సిరివెన్నెల సీతారామశాస్త్రీగారి బర్త్‌ డే స్పెషల్‌

          వాన బొట్టు ఆల్చిప్పాలో పడితేనే ముత్యం అవుతుంది. అదే చినుకు సముద్రంలో పడితే అలలలో కొట్టుకుపోతుంది అలా సాక్షాత్తు సరస్వతీ దేవి తెలుగు తెరకు అందించిన అపురూప ఆణిముత్యం సీతారామశాస్త్రీ తన తొలి సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రీ ప్రస్థుతం తెలుగు సినిమా సాహిత్యానికి పెద్దదిక్కుగా నడిపిస్తున్నారు..    ఆయన కలం అన్ని భావాలను అవలీలగా పలికిస్తుంది.. సిరివెన్నెల గారి పాటల్లో జీవిత సత్యాలు ఆలోచింప చేస్తాయి కొత్త జీవన మార్గాన్ని చూపిస్తాయి.. కోటీశ్వరున్ని కూటికి గతిలేని వాన్ని ఒకే బండి ఎక్కిస్తాయి.. ఒకే గమ్యాన్ని చేరుస్తాయి..           సీతారామశాస్త్రీగారి పాటలలో బరువైన పద ప్రయోగాలు ఆకట్టుకుంటాయి.. మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చేయాజారాకా అన్న పదం ఆయన తప్ప ఇంకెవరు రాయగలరు.. అందుకే ఆయన తెలుగు సినిమా సాహిత్యాన్ని శాసించగలుతున్నారు        భారీ పద ప్రయోగాలు బరువైన మాటలే కాదు ఆయన చిన్న చిన్న పదాలతో ఈ తరానికి అర్ధమయ్యేలా అలరించేలా కూడా పాటలు రాయగలరు.. ఖడ్గం సినిమాలో ఆయన రాసిన ముసుగువేయోద్దు మనసు మీద అన్నపాటలో ఎంత ఆధునికత ఉందో అంతే జీవిత సత్యం కూడా ఉంది..         ఎలాంటి సందర్భం మీదైనా ఎలాంటి విషయం మీదైనా పాట రాయగలిగిన సీతారామశాస్త్రీ ఆయన ఇష్టం దైవం పరమేశ్వరుని మీద పాట అంటే మరింత ప్రేమగా రాస్తారు.. ఆ అవకాశం ఆయన తొలి సినిమాలోనే వచ్చింది.. ఆ అవకాశమే ఆది భిక్షువు వాడినేమి అడిగేది అంటూ పాటగా ప్రవహించింది..        సంధేశాత్మక మాటలతో పాటలే కాదు, చిన్న చిన్న పదాలతో ఆకట్టుకునే పాటలు కూడా రాయగలరు సిరివెన్నెల.. అలా ఆయన రాసిన అల్లరి పాటల్లో కూడా నీతి బోదలే కనిపిస్తాయి.. అందుకే ఆయన సిరివెన్నెల అయ్యాడు..        ప్రాసలు, గమకాలతో కూడా ఆయన ఆడుకోగలడు అందుకే ఆయన పాటల్లో శాస్త్రీయత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది…  తెలుగు పాటకు పంచామృతాల పవిత్రను కల్పించిన సిరివెన్నెలగారు వెండితెర మీద చేయని ప్రయోగం లేదు..        సీతారామశాస్త్రీ గారి కలానికి అన్ని వైపులా పదునే ఉంటుంది.. అందుకే ఆయన ఎలాంటి పాటనైనా అవలీలగా రాయగలరు.. అద్భుతమైన భక్తి పాటలను రాసిన ఆయన ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి రోమాంటిక్‌ సాంగ్‌తో కూడా మెప్పించారు..        ఓ మంచి రచయితకు సరైన సందర్భంగా దొరికితే ఎలాంటి పాట వస్తుందో సీతారామ శాస్త్రీగారు చాలా సార్లు నిరూపించారు… పవిత్రబందం సినిమాలో ఆయన రాసిన అపురూపమైనదమ్మ ఆడజన్మ పాట అలాంటి పాటల్లో ఒకటి..         అచ్చమైన తెలుగు పదాలతోనే కాదు.. ఆయన పల్లెపదుల జానపదాలతోనూ ప్రయోగాలు చేయగలడు.. రుద్రవీణ సినిమాలో ఆయన రాసిన నమ్మకు నమ్మకు ఈ రేయిని పాట.. ఆయనకు తెలుగు భాషమీద ఉన్న పట్టుకు ఓ నిదర్శనం..         సీతారమశాస్త్రీ ఓ రచయిత మాత్రమే కాదు సమాజంలోని తప్పులను ప్రశ్నించే ఓ సమాజ సేవకుడు కూడా.. అందుకే దశాబ్దాల క్రితమే ఆయన ఈ సమాజంలోని సిగ్గులేని జనాల్ని నిగ్గదీసి అడగమంటూ పిలుపునిచ్చారు.        దేశంలోని రాజకీయ సామాజిక వ్యవస్థల మీద కూడా సీతారామశాస్త్రీగారికి మంచి అవగాహన ఉంది.. అందుకే ప్రస్థుత రాజకీయ సామాజిక వ్యవస్థను ప్రశ్నిస్తూ అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వరాజ్యమందామా అంటూ ప్రశ్నించాడు..         పదాలతో ఎలాంటి ప్రయోగాలు చేసినా ఆయనలో లోతైన తత్వవేత్త కూడా ఉన్నాడు.. అందుకే ఆయన జగమంత కుటుంబం నాది అంటూనే ఏకాకి జీవితం నాది అంటూ నిట్టూరుస్తాడు. సంసార సాగరం నాదంటూనే సన్యాసం శూన్యం నాదంటాడు.. ఆయన చెప్పిన తత్వం.. ఆయన మాత్రమే చెప్పగలిగిన వేదాంతం..         సిరివెన్నెల కలం నుంచి వచ్చిన  మరో అద్భుతం జరుగుతున్నది జగన్నాటకం.. దశావతార ఘట్టాన్ని నేటి జీవన విదానానికి ఆయన అన్వయించిన తీరు నిజంగా అద్భుతం.. అది సీతారామ శాస్త్రీకి మాత్రమే సాధ్యం..        ఆత్రేయ వేటూరి లాంటి మహానుభావుల తరానికి, చంద్రబోసు, అనంత శ్రీరామ్‌ లాంటి ఈ తరానికి మధ్య ఆయన వారథి.. నేటి సినీ సాహిత్యానికి రథసారథి.. అందుకే  ఈ సిరివెన్నెల మరింత కాలం మన వెండితెర మీద విరబూయాలని కోరుకుంటూ సీతారామశ్రాస్తిగారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము..

