తెరాస వైపుకి మొగ్గు చూపుతున్న కోమటి రెడ్డి
posted on May 17, 2013 @ 12:15PM
నల్గొండ జిల్లా కాంగ్రెస్ శాసనసభ్యుడు కోమటి రెడ్డి వెంకట రెడ్డి, పార్టీ అధిష్టానం తెలంగాణా ప్రకటించనందుకు అలిగి తన మంత్రి పదవికి రాజినామా చేసి కొన్ని రోజులు నిరవదిక నిరాహార దీక్ష చేసినా కూడా పార్టీ పట్టించుకోకపోవడంతో, ఆయన చాలా రోజులుగా పార్టీ వ్యవహారాలకి దూరంగా ఉంటున్నారు. అప్పుడు తెరాస, వైకాపాలు రెండూ కూడా ఆయనను తమ పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నాలు చేసాయి.
కానీ, ఆ రెంటిలో దేనిలో చేరాలో నిర్ణయించుకోలేక ఇంత కాలం కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. ఒకానొక సమయంలో ఆయన వైయసార్ కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ, ఆయన దానిని గట్టిగా ఖండించకపోవడంతో ఆయన ఏదో ఒకరోజు ఆ పార్టీలో చేరం ఖాయమని అందరూ భావించారు. కానీ, జగన్ మోహన్ రెడ్డి కి ఇప్పుడప్పుడే బెయిలు వచ్చే పరిస్థితి కబడకపోవడంతో అగమ్యంగా ఉన్న ఆ పార్టీలో చేరి, తన రాజకీయ భవిష్యత్తుని ప్రశ్నార్ధకంగా మార్చుకోవడం కంటే, మంచి ఊపు మీదున్న తెరాసలో జేరితేనే మేలని ఆయన భావించినట్లున్నారు. అదీగాక, కేసీఆర్ త్వరలో తన పార్టీ అభ్యర్ధుల జాబితాను కూడా విడుదల చేయనున్నందున కోమటి రెడ్డి ముందుగానే ఆ పార్టీలో చేరి తన టికెట్ రిజర్వ్ చేసుకోవడం మేలని అభిప్రాయానికి వచ్చారు.
అదే విషయాన్ని చూచాయగా ప్రకటిస్తూ “మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణా అంశంపై నిర్ణయం తీసుకోకుండా ఇంకా సాగదీయలని గానీ ప్రయత్నిస్తే నేను ప్రజలు అభిమానిస్తున్న మరో పార్టీలోకి మారిపోవాలనుకొంటున్నాను,” అని మొన్న నల్గొండలో ప్రకటించారు.