జ‌న‌సేన‌తో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లి.. తెలుగుదేశం పార్టీని  ప‌క్క‌న పెట్టాల‌ని మోడీని కోరాలని జగన్ భావించారని చెబుతున్నారు. అదే జరిగితే   వైసీపీ మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని, తాము అధికారంలోకి వ‌స్తే ఎలాగూ బీజేపీ వెంటే  ఉంటామ‌ని జ‌గ‌న్ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి వివ‌రించాల‌ని భావించారనీ అయితే మోడీ అందుకు ఇసుమంతైనా అవకాశం ఇవ్వలేదని చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం ఓడిపోతే.. ఆ పార్టీ ఓటు బ్యాంకు బీజేపీ వైపు మ‌ళ్లుతుంద‌ని, త‌ద్వారా ఏపీలో బీజేపీ బ‌ల‌ప‌డుతుందనీ మోడీకి వివరించి ఆయన మొప్పు, మద్దతు పొందాలన్న ఆశతో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన జగన్ కు ఆ ఆశ ఆవిరైపోయిందని వైసీపీ వర్గాలే   చెబుతున్నాయి.   . అయితే  జ‌గ‌న్ అనుకున్న‌ది ఒక‌టి ఢిల్లీలో జ‌రిగింది మరొకటి అంటున్నారు.   జ‌గ‌న్ కేవ‌లం ప్ర‌ధాని మోడీ, కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తో మాత్రమే భేటీ అయ్యారు. అమిత్ షా, జేపీ న‌డ్డాఅప్పాయింట్ మెంట్ జగన్ కు లభించలేదు.  దీంతో తానొకటి తలిస్తే ఢిల్లీలో మరొకటి జరిగిందని జగన్ డీలాపడిపోయారని అంటున్నారు. హస్తిన పర్యటన అనంతరం వైసీపీ శ్రేణుల్లో సైతం ఆందోళన మిన్నంటుతోం ఈసారి టీడీపీ  కూట‌మి అధికారంలోకి రావ‌టం దాదాపు ఖాయ‌మైంద‌ని స‌ర్వేలు తేట‌తెల్లం చేస్తున్న క్ర‌మంలో ప‌లువురు వైసీపీ ముఖ్య‌నేత‌లు ఆ పార్టీని వీడేందుకు రెడీ అవుతున్నారు. ఈ తరుణంగా జగన్ హస్తిన పర్యటన ఆయనకు కేంద్రం అండ కూడా దూరమైందని తేటతెల్లం చేయడంతో వైసీపీ నుంచి మరిన్ని వలసలు ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

నేడే తెలంగాణ బడ్జెట్.. కేటాయింపుల కంటే కేసీఆర్ హాజరుపైనే అందరి ఆసక్తి!

తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శనివారం (ఫిబ్రవరి 10) బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే మంత్రివర్గం బడ్జెట్ ను ఆమోదించింది.   ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీతో పాటు ఇతర హామీలకు నిధుల కేటాయింపుపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.   వాస్తవికమైన బడ్జెట్‌ను, ఆచరణాత్మకమైన తీరులోబడ్జెట్ ఉంటుందని ఇఫ్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో అందరి దృష్టీ బడ్జెట్ పైనే ఉంది. అంతకంటే ఎక్కువ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనైనా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత, ఆ పార్టీ శాసనసభా పక్ష నేత కేసీఆర్ సభకు హాజరౌతారా లేదా అన్న దానిపై ఉంది. కేఃసీఆర్ సభకు హాజరౌతారని బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ప్రకటించినప్పటికీ ఆయన హాజరుపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం రోజున కేసీఆర్ సభకు గైర్హాజరయ్యారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత ప్రజా స్వామ్య ప్రాధాన్యాన్ని గుర్తించి హుందాగా వ్యవహరించాలనీ, సభకు హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఆయన సభకు హాజరౌతారంటూ బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. ఒక వేళ కేసీఆర్ సభకు హాజరైనా బడ్జెట్ పై చర్చలో పాల్గొంటారా? లేదా అన్న విషయంపై కూడా రాజకీయవర్గాలలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.    వంద రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామంటూ సర్కర్ విస్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఆ ఆరు గ్యారంటీలకు సంబంధించిన కూటాయింపులు ఎలా ఉండనున్నాయన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది.   గతేడాది రూ. 2.90 లక్షల కోట్లతో బీఆర్ఎస్ సర్కార్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సారి బడ్జెట్ లో  విద్య, వైద్య, సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ఇప్పటికే  సీఎం రేవంత్ పేర్కొన్నారు. దీంతో ఆయా రంగాలకు కేటాయింపులపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఇక 420 హామీలు అంటూ ప్రతిపక్షం విమర్శలకు గట్టి బదులిచ్చేలా మేనిఫెస్టోలోని హామీలకు ఏ మేరకు కేటాయింపులు ఉంటాయన్న ఉత్కంఠ కూడా వ్యక్తం అవుతోంది.  