మహేంద్ర రెడ్డికి కెసిఆర్ పది కోట్ల ఆఫర్

  ఇటీవల తెరాస నుండి సస్పెండ్ అయిన రఘునందనరావు, పద్మాలయ స్టూడియోస్ యాజమాన్యం నుండి హరీష్ రావు రూ.80లక్షలు పిండుకొన్నాడని ఆరోపణలు చేశారు. అంతే కాక, ఆయన గత ఎన్నికలలో సిరిసిల్ల నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న తారక రామారావును ఓడించేందుకు స్వతంత్ర అభ్యర్ధిగా నిలబడిన మహేంద్ర రెడ్డికి ఏభై లక్షలు పంపారని ఆరోపించారు.   తెరాస అధినేత చంద్రశేఖర్ రావు మొదట మహేంద్ర రెడ్డికే పార్టీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చినప్పటికీ, ఆఖరి నిమిషంలో తన కొడుకు కె.తారకరామారావుకు ఇవ్వడంతో ఆగ్రహించిన మహేంద్ర రెడ్డి స్వంతత్ర అభ్యర్ధిగా రంగంలో దిగారు. హరీష్ రావ్ తనకు ఏభై లక్షలు పంపారని ఆరోపిస్తున్న రఘునందన రావు మాటలకి స్పందిస్తూ, “తానూ పోటీ నుండి తప్పుకుంటే తెరాస అధినేత చంద్రశేఖర్ రావు పది కోట్లు ఆఫర్ ఇచ్చారని’ మహేందర్ రెడ్డి స్పష్టం చేసారు. అంతే కాకుండా తనకు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజక వర్గం టిక్కెట్ కూడా ఇస్తానని ప్రలోభపెట్టారని, కానీ తానూ పోటీ నుండి విరమించుకోలేదని ఆయన అన్నారు. ఆ పోటీలో చివరికి కె.తారకరామారావే గెలిచినా ఆయనకు కేవలం రెండు వందల ఓట్లలోపు మెజార్టీతో గండం గట్టెక్కడం, పోటీ ఎంత తీవ్రంగా సాగిందో తెలియజేస్తుంది.   రఘునందన్ రావు చేసిన ఆరోపణలు హరీష్ రావు, కేటీఆర్ ల మధ్య విభేదాలను బయటపెడితే, మహేంద్ర రెడ్డి చెప్పిన విషయం కేసీఆర్ ఎన్నికలలో గెలవడం కోసం డబ్బులు ఎంతగా విరజిమ్ముతున్నాడో తెలియజేప్తోంది. ఉద్యమపార్టీగా ఆవిర్భవించిన తెరాస చివరికి ఏదశకు చేరుకొందో ఈ రెండు సంఘటనలు తెలియజేస్తున్నాయి. రఘునందనరావు రేపటి ఎపిసోడ్ లో ఇంకెన్ని రహస్యాలు బయటపెడతాడో చూడాలి.

కళంకిత మంత్రులను తొలగిస్తారా!

      అవినీతి మంత్రుల జాబితాలో ఉన్న సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావుల తొలగింపు ఖాయమే అని అనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన నుండి తిరిగి రాగానే జరుగుతున్న పరిణామాలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. ఇప్పటికే ధర్మాన, సబితలు సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారిని కొనసాగించడం ఏ మాత్రం మంచిది కాదని, వారిని తొలగించి అవినీతికి, అక్రమాలకు కాంగ్రెస్ పార్టీ దూరం అని చాటాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి మీదనే ఈ బాధ్యత వేసినట్లు సమాచారం. అందుకే ముఖ్యమంత్రి శ్రీకాకుళంలో ఉన్న మంత్రి ధర్మానను ఉన్నపళంగా హైదరాబాద్ రావాలని కోరారు. రాత్రి వరకు అక్కడే ఉన్న ఆయన ముఖ్యమంత్రి ఫోన్ రాగానే వెంటనే బయలుదేరారు. ఇక కాంగ్రెస్ అధికార ప్రతినిధి పీసీ చాకో అవినీతి మంత్రులు గౌరవంగా తప్పుకోవాలని సూచించడం కూడా అధిష్టానం ఆలోచనలకు అద్దం పడుతుంది.

