ఏదీ గెలుపు బాట.. మిత్రుల కోసం వేట.. కమలనాథుల్లో తగ్గిన ధీమా!
సార్వత్రిక ఎన్నికల ముంగిట బీజేపీలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సర్వేలన్నీ మోడీ సర్కార్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ఘోషిస్తున్నా.. బీజేపీ హై కమాండ్ లో మాత్రం ఆ విశ్వాసం మచ్చుకైనా కనిపించడం లేదు. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వచ్చే ఎన్నికలలో 400 సీట్లలో గెలుపు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నా.. మరో సారి అధికారంలోకి రావాలంటే సొంత బలం సరిపోదన్న అంచనాలలో ఆ పార్టీ ఉంది. అందుకే చేతులారా దూరం చేసుకున్న మిత్ర పక్షాల కోసం తలుపులు బార్లా తెరవడమే కాదు.. మెట్లు దిగి మరీ వాటిని ఆహ్వానిస్తోంది. బుజ్జగిస్తోంది. అయ్యిందేదో అయిపోయింది.. ఇక నుంచి మనం మిత్రపక్షాలం. పెద్దన్న పాత్ర పోషించకుండా మిత్రధర్మాన్ని పాటిస్తాం నమ్మండి ప్లీజ్ అని బతిమలాడుకుంటోంది.
నిజానికి ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్ పేయి సారధ్యంలో 24 పార్టీల కూటమిగా కేంద్రంలో చక్రం తిప్పిన ఎన్డీఎ ఇప్పుడు చిక్కి శల్యమైపోయింది. బీజేపీ వినా ఆ కూటమిలో చెప్పుకోదగ్గ పార్టీ లేదంటే అతిశయోక్తి కాదు. ఇందుకు కారణం మోడీ, అమిత్ షాల పోకడలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
నిజానికి, 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఏకపార్టీ ఆధిక్యత సాధించిన రోజునే, ఎన్డీఎ కథ ముగింపు దశకు చేరింది. ఇంచు మించుగా మూడు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా 2014 ఎన్నికలలో లోక్ సభలో బీజేపీ సొంతగా సాధారణ మెజారిటీ (272)కు 10 సీట్లు అదనంగా (282) గెలిచి చరిత్రను తిరగ రాసింది. అలాగే 2019 ఎన్నికల్లో బీజేపీ సొంత బలం మరింత పెరిగి 303 కు చేరింది. మరో వంక ప్రతిపక్ష కూటమి, యూపీఎకు సారధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ దినదిన ప్రవర్థమానంగా దిగజారి ప్రాంతీయ పార్టీల పంచన చేరింది.
అయినా 2014లో, 2019లో బీజీపీ ప్రధాని మోడీ సారధ్యంలో ఎన్డీఎ సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో తెలుగు దేశం, శివసేన, అకాలీదళ్, సహా అనేక ప్రాంతీయ పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. అయితే ఆ తర్వాత ఏమి జరిగిందన్నది అందరికీ తెలిసిందే. ఎవరి కారణాలు వారికీ ఉన్నా, ఒక్కొక్క పార్టీ ఎన్డీఎకి దూరమవుతూ వచ్చాయి.
2019 ఎన్నికల్లోనూ అకాలీ దళ్, శివసేన, పాశ్వాన్ పార్టీ ఎల్ జేపీ, ఎఐఎడిఎంకే, జేడీ(యు)సహా అప్నా దళ్, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ వంటి మరికొన్ని చిన్నా చితక పార్టీలు సహా మొత్తం తొమ్మిది పార్టీలు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలుగా బీజేపీతో కలిసి పోటీచేశాయి. కానీ, ఇప్పుడు ఆ చిన్నా చితక పార్టీలలో కొన్ని మాత్రమే కూటమిలో మిగిలాయి. బీజేపీ సహజ మిత్ర పక్షాలు శివసేన, అకాలీ దళ్ సహా ప్రధాన ప్రాంతీయ పార్టీలన్నీ ఎన్డీఎ గూడు వదిలి పోయాయి. ఇక ఇప్పుడు ఎన్డీఎలో ఉన్న పార్టీలు ఏవీ రాజకీయంగా అంతగా ప్రభావం చూపగలిగే పార్టీలు కాదు. ఏ పార్టీకీ కూడా లోక్ సభలో ఒకటి రెండు స్థానాలకు మించి లేవు.
అయితే, మిత్ర పక్షాలు బీజేపీకి ఎందుకు దూరం అవుతున్నాయి? బీజేపీతో చెలిమిని మిత్ర పక్షాల ఎందుకు దృతరాష్ట్ర కౌగిలిగా భావిస్తున్నాయి? బీజేపీకి మిత్ర పక్షాలు దురమవుతున్నాయా? లేక బీజేపీనే ఉద్దేశపూర్వకంగా మిత్ర పక్షాలను పోమ్మనకుండా పొగబెట్టి, సాగనంపుతోందా? మిత్ర పక్షాలు మోడీ, షా జోడీ రాజాకీయ వ్యూహ చతురతను తట్టుకోలేక చక్రబంధాలను ఛేదించుకుని బయట పడుతున్నాయా? అంటే ఇదీ కారణం అని చెప్పడానికి పరిశీలకులు కొంచం తటపటాయిస్తున్నా.. వాస్తవం మాత్రం బీజేపీ ఒంటెత్తు పోకడలే.. చిన్నా చితకాపార్టీలను నిర్వీర్యం చేయడానికీ, వాటి ఉనికిని ప్రశ్నార్ధకం చేయడానికీ కమలం పార్టీ చేస్తున్న సర్పయాగం లాంటి క్రతువేకారణమనడంలో సందేహం లేదు.
