బాలకృష్ణతో చంద్రబాబు రాయబారం

        చాలా కాలంగా తన మీద ఆగ్రహంగా ఉన్న హరికృష్ణను బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందుకు బావమరిది బాలయ్యను చంద్రబాబు సంధికి పంపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన బావమరిది, హీరో నందమూరి బాలకృష్ణతో భేటీ అయ్యారు. బాలయ్య ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆయనతో రాజకీయ అంశాలపై చర్చించినట్లుగా చెబుతున్నారు. పార్టీ పట్ల, చంద్రబాబు పట్ల అసంతృప్తితో ఉన్న నందమూరి హరికృష్ణను బుజ్జగించే విషయమై వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.   హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు కొన్నాళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇది పార్టీ చేటు చేస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నుండి గవర్నర్ ను కలిసే కార్యక్రమానికి హరికృష్ణకు ఆహ్వానం అందలేదు. ఎంపీ అయిన తనను విస్మరించడం హరికృష్ణకు మరింత ఆగ్రహం తెప్పించిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు దిద్దుబాటు చర్యలు చేపట్టారని సమాచారం. అయితే హరికృష్ణ, ఎన్టీఆర్ లు ఇద్దరూ బాలయ్య మీద కూడా ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో రాజీ చర్చలు ఫలిస్తాయా ? లేదో.

ఆనం వారి నీతి ప్రవచనాలు

  వైయస్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రజలు వెలివేయాలని, జగన్ను ఉరి తీయాలని తీర్మానం చేసిన రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఆనం రామినారాయణ రెడ్డి మళ్ళీ నోరు విప్పారు. నేరారోపణ ఎదుర్కొంటున్న మంత్రులు కేవలం మాజీ ముఖ్యమంత్రి డా. రాజశేఖర్ రెడ్డి ఆదేశాలను పాటించారు తప్పఏ నేరంలోను స్వయంగా పాలుపంచుకోలేదు. ఆయన తీసుకొన్న నిర్ణయాలతో ఆయన కుటుంబ సభ్యులు మరియు ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి లబ్ది పొందారు తప్ప మంత్రులెవరూ కూడా వ్యక్తిగతంగా లబ్ది పొందలేదు. కనుక, వారినెవరినీ తప్పు పట్టలేమని ఆయన శలవిచ్చారు. అయితే, వారివల్ల తప్పు జరిగింది గనుక, వారి విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకొన్న ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అన్నారు.   ఇక, తమ పార్టీ నుండి ఇంకా ఎంత మందిని వైయస్సార్ పార్టీ ఆకర్షించి తీసుకు వెళ్ళగలదో దయచేసి వెంటనే అందరినీ తీసుకు వెళ్ళిపోమని, అటువంటి నిలకడలేని మనస్తత్వం కలవారు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదని ఆయన అన్నారు. నీతి నిబద్ధత, పార్టీ సిద్ధాంతాల పట్ల అభిమానం ఉన్నవారు మాత్రమే తమ పార్టీకి అవసరం తప్ప నిలకడలేని అటువంటివారు తమకు అవరసరం లేదని ఆయన ఆన్నారు.   ఆనం వారు గతంలో రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు ప్రత్యేక సమావేశం పెట్టి అటువంటి మహానుభావుడిని కోల్పోయిన రాష్ట్ర ప్రజలు అనాధలుగా మారిపోయారని, పుట్టెడు దుఃఖంలో ఉన్నపటికీ దిక్కులేక విలవిలలాడుతున్నప్రజలను ఆదుకోవడానికి జగన్ మోహన్ రెడ్డి ముందుకు వచ్చాడని, ఆయన లేకపోతే రాష్ట్రం ఏమయిపోతుందో? అని వల వల ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకొన్న ఆనం వారు, నేడు ఈ విధంగా రాజకీయాలలో నీతి, నిజాయితీ, నిబద్ధత, పార్టీ సిద్ధాంతాలు విలువలు అని మాట్లాడుతుంటే వైకాపానేతలే కాదు ఆయన మాటలు విన్న ప్రజలు కూడా నవ్వుకొంటున్నారు.   అయినా రాజకీయాలలో ఈవిధంగా రంగులు మార్చలేని వారు మనుగడ సాగించడం చాలా కష్టమే, కనుక ప్రజలే కొంచెం విశాల హృదయంతో వారిని అర్ధం చేసుకోక తప్పదు.