కళంకిత మంత్రులు తప్పుకొంటేనే బెటర్: చాకో

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డిల్లీ పెద్దలను కళంకిత మంత్రులను క్యాబినెట్ లో కొనసాగించుకోనేందుకు ఒప్పించుకొన్నారని, మరో వైపు ‘సబితా, ధర్మానలని ఇంటికి సాగనంపడానికి రంగం సిద్ధం’ అంటూ టీవీ చాన్నాళ్ళు బ్రేకింగ్ న్యూసులతో హోరెత్తించేస్తుంటే, హైదరాబాద్ చేరుకొన్న కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఇంతవరకు నోరు విప్పలేదు. అయితే ఆయన హైదరాబాద్ లో దిగే సమయానికే, అక్కడ డిల్లీ నుండి మరో బ్రేకింగ్ న్యూసు వచ్చిపడింది. అది ఎఐసిసి అదికార ప్రతినిధి పిసి చాకో వండి వడ్డించిన వార్త.   ఆయన డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, కేంద్రంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఇద్దరు మంత్రులు ఏవిధంగా స్వచ్చందంగా (?) తమ పదవుల నుండి తప్పుకొన్నారో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు తమంతట తామే తప్పుకొంటే బాగుంటుందని శలవిచ్చారు.   రెండు రోజుల నుండి వారు పదవులలో కొనసాగడంపై న్యూస్ చానల్సో జరుగుతున్న చర్చా కార్యక్రమాలు, న్యూస్ పేపర్లలో వస్తున్న విశ్లేషణలు వగైరాలన్నీ చూస్తే ఆత్మాభిమానం ఉన్న వారెవరయినా ఈపాటికే రాజీనామా ఇచ్చిఉండేవారు. కానీ అటువంటిదేమి జరుగలేదు. ఇంతవరకు రాష్ట్రంలో ప్రతిపక్షాలు అరిచి గీ పెట్టినా వారు ఖాతరు చేయలేదు. కాంగ్రెస్ పార్టీకే చెందిన హనుమంత రావు వంటి పెద్దమనుషులు చెపుతున్నావారు పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి చాకోయే ‘మీ అంతట మీరు తప్పుకొంటే బాగుటుందని’ చెప్పడం వారికి చెంప దెబ్బ వంటిదే. అయినప్పటికీ, వారు తమ పదవులలో కొనసాగితే, రేపటి నుండి ప్రతిపక్షాలు చాకో మాటలనే పట్టుకొని కళంకిత మంత్రులను నిలదీయడం మొదలుపెడతాయి.   గోటితో పోయే దానిని గొడ్డలి వరకు తెచ్చుకొని అవమానకర పరిస్థితుల్లో రాజీనామాలు చేసిన కేంద్ర మంత్రుల కెదురయిన దుస్థితి, ‘ఆ ఐదుగురికి’ కూడా ఎదురయ్యే వరకు కొనసాగుతారో, లేక రేపే రాజీనామాలు సమర్పించుకొని ఈ గొడవ నుండి బయట పడతారో చూడాలి.

సీపీఐ నేతలను దువ్వుతున్న చంద్రబాబు

  తెలుగుదేశం పార్టీతో సీపీఐ, సీపీఎం పార్టీలకు మొదటి నుండి సత్సంబంధాలే ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఆ రెండు పార్టీలలో సీపీఎం సమైఖ్యాంధ్ర కి మద్దతు ఇస్తుండగా, సీపీఐ ప్రత్యేక తెలంగాణాకు మద్దతు ఇస్తోంది. అందువల్ల ఆ రెండు పార్టీలు కూడా సీమంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీతో ఎన్నికల పొత్తులకి సిద్దమే అయినప్పటికీ, సీపీఐ మాత్రం తన తెలంగాణా వాదానికి అనుకూలంగా తెరాసతో పొత్తులకి మొగ్గు చూపుతోంది. తెలంగాణా జిల్లాలలో సీపీఐ చాలా చోట్ల మంచి బలంగా ఉంది. అది వెళ్లి మరింత బలమయిన తెరాసతో చేతులు కలిపితే ఇక తెలుగుదేశం పార్టీ తెలంగాణాలో బొటాబొటి సీట్లతోనే సరిపెట్టుకోవలసి వస్తుంది.   ఈసారి రాష్ట్రంలో ఎలాగయినా మళ్ళీ అధికారంలోకి రావాలని కలలుకంటున్న చంద్రబాబుకి, తెలంగాణాలో ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోతే, మళ్ళీ మరో ఐదేళ్ళు ప్రతిపక్షానికే పరిమితమవక తప్పదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వరుసపెట్టి రోజుకొక కొత్త పధకంతో తెలంగాణాలో దూసుకుపోతుంటే, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ‘సీమంధ్ర పార్టీలు మనకొద్దు’ అని ఇప్పటి నుండే తెలంగాణా ప్రజలలో సెంటిమెంటు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు.   ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణా జిల్లాలో ఉన్నఒక్క స్నేహితుడిని, ఆసరాను వదులుకోవడం చంద్రబాబుకి ఇష్టం లేదు. కానీ, ఆయనకి అవసరమని సీపీఐ తన పంధా మార్చుకోదని కూడా ఆయనకీ స్పష్టంగా తెలుసు. ఇక లాభం లేదనుకొన్న ఆయన ఈ సమస్యని రెండో వైపు నుంచి నరుక్కురావాలనే ఆలోచనతో సీపీఐ జాతీయ నాయకులను దువ్వడం మొదలుపెట్టారు.   యుపీయే, ఎన్డీయేల ధోరణితో విసుగెత్తిపోయున్నవారు ఆ రెంటికీ ప్రత్యామ్నాయంగా కేంద్రంలో 3వ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారు. భక్తుడు కోరుకొన్నదే దేవుడు కూడా వరంగా ఇచ్చినట్లు, చంద్రబాబుకూడా ప్రస్తుతం ఎన్డీయే కూటమితో జత కట్టే ఆలోచనలేదు కనుక, ఆయన కూడా కేంద్రంలో 3వ ఫ్రంట్ ఏర్పాటు చేసి మళ్ళీ చక్రం తిప్పాలని కలలు కంటున్నారు. అందువల్ల స్వామి కార్యంతో బాటు స్వకార్యం కూడా సిద్దిస్తుందంటే ఎవరు మాత్రం కాదంటారు?   అందుకే ఇటీవల చంద్రబాబు డిల్లీ వెళ్లినప్పుడు సీపీఐ జాతీయ నాయకులను కలిసి 3వ ఫ్రంట్ గురించి చర్చించి వచ్చారు. సీపీఐ నేత బర్ధన్ మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు చంద్రబాబు ఆయనను తన ఇంటికి ఆహ్వానించి 3వ ఫ్రంట్ గురించి చర్చించడమే కాకుండా, ఆయనకు శాలువా కప్పి సన్మానం కూడా చేసారు. ప్రస్తుతానికి చంద్రబాబు కేవలం 3వ ఫ్రంట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నపటికీ, అది పూర్తిగా రూపురేఖలు దిద్దుకొన్న తరువాత, తెలంగాణాలో తన తెలుగుదేశం పార్టీకి సీపీఐ మద్దతు ఈయాలనే మెలికపెడితే అప్పుడు ఉభయ పార్టీల విశాల ప్రయోజనాలను దృష్టిలోఉంచుకొని సీపీఐ తెలంగాణా ప్రాంతంలో కూడా తెదేపాతో పొత్తులకి సిద్దపడవచ్చునని చంద్రబాబు దూరాలోచన. మరి సీపీఐ చంద్రబాబు కోసం తన తెలంగాణా వాదం పక్కన పెడుతుందా లేదా అనేది మున్ముందు తెలుస్తుంది.