ఎన్డీయేకు దూరమైన ఒక్కొక్క పార్టీదీ ఒక్కొక్క కథ. తెలుగు దేశం పార్టీ అప్పట్లో బయటకు వచ్చిన కారణాలకు, అలాగే నితీష్ కుమార్ బయటకు వెళ్ళిన కారణాలకు పొంతన లేదు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాటం ప్రకటించి బయటకు వచ్చారు. చంద్రాబాబు రాజకీయ ప్రయోజనాలు చూసుకోలేదు.కానీ, నితీష్ కుమార్ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగుతుందని, కమల దళానికి కటీఫ్ చెప్పలేదు. బీజేపీ చెలిమి భస్మాసుర హస్తంగా మారుతోందన్న భయంతో, తన అధికారానికి ముప్పు ఏర్పడిందన్న కారణంతో తెగతెంపులు చేసుకున్నారు. అలాగే, అకాలీ దళ్, శివసేన ఇలా ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క కథ.. ఒక్కొక్క వ్యథ.
అయితే ఒకటి మాత్రం నిజం, మోడీ, షా జోడీ నాయకత్వంలో బీజేపీ శతృమిత్ర బంధాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలను సమ దృష్టితో చూసింది. అన్ని పార్టీలను రాజకీయ ప్రత్యర్ధులుగానే చూసింది. అందుకే మోడీ, షా జోడీ అడుగులు ఏక పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం వైపుకు సాగుతున్నాయా? అనే అనుమానాలను పరిశీలకులు బలంగా వ్యక్తం చేశారు. చేస్తున్నారు. నిజానికి ఒక విధంగా మోడీ,షా జోడీ రాజకీయ అశ్వమేధ యాగం సాగిస్తున్నారు. కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్యంగా మొదలు పెట్టిన ఈ యాగం కాంగ్రెస్ కథ ముగింపుతో కానీ ముగిసేలా లేదని పరిశీలకులు విశ్లేషణలు చేశారు. చేస్తున్నారు.
అయితే 2024 సార్వత్రిక ఎన్నికల ముంగిట మోడీ, షా ద్వయం ఏకఛత్రధిపత్య ధోరణికి చెక్ పడిందనే చెప్పాలి. ఎన్డీయే కూటమికి దాదాపు శుభం కార్డు పడిపోయిన దశ కనిపించడం, అదే సమయంలో కాంగ్రెస్ పుంజుకోవడం, బీజేపీయేతర పార్టీల మధ్య విభేదాలున్నా.. ఐక్యతా ప్రయత్నాలు జరుగుతుండటం కమలనాథులలో ఆందోళనకు కారణమైంది. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదానికి కాలం చెల్లిపోయిందనీ, అయోధ్య రామమందిరం, మతం ప్రాతిపదికన పోలరైజేషన్ కలలు సాకారమయ్యే పరిస్థితి లేదని అర్ధం అవ్వడంతో ఇప్పుడు బీజేపీ భాగస్వామ్య పక్షాలను వెతుక్కునే పనిలో పడింది. అందుకే ముందుగా జేడీయూను ఆ పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసమే ముందుకు వచ్చినా ఎలాంటి అరమరికలూ లేకుండా అక్కున చేర్చుకుంది. ఆ తరువాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీనీ ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానించింది.
ఇప్పుడు కూడా నితీష్ ఎన్డీయే కూటమిలోకి రావడానికి, చంద్రబాబు ఎన్డీయే కూటమిలో చేరేందుకు ఓకే చెప్పడానికీ వేర్వేరు కారణాలున్నాయి. అది వేరే సంగతి. కానీ బీజేపీ మాత్రం మరో సారి అంటే ముచ్చటగా మూడో సారి కేంద్రంలో అధికారం చేపట్టాలంటే ఒంటరి పోరుతో కుదిరే పని కాదని తేలిపోయింది. అందుకే తన ఆటిట్యూడ్ తో దూరం చేసుకున్న పార్టీలను ఇప్పుడు రెండు మెట్లు దిగి మరీ ఆహ్వానిస్తోంది. అధికారాన్ని కాపాడుకోవడం కోసం నితీష్ కుమార్ ఎన్డీయే పంచన చేరితే.. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం చంద్రబాబు ఎన్డీయే ఆహ్వానాన్ని మన్నిస్తున్నారు. మొత్తం మీద ఎన్డీయేను బలోపేతం చేయడం ద్వారా మాత్రమే మూడో సారి అధికారం అని మోఢీ భావిస్తున్నారు. అందుకోసమే దూరమైన భాగస్వామ్య పక్షాలను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.