మ్యాచ్ ఫిక్సింగ్ లో క్రికెటర్ శ్రీశాంత్ అరెస్ట్

      ప్రముఖ క్రికెటర్ శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కుని అరెస్టయ్యాడు. మ్యాచ్ ఫిక్సింగ్ లో శ్రీశాంత్ పాత్ర ఉన్నట్లు తేలడంతో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు రాజస్థాన్ రాయల్స్ కు చెందిన అజిత్ చండీల, అంకితా చౌహాన్ లను అరెస్టు చేశారు. వీరు ముగ్గురు స్పాట్ ఫిక్సింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న ఏడుగురు బుకీలు వెల్లడించిన వివరాల మేరకు గత కొన్ని రోజులుగా శ్రీశాంత్, సహచర క్రికెటర్ల మీద నిఘా పెట్టిన పోలీసులు ఖచ్చితమయిన ఆధారాలు లభించాక ఈ రోజు అరెస్టులు మొదలు పెట్టారు. అంతర్జాతీయంగా క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ పై పెద్ద దుమారం చెలరేగుతున్నా, ఈ మ్యాచ్ ఫిక్సింగ్ వివాదాలు వస్తూనే ఉండడం బాదాకరం.

2000 కి.మీ. మైలురాయి దాటిన షర్మిల పాదయాత్ర

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైయస్ షర్మిల ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో రావికంపాడు గ్రామం వద్ద తన పాదయాత్రలో 2000 కి.మీ. మైలురాయిని దాటారు. దేశంలో ఇంతదూరం ఏకదాటిగా నడిచిన మొట్ట మొదటి మహిళగా కూడా ఆమె ఒక సరి కొత్త రికార్డు నెలకొల్పారు. గత ఏడాది అక్టోబర్ 18న కడప జిల్లా ఇడుపులపాయలో మొదలుపెట్టిన తన పాదయాత్రలో ఆమె మోకాలికి గాయం అయినప్పుడు మాత్రమే కేవలం ఒకటిన్నర నెలల పాటు విశ్రాంతి తీసుకొన్నారు. ఆమె శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం వద్ద తన పాదయాత్రను ముగించాలని నిర్ణయించుకొన్నారు. అంటే ఇంకా మరో మూడు నెలల పాటు ఆమె పాదయత్ర సాగుతుంది. మహిళలు తలచుకొంటే దేనినయినా సాదించగలరని ఆమె నిరూపించి చూపారు. తీవ్ర సమస్యలతో సతమతమవుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆమె పాదయాత్ర స్పూర్తినిస్తుందని ఆశిద్దాము.

రేపు కోర్టులో లొంగిపోనున్నసంజయ్ దత్త్

  బాలివుడ్ నటుడు సంజయ్ దత్త్ రేపు ముంబైలోని టాడా కోర్టు ముందు లొంగిపోతునట్లు ఈ రోజు కోర్టుకు తెలియజేసారు. 1993 ముంబై దాడుల కేసులో చట్టవిరుద్ధంగా ఆయుధాలు కలిగి ఉన్న నేరానికి అతనికి సుప్రీంకోర్టు ఐదు సం.లు జైలు శిక్ష విదించింది. గతంలో అతను ఒకటిన్నర సం.లు జైలు శిక్ష అనుభవించినందున,ఆయన ఇప్పుడు మిగిలిన మూడున్నర సం.లు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. బాలివుడ్ సినీ రంగం ఆయనపై దాదాపు రూ.200 కోట్ల పెట్టుబడులుపెట్టి సినిమాలు తీస్తున్న ఈ తరుణంలో ఆయన ఏకంగా మూడున్నర సం.లు జైలులో గడిపితే తీవ్ర నష్టం భరించక తప్పదు. కనుక తమ సినిమాలు పూర్తయ్యే వరకు అతనికి మరికొంత కాలం బయట ఉండేందుకు అనుమతి ఈయాలని కోరుతూ కొందరు నిర్మాతలు మూడు రోజుల క్రితం సుప్రీం కోర్టులో పిటిషను వేసారు. కానీ సుప్రీంకోర్టు దానిని తిరస్కరించడంతో ఇంక సంజయ్ దత్త్ జైలుకి వెళ్లక తప్పడంలేదు. రేపు జైలులోకి వెళ్ళిపోతే మళ్ళీ అతను 2016 నవంబరులో విడుదల అవుతారు.