అవినీతిని లైట్ తీసుకోమంటున్న మంత్రిగారు

  సీబీఐని పంజరంలో ఉన్న చిలుకగా అభివర్ణించిన సుప్రీంకోర్టు, ఆ ఒక్క చిలుకకు అనేక మంది యజమానులని ప్రభుత్వ పెద్దలను విమర్శించింది. సీబీఐపై ప్రభుత్వ ప్రమేయం, అజమాయిషీ, ఒత్తిళ్ళు లేకుండా పనిచేసేందుకు చట్టంలో అవసరమయిన మార్పులు వెంటనే చేయమని సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడంతో, అందుకు తగిన సూచనలు, సలహాలతో ఒక నివేదికను తయారు చేసేందుకు ఆర్ధిక మంత్రి చిదంబరం నేతృత్వంలో ఐదుగురు మంత్రులతో కూడిన ఒక కమిటీ ఏర్పడింది. అయితే, కమిటీకి నేతృత్వం వహిస్తున్న చిదంబరం గారు, ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నపటికీ, అక్కడి నుండే తన అమూల్యమయిన సలహా ఒకటి తెలియజేసారు.   సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా దర్యాప్తు విషయంలో సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని, కానీ అదే సమయంలో సీబీఐ కూడా ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలని ఆయన అన్నారు. అంటే, చిలుక ఎగురవచ్చును కానీ మళ్ళీ పిలవగానే వచ్చి గూటికి చేరిపోవాలన్నమాట. ప్రపంచంలో సీబీఐ వంటి వివిధ వ్యవస్థలు తప్పనిసరిగా అక్కడి కార్యనిర్వాహక వ్యవస్థకు (ప్రభుత్వానికి) లేదా శాసనవ్యవస్థకు లేదా కోర్టులకు జవాబుదారీగా ఉంటాయి. అదేవిధంగా మన దేశంలో కూడా సీబీఐ ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండవలసి ఉంటుందని ఆయన అన్నారు.   అదే సమయంలో సీబీఐ దర్యాప్తుల్లో ప్రభుత్వం లేదా ప్రభుత్వంలో ఇతర వ్యక్తులు జోక్యం కల్గించుకోకుండా ఆ వ్యవస్థను ఏవిధంగా కట్టు దిట్టం చేయాలనేదే ఇప్పుడు మన ముందున్న సమస్య అని ఆయన అన్నారు.   మనం అవినీతి గురించి మరీ అంత బెంగ పెట్టేసుకొనవసరం లేదని చిదంబరం గారు శలవిచ్చారు. ఎందుకంటే అవినీతి ఒక్క భారత దేశానికే పరిమితమైన అంశం కాదని, ప్రపంచంలో ప్రతి దేశంలో ఈ అవినీతి ఆరోపణలనేవి ఉన్నాయని అందువలన అవినీతిని లైట్ తీసుకోమని సూచించారు. మరి సీబీఐ గురించి, వ్యవస్థలో అవినీతి గురించి ఇంత గొప్ప అభిప్రాయాలున్న చిదంబరంగారు నేతృత్వంలో కమిటీ ఎటువంటి నివేదిక తయారు చేస్తుందో చూడాల్సిందే.

