చంద్ర‌బాబు మాస్టార్ ప్లాన్‌.. తిరువూరు అసెంబ్లీ బ‌రిలో ఫైర్‌ బ్రాండ్‌ కొలికిపూడి

ఏపీలో ఎన్నిక‌ల వేడి తారస్థాయికి చేరింది.  మ‌రో మూడునాలుగు నెల‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో అధికార వైసీపీ, తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి అభ్య‌ర్థుల ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మరో చాన్స్ కోసం నేల విడిచి సాము చేస్తున్నారు. ఈక్ర‌మంలో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు చెక్‌పెడుతూ కొత్త‌గా ఇంచార్జిల‌ను నియ‌మిస్తున్నారు. ఇప్ప‌టికే ఐదు ద‌పాలుగా విడుద‌లైన జాబితాల్లో  60 నియోజ‌క‌వ‌ర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను మార్చేశారు. ఈ క్ర‌మంలో తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి అభ్య‌ర్థుల ఎంపిక‌పై ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తోంది. వైసీపీ అభ్య‌ర్థుల‌కు దీటుగా బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను బ‌రిలో నిలిపేందుకు చంద్ర‌బాబు, ప‌వ‌న్ స‌మాలోచ‌న‌లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి అమ‌రావ‌తి ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషిస్తున్న, ఫైర్ బ్రాండ్ గా పేరుగడించిన కొలిక‌పూడి శ్రీ‌నివాస్ ను బ‌రిలోకి దింపాల‌ని చంద్ర‌బాబు నిర్ణయించారు. వైసీపీలో టికెట్ ద‌క్క‌ని తిరువూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ర‌క్ష‌ణ నిధి తెలుగుదేశంలోకి వ‌స్తారని, తిరువూరు నుంచి తులుగుదేశం అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగుతారని స్థానికంగా చ‌ర్చ‌జ‌రుగుతున్నది. అయితే  చంద్ర‌బాబు మాత్రం కొలిక‌పూడి శ్రీ‌నివాస్ వైపే మొగ్గు చూపుతున్న‌ట్లు స‌మాచారం.  తిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం నేత‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే న‌ల్ల‌గ‌ట్ల స్వామిదాస్ ఇటీవ‌లే వైసీపీలో చేరారు. వైసీపీ అధిష్టానం ప్ర‌క‌టించిన నాలుగో జాబితాలో తిరువూరు అసెంబ్లీ ఇంచార్జిగా న‌ల్ల‌గ‌ట్ల స్వామిదాస్ పేరును ఉంది. దీంతో తిరువూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా స్వామిదాస్ బ‌రిలో నిల‌వ‌డం దాదాపు ఖ‌రారైంది. స్వామిదాస్ కు దీటుగా బ‌ల‌మైన అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపాల‌ని తెలుగుదేశం అధిష్టానం భావిస్తోంది. ఈ క్ర‌మంలో ఒక‌రిద్ద‌రి పేర్లు తెర‌పైకి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. కొలిక‌పూడి శ్రీ‌నివాస్ ను తిరువూరు నుంచి బ‌రిలో దింప‌డ‌మే స‌రైంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవ‌లే కొలిక‌పూడి శ్రీ‌నివాస్ చంద్ర‌బాబు స‌మ‌క్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.  తాటికొండ నియోజ‌క‌వ‌ర్గం సీటును ఆయ‌న ఆశిస్తున్న‌ప్ప‌టికీ.. తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం అయితేనే విజ‌యావ‌కాశాలు పుష్క‌లంగా ఉంటాయ‌ని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన శ్రీ‌నివాస్ భార్య ఎస్టీ  కావ‌డంతో ద‌ళితులు, గిరిజ‌నుల ఓట్లే ల‌క్ష్యంగా కొలిక‌పూడి పేరును తెలుగుదేశం అధిష్టానం తెర‌పైకి తెచ్చింది.  అమ‌రావ‌తి ఉద్య‌మంలో కొలిక‌పూడి శ్రీ‌నివాస్ కీల‌క పాత్ర పోషిస్తున్న విష‌యం తెలిసిందే. ప‌లు ఛాన‌ళ్లలో డిబేట్ ల‌లోనూ కొలిక‌పూడి త‌న వాగ్దాటితో ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపిస్తుంటాడు. ముఖ్యంగా అమ‌రావ‌తి ఉద్య‌మంలో పదునైన మాట‌ల‌తో ప్ర‌భుత్వ విధానాలు ఎండ‌గ‌ట్ట‌డం,  ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన‌డంతోపాటు ఉమ్మ‌డి గుంటూరు స‌హా కృష్ణా జిల్లాలోనూ ప్ర‌జ‌ల్లో  శ్రీ‌నివాస్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవ‌ల చంద్ర‌బాబు అరెస్టై జైలుకెళ్లిన స‌మ‌యంలో హైద‌రాబాద్‌లోని ఐటీ ఉద్యోగుల‌ను ఏక‌తాటిపైకి తీసుకువ‌చ్చి వారిని చైత‌న్య‌ ప‌రిచి చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా అక్క‌డి ఆందోళ‌న‌లకు కొలిక‌పూడి శ్రీ‌నివాస్ నేతృత్వం వ‌హించారు. అన్ని అంశాల్లోనూ ప్ర‌త్య‌ర్థుల‌ను దీటుగా ఎదుర్కోగ‌ల స‌త్తాఉన్న కొలిక‌పూడిని ఎలాగైనా అసెంబ్లీలోకి తీసుకురావాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారని చెబుతున్నారు‌. ఈ క్ర‌మంలో తిరువూరు నుంచి కొలిక‌పూడి శ్రీ‌నివాస్ పేరును చంద్ర‌బాబు  దాదాపు ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది.  ఎస్సీ సామాజిక వ‌ర్గానికి రిజ‌ర్వు అయిన తిరువూరులో ఎస్సీ సామాజిక వ‌ర్గ ఓట్ల‌తో పాటు ఎస్టీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఓట్లుకూడా ఎక్కువ‌గానే ఉన్నాయి. ఈ క్ర‌మంలో శ్రీ‌నివాస్ ఎస్సీ సామాజిక వ‌ర్గం వ్య‌క్తి కావ‌డం, అత‌ని భార్య ఎస్టీ సామాజిక వ‌ర్గానికి చెందిన  వ్య‌క్తికావ‌డంతో రెండు సామాజిక వ‌ర్గాల ఓట్లూ ప్రభావితమౌతాయని   టీడీపీ అధిష్టానం భావిస్తున్నద‌ని స‌మాచార‌. తిరువూరుతో పాటు మైల‌వ‌రంలో ఉన్న ప‌లు తండాల్లో కూడా కొలిక‌పూడి శ్రీనివాస్ స‌తీమ‌ణితో ప్ర‌చారం చేయించ‌డం ద్వారా మంచి  మైలేజ్ వ‌స్తుంద‌ని తెలుగుదేశం భావిస్తోంది. అమ‌రావ‌తి ఉద్య‌మంలో కొలిక‌పూడి కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన నేప‌థ్యంలో తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లుకూడా ఎక్కువ‌గా ఆద‌రిస్తార‌ని, త‌ద్వారా వైసీపీని తిరువూరులో వైసీపీని మ‌ట్టిక‌రిపించాలంటే కొలిక‌పూడి శ్రీ‌నివాస్ క‌రెక్ట్ క్యాండెంట్ అని చంద్రబాబు భావిస్తున్నారు. కొలిక‌పూడి   తిరువూరు నుంచి బ‌రిలోకి దిగితే భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. 

ఒంగోలులో కాక రేగుతోన్న రాజకీయం

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు కేంద్రంగా రాజకీయం కాక రేగుతోంది. ఒంగోలు పార్లమెంటరీ సమన్వయకర్తగా చెవిరెడ్డి భాస్కరరెడ్డిని నియమించడంతో మొదలైన రగడ.. ఆయన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే చింపి.. తగలబెట్టారు. దీంతో ఒంగోలులో అధికార పార్టీలో పోరు తారస్థాయికి చేరినట్లు అయింది. దాంతో జిల్లాలో రాజకీయ పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే ఈ చర్యకు పునుకొంది మాత్రం బాలినేని వర్గీయులేననే ఓ ప్రచారం అయితే జిల్లాలో వాడి వేడిగా ఊపందుకొన్నట్లు తెలుస్తోంది.    ఒంగోలు ఎంపీ అభ్యర్థి ఎంపిక అంశంపై స్తానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన పంతం వీడడం లేదని.. దీంతో స్థానిక రాజకీయ పరిస్థితులు ఒక కొలిక్కి రావడం లేదని వారు వివరిస్తున్నారు. ఇదే అంశంపై ఇటీవల బాలినేనితో సీఎం వైయస్ జగన్ ప్రతినిధులు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి భేటీ కావడం.. ఆ క్రమంలో ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డిని నిలుపుతామంటూ వారు బాలినేనితో స్పష్టం చేయడం.. ఆ ప్రతిపాదనను బాలినేని వ్యతిరేకించడమే కాకుండా.. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డి లేకుంటే ఆయన కుమారుడు రాఘవరెడ్డిని ప్రకటించాలని.. అలా అయితే వారిని గెలిపించుకుంటామని... అలా కాదు.. కూడదంటూ.. చెవిరెడ్డి భాస్కరరెడ్డికి  ఇస్తామంటే మాత్రం అది కుదరని పని అని వారి ఎదుటే బాలినేని కుండ బద్దలు కొట్టినట్లు.. స్థానికంగా ఓ చర్చ అయితే వైరల్ అవుతుందని చెబుతున్నారు.  ఇక బాలినేని ఆలోచనలను ముందే పసిగట్టిన తాడేపల్లి ప్యాలెస్‌లోని పెద్దలు.. ఒకానొక సమయంలో మంత్రి ఆర్కే రోజాను ఒంగోలు ఎంపీగా బరిలో దింపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మీడియాలో కథనాలు సైతం వెల్లువెత్తాయని.. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ.. మళ్లీ చెవిరెడ్డిని తెరపైకి తీసుకు వచ్చారని.. అయితే చెవిరెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి ఎమ్మెల్యే అని... అదీకాక ఆయన ఒంగోలులో నాన్ లోకల్ అని..  దాంతోపాటు తన బావమరిది, టీటీడీ బోర్డ్ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఈ చెవిరెడ్డి జాంగ్ జిగ్రీ దోస్త్ అని.. దీంతో తన శత్రువుకు మిత్రుడు.. తనకు శత్రువే అవుతారన్నట్లుగా బాలినేని వ్యవహారశైలి ఉందని రాజకీయ విశ్లేషకులు ఈ సందర్బంగా విపులీకరిస్తున్నారు.  ఓ వేళ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి టికెట్ ఇస్తే.. రేపు ఆయన గెలిస్తే.. జిల్లాలో తన రాజకీయ ప్రాబల్యం దాదాపుగా కనుమరుగు అవుతోందని బాలినేని ఆలోచిస్తున్నారని.... ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. సదరు జిల్లాలో చెవిరెడ్డి అండ చూసుకొని వైవీ సుబ్బారెడ్డి రాజకీయంగా మరింత చెలరేగిపోయే అవకాశాలు ఉన్నాయని.. ఈ విషయాన్ని గ్రహించిన బాలినేని.. ఎంపీ అభ్యర్థి విషయంలో.. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్న చందంగా వ్యవహరిస్తున్నారని వారు వివరిస్తున్నారు. ఇక ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి లేదా ఆయన కుమారుడు. అది ఇది కాకుంటే తన కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డికి ఇస్తే.. ఉమ్మడి జిల్లాలో ఫ్యాన్ పార్టీ గెలుపు బాధ్యతలు తన నెత్తికి ఎత్తుకుంటాననే ఓ బలమైన సందేశాన్ని సైతం ఇప్పటికే బాలినేని తాడేపల్లి ప్యాలెస్‌కు పంపినట్లు.. ఓ ప్రచారం అయితే జిల్లాలో జోరుగా కొన.. సాగుతోందనే ఓ ప్రచారం సైతం నడుస్తోంది. ఓ వేళ ఒంగోలు ఫ్యాన్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి పేరును జగన్ అండ్ కో ఖరారు చేస్తే.. బాలినేని ఆ వెంటనే పెట్టి బేడా సర్దుకొని.. వైయస్ షర్మిల సమక్షంలో హస్తం పార్టీలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని.. ఆ క్రమంలో తనతోపాటు తన కుమారుడికి సైతం టికెట్లు ఇప్పించుకొని.. జిల్లాలో మళ్లీ తన రాజకీయాన్ని పదును  పెట్టుకొనే అవకాశాలు సైతం ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో విశ్లేషణలు చేస్తున్నారు.