ఐఆర్ఆర్ కేసులో చార్జ్ షీట్ తిరస్కరించిన కోర్టు.. పాతాళానికి దిగజారిన సర్కార్ పరువు!

జగన్ హయాంలో ఏపీ సీఐడీ ఒక ప్రైవేటు సైన్యంలా మారిపోయిందన్న విమర్శలను ఎదుర్కొంటున్నది.   విపక్ష నేతలను వేధించడం కోసం ఇష్టారీతిగా అక్రమ కేసులు బనాయించడం, అరెస్టు చేయడం తప్ప ఆ దర్యాప్తు సంస్థకు మరో పని లేదని జనం భావిస్తున్న పరిస్థితి. ఇష్టారీతిగా అక్రమ కేసులు బనాయించి ఆ తరువాత కోర్టులో మొట్టికాయలు తినడం ఏపీ సీఐడీకి పరిపాటిగా మారిపోయింది.  రాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టడమే ఏపీ సీఐడి పనిగా పెట్టుకుందని, అందుకోసమే  పని చేస్తున్నదని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషణలు చేస్తున్నారు. తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ దాఖలు చేసిన చార్జ్ షీట్ ను ఏసీబీ కోర్టు పరిగణనలోనికి తీసుకోవడానికి నిరాకరించింది. ఇప్పటికే .అచ్చెన్నాయుడుపై దాఖలు చేసిన చార్జిషీటును ఏసీబీ కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఐఆర్ఆర్ కేసులో ఏపీ సీఐడీ దాఖలు చేసిన చార్జ్ షీట్ ను కూడా ఏసీబీ తిరస్కరించింది. ఇలా వరుసగా ఏపీ సీఐడీ అక్రమ కేసులు బనాయించడం, కోర్టులు మొట్టికాయలు వేయడంతో దర్యాప్తు సంస్థ పరువే కాదు, జగన్ సర్కార్ ప్రతిష్ట కూడా పాతాళానికి దిగజారిపోతోందని పరిశీలకులు అంటున్నారు. ఐఆర్ఆర్ కేసు విషయానికి వస్తే ..  ఇప్పుడు ఐఆర్ఆర్ కేసులో గవర్నర్ అనుమతి తీసుకున్న తరువాతే ముందుకు సాగాల్సిన పరిస్థితి. అయితే అలా చేస్తే ఏపీ సీఐడీ ఈ కేసులో ఇప్పటి వరకూ ఎటువంటి అనుమతులూ లేకుండానే ఇష్టారీతిగా వ్యవహరించినట్లు అంగీకరించినట్లౌతుంది. దీంతొ ఏం చేయాలో, ఎలా ముందుకు సాగాలో తెలియక ఏపీ సీఐడీ దిక్కుతోచని పరిస్థితుల్లో పడింది.  వాస్తవానికి ఒక్క ఎకరం కూడా సేకరించని.. రూపాయి కూడా ఖర్చు పెట్టని ఐఆర్ఆర్ లో అవినీతి ఏమిటన్న తెలుగుదేశం వాదనే కరెక్టని, ఈ కేసులో చార్జిషీట్ ను నిరాకరించడం ద్వారా ఏసీబీ కోర్టు తేల్చేసినట్లైంది.   