రఘునందన్ రావు గొంతులో ఆంధ్రావాయిస్

  తెరాస బహిష్కృత నేత రఘునందన్ సినీ నటుడు కృష్ణకు చెందిన పద్మాలయ స్టూడియోస్ భూముల వ్యవహారంలో ఆసంస్థ నుండి హరీష్ రావు రూ.80లక్షలు వసూలు చేసారని చేసిన ఆరోపణలపై స్పందించేందుకు తెరాస నేతలు కొంచెం సమయం తీసుకొన్నపటికీ, యధావిధిగా తమ ఎదురు దాడి వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంబించారు. అందుకు తమకు బాగా అచ్చొచిన ‘ఆంధ్రా అస్త్రాన్ని’ రఘునందన్ రావుపైకి ప్రయోగించి బోడి గుండికి మోకాలికి ముడి పెట్టె ప్రయత్నం చేసారు.   తెరాస నేత ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ, రఘునందన్ రావు గొంతులో ఆంధ్రా పాలకుల, రాజకీయ నాయకుల స్వరం వినిపిస్తోందని, తెలంగాణా ఉద్యమానికి వ్యతిరేఖంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి ముగ్గురూ కలిసికట్టుగా నడుపుతున్న ఈ కుట్రలో రఘునందన్ రావు పావుగా మారాడని ఆరోపించారు. తెలంగాణా ఉద్యమంలో చీలికలు తెచ్చేందుకు గతంలో ఈవిధంగా చాలా మందే ప్రయత్నించారని, కానీ వారందరూ మట్టిలో కలిసిపోయారని అన్నారు. చివరికి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి కూడా తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యాడని, ఇప్పుడు రఘునందన్ రావు ద్వారా కొంత మంది ఆంధ్రా పాలకులు, రాజకీయ నేతలు తెలంగాణా ఉద్యమాన్ని దెబ్బ తీయాలని ప్రయత్నిస్తూన్నారని, వారికుటిల యత్నాలన్నిటినీ ఎదుర్కొని ఉద్యమం నిలబడుతుందని అన్నారు.   రఘునందన్ రావు దగ్గర నిజంగా సీడీలు ఉంటే వాటిని వెంటనే బయటపెట్టాలని, లేకుంటే ఆయనపై పరువు నష్టం దావా వేస్తామని ఆయన హెచ్చరించారు. రఘునందన్ రావు ఎటువంటి వాడో తెలుసు కోవాలంటే, ఒకసారి పటాన్ చెరువు (హైదరాబాద్ శివారు ప్రాంతం) ప్రాంత ప్రజలను అడిగితే తెలుస్తుందని ఆయన హేళన చేసారు.   ఇక, అతను అవినీతిపరుడని ఈటెల రాజేందర్ అభిప్రాయపడుతున్నపుడు, మరి ఇంత కాలం ఆయనతో భుజం భుజం రాసుకొని ఎందుకు పనిచేసారూ? అవినీతి పరుడని తెలిసిన తరువాత ఆయనని పార్టీలో ఎందుకు కొనసాగించవలసి వచ్చింది? అనే ప్రశ్నలకి ఆయనని నిందిస్తున్న తెరాస నేతలు జవాబు చెప్పవలసి ఉంది.   ఇక అదేవిధంగా, తెరాసలో కేవలం తానూ మాత్రమే పరిశుద్ధ ఆత్మ కలవాడినని, మిగిలిన వారందరూ అవినీతి పరులేనన్నట్లు మాట్లాడుతున్న రఘునందన్ రావు, మరి వారు అటువంటి వారని తెలిసి, వారి అవినీతి భాగోతాలను కళ్ళారా చూస్తూ కూడా మరి ఇంత కాలం ఎందుకు ఆ పార్టీలో వారితో కలిసి పనిచేసారు? తెరాస నేతలు అందరి దగ్గర డబ్బు దండుకొంటున్నారని ఆరోపిస్తున్న ఆయన, తనను పార్టీ నుండి అదే కారణంతో బహిష్కరించినందుకు ఆయనేమి జవాబు చెపుతారు? తాటి చెట్టుక్రింద కూర్చొని పాలు తాగుతున్నానని ఎవరు చెప్పినా ప్రజలు అవి పాలని నమ్మరు. గనుక, తన మీద తెరాస చేసిన వసూళ్ళ ఆరోపణలకు ఆయన జవాబు చెప్పుకోక తప్పదు.   ఇక, ఆయన తన వద్ద ఉన్న సీడీలు తెరాస నేతలు తీసుకొన్న చెక్కుల కాపీలు వగైరా మీడియా ముందు పెడితే, ఎవరి కధ ఏమిటో ప్రజలే అర్ధం చేసుకొంటారు. తెరాస నేతలు కూడా అవి బయట పెట్టమనే గట్టిగా డిమాండ్ చేస్తున్నారు గనుక ఆ పనేదో చేసి చూపిస్తే ఎవరు ఎటువంటి వారో ప్రజలకీ అర్ధం అవుతుంది.

పీసీసీ పడవలో మరో 14మందికి చోటు

  కాంగ్రెస్ అధిష్టానంతో ఎడతెగని చర్చలు చేసిచేసి అలసి సోలసిపోయిన పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ ఈరోజు సాయంత్రమే డిల్లీ నుండి విజయనగరం చేరుకొన్నారు. అయితే, ఆయనేమీ ఇంతవరకు ప్రజలు పండుగ చేసుకోనేంత గొప్ప వార్తలేవీ ఇంకా చెప్పలేదు. కానీ, తన పీసీసీ నౌకలో మరి కొంత తమందిని ఎక్కించుకొనేందుకు (కార్యవర్గ విస్తరణకు)అధిష్టానం అనుమతి తెచ్చుకొన్నారని మాత్రం సమాచారం వెలువడింది. 9మంది ప్రధాన కార్యదర్శులు,5 మంది ఉపాద్యక్షుల పోస్టులు భర్తీ చేసుకోనేందుకు బొత్స డిల్లీ నుండి అనుమతి తెచ్చుకొన్నారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీలో 14మంది రాజకీయ నిరుద్యోగులకు లేదా అసమ్మతి నేతలకు ఉపాధి దొరుకుతుంది. ఇక రేపు డిల్లీ నుండి తిరిగి రానున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తన ప్రభుత్వంలో ఎటువంటి మార్పులు చేర్పులకు అనుమతి తెచ్చుకొంటారో వేచి చూడాలి. తరచూ ఇటువంటి డిల్లీ పర్యటనలతో బిజీగా ఉండే మన మంత్రులు రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ మార్క్ పాలన ఎలాగ ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు.