వైకాపాలోకి అడుసుమిల్లి

  ఇంత కాలం విజయవాడ యంపీ లగడపాటి రాజగోపాల్ కు సన్నిహితుడుగా ఉన్న కాంగ్రెస్ నేత అడుసుమిల్లి జయప్రకాష్, హట్టాతుగా ఆయనకు హస్తం ఇచ్చేసి వైకాపా హస్తం అందుకొన్నారు. ఈ రోజు పార్టీ ఆఫీసులో విజయమ్మ ఆయనకు వైకాపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.   ఆయన 1983లో తెలుగు దేశం పార్టీలో చేరి విజయవాడ తూర్పు నియోజక వర్గం నుండి గెలిచారు. ఆయన 1994 నుంచి టిడిపి అర్భన్ అధ్యక్షుడిగా, 1999 నుంచి 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా పనిచేసారు. కానీ, ఆ తరువాత కొన్ని సమస్యల వలన ఆయన చాలారోజుల పాటు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. మళ్ళీ హరికృష్ణ ప్రోద్భలంతో పార్టీలోకి వచ్చినా, ఎన్నికల పొత్తులో భాగంగా బిజెపికి అవకాశం ఇవ్వడంతో పార్టీపై అలిగిన అడుసుమిల్లి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలోకి మారి లగడపాటితో ఇంత కాలం సన్నిహితంగా మెలిగారు.   ఎన్నికల సమయం దగ్గరపడుతున్నందున వైకాపాకు గెలిచే అవకాశాలున్నట్లు అంచనా వేసుకొన్న ఆయన ఇప్పుడు ఆ పార్టీలో తేలారు. ఆయన రాబోయే ఎన్నికలలో మళ్ళీ విజయవాడ తూర్పు నియోజక వర్గం నుండి పోటీ చేయాలని కోరుకొంటున్నట్లు సమాచారం. కానీ, ఆ స్థానానికి తీవ్ర పోటీ ఉండటంతో మరి ఆయనకీ అవకాశం దక్కుతుందో లేదో ఇప్పుడే చెప్పడం కష్టం.

కోదండ రాముడు పార్టీ పెడతాడా?

