అనం మాటల యుద్ధం అందుకే మొదలు పెట్టారా
posted on Apr 15, 2013 @ 12:26PM
ఆర్ధిక మంత్రి రామనారాయణరెడ్డి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా.రాజశేఖర్ రెడ్డిపై అతని కుటుంబ సభ్యులపై చేసిన తీవ్రవిమర్శలు ఊహించినట్లే కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మద్య మంటలు రేపాయి. దానికి కాంగ్రెస్ నేతలు ఒకరొకరిగా తమవంతు వ్యాక్యానాలు, విమర్శలు జోడిస్తూ ఆ మంటలు చల్లారకుండా చూస్తున్నారు. అయితే ఇది యాదృచ్చికంగా మొదలుపెట్టిన యుద్ధం మాత్రం కాదని చెప్పవచ్చును. తీవ్ర సమస్యలలో చిక్కుకొని ప్రతిపక్షాల దాడికి విలవిలలాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తనకి బాగా అబ్బిన విద్యనే మళ్ళీ మరో మారు లాఘవంగా ప్రదర్శించి ఊహించిన ఫలితాలు రాబట్టిందని చెప్పవచ్చును.
పెరిగిన కరెంటు చార్జీలపై ప్రతిపక్షాలన్నీ ఐకమత్యంగా ప్రభుత్వంపై చేస్తున్నపోరాటాన్నిఅలాగే దీర్ఘకాలం కొనసాగిస్తే ప్రజలలో అది మరింత ప్రభుత్వ వ్యతిరేఖత పెంచుతుందని గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల, మీడియా, మరియు ప్రతిపక్షాల దృష్టిని మళ్ళించగల అంశం కోసం ఎదురు చూస్తుంటే, సీబీఐ చార్జ్ షీటు నెత్తి మీద పిడుగులా పడింది. దానితో కాంగ్రెస్ పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలోకి దూకినట్లయింది. కిరణ్ కుమార్ ముఖ్యమంత్రిగా అధికారం చేప్పట్టిన నాటి నుండి ఒక సమస్య నుండి మరో సమస్యలోకి పయనిస్తున్నకాంగ్రెస్ ప్రభుత్వం, నెత్తిన పిడుగులా పడిన ఊహించని ఈ సమస్యకు మొదట దిగ్భ్రాంతి చెందినా, తరువాత మెల్లగా కోలుకొని తన కాంగ్రెస్ మార్క్ తెలివి తేటలు ప్రదర్శించింది.
ఈ ఆంశంలోనే డా.రాజశేఖర్ రెడ్డి, అతని కొడుకు జగన్ మోహన్ రెడ్డి అవినీతి భాగోతాలు కూడా ఇమిడి ఉండటంతో ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్లు వారిని విమర్శించడం ద్వారా ప్రతిపక్షాలన్నిటికీ పని కల్పించడమే కాకుండా, అందరి దృష్టిని మళ్లించగలిగింది. ఇప్పుడు అందరి దృష్టీ మంత్రి ఆనం రామి నారాయణ రెడ్డి చేసిన తీవ్రవిమర్శల మీద, దానికి వస్తున్న ప్రతిస్పందన మీద ఉంది తప్ప, దీనికి ప్రధాన కారణమయిన ‘సీబీఐ చార్జ్ షీటు-హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిని పదవి నుండి తొలగించాలనే డిమాండ్’ మీద లేదిప్పుడు.
ఇదే విధంగా ఆమె విషయం మరికొంత కాలం నాన్చగలిగితే ఆ తరువాత ఆమెను కూడా ధర్మాన ప్రసాదరావులాగే వెనకేసుకు రావడం పెద్ద కష్టమేమి కాదని కాంగ్రెస్ ఆలోచన కావచ్చును. దీనిని బట్టి అర్ధం అవుతున్నది ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించలేదేమో కానీ, తన సమస్యలను మాత్రం ఈ విధంగా చాలా తెలివిగా చాకచక్యంగా పరిష్కరించుకోగలదని అర్ధం అవుతుంది.