హనుమంతన్న మంచి మాట

  కళంకిత మంత్రులను తొలగించాలని మొదటి నుండి గట్టిగా కోరుతున్న వారిలో సీనియర్ నేత వీ.హనుమంత రావు ఒకరు. అయితే, అది చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే ఉంది. అయినప్పటికీ, ఆయన అవకాశం దక్కినప్పుడల్లా తన వాదన గట్టిగ వినిపిస్తూనే ఉన్నారు. డిల్లీలో అధిష్టానానికి, రాష్ట్ర నేతలకి మధ్య ఎడతెగక సాగుతున్న మంతనాలను చూసి ఆయన మళ్ళీ ఈ రోజు మరో మారు తన వాదన గట్టిగా వినిపించారు.   ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రులను నిర్దోషులని నమ్మిన్నంత మాత్రాన్న సరిపోదని, ఆవిషయం ప్రజలు నమ్మడమే ముఖ్యమని ఆయన అన్నారు. వారు నిర్దోషులని ఆయన దృదంగా నమ్ముతున్నందున ‘ఆ ఐదుగురు’ మంత్రులను ప్రభుత్వం నుండి తొలగించి వారికి నిర్దోషిత్వం నిరూపించుకొనే అవకాశం కల్పించాలని, ఒకవేళ వారు నిజంగా నిర్దోషులేనని ఋజువు చేసుకోగలిగితే, దానివల్ల ఆయన అభిప్రాయం నిజమని ప్రజలకి అర్ధం అవుతుందని ఆయన ఒక మంచి లాజిక్ పాయింటు కూడా చెప్పారు. కర్ణాటకలో ప్రజలు అక్కడి బీజేపీ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేఖంగా ఓటువేసి ఓడించిన విషయం కిరణ్ కుమార్ రెడ్డి కూడా బాగా గుర్తుంచు కోవాలని, తన ప్రభుత్వంలో కళంకిత మంత్రులను పెట్టుకొని ప్రజల వద్దకు వెళితే ఏమవుతుందో కర్ణాటక ఎన్నికలు ప్రత్యక్షంగా తెలియజేస్తున్నాయని అని ఆయన చెప్పారు.

తెదేపా తలుపులు తెరిచిందా?

  మొన్న తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ తాము తలుపులు తెరవలేదని ఒకవేళ తెరిస్తే ఇక ఇతర పార్టీల దుఖాణాలు మూసుకోవలసిందేనని, కానీ తాము ఆచి తూచి ఎవరినయినా లోపలి రానిస్తామని అన్నారు. మరి ఆయన నిజంగా అచితూచి తీసుకొంటున్నారో లేక తెరాస కంటే తమది పైచేయని నిరూపించుకోవడానికే తీసుకొంతున్నారో కానీ, ఆ పార్టీ నుండి ఎగిరి వచ్చి తమ పార్టీ ఆఫీసు మీద వాలుతున్న తెరాస వలస పక్షులను ఆయన సాదరంగా లోనకి ఆహ్వానిస్తున్నారు. ఇటీవల చాడా సురేష్ కుమార్ రెడ్డి, తన అనుచరులతో సహా వచ్చి తెదేపాలో చేరారు. ఈరోజు దొమ్మేటి సాంబయ్య వచ్చి తెదేపాలో చేరారు. కడియం శ్రీహరి కాళీ చేసిన వరంగల్ యంపీ సీటును ఆశిస్తున్న ఆయనని, పార్టీలోకి తీసుకోవడం ద్వారా చంద్రబాబు ఆ సీటు ఆయనకే ఖరారు చేసినట్లు భావించవచ్చును. సాంబయ్య గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసి తెరాసలోకి వెళ్లి, మళ్ళీ ఇప్పుడు పార్టీలోకి తిరిగివచ్చారు. స్థానికంగా మంచి పలుకుబడి ఉన్న సాంబయ్యే, కడియం శ్రీహరి వతని బలమయిన నాయకుడిని ఎదుర్కోవడానికి తగిన అభ్యర్ధి అని చంద్రబాబు భావించి ఆయనను పార్టీలోకి తీసుకొని ఉండవచ్చును.

ఎన్టీఆర్, పవన్ తరువాత అల్లు అర్జున్!