పేపర్‌ లీకేజీ వెనుక పెద్ద హస్తం ఉందా? 

కేటీఆర్ పీఏ తిరుప‌తికి - గ్రూప్ వ‌న్ పేప‌ర్ లీక్ కి లింక్ ఏమిటి? భారీ ఎత్తున పోస్టుల‌కు సంబంధించి బేరం పెట్టిందెవ‌రు?  హనీ ట్రాప్ లో ప‌డిన ఆ పెద్ద చేప ఎవ‌రు? పేపర్‌ లీకేజీ వెనుక పెద్దల హస్తం ఉందా?  గ్రూప్ 1 పేపర్‌ లీకేజీ వ్యవహారంపై  మొదట హ్యాక్‌ అయిందన్నారు. తర్వాత హనీట్రాప్‌ జరిగిందన్నారు.ఆ త‌రువాత‌ లీకైంద‌న్నారు. అస‌లు వాస్త‌వాలేమిటి? ఈ వ్య‌వ‌హారంలో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది.  ఇప్పటికే అనేక మలుపు తీసుకున్న ఈ కేసులో ఎన్నో ట్విస్ట్‌లున్నాయి. దర్యాప్తు చేస్తున్న కొద్దీ ఆశ్చర్యపోయే నిజాలు బహిర్గతం అవుతున్నాయి.  1. గ్రూప్ వ‌న్ పేప‌ర్ లీక్ ఎలా వెలుగులోకి వచ్చిందంటే..?మహబూబ్‌నగర్ జిల్లా పగిడ్యాల్ పంచగల్ తండాకు చెందిన రేణుక నుంచి ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమె ప్రస్తుతం వనపర్తి గురుకుల పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. తన తమ్ముడు రాజేశ్వర్‌ నాయక్‌కు ప్రభుత్వ ఉద్యోగం తెప్పించేందుకు తన భర్త ఢాక్యానాయక్‌, టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగి ప్రవీణ్‌తో కలిసి ప్లాన్ చేసి దొరికిపోయారు. 2. ఈ ప్ర‌వీణ్ ఎవ‌డు?ప్రవీణ్ టీఎస్‌పీఎస్‌సీలో కారుణ నియామకం ఉద్యోగం సంపాదించాడు. తన తండ్రి హరిచంద్రరావు విధి నిర్వహణలో మరణించగా.. ఆ ఉద్యోగం ప్రవీణ్‌కు వచ్చింది. సెక్ర‌ట‌రీ పి.ఏ.గా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. 3. ప్ర‌వీణ్‌కు రేణుక‌తో లింక్ ఏమిటి? గతంలో రేణుక గురుకుల టీచర్ ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసుకున్న సమయంలో దరఖాస్తులో కొన్ని తప్పులు దొర్లాయి. వాటిని ఆమె సరిదిద్దుకునేందుకు ఎస్‌పీఎస్సీ ఆఫీస్‌కు వెళ్లారు. అప్పుడే ప్రవీణ్‌ పరిచయం అయ్యాడు. అతని నెంబరు తీసుకుని అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేది. ఈ పరిచయంతోనే తన తమ్ముడు రాజేశ్వర్ నాయక్‌ కోసం పేపర్ లీక్ చేయాలని అడిగింది.  4. త‌మ్ముడి కోసం అక్క డీల్‌ ఆమెతో డీల్ కుదుకుర్చుకున్న ప్రవీణ్‌.. ఐపీ అడ్రస్‌ను తెలుసుకుని నెట్‌వర్క్ అడ్మిన్ రాజశేఖర్ రెడ్డితో కలిసి టౌన్ ప్లానింగ్ క్వశ్చన్ పేపర్‌ను సేకరించాడు. ప్రశ్నాపత్రాన్ని పెన్‌డ్రైవ్‌లలో సేవ్ చేసుకుని.. రేణుకకు 10 లక్షల రూపాయలకు అమ్మేశాడు. రేణుక దంపతులు ఈ ప్రశ్నాపత్రాలను 40 లక్షల రూపాయలకు ఇతర అభ్యర్థులకు విక్రయించాడు.   గ్రూప్ వ‌న్ పేపర్ ను లీక్ చేసి రేణుకకు ఇచ్చిన టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్..  నమ్మకమైన వారికే అమ్మాలని సూచించాడు. ఆమెతో రూ. 10 లక్షలకు బేరం కుదుర్చుకొని అడ్వాన్స్‌గా రూ.5 లక్షలు తీసుకున్నాడు.  రేణుక  ఏఈ పేపర్‌ను త‌మ్ముడు రాజేశ్వర్‌కు ఇచ్చింది.మూడు ఏఈ పేపర్లను రాజేశ్వర్ రూ. 40 లక్షలకు విక్రయించాడు.  అభ్యర్థులై గోపాల్, నీలేష్, ప్రశాంత్, రాజేంద్ర కుమార్‌ల నుంచి రూ.25 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్న రాజేశ్వర్.. మిగతా డబ్బులు ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు.  అందులో రూ.10 లక్షలు డాక్యా నాయక్‌కు ఇచ్చాడు. రాజేశ్వర్ ఇచ్చిన రూ. 10 లక్షల్లో నుంచి రూ. 5 లక్షలను డాక్యా నాయక్‌ ప్రవీణ్‌కు ఇచ్చాడు.  5. మ‌రి ఈ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఎవ‌డో తెలుసుకోవాలంటే.... కేటీఆర్ పీఏ తిరుప‌తి గురించి మాట్లాడుకోవాల్సిందే. ఏ2గా ఉన్న రాజ‌శేఖర్ రెడ్డి ది -  పీఏ తిరుప‌తిది ది ప‌క్క ప‌క్క ఊర్లేన‌ట‌. అస‌లు రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి టీఎస్ పీఎస్సీలో ఉద్యోగం ఇప్పించిందే కేటీఆర్‌ పీఏ తిరుప‌తినే. ఒక్క మాట‌లో చెప్పాలంటే కేసీఆర్ కు షాడో సీఎం కేటీఆర్ అయితే కేటీఆర్ కు షాడో మంత్రి తిరుప‌తి అలా న‌డిచింద‌ప్ప‌ట్లో.కేటీఆర్ పీఏ తిరుప‌తి, నిందితుడు రాజ‌శేఖ‌ర్ స‌న్నిహితులంద‌రికీ గ్రూప్ -1 లో ఎక్కువ మార్కులు వ‌చ్చాయి. అంటే తిరుప‌తికి - గ్రూప్ వ‌న్ పేప‌ర్ లీక్ కి లింక్ ఏమిట‌ని సిట్ గ‌ట్టిగానే త‌వ్వుతోంది.ప్రశ్నపత్రాల లీక్ విషయం టిఎస్పిఎస్సి కమీషన్ కార్యాలయంలో పని చేస్తున్న మరో ఇద్దరు ఉద్యోగులకు ముందే తెలుసు. వాళ్లెవ‌రంటే... 6. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్,  7. ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రమేష్ లు  అయితే ఈ విషయం తెలుసుకున్న  ప్రవీణ్, రాజశేఖర్ ప్రశ్నపత్రాల లీకేజి అంశం ఉన్నతాధికారులకు చెబుతారేమో అని భయపడ్డారు. ఈ క్రమంలో షమీమ్, రమేష్ లను ప్రలోభపెట్టారు. మీకు కూడా గ్రూప్ 1 పేపర్ ఇస్తామని..మీరు కూడా పరీక్ష రాసి ఉద్యోగం సాధించుకోవచ్చని  ప్రవీణ్, రాజశేఖర్ చెప్పుకొచ్చారు. దీనితో ఆ విషయం ఎవరికీ చెప్పకుండా గ్రూప్ 1 పేపర్ తీసుకున్నారు.  షమీమ్, రమేష్ ల నుండే  8. న్యూజిలాండ్ లో ఉన్న ప్రశాంత్ కు,  9. సైదాబాద్ కు చెందిన సురేష్ కు పేపర్ లీక్ చేశారు.  10. సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మి అస‌లెలా జ‌రిగిందంటే  సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మి సిస్టమ్ లోకి జూన్‌‌‌‌లోనే గ్రూప్‌‌‌‌1 క్వశ్చన్‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. అదే సమయంలో రాజశేఖర్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ సిస్టమ్స్‌‌‌‌ అప్‌‌‌‌డేట్‌‌‌‌ చేశాడు. ఈ క్రమంలోనే శంకరలక్ష్మి సిస్టమ్ నుంచి గ్రూప్‌‌‌‌ 1 పేపర్‌‌‌‌‌‌‌‌ హ్యాక్ చేశాడు. ఈ పేపర్‌‌‌‌‌‌‌‌ను ప్రవీణ్‌‌‌‌, రాజశేఖర్‌‌‌‌ తమకు తెలిసిన వారికి అమ్ముకున్నారు. రాజశేఖర్ రెడ్డి సాయంతో ప్రవీణ్ 5 పేపర్లను కంప్యూటర్ నుంచి కొట్టేశాడు.  పెన్‌డ్రైవ్‌లో పేపర్లు సేవ్ చేసుకున్నాడు. టౌన్ ప్లానింగ్,  బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష,  అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ ,  గ్రౌండ్ వాటర్ ఇన్స్‌పెక్టర్ పోస్టుల పేపర్లను తన దగ్గర పెట్టుకున్నాడు ప్రవీణ్.  సమయం చూసి పేపర్లను విక్రయించేందుకు ప్రవీణ్ ప్లాన్ చేశాడు.  టీచ‌ర్ రేణుక‌తోనూ మాట్లాడాడు. తాను గ‌తంలో భవిష్యత్తులో జరిగే పరీక్షా పత్రాలు ఇస్తానని రేణుకకు ప్రవీణ్ హామీ ఇచ్చి వున్నాడు. కాబ‌ట్టి అభ్యర్ధులను వెతికి బేరమాడి పెట్టాలని రేణుకకు చెప్పాడు ప్రవీణ్.  ప్రవీణ్‌ కింగ్ పిన్‌గా మారాడు.  మహిళలతో వ్యవహారాలు నడుపుతూ అడ్డగోలు దందా చేశాడు. ప్రవీణ్ ఫోన్‌లో విచ్చలవిడిగా నగ్న చిత్రాలు, అసభ్య చాటింగ్‌లను పోలీసులు గుర్తించారు.   హనీ ట్రాప్ జ‌రిగింద‌నే ప్ర‌చారం వుంది. రేణుక భర్త ఢాక్యానాయక్‌ ద‌గ్గ‌ర గ్రూప్ వ‌న్ పేప‌ర్ కొన్న గండీడ్ కు చెందిన తిరుపతయ్యను సిట్ పోలీసులకు దొరికాడు.  రమేష్ నుంచి పేప‌ర్ కొన్న ప్రశాంత్ రెడ్డి, రాజేందర్ కుమార్  పోలీసుల‌కు దొరికారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 15కు చేరింది. తెలంగాణా ప‌బ్లిక్‌ స‌ర్వీస్ కమీషన్ లో పని చేసే ఎంత మంది గ్రూప్‌వ‌న్ రాశారు? ప్రవీణ్  తో పాటు మరో 10 మంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై అయ్యారు. ఇందులో ఏడుగురు రెగ్యులర్ ఉద్యోగులు  మరో ముగ్గురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అయితే వీరు కమీషన్ లో పని చేస్తూనే పరీక్ష రాశారా?  లేక సెలవులో ఉండి పరీక్ష రాశారా అనేది తెలియాల్సి ఉంది.  అలాగే పరిక్ష రాయడానికి వీరు కమిషన్ నుండి అనుమతి తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. అయితే వీరికి కూడా ప్రశ్నాపత్రం లీక్ అయిందా అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా రాజశేఖర్, ప్రవీణ్, రేణుకకు సంబంధించి ఆర్ధిక లావాదేవీలపై కూపీ లాగుతున్నారు. నీళ్లు, నిధులు, నియామ‌కాల నినాదంతో తెలంగాణ ఉద్య‌మం మొద‌లైంది.  తొలి చైర్మ‌న్ గా ఘంటా చ‌క్ర‌పాణి సార‌థ్యంలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించినా  ఒకే ప్రాంతానికి చెందిన వారు ఎంపికైన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.  కానీ ఆయ‌న వాటిని ఖండించారు. నోటిఫికేష‌న్లు వేయ‌డం , కోర్టుల్లో పిటిష‌న్లు దాఖ‌లు చేయ‌డం , ఆ త‌ర్వాత య‌ధావిధిగా వాయిదా ప‌డ‌డం ష‌రా మామూలై పోయింది.  గ‌తంలో జిల్లా స్థాయిలో ఎంపిక క‌మిటీ ఉండేది. కానీ ప్ర‌తి పోస్టును టీఎస్పీఎస్సీ ద్వారానే అప్ప‌గించ‌డం కొలువుల ఎంపిక‌లో తాత్సారం జ‌రుగుతూ వ‌చ్చింది. బీఆర్ఎస్ రెండోసారి ప‌వ‌ర్ లోకి వ‌చ్చినా ఉద్యోగాల నియామ‌కాల విష‌యంలో ఆస‌క్తి క‌న‌బ‌ర్చ లేదు. ల‌క్ష‌లాది మంది నిరుద్యోగులు జాబ్స్ కోసం ఎదురు చూస్తూ వ‌చ్చారు.  అయితే అసెంబ్లీ సాక్షిగా గ‌త‌ సీఎం 85 వేల పోస్టులు భ‌ర్తీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఆ మేర‌కు టీఎస్పీఎస్సీకి బి. జ‌నార్ద‌న్ రెడ్డిని చైర్మ‌న్ గా ఎంపిక చేశారు. హ‌డావుడిగా నోటిఫికేష‌న్లు జారీ చేశారు. 