  కేసీఆర్ తన తెలంగాణా ఉద్యమాన్ని పక్కన బెట్టి ఎన్నికల హడావుడిలో పడటంతో, ఆయనను ఆయన పార్టీనే నమ్ముకొని బ్రతుకుతున్న తెలంగాణా జేయేసీ కూడా ఇక చేసేదేమీ లేక తానూ కూడా అదే దారిలో పయనించాలని నిశ్చయించుకొంది. ఇక, తెలంగాణా ఉద్యమం పేరిట పుట్ట గొడుగులులాగ పుట్టుకొచ్చిన రకరకాల జేయేసీల నేతలు కూడా రాబోయే ఎన్నికలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్దపడుతున్నారు.   వారిలో ప్రప్రధంగా గజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌ ను పేర్కొనవచ్చును. ఆయన మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. తనకు కాదని తెరాస మరెవరికి టికెట్ ఇచ్చినా ఈసారి కూడా పార్టీ ఓడిపోవడం ఖాయమని చెపుతున్నారు. ఈసారి తానే తెరాస అభ్యర్దిగా బరిలో నిలబడుతానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. జేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ నల్గొండ జిల్లాలోని ఎస్సీ రిజర్వుడు సీటు అయిన తుంగతుర్తిలో పోటీ చేయాలని డిసైడ్ అయిపోయారు.   ఇక 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ టిక్కెట్టు ఆశించి భంగపడ్డ రసమయి బాలకృష్ణ ఈ సారి తనకు తప్పనిసరిగా టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. కత్తి వెంకట స్వామి (తెలంగాణ లెక్చరర్ల ఫోరం నేత) వరంగల్ నుండి, డా. నర్సయ్య (తెలంగాణ డాక్టర్ల జేఏసీ నేత) భువనగిరి పార్లమెంటు స్థానం నుండి, మల్లేపల్లి లక్ష్మయ్య(తెలంగాణ విద్యావంతుల వేదిక ఛైర్మన్‌) కరీంనగర్ పెదపల్లి నుండి పార్లమెంటుకి ఈసారి పోటీ చేయాలని ఆశిస్తున్నారు. వీరిలో చాల మంది స్వంత సర్వేలు చేయించుకొని విజయావకాశాల నివేదికలను కేసీఆర్ కి సమర్పిస్తుండగా, మరి కొందరు కేసీఆర్ కుటుంబ సభ్యుల చుట్టూ టికెట్ కోసం ప్రదక్షిణాలు చేస్తున్నారు.   అయితే కేవలం ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న కారణంగా ఎవరికీ పార్టీ టికెట్స్ ఇవ్వలేమని, బలమయిన తమ ప్రత్యర్ధులను ఎదుర్కొని ఎన్నికలలో విజయం సాదించాలంటే అందుకు కొన్నిప్రత్యేక ‘అర్హతలు’ తప్పనిసరి అని కేసీఆర్ ఇటీవలే ప్రకటించారు. వీరందరిలో చాలా మందికి తెరాస అధ్యక్షుడు కేసీఆర్ నిర్దేశించిన ఆ ‘ఆర్ధిక అర్హత’ లేనందున తమకు ఆయన పార్టీ టికెట్ ఇస్తాడని భ్రమలు విడిచిపెట్టి, ఇంతకాలం తమకి ఒక గుర్తింపు, రాజకీయ అవకాశం కల్పించిన తెలంగాణా జేయేసీని దాని చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాముడ్నినమ్ముకోవడమే మేలనే నిర్ణయానికి వచ్చేసారు. ఒకవేళ కేసీఆర్ తమకు టికెట్స్ ఇవ్వకపోతే అందరూ కలిసి ఆయన నేతృత్వంలో ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టి, దాని తరపున ఎన్నికలలో పోటీ చేసి తమ ఎన్నికలల కలలను సాకారం చేసుకొని అసెంబ్లీలో పార్లమెంటులో అడుగుపెట్టాలని వారందరూ ఉవ్విళ్లూరుతున్నారు. అందుకు కోదండరాం కూడా సానుకూలంగా ఉన్నారని సమాచారం.   కేవలం తన దయవల్లే కోదండరాంకి, జేఎసీకి ఇంత గొప్ప పేరు వచ్చిందని నలుగురిలో చులకనగా మాట్లాడుతున్న కేసీఆర్ కి తగిన విధంగా బుద్ధి చెప్పాలంటే అందుకు ఇదే తగిన సమయమని ఆయనకు అందరూ గట్టిగా చెపుతుండటంతో, ఆయన కూడా గట్టిగానే ఆలోచిస్తునట్లు తెలుస్తోంది.   తెలంగాణాలో తెరాస తప్ప వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో నోటి దురుసు ఉన్న కేసీఆర్ క్రింద పనిచేస్తున్న అనేక మంది విద్యావంతులు, మేధావులు కూడా కోదండరాం వంటి ఉన్నత విద్యావంతుడు, సంస్కారవంతుడు పార్టీ పెడితే ఆయన నేతృత్వంలో పనిచేసేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.   ఇక, కేసీఆర్ మరియు తెరాస ప్రభావం బలంగా ఉన్న తెలంగాణా జిల్లాలలో ఓట్లు చీల్చితే తప్ప, రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావడం కష్టమని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ కూడా కోదండరాంని వెనుక నుండి ప్రోత్సాహిస్తోందని సమాచారం. ఆయన రాజకీయ పార్టీ పెడితే, ఆయన పలుకుబడి అభ్యర్ధులను గెలిపించలేకపోయినా, తప్పని సరిగా తెరాసా ఓట్లను చీల్చగలదని ధృడంగా నమ్ముతున్న కాంగ్రెస్ పెద్దలు, వెనుక నుండి ఆయనను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది.   అయితే, కేసీఆర్ ఆయన ఆలోచన కార్యరూపం దాల్చనిస్తారని భావించలేము. ఒకవేళ ఆయన పార్టీ పెట్టే అవకాశం ఉందని కేసీఆర్ కి ఏమాత్రం అనుమానం కలిగినా, ముందుగా ఆయనకే పార్టీ టికెట్ ఇచ్చి ఆయనను బుట్టలో వేసుకొనే ప్రయత్నం చేయవచ్చును. ఈ నెలాఖరులోగా తెరాస తన మొదటి అభ్యర్ధుల లిస్టును విడుదల చేసే అవకాశం ఉంది గనుక, అది విడుదల అయిన తరువాత కోదండరాం కొత్త రాజకీయ పార్టీ పెడతారా లేదా అనే అంశంపై కొంచెం స్పష్టత వస్తుంది.