ఈ కేసులో ఏ1గా  చంద్రబాబు, ఏ2గా మాజీ మంత్రి నారాయణ  పేర్లను జోడించింది. లోకేష్ , లింగమనేని రాజశేఖర్, రమేష్ లను ముద్దాయిలుగా పేర్కొంటూ సీఐడీ ఏసీబీ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇంతకీ కేసేంటంటే.. సింగపూర్ తో గతంలో చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ఒప్పందాలు చేసుకుందని,  సింగపూర్ తో ఒప్పందానికి కేంద్రం నుంచి అనుమతి లేదనీ,  చట్టవిరుద్ధంగా మాస్టర్ ప్లాన్ పేరుతో సుర్బానా జురాంగ్ కు టీడీపీ ప్రభుత్వం డబ్బులు చెల్లించిందని సీఐడీ ఆ చార్జ్ షీట్ లో పేర్కొంది.  నిందితులకు ప్రయోజనం చేకూర్చేలా  ఇన్నర్ రింగ్ రోడ్, సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ లను రూపొందించారని..  లింగమనేని, మాజీ మంత్రి నారాయణ భూములకు అనుగుణంగా ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్ ను మార్చారనీ పేర్కొంది.  ఇన్నర్‌ రింగ్‌రోడ్డును లింగమనేని, హెరిటేజ్‌, నారాయణల ప్రయోజనం చేకూరేలా మాస్టర్ ప్లాన్ ను మార్చారనీ సీఐడీ తన చార్జ్ షీట్లో పేర్కొంది.  భూములకు అనుగుణంగా మార్చినట్టు సిఐడి ఛార్జిషీట్‌లో వెల్లడించింది.   అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందుకు వెళ్లే విషయంలో ఏపీ సర్కార్ కు, ఏపీ సీఐడీకి మొదటి నుంచీ ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిలు రద్దు చేయాలంటూ జగన్ సర్కార్ సుప్రీంను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ముందస్తు బెయిలు రద్దుకు సుప్రీం నిర్ద్వంద్వంగా నిరాకరించడమే కాకుండా, ఈ కేసు విషయంలో ఈ దశలో కలుగజేసుకోబోమని స్పష్టం చేసింది.  హైకోర్టు అన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకునే ఉత్త‌ర్వులు ఇచ్చింద‌ని, కేసు ద‌ర్యాప్తుపై ముంద‌స్తు బెయిల్ ప్ర‌భావం ఎంత మాత్రం ఉండదని సుప్రీం కోర్టు విస్పష్టంగా పేర్కొంది. ఇప్పుడు ఏసీబీ కోర్టు ఈ కేసులో అసలు చార్జ్ షిట్ నే పరిగణనలోనికి తీసుకోవడానికి నిరాకరించింది. దీంతో సీఐడీ పరువుతో పాటు జగన్ సర్కార్ ప్రతిష్ట కూడా మంటగలిసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

సీఎం రేవంత్ రెడ్డి బిగ్ స్కెచ్.. ఏమిటో తెలుసా?