నానికి రాజకీయం అంటే ఏంటో తెలవక ముందే గద్దే రామ్మోహన్ ఎంపీ అయ్యాడు

టిడిపి నాయకుడు కేశినేని శివనాద్ (చిన్ని) ఆధ్వర్యంలో చిరివేపాకు తోపుడుబండ్ల పంపిణీ కార్యక్రమం సెంట్రల్ టిడిపి కార్యాలయం వద్ద జరిగింది....   కేశినేని చిన్ని కామెంట్స్:: కేశినేని నాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు.... సైక్రియార్టిస్టుకు చూపించుకోవాలి కేశినేని నానితో సహా సైకోలందరూ ఒక పార్టీలో చేరారు కేశినేని నానికి రాజకీయం అంటే ఏంటో తెలవక ముందే గద్దే రామ్మోహన్ ఎంపీ అయ్యాడు గద్దె రామ్మోహన్ స్థాయి  తెలుసుకుని నాని మాట్లాడితే మంచిది తెలుగుదేశం పార్టీకి, చంద్ర బాబు కు సీట్లు అమ్ముకోవలసిన పరిస్థితి లేదు సైకో పార్టీలో ఉన్న వారంతా చంద్రబాబు నాయుడుని విమర్శించటమే పనిగాపేట్టుకున్నారు....

మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థిత్వానికి బండ్ల గణేష్ దరఖాస్తు 

పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. త్వరలో  ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. పార్లమెంట్‌లో పన్నెండు  స్థానాలు గెలవాలని కాంగ్రెస్, అసెంబ్లీ ఎన్నికల్లో ఢీలా పడినా.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్, బీజేపీ యోచిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు దక్కని పలువురు సీనియర్ నేతలు ఎంపీ టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్దమని కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత బండ్ల గణేశ్ పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈమేరకు మల్కాజిగిరి ఎంపీ టికెట్ తనకు ఇవ్వాలంటూ పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం గాంధీ భవన్ కు వచ్చి దరఖాస్తును అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉందని చెప్పారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రేవంత్ రెడ్డి పాలన చూసి గర్వపడుతున్నట్లు తెలిపారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎంపీ సీట్లు అన్నీ కాంగ్రెస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మల్కాజిగిరి నుంచి లోక్ సభకు పోటీచేసే అవకాశం కల్పిస్తే గెలిచి చూపిస్తానని బండ్ల గణేశ్ చెప్పారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై బండ్ల గణేశ్ తీవ్రంగా మండిపడ్డారు. మల్లారెడ్డికి మతిభ్రమించినట్లుందని, అందుకే పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు. మల్లారెడ్డి విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులను ఫీజుల పేరుతో పీల్చిపిప్పి చేస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ లో చేరతానని వచ్చినా సరే మల్లారెడ్డిని చేర్చుకోబోమని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో అతిపెద్ద లోకసభ నియోజకవర్గమైన మల్కాజ్ గిరి గెలుపు కోసం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ అయిన బిఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉంది. బిజెపి నుంచి రాంచందర్ రావు పోటీలో ఉన్నారు. మల్కాజ్ గిరి ఎంపీగా గత ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి గెలుపొందారు.  గత అసెంబ్లీ ఎన్నికలలో కొడంగల్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలుపొంది ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో మల్కాజ్ గిరి కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కొద్ది రోజులుగా  కాంగ్రెస్ లో స్థబ్దుగా ఉన్న బండ్ల గణేష్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఆయన పెద్దగా ప్రచారం చేయలేదు. కానీ కాంగ్రెస్ వేవ్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.  దీంతో  కాంగ్రెస్ పార్టీకి దూరమైన నేతలు ఒక్కొక్కరు  దగ్గరవుతున్నారు. లోకసభ ఎన్నికల వేళ మరింత క్రియాశీలకమవుతున్నారు. 