      పూరి జగన్నాథ్‌.. తెలుగు సినిమాకు స్పీడు నేర్పిన స్టార్‌ డైరెక్టర్‌.. చాలా రోజుల తరువాత బాలీవుడ్‌లో మెగాఫోన్‌ పట్టిన తెలుగు డైరెక్టర్‌.. కమర్షియల్‌ సినిమాకు కరెక్ట్‌ ఎగ్జామ్‌పుల్స్‌ లాంటి సినిమాలను చేసే ఈ స్టార్‌ డైరెక్టర్‌ కూడా అప్పుడప్పుడు పొరపాట్లు చేశాడు.    అవును పూరి లాంటి గ్రేట్‌ డైరెక్టర్‌ కూడా స్టార్‌ హీరోల విషయంలో మాత్రం పప్పులో కాలేశాడు.. భారీ బ్లాక్‌ బాస్టర్‌లతో మంచి ఫామ్‌లో ఉన్నారనుకున్న యంగ్‌ హీరోలను తన సినిమాతో మళ్లీ ఫ్లాప్‌ బాట పట్టించాడు..       పూరి కెరీర్‌ లోనే భారీ డిజాస్టర్స్‌లో ఆంద్రావాలా సినిమా ఒకటి.. సింహాద్రి లాంటి బిగ్‌ హిట్‌ తరువాత ఎన్టీఆర్‌ చేసిన ఈ సినిమాతో ఎన్టీఆర్‌ నెంబర్‌ వన్‌ హీరోగా సెటిల్‌ అవుతాడు అనుకున్నారు.. అప్పటికే పూరికి కూడా మంచి ఇమేజ్‌ ఉండటంతో ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఏర్పడ్డాయి.. కాని సినిమా రిలీజ్‌ తరువాత మాత్రం సీన్‌ రివర్స్‌ అయింది.. తొలి షో నుంచే సినిమా ఫ్లాప్‌ టాక్‌ మూట కట్టుకోవటంతో ఆ సినిమా ఎన్టీఆర్‌, పూరిల కెరీర్‌ను వెనక్కు నెట్టింది..               చాలా గ్యాప్‌ తరువాత ఇదే తప్పును మరోసారి చేశాడు పూరి… దాదాపు పుష్కరకాలంగా హిట్‌లేక సతమతమవుతున్న పవన్‌కళ్యాణ్‌ అభిమానుల ఆకలి తీర్చిన సినిమా గబ్బర్‌సింగ్‌.. అప్పటి వరకు ఉన్న చలనచిత్ర రికార్డులన్నింటినీ తిరగరాస్తూ ఈసినిమా ఘనవిజయం సాదించింది.. అయితే ఈ సినిమా తరువాత పూరి తో కలిసి కెమెరామెన్‌ గంగతో రాంబాబు సినిమా చేశాడు పవన్‌.. మరోసారి కెరీర్‌ పీక్స్‌ను టచ్‌ చేసింది అనుకున్న హీరోకు తన సినిమాతొ చుక్కలు చూపించాడు పూరి..           ఇప్పుడు మరోసారి ఇదే సాహసం చేయబోతున్నాడు పూరి.. జులాయి లాంటి మంచి సక్సెస్‌తో ఫామ్‌లో ఉన్న అల్లు అర్జున్‌ హీరోగా ఇద్దరమ్మాయిలతో సినిమా చేస్తున్నాడు మరి ఈ సినిమాతో అయినా పూరి తన మీద ఉన్న ఈ అపవాదును చేరిపేసుకుంటాడో లేదో చూడాలి..  

దాడి రాకతో కొణతాలకు అనారోగ్యం మొదలు

  జగన్ మోహన్ రెడ్డి ఎలాగో కష్టపడి కొండెక్కి కూర్చొన్న సురేఖ దంపతులని చంచల్ గూడా జైలులోకి దింపగలిగారు. కానీ, దాడి వీరభద్రరావును చేర్చుకోవడంతో కణకణమండుతున్న రామకృష్ణుడి కోపం మాత్రం ఇంకా చల్లార్చలేకపోతున్నారు. ఆయన జైలుకి వెళ్లేందుకు ఇష్టపడకపోవడంతో, ఈ సమస్యకి పరిష్కారం దొరకడంలేదు.   రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యుడయిన కొణతాల క్రిందటి వారం హైదరాబాదులో జరిగిన కమిటీ సమావేశానికి మొహం చాటేశారు. ఇక, మొన్న షర్మిలమ్మ 2000కిమీ పాదయాత్ర పూర్తిచేసుకొన్నపుడు పార్టీలో చిన్నా పెద్దా నాయకులందరూ తరలివెళ్లి ఆమెకు అభినందనలు తెలిపినా, కొణతాల ఆయన అనుచరులు మాత్రం వెళ్ళలేదు. మళ్ళీ నిన్న జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశానికి కూడా ఆయన మొహం చాటేశారు. మామూలు పరిస్థితుల్లో అయితే ఎవరు వచ్చినా రాకున్నా మీడియా పెద్దగా పట్టించుకోదు. కానీ, కొణతాల హాజరు కాకపోతే మాత్రం మీడియాకు జవాబు చెప్పుకోవడానికి వైకాపా నేతల చాలా ఇబ్బందిపడవలసి వస్తోంది. ఆయన అనారోగ్యం వల్ల సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్లు తమకి ముందే తెలియబరిచారని వైకాపా నేతలు చెప్పుకొన్నారు. ఇటువంటి అనారోగ్య పరిస్థితులు ఆయనకీ మచివి కావు అటు పార్టీకి మంచివి కావు కనుక ఆయన ఆరోగ్యంపై 'దాడి' చేస్తున్నవీరభద్రుడి విషయంలో పార్టీ తగిన నిర్ణయం తీసుకోకపోతే ఇక ఆయన శాశ్వితంగా అనారోగ్య కారణాలతోనే పార్టీకి దూరం కావచ్చునేమో!

చంద్రబాబువి పగటికలలు

        తెలుగుదేశం అదినేత చంద్రబాబునాయుడు తృతియ ఫ్రంట్ ఏర్పాటు పై తులసిరెడ్డి స్పందించారు. బాబువి పగటి కలలూ అని వ్యాఖ్యానించారు. తృతీయ ఫ్రంట్‌లో టీడీపీ కీలకపాత్ర పోషిస్తుందని చంద్రబాబు అనడం పెద్ద జోక్ అని పీసీసీ అధికార ప్రతినిధి కూడా అయిన తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగు అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబు హయాం అంతా కుంభకోణాలమయమేనని, తనపై ఉన్న అవినీతి కేసుల్లో కోర్టుల నుంచి స్టే తెచ్చుకున్న బాబుకు నిజాయితీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అవినీతిపై చంద్రబాబుకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలన్నారు.

తెరాస వైపుకి మొగ్గు చూపుతున్న కోమటి రెడ్డి

  నల్గొండ జిల్లా కాంగ్రెస్ శాసనసభ్యుడు కోమటి రెడ్డి వెంకట రెడ్డి, పార్టీ అధిష్టానం తెలంగాణా ప్రకటించనందుకు అలిగి తన మంత్రి పదవికి రాజినామా చేసి కొన్ని రోజులు నిరవదిక నిరాహార దీక్ష చేసినా కూడా పార్టీ పట్టించుకోకపోవడంతో, ఆయన చాలా రోజులుగా పార్టీ వ్యవహారాలకి దూరంగా ఉంటున్నారు. అప్పుడు తెరాస, వైకాపాలు రెండూ కూడా ఆయనను తమ పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నాలు చేసాయి.   కానీ, ఆ రెంటిలో దేనిలో చేరాలో నిర్ణయించుకోలేక ఇంత కాలం కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. ఒకానొక సమయంలో ఆయన వైయసార్ కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ, ఆయన దానిని గట్టిగా ఖండించకపోవడంతో ఆయన ఏదో ఒకరోజు ఆ పార్టీలో చేరం ఖాయమని అందరూ భావించారు. కానీ, జగన్ మోహన్ రెడ్డి కి ఇప్పుడప్పుడే బెయిలు వచ్చే పరిస్థితి కబడకపోవడంతో అగమ్యంగా ఉన్న ఆ పార్టీలో చేరి, తన రాజకీయ భవిష్యత్తుని ప్రశ్నార్ధకంగా మార్చుకోవడం కంటే, మంచి ఊపు మీదున్న తెరాసలో జేరితేనే మేలని ఆయన భావించినట్లున్నారు. అదీగాక, కేసీఆర్ త్వరలో తన పార్టీ అభ్యర్ధుల జాబితాను కూడా విడుదల చేయనున్నందున కోమటి రెడ్డి ముందుగానే ఆ పార్టీలో చేరి తన టికెట్ రిజర్వ్ చేసుకోవడం మేలని అభిప్రాయానికి వచ్చారు.   అదే విషయాన్ని చూచాయగా ప్రకటిస్తూ “మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణా అంశంపై నిర్ణయం తీసుకోకుండా ఇంకా సాగదీయలని గానీ ప్రయత్నిస్తే నేను ప్రజలు అభిమానిస్తున్న మరో పార్టీలోకి మారిపోవాలనుకొంటున్నాను,” అని మొన్న నల్గొండలో ప్రకటించారు.

ఎన్టీఆర్ 'రామయ్య వస్తావయ్యా' రిలీజ్ డేట్

        యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'రామయ్య వస్తావయ్యా' మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ తొలి హిట్ సినిమా 'స్టూడెంట్ నెం. 1' సెప్టెంబర్ 27న విడుదలైంది. ఇదే రోజున 'రామయ్యా వస్తావయ్యా' ను కూడా విడుదల చేయాలని ప్రొడ్యూసర్ నిర్ణయించారని సమాచారం. 'బాద్‌షా' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఎన్టీఆర్, 'గబ్బర్‌సింగ్' వంటి టాప్ గ్రాసర్ తర్వాత హరీష్ శంకర్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. సమంత, శ్రుతి హాసన్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమన్ సంగీత౦ అందిస్తున్నాడు.

లొంగిపోయిన సంజయ్‌దత్

        బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ ముంబయి టాడా కోర్టులో లొంగిపోయారు. అక్కడి నుంచి ఆయనను జైలుకు తరలించనున్నారు. 1993 ముంబై దాడుల కేసులో చట్టవిరుద్ధంగా ఆయుధాలు కలిగి ఉన్న నేరానికి అతనికి సుప్రీంకోర్టు ఐదు సం.లు జైలు శిక్ష విదించింది. గతంలో అతను ఒకటిన్నర సం.లు జైలు శిక్ష అనుభవించినందున,ఆయన ఇప్పుడు మిగిలిన మూడున్నర సం.లు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. బాలివుడ్ సినీ రంగం ఆయనపై దాదాపు రూ.200 కోట్ల పెట్టుబడులుపెట్టి సినిమాలు తీస్తున్న ఈ తరుణంలో ఆయన ఏకంగా మూడున్నర సం.లు జైలులో గడిపితే తీవ్ర నష్టం భరించక తప్పదు. కనుక తమ సినిమాలు పూర్తయ్యే వరకు అతనికి మరికొంత కాలం బయట ఉండేందుకు అనుమతి ఈయాలని కోరుతూ కొందరు నిర్మాతలు మూడు రోజుల క్రితం సుప్రీం కోర్టులో పిటిషను వేసారు. కానీ సుప్రీంకోర్టు దానిని తిరస్కరించడంతో ఇంక సంజయ్ దత్త్ జైలుకి వెళ్లక తప్పడంలేదు.