కరీంనగర్ లో బండి నడక నల్లేరు మీద కాదు!
posted on Feb 7, 2024 @ 10:15AM
తెలంగాణలో బీజేపీ ప్రస్థానం ఆశలు, నిరాశల మధ్య కొనసాగుతోంది. అధికారం తథ్యం అంటూ ఆత్మవిశ్వాసంతో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి దిగిన ఆ పార్టీకి నిరాశ తప్పలేదు. ఇప్పుడు మళ్లీ వచ్చే లోక్ సభ ఎన్నికలలో అత్యధిక స్ఖానాలలో విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది.
బీజేపీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో సింగిల్ డిజిట్ దాటకపోయినా ఎనిమిది అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని గౌరవ ప్రదమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే ఆ ఎన్నికలలో అధికారమే తరువాయి అన్నంతగా ఆ పార్టీ చేసిన, చేసుకున్న ప్రచారం కారణంగా ఆ పార్టీ తెలంగాణలో సింగిల్ డిజిట్ పార్టీయే అంటూ ప్రత్యర్థులు చేసిన విమర్శలు నిజమయ్యాయి.
ఇక ఇప్పుడు ఆ పార్టీ రానున్న సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించింది. 2019 సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలలో నాలుగింటిలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికలలో ఆ స్కోరును అధిగమించాలన్న పట్టుదలతో ఉంది. వీలైతే అసెంబ్లీ ఎన్నికలలో సాధించలేని డబుల్ డిజిట్ ను ఈ సార్వత్రిక ఎన్నికలలో సాధించాలని ఆశపడుతోంది. అయితే ఆ ఆశ నెరవేరుతుందా? లేదా అన్నది పక్కన పెడితే.. గత సార్వత్రిక ఎన్నికలలో గెలుచుకున్న స్థానాలను నిలబెట్టుకుంటుందా? అంటే పరిశీలకులు అదంత ఈజీ కాదంటున్నారు. ముఖ్యంగా గత ఎన్నికలలో కరీంనగర్ లోక్ సభ స్థానంలో విజయం సాధించిన బండి సంజయ్ కు ఈ సారి అక్కడ ఎదురు గాలి వీస్తోందని, ఆయన విజయం నల్లేరు మీద బండి నడక ఇంకెంత మాత్రం కాదనీ చెబుతున్నారు.
అయితే అయోధ్య రామమందిరం ప్రభావం పడితే మాత్రం రాష్ట్రంలో బీజేపీ పలు లోక్ సభ స్థానాలలో గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు. బండి సంజయ్ కు అది కలిసి వస్తే కనుక భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని చెబుతున్నారు. అయితే బండి సంజయ్ విజయాని కాంగ్రెస్ రూపంలో గండం ఉందని కూడా చెబుతున్నారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ బలహీనంగా ఉండటం, అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట ప్రభావాన్ని పరిగణనలోనికి తీసుకుంటే తెలంగాణ మొత్తంలో బీజేపీకి గ్యారంటీ అని చెప్పడానికి కరీంనగర్ స్థానం ఒక్కటే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల ముందు బండి సంజయ్ ను బీజేపీ అధిష్టానం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో పార్టీలోనే కాకుండా సామాన్య జనంలో కూడా ఆయన పట్ల సానుభూతి వ్యక్తం అవుతోంది. అయితే ఆ సానుభూతి ఆయనకు అసెంబ్లీ ఎన్నికలలో పెద్దగా ఉపయోగపడలేదు. ఆయన పోటీ చేసిన కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పరాజయం పాలు కావడమే ఇందుకు నిదర్శనం.
అదే విధంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్రంలో బీజేపీ శ్రేణులు బాగా డీలా పడ్డాయి. అదే సమయంలో ఎన్నికల ముందు బండి సంజయ్ కు పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన బీజేపీ హైకమాండ్ వైఖరి పట్ల కూడా గుర్రుగా ఉన్నారు. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాడి, జైలు పాలై, పలు కేసులలో ఉన్న బండి సంజయ్ విషయంలో బీజేపీ అధిష్ఠానం తీరు కారణంగానే గెలుపు తథ్యమనుకున్న పలు స్థానాలలో గత అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు ఓటమిని మూటగట్టుకున్నారన్న అసంతృప్తి క్యాడర్ లో ఉంది. ఆ కారణంగానే బీజేపీలో పెద్దగా జోష్ కనిపించడం లేదు.