రేరా బాలకృష్ణుడు నోరు విప్పితే ఫామ్ హౌజ్లో ప్రకంపనలే

అవినీతి అన‌కొండ... అదేనండి హెచ్ఎండిఏ బాలకృష్ణ, పెద్ద సార్‌ భార్య‌కి 25 ఎక‌రాల భూమి గిఫ్ట్ గా ఎందుకు ఇచ్చాడు. ధ‌ర‌ణిని అడ్డుపెట్టుకొని తెలంగాణా వ్యాప్తంగా 25 లక్షల కోట్ల విలువైన భూముల రికార్డులు తారుమారు చేసిన‌ స్కాంలో ప్ర‌ధాన సూత్రదారి ఎవ‌రు?అత‌న్నే అప్ప‌ట్టి సి.ఎం. త‌న సలహాదారుగా పెట్టుకొవ‌డం వెనుక మ‌త‌ల‌బు ఏమిటి? కోకాపేట భూముల విక్ర‌య వ్య‌వ‌హ‌రంలో మైహోమ్, రాజ‌పుష్ప కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించి వెయ్యి కోట్ల స్కామ్ కు తెర‌లేపిన బీహార్ బ్యాచ్ పై తెలుగువ‌న్ గ్రౌండ్ రిపోర్ట్‌.తెలంగాణా లో బీహార్ బ్యాచ్  చేసిన ఆరాచ‌కాలు ఒక్కొక్క‌టి వెలుగుచూస్తున్నాయి. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ గుర్తున్నారా.. అదే నండి....ఆయన్ను ఏపీకి కేటాయిస్తే తెలంగాణలోనే ఉండి సీఎస్ గా పని చేశారు.  ఏపీ క్యాడర్ వెళ్లాలని తేల్చిచెప్పడంతో అక్కడి వెళ్లి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు.  ఆ త‌రువాత సి.ఎం. సార్‌కి స‌ల‌హాదారుడిగా పెత్త‌నం చేశారు. ఔను. అయితే.....ఇప్పుడు వార్త ఏమిటంటే.... సోమేష్ కుమార్ భార్య డాగ్యన్ముద్ర గారికి యాచారం మండలం కొత్తపల్లి రెవెన్యూ పరిధిలో  25 ఎకరాల భూమి ఉంది.అక్కడ ఎకర భూమి విలువ రూ.3 కోట్లుగా ఉంది. అంటే ఆ భూమి విలువ రూ.75 కోట్లు.  అయితే ఈ భూమి ఎలా వచ్చిందో తెలియడం లేదు. ధరణి పోర్టల్ లో ఖాతాలో  ఈ డాక్యుమెంట్  ఉంది.ఖాతా నంబర్ 5237 అనే నంబర్ ఎలా వచ్చిందో ఎవరికి అర్థం కావడం లేదు. పైగా ఈ భూములను సేల్ డీడ్ ద్వార కొనలేదు. సాదాబైనామా ద్వారా భూమి కొన్నట్లు తెలుస్తోంది.  సాదాబైనామా అంటే ఏమిటి అనే క‌దా మీ డౌట్‌....తెల్ల కాగితంపై భూమి కొనుగోలు,  రిజిస్టర్ కాని క్రయ విక్రయాలు చేసిన భూములను విదానాన్ని సాదాబైనామా అంటారు.దీనికి సంబంధించి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ వెబ్ సైట్ లో ఎన్ కంబరెన్స్ (ఈసీ) సర్టిఫికేట్ కోసం చేస్తే కనిపించడం లేదు.  దీంతో ఈ భూమి అక్రమంగా వచ్చింద‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంది.ఎలా వ‌చ్చింద‌నేగా మీ డౌట్‌....అదేనండి హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణ రేరా సెక్ర‌ట‌రీగా వున్న‌ప్పుడు సోమేష్ సార్ ఏమో ఛైర్మ‌న్‌గా వున్నారు. అప్ప‌డు బాల‌కృష్ణ సార్ వాళ్ళ భార్య‌కి గిఫ్ట్‌గా 25 ఎక‌రాలిచ్చాశాడ‌ట‌. ఆ సమయంలోనే యాచారంలో సోమేష్ కుమార్ భార్య పేరున 25 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయినట్లు ఏసీబీ గుర్తించింది.  సోమేష్ కుమార్ కనుసన్నల్లోనే హైదరాబాద్‌ చుట్టుపక్కల లక్షల కోట్ల భూములు చేతులు మారాయి.  గ‌తంలో పేదలకు పంచిన భూముల్ని ధరణి పోర్టల్ పేరుతో లాక్కున్నారు. ఒక్క ఇ‍బ్రహీంపట్నం నియోజకవర్గంలోనే 5 లక్షల కోట్ల విలువైన భూములు లాక్కున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల కోట్ల విలువైన భూములను లాక్కునే ప్రణాళికలో సూత్రదారి సోమేశ్ కుమార్. అలాంటి వ్యక్తిని కేసీఆర్‌ సలహాదారుగా పెట్టుకొని క‌థ న‌డిపార‌ట‌. ఔటర్ రింగ్ రోడ్డును లీజుకు ఇవ్వడం వెనుక కూడా సోమేష్ కుమార్‌ ఉన్నారట ఏటా వందల కోట్ల ఆదాయం వచ్చే ప్రాజెక్టును 30 సంవ్సతరాలు లీజుకు ఇవ్వడం వెనుక భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నారు.  కోకాపేట భూముల విక్ర‌యం వ్య‌వ‌హ‌రంలో మైహోమ్, రాజ‌పుష్ప కు కేసీఆర్ స‌ర్కారు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో, వెయ్యి కోట్ల రూపాయ‌ల స్కామ్ జ‌రిగింది. ఈ ప్రొక్యూర్ మెంట్ టెండ‌ర్ వెబ్ సైట్ ద్వారా టెండ‌ర్లు పిలవ‌కుండా ఎంపిక చేసిన సంస్థ‌ల‌కు మేలు చేసేందుకే మాన్యువ‌ల్ ప‌ద్ద‌తిలో  అనుమ‌తించారు.  అస‌లు వేలంలో ఎవ‌రెవ‌రు పాల్గొన్నారు.. బిడ్డింగ్ లో విజేత త‌ర్వాత నిలిచింది ఎవ‌రు అనే అంశాల‌ను బ‌హిరంగ ప‌ర్చ‌కుండా అంతా గోప్య‌త పాటించారు. ఈ వేలంలో అస‌లు పార‌ద‌ర్శ‌క‌త లేదు. 2021 జూన్ 10న జీవో ఎంఎస్ 13 జారీ చేసి కోకాపేట భూముల వేలానికి ఎంఎస్ టిఎస్ ను అనుమ‌తించటం వెన‌క దురుద్దేశాలు ఉన్నాయి. ఎంపిక చేసిన రియ‌ల్ ఎస్టేట్ కంపెనీల కోసం ఈ వేలం నిబంధ‌న‌ల్లో స‌ర్దుబాట్లు చేశారు. దీనికి స‌హ‌రించిన వారిలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్ దే కీల‌క పాత్ర‌.  జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావుకు చెందిన మైహోమ్ గ్రూప్, సిద్ధిపేట క‌లెక్ట‌ర్ గా ఉన్నవెంక‌ట్రామిరెడ్డికి కుటుంబానికి చెందిన రాజపుష్ప సంస్థ‌ల‌కు అనుచిత ల‌బ్ది క‌లిగేలా చేశార‌న్నారు.  ఎంఎస్ టిసితో కుమ్మ‌క్కు అయి కొన్ని సంస్థ‌ల‌కు ప్ర‌యోజ‌నం చేకూరేలా వ్య‌వ‌హ‌రించ‌టం వల్ల ప్ర‌భుత్వానికి 1000 కోట్ల రూపాయ‌ల మేర న‌ష్టం వ‌చ్చింది.   ప్ర‌భుత్వ ఈ ప్రొక్యూర్ మెంట్ టెండ‌ర్ వెబ్ సైట్ ద్వారా టెండ‌ర్లు పిలిచే అవ‌కాశం ఉన్నా ఎంఎస్ టీసీని రంగంలోకి దించి ముఖ్య‌మంత్రి కెసీఆర్ త‌నవారికి మేలు చేసేలా అధికారుల‌ను ఉప‌యోగించుకుని ప్ర‌భుత్వ ఖ‌జానాకు వెయ్యి కోట్ల రూపాయ‌ల మేర న‌ష్టం చేకూర్చారు.  ఈ వేలం ద్వారా క‌మిష‌న్ రూపంలో ఎంఎస్ టీసీకి 50 కోట్ల రూపాయ‌ల మేర చెల్లింపులు చేశార‌ని..  అదే ఈ ప్రొక్యూర్ మెంట్ ద్వారా అయితే ఈ మేర‌కు ఆదా అయ్యేది. నిబంధ‌న‌ల ప్ర‌కారం ఈ కెవైసీని ఫాలో అవ్వాల్సి ఉండ‌గా..ఎంఎస్ టీసీ ఎంపిక చేసిన సంస్థ‌ల‌కు మేలు చేసేందుకే మాన్యువ‌ల్ ప‌ద్ద‌తిలో కూడా అనుమ‌తించారు. అస‌లు వేలంలో ఎవ‌రెవ‌రు పాల్గొన్నారు..బిడ్డింగ్ లో విజేత త‌ర్వాత నిలిచింది ఎవ‌రు అనే అంశాల‌ను బ‌హిరంగ ప‌ర్చ‌కుండా అంతా గోప్య‌త పాటించారు.ఈ వేలంలో అస‌లు పార‌ద‌ర్శ‌క‌త లేద‌ని పేర్కొన్నారు.  కోకాపేట భూముల విక్ర‌యం వ్య‌వ‌హ‌రంలో మైహోమ్, రాజ‌పుష్ప కు కేసీఆర్ స‌ర్కారు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో, వెయ్యి కోట్ల రూపాయ‌ల స్కామ్ జ‌రిగింది.  రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల కోట్ల విలువైన భూముల్ని స్వాహా చేయ‌డంలో కూడా ఆయ‌నే ప్ర‌ధాన‌ సూత్రదారి అట‌.  అత‌ని భార్య పేరున 25 ఎకరాలు ఎలా వ‌చ్చాయో ఎవ‌రికి తెలియ‌డం లేద‌ట‌.   ఔటర్ రింగ్ రోడ్డును లీజుకు ఇవ్వడం వెనుక కూడా సోమేష్ కుమారే వున్నార‌ట‌. గ‌త ప్ర‌భుత్వం పేద‌ల నుంచి లాక్కున్న భూములను తిరిగి ఇచ్చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పుడా హామీ ఎప్ప‌ట్టి వ‌ర‌కు నెర‌వేర్చ‌నుంది?

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పై అరెస్ట్ వారెంట్ 

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రసాదంపాడులోని ఓ పోలింగ్ బూత్ వద్ద జరిగిన ఘటనలో మొత్తం 38 మందిపై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. కేసు విచారణకు కోర్టుకు హాజరుకాకపోవటంతో వారెంట్ ను గత విచారణలోనే న్యాయస్థానం జారీ చేసింది. ఇవాళ్టి విచారణకూ వంశీ హాజరుకాకపోవటంతో వారెంట్ అమలు చేయాలని పోలీసులకు ఆదేశాలించింది. ప్రస్తుతం వల్లభనేని వంశీ నియోజకవర్గంలో అందుబాటులో లేనట్లుగా తెలుస్తోంది. గతకొంతకాలంగా ఆయన నియోజకవర్గానికి దూరంగా హైదరాబాద్ లో ఉంటున్నారని సమాచారం. అయితే, తాజా పరిణామాలపై వల్లభనేని వంశీ ఎలా ముందుకెళ్తారనేది వేచి చూడాల్సిందే.  

జార్ఖండ్ మాజీ సిఎంకు సుప్రీంలో చుక్కెదురు 

మనీలాండరింగ్ కేసులో అరెస్టైన  జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎమ్ఎమ్ పార్టీ అధినేత హేమంత్ సోరెన్‌కు శుక్రవారం సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తన అరెస్టును సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించబోమని సుప్రీం తేల్చిచెప్పింది. ఈ పిటిషన్‌కు తగిన వేదిక సుప్రీంకోర్టు కాదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎమ్ఎమ్ సుందరేశ్, జస్టిస్ బేలా ఎం త్రివేదీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్‌పై హైకోర్టును ఆశ్రయించాలని మాజీ సీఎంకు సూచించింది. జార్ఖండ్‌లో అక్రమ భూలావాదేవీలపై విచారణ జరుపుతున్న ఈడీ ఈ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పీఎమ్ఎల్‌ఏ కోర్టు సోరెన్‌కు ఒక రోజు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే, పది రోజుల రిమాండ్ కావాలని ఈడీ కోరడంతో తీర్పును నేటికి రిజర్వ్ చేసింది. సోరెన్ పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారించింది.  సోరెన్ అరెస్టుకు వ్యతిరేకంగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.భూ కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఏడు గంటల పాటు విచారించిన తర్వాత బుధవారం అర్థరాత్రి సోరెన్‌ను ఇడి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  అరెస్టుకు ముందే సోరెన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

మంత్రి రోజాకు నిరసన సెగ

ఎపికి మూడు రాజధానుల ప్రతిపాదన ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ఎపికి రాజధాని లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో జై అమరావతి ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. తాజాగా  తిరుమల కొండపై ఏపీ మంత్రి రోజాకు శ్రీవారి సేవకుల నుంచే  నిరసన సెగ తగిలింది. జై అమరావతి అంటూ వారు మంత్రి ఎదుట నినదించారు. అంతకుముందు వారు మంత్రి రోజాతో సెల్ఫీలు దిగారు. ఎపికి మూడు రాజధానులు అవసరం లేదని వాళ్లు మంత్రికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత వాళ్లు జై అమరావతి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  ఈ ఉదయం ఆమె తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం ఆమె ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత... అమరావతి ప్రాంతం నుంచి వచ్చిన శ్రీవారి సేవకులు ఆమెను చుట్టుముట్టారు. ఆమె ఆందోళనకారులతో నవ్వుతూ సమాధానాన్ని దాట వేసారు.  జై అమరావతి, ఏపీకి ఒకటే రాజధాని, వందేమాతరం అని నినాదాలు చేశారు. జై అమరావతి అని మీరు కూడా చెప్పండి మేడమ్ అని రోజాను వారు అడిగారు. అయితే, రోజా చిరునవ్వులు చిందిస్తూనే... 'శ్రీవారి సేవకు వచ్చి ఇదేంది?' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.  ఎపిలో ఎన్నికలు కూత వేటు దూరంలో ఉన్న నేపథ్యంలో అమరావతి ఉద్యమకారుల నుంచి నిరసన రావడం జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది

గంజాయి స్మగ్లింగ్ చేస్తూ  పట్టుబడ్డ ఎపి పోలీసులు 

గంజాయి మీద ఉక్కు పాదం మోపిన తెలంగాణ సర్కారు కు వింత అనుభవం ఎదురైంది. తెలంగాణ పోలీసులకు ఆంధ్రా పోలీసులు పట్టుబడిన వైనమిది.  హైదరాబాద్ లోని బాచుపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున సంచలనం చోటుచేసుకుంది. గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు బాలానగర్ పోలీసులకు పట్టుబడ్డారు. కారులో గంజాయి తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా డ్యూటీకి సెలవు పెట్టి మరీ గంజాయి దందాకు తెరలేపారు. ముందస్తు సమాచారం అందడంతో తెలంగాణ పోలీసులు తనిఖీ చేపట్టడంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాచుపల్లిలో గంజాయి అమ్మేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారంటూ సమాచారం అందడంతో బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున వాహనాల తనిఖీ చేపట్టారు. దీంతో ఓ కారులో 22 కిలోల గంజాయి బయటపడింది. ఆ కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. విస్తుపోయే విషయం బయటపడింది. వారిద్దరూ ఏపీ పోలీస్ శాఖకు చెందిన వారని, కాకినాడలో ఒకరు హెడ్ కానిస్టేబుల్, మరొకరు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారని తేలింది. విధులకు సెలవు పెట్టి మరీ గంజాయి దందాకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి వారిద్దరినీ బాచుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు వివరించారు.

కేసీఆర్ కు అగ్నిపరీక్ష!

తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరగనున్నాయన్న సమాచారంతో బీఆర్ఎస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలర్ట్ అయ్యారు. గురువారం (ఫిబ్రవరి1) ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమై వారికి కీలక సూచనలు చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ తో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. అయితే కేసీఆర్ స్వరంలో గతంలో ఉన్న ధీమా లేదనీ, పార్టీ ఎమ్మెల్యేలపై ఆయనకు పట్టు జారిందనీ చెబుతున్నారు. గట్టిగా మందలిస్తే రేపు పార్టీ వీడుదామనుకుంటున్న వారు ఇప్పుడే జారిపోతారేమో అన్న భయం ఆయనలో ప్రస్ఫుటంగా కనిపించిందని పార్టీ వర్గాల సమాచారం. ఇప్పుడు కర్రవిరగకుండా, పాము చావకుండా వ్యవహరించి ఎమ్మెల్యేల వలసలను నిరోధించాలన్న టాస్క్ తో కేసీఆర్ ఉన్నారని వారు చెబుతున్నారు. అందుకే రేవంత్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ విషయంలో ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే.. అలా భేటీ అయిన ఎమ్మెల్యేలను తప్పుపట్టకుండా జాగ్రత్తగా మాట్లాడారు. మంచి ఉద్దేశంతో ప్రభుత్వంలో ఉన్న వారిని కలిస్తే తప్పు లేదనీ, అయితే అలా కలవడం వల్ల ప్రజలలోకి తప్పుడు సంకేతాలు వెడతాయనీ కేసీఆర్ పేర్కొన్నారు. అందుకే సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వాలన్నా, నియోజకవర్గ సమస్యలను చెప్పుకోవాలన్నా అదంతా ప్రజల సమక్షంలోనే చేయాలని సూచించారు.  ఎమ్యెల్యేలు పార్టీ మారుతారనే ప్రచారం నేపథ్యంలో ఆయన నిర్వహించిన ఈ  సమావేశానికి ప్రాధాన్యం చేకూరింది. లోక్ సభ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో కేసీఆర్ ఇక తాను అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు. పార్టీ కేడర్ ను కాపాడుకోవడం ముఖ్యమన్నారు. లోకసభ ఎన్నికలలో బీఆర్ఎస్ సత్తా చాటకుంటే..  వలసలను ఆపడం సాధ్యం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా వచ్చే లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు మాత్రమే కాదు కేసీఆర్ కు కూడా అగ్నిపరీక్షగానే మారాయి.  అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో నరేంద్రమోడీ గ్రాఫ్ పెరిగింది. దీంతో వచ్చే లోక్ సభ  ఎన్నికలలో తెలంగాణలో కూడా బీజేపీ పెర్ఫార్మెన్స్ బాగుంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ ను వెనక్కు నెట్టి కాంగ్రెస్, బీజేపీల మధ్యే పోరు ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. అదే జరిగితే బీఆర్ఎస్ ఉనికే ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెబుతున్నారు. వీటన్నిటినీ పరిగణనలోనికి తీసుకునే కేసీఆర్ తెరమీదకు వచ్చారని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత.. కేసీఆర్ గాయం కారణంగా ఇన్ని రోజులూ తెరమీదకు రాలేదు. దీంతో బీఆర్ఎస్ పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే పార్టీలో మళ్లీ జోష్ తీసుకురావడానికి కేసీఆర్ రంగంలోకి దిగారు. 

దిగజారిన కేశినేని నాని స్థాయి!

విజయవాడ సిట్టింగ్ ఎంపీ, వైసీపీ నాయకుడు త కేశినేని నానిపై ఆయన సోదరుడు, తెలుగుదేశం నేత కేశినేని చిన్ని మరోసారి విరుచుకుపడ్డారు.విశ్వాసం లేని వ్యక్తి కేవినేని నాని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.   కేశినేని  నాని వైసీపీలో చేరడంతో  సైకోలందరూ ఒకే చోటకు చేరినట్టయిందని అన్నారు. విజయవాడ లోక్ సభ స్థానానికి కేశినేని నాని పోటీ చేస్తే ఆయన ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. విజయవాడ ఎంపీగా నాని కచ్చితంగా 3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోతాడన్నారు. అందుకే విజయవాడ టికెట్ ను నానికి ఇచ్చే అంశంలో వైసీపీ నాయకత్వం ఇంత వరకు ఎలాంటి హామీ ఇవ్వలేదని అన్నారు.  తెలుగుదేశంలో ఉన్నప్పుడు కేశినేని నానికి చాలా గౌరవం ఉండేదని, ఇప్పుడు ఆయన వైసీపీలో చేరిన తరువాత ఆయన స్థాయి దిగజారిపోయిందని కేశినేని చిన్న పేర్కొన్నారు.  ఇప్పుడు దేవినేని అవినాశ్ కు ముఖ్య అనుచరుడిగా నాని మారారని ఎద్దేవా చేశారు. విజయవాడ నుంచి తాను బరిలోకి దిగే అంశాన్ని పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు.  తమ నాయకత్వం ఎక్కడి నుంచి పోటీ చేయాలని  ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తానని తెలిపారు. టికెట్ల కేటాయింపులపై తమ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ చర్చిస్తారని చెప్పారు. అయితే కేశినేని నానిపై పోటీకి తాను సిద్ధమని కేశినేని చిన్ని చెప్పారు.

వదల బొమ్మాలీ వ‌ద‌లా.. ఢిల్లీలోనూ జ‌గ‌న్‌కు దిమ్మ‌తిరిగే షాక్‌లిస్తున్న ష‌ర్మిల

తాడేప‌ల్లి ప్యాలెస్‌లో ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  కంగారెత్తిపోతున్నార‌ు. ఈ విష‌యం తెలుసుకున్న వైసీపీ నేత‌లు బెంబేలెత్తిపోతున్నారు. ఎవ‌రు అడ్డొచ్చినా కేసులుపెట్టి లోపలేసే మా జ‌గ‌న‌న్న‌కు కంగారెంటి? అంటూ బాధపడిపోతున్నారు. జగన్ కు కంగారెత్తించేంత సీన్  ఎవ‌రికీ లేద‌ంటూ తమకు తామే ధైర్యం చెప్పుకుని  జ‌బ్బ‌లు చ‌చరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.  కానీ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌రిస్థితి మాత్రం ముందు నుయ్యి.. వెన‌క గొయ్యి అన్న‌ట్లుగా త‌యారైంది. కేంద్రంలోని బీజేపీ అండ‌దండ‌లు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి పుష్క‌లంగా ఉండ‌టంతో ప్ర‌త్య‌ర్థి పార్టీలైన‌ తెలుగుదేశం, జ‌న‌సేన‌లు ఇంత కాలం జ‌గ‌న్ ను దీటుగా ఎదుర్కోవడంలో కొంత ఇబ్బంది పడ్డారు.  కానీ, తాను వ‌దిలిన బాణ‌ం, సొంత సోదరి షర్మిలే  త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తును కుప్ప‌కూల్చేందుకు ఎదురు తిరిగి వ‌స్తుండ‌టంతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డిపోయారు. ఈ విషయం ఏపీ రాజ‌కీయాల్లో అవ‌గాహ‌న ఉన్న వారందరికీ ఇప్పటికే అర్థమైపోయింది.   ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా ప‌గ్గాలు చేప‌ట్టి  జ‌గ‌న‌న్న‌పై క‌య్యానికి కాలుదువ్వుతున్న ష‌ర్మిల‌ను ఎదుర్కొనేందుకు వైసీపీ నేత‌లు నానా తంటాలు ప‌డుతున్నారు. సూటిగా సుత్తి లేకుండా జ‌గ‌న‌న్నా.. అంటూ ఆమె సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలకు సమాధానం చెప్పలేక తమకు మాత్రమే తెలిసిన తిట్ల‌దండ‌కం అందుకుంటున్నారు. తెలంగాణ‌లో త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు పునాదులు వేసుకోవ‌టంలో విఫ‌ల‌మైన ష‌ర్మిల కాంగ్రెస్ గూటికి చేరి, త‌న సొంత పార్టీ  వైఎస్‌ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. తెలంగాణ‌లో కోడ‌లినంటూ రాజ‌కీయాలు చేసిన ష‌ర్మిల.. ఇప్పుడు జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఇలాకాలో  అస‌లు సిససలైన  వైఎస్ వార‌సురాలిని నేనే అంటూ జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి చరమగీతం పాడేందుకు  కంక‌ణం క‌ట్టుకున్నారు. ముఖ్యంగా గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా ఎత్తిచూపుతూ జ‌గ‌న్ శిబిరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తాజాగా గ‌ల్లీలోనే కాదు.. ఢిల్లీలోనూ వ‌ద‌లేది లేదంటూ జ‌గ‌న్ లో టెన్ష‌న్ ను మ‌రింత పెంచేస్తున్నారు ష‌ర్మిల‌. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రంపై పోరాటం చేశారు. అయితే కేంద్రం స్పందించకపోవడంతో ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. ఆ తరువాత జరిగిన 2019 ఎన్నికలలో తెలుగుదేశం పరాజయం పాలైంది. అయితే ఆ ఎన్నికల ప్రచారంలో  నాకు ఇర‌వైకిపైగా ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడ‌లు వంచి ఏపీకి ప్ర‌త్యేక హోదా తెస్తానంటూ జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో  ఉదరగొట్టేశారు.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాట‌ల‌ను న‌మ్మిన ఏపీ ప్ర‌జ‌లు ఆయ‌న కోరిన‌ట్లే ఇర‌వైకిపైగా ఎంపీ స్థానాల్లో వైసీపీ అభ్య‌ర్థుల‌ను గెలిపించారు. రాష్ట్రంలోనూ భారీ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్.. ప్ర‌త్యేక హోదా విష‌యాన్ని మ‌ర్చిపోవ‌టంతో పాటు.. కేంద్రంతో స్నేహ సంబంధాల‌ను కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యం ముంచుకొస్తున్న స‌మ‌యంలో ఏపీ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ష‌ర్మిల.. ప్ర‌త్యేక హోదా విష‌యాన్నే ప‌దేప‌దే ప్ర‌స్తావిస్తూ ప్ర‌జల‌కు జ‌గ‌న్ ఇచ్చిన హామీల‌ను గుర్తు చేస్తూ వైసీపీ నేత‌ల‌కు వ‌ణుకుపుట్టిస్తున్నారు. ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం ప్రాజెక్టుకు నిధులు వంటి అంశాల‌పై గ‌ళ‌మెత్తుతున్న ష‌ర్మిల‌.. అటూ జ‌గ‌న్, మ‌రోవైపు బీజేపీపై విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతున్నారు. ష‌ర్మిల దూకుడుకు చెక్ పెట్టేందుకు జ‌గ‌న్ సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది.  ఢిల్లీ వెళ్లి ప్ర‌ధాని మోదీ, అమిత్ షాల‌తో పాటు ఇత‌ర కేంద్ర మంత్రుల‌ను క‌లిసి ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం ప్రాజెక్టు నిధులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల‌పై విన్న‌వించుకొనేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈక్ర‌మంలో బుధ‌వారమే ఢిల్లీ వెళ్లాల్సిన జ‌గ‌న్‌.. మోదీ, అమిత్ షా అపాయింట్ మెంట్ దొరకకపోవడంతో ఆగిపోయారు.  వారి నుంచి ఎప్పుడు అపాయింట్ మెంట్ వ‌స్తే అప్పుడు వెళ్లి క‌లిసేందుకు జ‌గ‌న్ సిద్ధంగా ఉన్నార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వై.ఎస్ ష‌ర్మిల ఏకంగా త‌న మ‌కాంను ఢిల్లీకి మార్చేశారు. ష‌ర్మిల ఆధ్వ‌ర్యంలో ఏపీ కాంగ్రెస్ నేత‌లు ఢిల్లీవెళ్లి అక్క‌డ ధ‌ర్నా చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం ప్రాజెక్టు అంశంతోపాటు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌పై ప్ర‌శ్నించేందుకు ఢిల్లీవేదిక‌గా ధ‌ర్నా చేప‌ట్ట‌బోతున్నారు. శుక్ర‌వారం (ఫిబ్ర‌వ‌రి 2న‌) ఢిల్లీలో జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ధ‌ర్నా చేయ‌నున్నారు. మ‌రోవైపు జ‌గ‌న్ కంటే ముందే మోదీ, అమిత్ షాల‌తో భేటీకోసం షర్మిల ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.  వారితో భేటీకి అప్పాయింట్ మెంట్ ల‌భిస్తే.. ప్ర‌త్యేక హోదా, ఏపీకి సంబంధించిన అంశాల‌పై చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ట్లు కాంగ్రెస్ నేత‌లు పేర్కొంటున్నారు. అయితే, పైకి అలా చెప్పుకుంటున్నా.. మోదీ, అమిత్ షాల‌తో ష‌ర్మిల భేటీ అయితే.. జ‌గ‌న్ రెడ్డికి ఎలాంటి సాయం చేయ‌వ‌ద్ద‌ని ఆయ‌న కుటుంబాన్ని ఎలా మోసం చేశారో వివ‌రించడమే షర్మిల ఉద్దేశమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌డంతో సీఎం జ‌గ‌న్ కు బీజేపీ అవ‌స‌రం ఎంతైనా ఉంది. తాజాగా ఎన్నిక‌ల సంఘం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. షెడ్యూల్ ప్ర‌క‌ట‌న త‌రువాత మ‌రింత కఠినంగా ఉండే  అవ‌కాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీనికితోడు జ‌గ‌న్ స‌ర్వీస్ అధికారుల్ని శంక‌ర‌గిరి మాన్యాలు ప‌ట్టించేందుకు జాబితాను రెడీ చేసుకుంటున్నద‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. మ‌రోవైపు.. ష‌ర్మిల లేవ‌నెత్తుతున్న ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం ప్రాజెక్టు నిధులు, ఏపీకి రావాల్సిన నిధులు అంశాల‌పై మోదీ, అమిత్ షాల దృష్టికి తీసుకెళ్ల‌డం ద్వారా ష‌ర్మిల వ్యూహాల‌కు జ‌గ‌న్ చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే, జ‌గ‌న్ ఢిల్లీ టూర్ స‌మ‌యంలోనే ష‌ర్మిల ఢిల్లీలో తిష్ట‌వేయ‌డం, ఏపీ స‌మ‌స్య‌ల‌పై ఢిల్లీ వీధుల్లో నిర‌స‌నకు పూనుకోవ‌డంతో జ‌గ‌న్ శిబిరంలో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోందంటున్నారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను సూటిగా సుత్తిలేకుండా ప్ర‌శ్నిస్తూ తాడేప‌ల్లి పాలెస్ లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి నిద్ర‌లేకుండా చేస్తున్న ష‌ర్మిల‌.. ఇప్పుడు ఢిల్లీలోనూ వ‌ద‌ల  బొమ్మాలీ వదల అంటుండ‌టంతో తాడేప‌ల్లి ప్యాలెస్ లో కంగారు మొదలైందని చెబుతున్నారు.  మొత్తానికి ష‌ర్మిల మాత్రం.. ఏపీలోనే కాదు.. ఢిల్లీలోనూ జగన్ ను వదిలేదే లే.. తగ్గేదేలే అంటూ క‌య్యానికి కాలుదువుతున్నారు. మ‌రి జ‌గ‌న్ ష‌ర్మిల పెట్టే టెన్ష‌న్ నుంచి ఎలా త‌ప్పించుకుంటాడో చూడాల్సిందే.

నమో నమామి.. కేసీఆర్ కు మిగిలిన దారిదేనా?

బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడు క్రాస్ రోడ్స్ లో నిలబడ్డారు. ఒక వైపు ఒక్క ఓటమితో కకావికలుకావడానికి సిద్ధంగా ఉన్న పార్టీని కాపాడుకోవడం, అదే సమయంలో ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో పీకలోతు ఇరుక్కున్న కుమార్తె కవితను ఆ కేసు నుంచి బయటపడేయడం. రెండూ ఒకే నిర్ణయంతో జరిగేలా ఆయన వ్యూహ రచన చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  తెలంగాణ ఆవిర్బావం నుంచి వరుసగా రెండు దఫాలు అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లకు పైగా ముఖ్యమంత్రిగా కొనసాగిన ఆయన ఆ అధికార మత్తులో తనకు ఇక తిరుగే లేదన్న భ్రమల్లో పడ్డారు. అందుకే తన పార్టీకి అధికారం కట్టబెట్టిన, తనకు వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి పగ్గాలను అప్పగించిన తెలంగాణ అన్న సెంటిమెంటును పార్టీకి దూరం చేసేశారు. అందుకు ఆయన చెప్పిన కారణం.. తెలంగాణ సిద్ధించిన తరువాత ఇక ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ కొనసాగాల్సిన అవసరం లేదు.. ఈ తెలంగాణ మోడల్ ప్రగతిని దేశ వ్యాప్తం చేయాలంటే తాను ప్రధాని కావడమేనని ఆయన నమ్మారు. తన మాటను శిలాశాసనంగా భావించే పార్టీ నేతలు, శ్రేణులను నమ్మించారు. అలా నమ్మని వారు ఎవరైనా ఉన్న ఎందుకు వచ్చిన గొడవ అనుకున్నారో ఏమో నోరెత్త లేదు.   పదేళ్ళకు పైగా సాగిన తెలంగాణ ఉద్యమాలలో, ఆ తర్వాత మరో పదేళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాలను తన కంటి చూపుతో కంట్రోల్ చేసిన కేసీఆర్, దేశ రాజకీయాలను కూడా అలాగే దున్నేయగలనని భావించారు. అందుకు అనుగుణంగానే ఆయన అడుగులు కదిపారు. కాంగ్రెస్సేతర, బీజేపీ యేతర కూటమి, ధర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్ అంటూ దేశ మంతా చుట్టేశారు. ధనిక రాష్ట్రం అంటూ ఇక్కడి బాధితులను ఆదుకోవడం అన్న విషయాన్ని పూర్తిగా విస్మరించి.. ఇతర రాష్ట్రాలకు వెళ్లి రాష్ట్ర సొమ్మును పందేరం చేశారు. అయితే ఆయన మోడీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ప్రచారాన్ని ఉదృతం చేసి,  కేంద్రంపై విమర్శల తీవ్రత పెంచిన సమయంల అనూహ్యంగా ఢిల్లీ మద్యం కుంభకోణం తెరమీదకు వచ్చింది. ఆ కుంభకోణంలో కీలక పాత్ర  కేసీఆర్ తనయ, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటూ ఆరోపణలు వెల్లువెత్తడం, సీబీఐ, ఈడీల దర్యాప్తు ఆమె అరెస్టు దిశగా సాగడంతో కేసీఆర్ దూకుడుకు బ్రేక్ పడింది. ఇక అప్పటి నుంచీ కేంద్రంపై  ఆయన విమర్శల వరదకు కళ్లెం పడింది. సరిగ్గా ఇదే బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అంటూ కాంగ్రెస్ విమర్శలు వాస్తవమే అన్న నమ్మకం కలిగింది. అదే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమికి, స్వయంగా కేసీఆర్ పోటీ చేసిన రెండు స్థానాలలో ఒక స్థానం నుంచి పరాజయం పాలు కావడానికి ప్రధాన కారణాలలో ఒకటి అయ్యింది.  సరే ఇప్పుడు అధికారం ఎలాగూ దూరమైంది. ఇక ఆయన ముందు ఇప్పడు ఉన్న లక్ష్యాలు పార్టీని, కుమార్తెను కాపాడు కోవడం మాత్రమేనని పరిశీలకులు అంటున్నారు. అందు కోసం ఆయన బీజేపీని పల్లెత్తు మాట అనేందుకు కూడా ఒకటికి పది సార్లు ఆలోచిస్తారని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత బీఆర్ఎస్ నేతల విమర్శలను అధకార పగ్గాలు  అందుకుని నిండా రెండు నెలలు కూడా కాని కాంగ్రెస్ పైనే సంధిస్తున్నారు తప్ప బీజేపీపై మాత్రం ఆమోదయోగ్యం కాని సంయమనం పాటిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ పొలిటికల్ గా మాళ్లీ యాక్టివ్ అయ్యే అవకాశలు ఉన్నప్పటికీ, ఆయన నమో నరేంద్ర మోడీ) నమామి అంటూ సరెండ్ అవుతారనీ, బీజేపీ కాంగ్రెస్ ముక్త భారత్ నినాదానికి తన గొంతు విచ్చి మోస్తారని పరిశీలకులు అంటున్నారు.  కవేళ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యుంటే తప్పకుండా అదీ చేసేవారేమో? కానీ అనూహ్యంగా కాంగ్రెస్‌ చేతిలో ఓడిపోవడంతో తెలంగాణ గడప దాటి అడుగు బయట పెట్టలేని స్థితిలో ఉన్నారు. అసలు ఈ ఓటమి కేసీఆర్‌కు చాలా పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే అపర చాణక్యుడైన కేసీఆర్‌ని ఎదుర్కోవడం ఎవరి వల్లా కాదని, రేవంత్‌ రెడ్డికి నోటి దురద తప్ప మరేమీ చేతకాదని బిఆర్ఎస్ పార్టీలో అందరూ గుడ్డి నమ్మకంతో ఉండేవారు. నిజానికి కేసీఆరే వారందరికీ అటువంటి గుడ్డి నమ్మకం కలిగించారని చెప్పవచ్చు. అందుకే కేసీఆర్‌ జాతీయ రాజకీయాలంటూ కేసీఆర్‌ ప్రత్యేక విమానాలు వేసుకొని దేశాటన చేస్తున్నప్పటికీ అభ్యంతరం చెప్పలేదు. దేశంలో ఏ పార్టీ కూడా తమతో కలవకపోవడం వలననే కేసీఆర్‌ టిఆర్ఎస్‌ పేరుని బిఆర్ఎస్ పార్టీగా పేరు మార్చారని తెలిసి ఉన్నప్పటికీ ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. కీలకమైన శాసనసభ ఎన్నికలకు ముందు కేసీఆర్‌ మహారాష్ట్రలో చక్కర్లు కొడుతున్నప్పటికీ పార్టీలో ఎవరూ తప్పుపట్టలేదు. ఎందుకంటే కేసీఆర్‌పై అంత గుడ్డి నమ్మకం వారికి. ఆయన మంత్ర దండం తిప్పేసి బిఆర్ఎస్‌ని గెలిపించేస్తారని అందరూ గుడ్డిగా నమ్మారు కనుక! కానీ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కేసీఆర్‌ నిర్ణయాలలో చాలా తప్పులే కనిపిస్తున్నాయి వారందరికీ. అందుకే పార్టీ పేరుని మళ్ళీ టిఆర్ఎస్‌గా మార్చుకొనే ఆలోచనలు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలలో ఇతర రాష్ట్రాలలో పోటీ చేసే ఆలోచనలు విరమించుకొని, తెలంగాణకు మాత్రమే పరిమితం అవుతున్నారు. కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయాలన్నీ తప్పని బిఆర్ఎస్‌ నేతలు ప్రస్తుతం చాలా మృదువుగా చెప్పుకుంటున్నప్పటికీ, ఒకవేళ లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్‌ పార్టీ ఎంపీ సీట్లు తగ్గిపోతే వారందరూ మరింత స్పష్టంగా కేసీఆర్‌ తీరుని తప్పు పట్టవచ్చు. అప్పుడు కేసీఆర్‌ని వ్యతిరేకించేవారు లేదా కేసీఆర్‌ వద్దనుకునేవారు కాంగ్రెస్‌లోకి జంప్ అయిపోవడం ఖాయమే. బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల వలసలు మొదలైతే వాటిని కేసీఆర్‌ కూడా ఆపలేరు. కనుక అవి మొదలవకుండా చేయడంపైనే బిఆర్ఎస్‌ మనుగడ ఆధారపడి ఉంటుంది. ఓ పక్క కేసీఆర్‌ తలపై ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కత్తి వ్రేలాడుతూనే ఉంది. మరోపక్క రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కూడా కేసీఆర్‌, కేట్, హరీష్ రావులతో సహా బిఆర్ఎస్‌ నేతలందరి మెడలకు ఉచ్చు బిగించేందుకు అనేక కేసులు సిద్దం చేస్తోంది. ఇదివరకు కేసీఆర్‌ నుంచి రక్షణ కోసం ఈటల రాజేందర్‌ వంటివారు బీజేపీలో చేరితే, ఇప్పుడు ఈ కేసులు, పార్టీని చక్కదిద్దుకోవడం కోసం కేసీఆర్‌ స్వయంగా మోడీ పంచన చేరి బీజేపీ రక్షణ కవచం ధరించక తప్పదు. కేసీఆర్‌కు వేరే దారి లేదు కూడా. బహుశః లోక్‌సభ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ ఇదే చేయవచ్చు. 

ఇలా జాబితాలు.. అలా అసమ్మతులు!.. వైసీపీలో గందరగోళం

వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డి వైనాట్ 175, అలాగే లోక్ సభ స్థానాలు కూడా 25 అవుటాఫ్ 25 అంటూ తెగ ఊదరగొట్టేసి.. ఇప్పుడు గెలవాలంటే అభ్యర్థులను మార్చేయాలని భావిస్తున్నారు. అయితే అభ్యర్థులను కాదు.. గెలవాలంటే అధినేతను మార్చాలని, ఆయన నిర్ణయంతో తీవ్ర అసంతృప్తికి లోనై పార్టీ విడిచి వెళ్లి పోతున్న నేతలు చెబుతు న్న మాట. ఇప్పటి వరకూ ఆయన ఇలాంటి మార్పులు చేర్పులతో ఐదు జాబితాలు విడుదల చేశారు. మొత్తం 61 అసెంబ్లీ, 14 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.  ఒంగోలు వైసీపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి మళ్ళీ టికెట్‌ ఇవ్వాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి పట్టుబట్టినా పట్టించుకోలేదు.  అక్కడి నుంచి ఈసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తారని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. అలా చెప్పినట్లే ఒంగోలు లోక్‌సభ బాధ్యతలు చెవిరెడ్డికి కట్టబెట్టారు. గత్యంతరం లేక బాలినేని సర్దుకుపోయి ఒంగోలు అసెంబ్లీ సీటుతో సరిపెట్టకుంటానని చెప్పేశారు. అయినా ఆయనలో అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉంది. అది ఏక్షణంలోనైనా నివురు తొలగించుకుని భగ్గుమనడం తథ్యమని పరిశీలకులు అంటున్నారు. ఇక మాగుంట అయితే పార్టీని వీడేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక నెల్లూరు అర్బన్ వైసీపి ఎమ్మెల్యే అనిల్ కుమార్‌ యాదవ్ ఇంతకాలం తనకు నెల్లూరులో తిరుగే లేదని, పార్టీని వీడిన కోటంరెడ్డి, మేకపాటి, ఆనం ముగ్గురికీ తన తడాఖా చూపిస్తానంటూ గంభీర ఉపన్యాసాలు ఇస్తూ వచ్చారు. తీరా ఇప్పుడు ఆయనను నెల్లూరు నుంచి  మార్చేసి నరసరావు పేట ఎంపీగా పోటీ చేయమంటున్నారు. ఆయన ఇప్పటి వరకూ మౌనంగానే ఉన్నా.. పార్టీ మారే యోచన చేస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.  అందుకు కారణం లేకపోలేదు. అనీల్ కుమార్ యాదవ్ మాకు వద్దంటే వద్దని నరసరావుపేట వైసీపీ శ్రేణులు ఇప్పటికే ఆందోళన బాట పట్టారు. ఎలాగోలా సర్దుకుని పోటీ చేసినా నరసరావు పేట లోక్ సభ అభ్యర్థిగా పార్టీ శ్రేణుల సహకారం లేకుండా గెలిచే అవకాశాలు లేవని అనీల్ కుమార్ యాదవ్ భావిస్తున్నారు. అదే విధంగా సత్యవేడు వైసీపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను  ఈసారి తిరుపతి నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని జగన్‌ ఆదేశించి సత్యవేడు టికెట్‌ నూకతోటి రాజేష్‌కి ఇచ్చారు. ఈ మార్పును అంగీకరించని ఆదిమూలం  పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇంకా మరిన్ని జాబితాలు ఉన్నాయంటున్నారు. ఒక్కో జాబితాతో పార్టీలో అసమ్మతి, అసంతృప్తి పెరిగిపోతోంది. జాబితాలు పూర్తయ్యే నాటికి పార్టీలో ఉండేదెవరో, గుడ్ బై చెప్పి వెళ్లేదెవరో అన్న అయోమయం పార్టీ శ్రేణుల్లో నెలకొంది. 

మొరార్జీ రికార్డు సమం చేసిన విత్త మంత్రి..ఎందులో నంటే..?

కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్  గురువారం (ఫిబ్రవరి 10) 2024 మధ్యంతర బడ్జెట్ నిరాశాజనకంగా ఉంది. పాత పన్ను బకాయిల రద్దు మాత్రం ఒకింత ఊరట కలిగించినా పన్ను రేట్లను యథాతథంగా ఉంచడం, అలాగే ఆదాయపన్ను మినహాయింపు పెంపుపై వేతన జీవులు పెట్టుకున్న ఆశలను పట్టించుకోకపోవడం నిరాశ కలిగింది. అదే విధంగా పన్ను స్లాబుల విషయంలో కూడా ఎలాంటి మార్పూ చేయలేదు. అయితే ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ కావడంతో ఎటువంటి అంచనాలూ వద్దని నిర్మలా సీతారామన్ ముందు ప్రకటించడంతో ఈ బడ్జెట్ పై ఎవరూ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. అయితే ఈ మధ్యంత బడ్జెట్ గురించి చెప్పుకోవలసింది ఏమైనా ఉందంటే అతి విత్త మంత్రిగా  బడ్జెట్ లు ప్రవశ పెట్టడంతో నిర్మలా సీతారామన్ సృష్టించిన రికార్డు ఒక్కటే. అవును మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ మధ్యంతర బడ్జెట్ ల రికార్డును నిర్మలా సీతారామన్ సమం చేశారు. ఔను 1959 1964 మధ్య కాలంలో మోరార్జీ దేశాయ్ విత్త మంత్రిగా ఐదు పూర్తి స్థాయి బడ్జెట్ లు, ఒక ఓటాన్  అక్కౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఇప్పుడు ప్రస్తుత విత్త మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అలాగే ఆమె ఇప్పటి వరకూ ఎవరూ చేయని విధంగా అత్యంత సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసిన ఆర్థిక మంత్రిగా కూడా రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. 2020లో నిర్మలా సీతారామన్  వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ఏకంగా 2 గంటల 42 నిముషాలు ప్రసంగించారు.     

ఎవరి సాయం లేకుండానే హ్యాండ్ స్టిక్ పట్టుకుని కేసీఆర్ నడక!.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.  గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన దాదాపు రెండు నెలల తరువాత గురువారం (ఫిబ్రవరి 1) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నేతలు స్వాగతం పలికారు. స్పీకర్ ఛాంబర్ లో కేసీఆర్ ప్రమాక స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ పాల్గొన్నా ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం హాజరు కాకపోవడం రాజకీయ ఊహాగానాలకు తెరలేపింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలు అందరూ కూడా కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైనా, వారిలో ఇద్దరు కొత్త ప్రభాకరరెడ్డి, ప్రకాష్ గౌడ్ లు మాత్రం గైర్హాజరయ్యారు.  కేసీఆర్ ఫామ్ హౌస్ లో కాలుజారి పడటంతో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం జాప్యమైంది. అయితే.. అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెడతారా? అసలు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారా? అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అయ్యాయి.  అయితే ఆ అనుమానాలన్నీ నిరాధారమేనని కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడంతో తేలిపోయింది.  అయితే కేసీఆర్ తుంటి ఎముక విరగడంతో ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో బీఆర్ఎస్ లో చోటు చేసుకున్న పరిణామాలే కేసీఆర్ ను రాజకీయాలకు గుడ్ బై చెబుదామన్న యోచనను విరమించుకునేలా చేశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆయన విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో నేతను ఎవరన్న దానిపై ఏకాభిప్రాయం కుదరకపోవడం, అదే సమయంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీరుపై పార్టీ ఎమ్మెల్యేలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేయడంతో పార్టీని కాపాడుకోవడం, ఎమ్మెల్యేలు జారిపోకుండా నిలువరించడం కేసీఆర్ వినా మరెవరు బీఆర్ఎస్పీ నేతగా ఎన్నికైనా సాధ్యం కాదన్న అభిప్రాయంతోనే కేసీఆర్ మళ్లీ క్రియాశీలంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇలా ఉండగా తుంటి ఎముక  గాయం నుంచి కేసీఆర్ చాలా వరకూ కోలుకున్నట్లుగా కనిపిచారు. కొన్ని రోజుల కిందటి వరకూ హ్యాండ్ స్టిక్ ఉన్నాఎవరో ఒకరు సాయం చేస్తే తప్ప అడుగులు వేయలేకపోయిన కేసీఆర్ ఇప్పుడు ఎవరి సాయం లేకుండానే హ్యాండ్ స్టిక్ పట్టుకుని నడవడం కనిపించింది. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఆయన తొలిసారిగా విపక్ష నేతగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆయన ఎవరినైతే అసెంబ్లీలో చూడడానికి ఇష్టపడలేదో అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో సభా నాయకుడిగా ఉన్నారు.  

వైసీపీ@5వ జాబితా.. నాలుగు ఎంపీ, మూడు ఎమ్మెల్యే స్థానాలు ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిదో అభ్యర్థుల జాబితాను  విడుదల చేసింది. ఈ జాబితాలో నలుగురు ఎంపీల పేర్లు ప్రకటించడంతో పాటు మూడు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్‌. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్‌కుమార్‌ యాదవ్‌. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి రమేష్‌ బాబు. సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నూకతోటి రాజేష్‌. అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా రేగం మత్స్యలింగం. అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు పేర్లను ప్రకటించింది.  ఇప్పటికే జగన్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో కూడిన నాలుగు జాబితాలను పలు దఫాలుగా విడుదల చేసిన విషయం విదితమే. మరికొద్ది రోజుల్లో మరిన్ని జాబితాలు విడుదల చేసే అవకాశం ఉంది. అయితే నరసరావుపేట ఎంపీగా నెల్లూరు సీటీ ఎమ్మెల్మే , మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను ఎంపిక చేశారు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా టీటీడీ మాజీ చైర్మన్, రాయలసీమ టీడీపీ నాయకుడు పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడిని బరిలో దింపేందుకు సైకిల్ పార్టీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపాలని ఫ్యాన్ పార్టీ అధినేత వైయస్ జగన్ నిర్ణయించారని.. దీంతో అనిల్ కుమార్ యాదవ్ పేరు ఖరారు చేసినట్లు సమాచారం. ఇక తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తినే మళ్లీ ఎంపిక చేశారు. 2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా బి దుర్గా ప్రసాద్ ఎన్నికయ్యారు. కానీ ఆయన ఆకస్మిక మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో  డాక్టర్ గురుమూర్తిని జగన్ పార్టీ బరిలో దింపింది. ఆ ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. దాంతో మళ్లీ ఆయనకే ఈ స్థానాన్ని కట్టబెట్టింది.    అలాగే మచిలీపట్నం లోక్ సభ స్థానం ప్యాన్ పార్టీ అభ్యర్థిగా సింహద్రి రమేష్ బాబును ఎంపిక చేశారు. ఆయన ప్రస్తుతం అవనిగడ్డ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక ఇప్పటి వరకు మచిలీపట్నం ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి పవన్ పార్టీ కండువా కప్పుకోవడంతో.. ఆ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా సింహద్రి రమేష్ బాబును సీఎం వైయస్ జగన్ తెరపైకి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేసిన డాక్టర్ సింహద్రి చంద్రశేఖరరావు.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సింహద్రి సత్యనారాయణ కుమారుడన్న సంగతి అందరికీ తెలిసిందే.  అలాగే కాకినాడ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవనున్న చలమలశెట్టి సునీల్ సైతం గతంలో ఇదే స్థానం నుంచి అదే పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. మళ్లీ ఆయన రానున్న ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారు.

రాజధాని ఫైల్స్.. ఏపీలో రాజకీయ ప్రకంపనలేనా?..

వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందే చిత్రాలు ఎప్పుడూ ప్రేక్షకుల మెప్పు పొందుతాయి. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది రైతుల ఆవేదనని కళ్ళకి కట్టినట్టు చూపిస్తూ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన తాజా చిత్రం 'రాజధాని ఫైల్స్'. శ్రీమతి హిమ బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై కంఠంనేని రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి భాను దర్శకత్వం వహించారు. 'రాజధాని ఫైల్స్' చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. టైటిల్ లోగోలో పొలం దున్నే నాగలి ఉండటం ఆకట్టుకుంది. అలాగే పోస్టర్ కూడా ఎంతో క్రియేటివిటీగా ఉంది. ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన ఒక యువ నాయకుడు.. వేలాది రైతు కుటుంబాలకు నేనున్నాను అని భరోసా ఇస్తున్నట్లుగా పోస్టర్ లో కనిపిస్తోంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ లో మరో రాజకీయ నాయకుడు రూపం ఉన్నట్లుగా గమనించవచ్చు. అలాగే పోస్టర్ మీద "ఒకే ఒక్కడి అహం.. వేలాది రైతులకి కన్నీరు.. కోట్ల కుటుంబాల భవిష్యత్తు అంధకారం." అని రాసుంది. వాస్తవ సంఘటనలకు సహజమైన భావోద్వేగాలను జోడించి ప్రేక్షుకుల్లో ఆలోచన రేకెత్తించేలా ఈ చిత్రాన్ని రూపొందించారట. సంగీత దర్శకుడు మణిశర్మ, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ వంటి దిగ్గజాలు ఈ సినిమా కోసం పని చేయడం విశేషం. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.