దేశంలో కాంగ్రెస్ ప‌రిస్థితి ఎలా ఉన్నా.. తెలంగాణ‌లో మాత్రం ఆ పార్టీకి  రోజు రోజుకు ప్రజాదర‌ణ పెరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డం, సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. దీనికి తోడు ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌ను సైతం సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్క‌టిగా అమ‌లు చేస్తున్నారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల షెడ్యూల్ వెలువ‌డే నాటికి ఆరు గ్యారెంటీల్లో స‌గానికి పైగా హామీల‌ను అమ‌లు చేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. అర్హులైన పేద‌లంద‌రికీ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందించేలా ఇప్ప‌టికే రేవంత్ రెడ్డి అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.  గ‌త ప్ర‌భుత్వంలో అర్హ‌త ఉండి ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు నోచుకోనివారికి సైతం ప్ర‌స్తుతం కాంగ్రెస్ హ‌యాంలో ప‌థ‌కాల ల‌బ్ధి చేకూరుతుండ‌టంతో పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రో రెండు నెల‌ల్లో పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల్లో కాంగ్రెస్ పార్టీపై అభిమానం పెరుగుతుండ‌టం క‌లిసొచ్చే అంశం. అయితే, దాదాపు 15 పార్ల‌మెంట్ స్థానాల‌ను గెలుచుకోవ‌ట‌మే టార్గెట్ గా పెట్టుకున్న సీఎం రేవంత్  ఆ మేర‌కు త‌న‌దైన శైలిలో వ్యూహాల‌ను అమ‌లు చేస్తున్నారు.  త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో 12 నుంచి 15 స్థానాల్లో విజ‌యం సాధించేలా రేవంత్ సార‌థ్యంలో కాంగ్రెస్  నేత‌లు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అర్హులైన వారంద‌రికీ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందేలా చేయ‌డంతోపాటు బీఆర్ ఎస్ పార్టీలోని అసంతృప్త నేత‌ల‌పై రేవంత్ రెడ్డి గురిపెట్టారు. బీఆర్ ఎస్ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న నేత‌లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూ క‌డుతున్నారు. కాంగ్రెస్ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న ఆద‌ర‌ణ‌ను చూసి మ‌రికొంత మంది ప్ర‌తిప‌క్ష పార్టీల్లోని నేత‌లు కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే బీఆర్ ఎస్ పార్టీకి చెందిన పెద్ద‌ప‌ల్లి ఎంపీ వెంక‌టేశ్ నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో వెంక‌టేశ్ నేత‌కు ఏఐసీసీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాకు చెందిన ప‌లువురు బీఆర్ ఎస్‌ ముఖ్య‌నేత‌లు సైతం కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. తాజాగా మాజీ మంత్రి, బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయ‌న స‌తీమ‌ణి వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డిలు రేవంత్ రెడ్డిని క‌లిశారు. వీరు కూడా త్వ‌ర‌లో కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధ‌మైన‌ట్లు చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్లి  కాంగ్రెస్ లో చేర‌నున్నారు.  గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్  మూడు ఎంపీ స్థానాల్లో విజ‌యం సాధించింది. అధికారంలోఉన్న బీఆర్ ఎస్ పార్టీ తొమ్మిది ఎంపీ స్థానాల్లో విజ‌యం సాధించింది. ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండ‌టంతో 12 నుంచి 15 ఎంపీ స్థానాల్లో పార్టీ  జెండా ఎగ‌ర‌వేయాల‌ని రేవంత్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఇప్ప‌టికే పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల వారిగా ఇంచార్జిల‌ను నియ‌మించారు.  వారు ఇప్పటికే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ అభ్య‌ర్థుల ఎంపిక‌పై దృష్టి పెట్టారు. ఖ‌మ్మం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గానికి  తీవ్ర‌ స్థాయిలో పోటీ నెల‌కొంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ఎవ‌రు బ‌రిలో నిలిచినా విజ‌యం ఖాయ‌మ‌న్న ధీమాతో అధిష్టానం ఉంది.  ఒక్కో పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు పుంజుకుంటుండ‌టంతో బీఆర్ ఎస్ సిట్టింగ్ ఎంపీలు సైతం కాంగ్రెస్ నుంచి బ‌రిలోకి దిగేందుకు ఆస‌క్తి చూపుతున్న‌ట్లు స‌మాచారం. ఈ విష‌యాన్ని బీఆర్ ఎస్ ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి చెప్ప‌క‌నే చెప్పారు. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు మొగ్గు చూపార‌ని మీడియా చిట్ చాట్ లో మ‌ల్లారెడ్డి చెప్ప‌డం తెలంగాణ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం రేపుతోంది.. రంజిత్ రెడ్డితోపాటు ప‌లువురు సిట్టింగ్ ఎంపీలు, బీఆర్ ఎస్ లోని ముఖ్య‌ నేత‌లు కొంద‌రు కాంగ్రెస్ వైపు చూస్తున్న‌ట్లు స‌మాచారం.. వీరంతా ఇప్పుడు కాక‌పోయినా, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌రువాతైనా కాంగ్రెస్ గూటికి చేర‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతుంది.