అసెంబ్లీలో బాబు గ్యారంటీలకు ప్రచారం!.. ఓటమి భయంతో జగన్ లో అయోమయం!
posted on Feb 7, 2024 5:09AM
ఏపీలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.. ఈ సమయంలో మరోసారి అధికారంలోకి వచ్చేది మేమేనంటూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సభల్లో గొంతెత్తి అరుస్తున్నాడు.. వైసీపీ శ్రేణులు జగన్ మాటలకు చప్పట్లు కొడుతున్నారు. కానీ, వారిలో సగం మందికి పైగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ గద్దెదిగడం ఖాయమని తెలుసు. జగన్ మోహన్ రెడ్డి సభల్లో పాల్గొని బయటకొచ్చే సమయంలోనే కొందరు ఈ విషయాన్ని చర్చించుకుంటూ వస్తున్నారు. ఏదో తప్పని పరిస్థితుల్లో జగన్ సభలకు రావడం తప్పితే.. వచ్చే ఎన్నికల్లో జగన్ గెలవడు అన్న చర్చ వైసీపీ శ్రేణుల్లో జోరుగా నడుస్తోంది. అసలు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని వాళ్లూ వీళ్లూ చెప్పడం కాదు.. స్వయంగా జగనే అంగీకరించేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను అధికారంలోకి రాకపోయినా బాధపడనని చెప్పిన సంగతి తెలిసిందే.
తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో జగన్ ప్రసంగం చూస్తే రాజకీయాలపై అవగాహన ఉన్న ఎవరికైనా జగన్ ఓటమిని ఒప్పుకున్నారని స్పష్టంగా అర్థమైపోతుంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేపట్టింది, ఎన్నికోట్లు ఖర్చు చేసింది, ఎంతమందికి లబ్ధి చేకూరింది. అనే విషయాలను ఏ ముఖ్యమంత్రి అయినా ప్రస్తావిస్తారు. కానీ, జగన్ మాత్రం అసెంబ్లీలో ఉన్నామన్న విషయం మరిచి.. ఓ బహిరంగ సభలో మాట్లాడినట్లు ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం ఆయనలోని ఓటమి భయాన్ని తేట తెల్లం చేస్తున్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఏపీలో అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం కోసం అంతా అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. సుమారు నాలుగున్నరేళ్లు అధికారంలో ఉన్న జగన్.. తన పాలన తీరును ఏ విధంగా సమర్థించుకుంటారు. అసలు సమర్ధించుకోవడానికి ఏముంది అంటూ ఆయన ప్రసంగం కోసం ఆసక్తిగా చూశారు. కానీ, జగన్ మాత్రం నాలుగున్నరేళ్లు ప్రజలకు ఏం చేశాం.. రాష్ట్రంలో అభివృద్ధి ఏ స్థాయిలో జరిగింది? ఎన్నికొత్త కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి? ఎంత మందికి ఉపాధి దొరికింది అనే అంశాలను ప్రస్తావించకుండా.. రెండు పత్రికలు, ఓ టీవీ చానెల్ పేరును పదేపదే ప్రస్తావించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకానొక దశలో టీవీల ముందు జగన్ స్పీచ్ ను వీక్షించిన పలువురు వైసీపీ శ్రేణులు సైతం జగనన్నా.. మీరు ఉన్నది అసెంబ్లీలో, పబ్లిక్ మీటింగ్ లో కాదన్నా అని మొత్తుకోవటం గమనార్హం. మరోవైపు కరోనా వల్ల నష్టపోయామని, ప్రతీ రాష్ట్రానికి ఓ పవర్ హౌస్ లా ఉండే మహానగరం లేకపోవడం వల్ల ఇంకా నష్టపోయామని.. అందువల్ల ఏమీ చేయలేక పోయామన్నట్లుగా జగన్ వివరణ ఇచ్చుకోవటం అసెంబ్లీలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలతోపాటు బయట ఉన్న వైసీపీ శ్రేణులు కంగుతినేలా చేసింది. జగన్ తన స్పీచ్‌లో ప్రతీ రాష్ట్రానికి ఓ పవర్ హౌస్ ఉండాలని, అలాంటి పవర్ హౌస్ విశాఖ అవుతుందని అనేక సార్లు ప్రస్తావించారు. కానీ, ఐదేళ్లలో విశాఖ అభివృద్ధికి ఏం చేశామనే విషయాలను ప్రస్తావించలేదు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అసెంబ్లీలో స్క్రీన్ వేసి మరీ చూపించారు. ఆ పథకాలను ఒక్కొక్కటిగా వివరిస్తూ ఇన్ని నిధులు ఎలా తెస్తారు? ఎలా అమలు చేస్తారు? అంటూ సీఎం జగన్ ప్రస్తావించారు. అసెంబ్లీలో జగన్ స్పీచ్ చూసిన వైసీపీ శ్రేణులు సైతం జగనన్నా.. అసలు రాష్ట్రానికి మీరేం చేశారు..? మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారు? అని చెప్పకుండా చంద్రబాబు పథకాలు ఎందుకు ప్రచారం చేస్తున్నావన్నా అంటూ తలలు పట్టుకున్న పరిస్థితి. అసెంబ్లీలో జగన్ ప్రసంగం మొత్తం వీక్షించిన వారికి చిరికి అర్థమయ్యేది ఒక్కటే.. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదన్న విషయాన్ని జగన్ స్వయంగా చెప్పేశారని. ఇప్పటికే తెలుగుదేశం. జనసేన పొత్తుతో అసెంబ్లీ ఎన్నికల రణరంగంలోకి దిగుతుండటంతో జగన్ అండ్ కో బెంబేలెత్తిపోతున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం, జనసేన పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు ఆ పార్టీ అధినాయకత్వం పడరాని పాట్లు పడుతుంది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నది. కానీ, జగన్ అండ్ కో ఆటలు సాగడం లేదు.
ఇన్నాళ్లు జగన్ మోహన్ రెడ్డికి అండగా ఉంటూ వచ్చిన కేంద్రంలో బీజేపీ పెద్దలు సైతం వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందన్న అంచనాకు వచ్చేశారు. పలు ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా జగన్ ఓటమి ఖాయమని తేల్చిశాయని పలువురు బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. దీంతో బీజేపీ కూడా తెలుగుదేశం, జనసేన కూటమిలో చేరేందుకు సిద్ధమైందని పరిశీలకులు అంటున్నారు. నేడో రేపో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలబోతున్నారు. మరోవైపు గతంలో జగన్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆయన సొంత సోదరి వైఎస్ షర్మిల ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో అందరూ కలిసి నన్ను ఒంటిరివాడిని చేశారు. నేను మిమ్మల్నే నమ్ముకున్నా అంటూ ప్రజల్లో మరోసారి సానుభూతి అస్త్రాన్ని జగన్ ప్రయోగిస్తున్నారు. కానీ, ఏపీ ప్రజలు మాత్రం చీదరించుకుంటున్న పరిస్థితి. ఒకసారి సానుభూతి చూపి రాష్ట్రాన్ని, మా జీవితాలను నాశనం చేసుకున్నాం. ఈసారి నిన్ను ఇంటికి పంపిస్తామంటూ ఏపీ ప్రజలు నినదిస్తున్నారు. దీంతో జగన్ అండ్ కో మీడియా ముందు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా ఓటమి తథ్యమన్న విషయం వారికికూడా అర్థమైంది. ఇందుకు తాజాగా అసెంబ్లీలో జగన్ ప్రసంగమే నిదర్శనం.