కేసీఆర్ గుట్టు బయట పెట్టిన రఘునందన్ రావు

  ఇంటిగుట్టు బయటకి పొక్కి లంకకు చేటు తెచ్చినట్లు, తెరాసలో ప్రముఖ నేతగా ఎదిగిన రఘునందన రావును పార్టీ వ్యతిరేఖ కార్యక్రమాలకు పాల్పడ్డాడని పార్టీనుండి బహిష్కరించడంతో ఆయన కేసీఆర్ మరియు అతని కుటుంబ సభ్యుల గుట్టు బయటపెట్టారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉద్యమం పేరిట పారిశ్రామిక వేత్తలను, విద్యాసంస్థలను, వ్యాపార సంస్థలను బెదిరించి కోట్ల రూపాయలు పోగేసుకొన్నారని ఇంతవరకు ముఖ్యమంత్రితో సహా విపక్షాలు కూడా చేస్తున్న ఆరోపణలను దృవీకరిస్తూ రఘునందన రావు అనేక ఆసక్తికరమయిన విషయాలు బయట పెట్టారు.   తనపై లేనిపోని ఆరోపణలు చేసిన కేసీఆర్ తనకు 48గంటలలో క్షమాపణ చెప్పాలని లేకుంటే ఇంతవరకు అతనికి ఎవరెవరు ఎన్నని చెక్కులు ఇచ్చేరో ఆధారాలతో సహా బయట పెడతానని ఆయన హెచ్చరించారు. ఆయన తెలంగాణా కోసం లాబీయింగ్ పేరిట డిల్లీలో నెల రోజుల మకాం ఎందుకు వేసారో, అప్పుడు కేవీపీతో సహా ఎవరెవరు ఎంతెంత చెక్కులు అందించారో తానూ బయట పెడతానని హెచ్చరించారు.   అదేవిధంగా హరీష్ రావు, కె.తారక రామారావు ఇద్దరూ కూడా ఉద్యమాల పేరిట బలవంతపు వసూల్లకు పాల్పడ్డారని అందరికీ తెలుసునని ఆయన ఆరోపించారు. హరీష్ రావు తనను కూడా డబ్బు కోసం పీడించేవాడని రఘునందన రావు ఆరోపించారు. ఆయన అడిగిన డబ్బు ఈయకపోవడంతో తానూ యం.యల్సీ ఎన్నికలలో పోటీచేస్తున్నపుడు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరూ కలిసి తనకు వ్యతిరేఖంగా పనిచేసేవారిని ప్రోత్సహించారని ఆయన ఆరోపించారు.   ఒకానొక సమయంలో హరీష్ రావు తెరాస అధ్యక్షుడి పదవి నుండి కేసీఆర్ ను తప్పించి, తానూ ఆ పదవి చెప్పట్టాలని ప్రయత్నించారని, ఆ సంగతి కేసీఆర్ కి తెలిసినా కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారని విమర్శించారు. తానూ చంద్రబాబు నాయుడిని ఎన్నడూ కలవక పోయినప్పటికీ, కలిసానని ఆరోపిస్తూ పార్టీ నుండి సస్పెండ్ చేసిన కేసీఆర్, హరీష్ రావు 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వెళ్లి వై.ఎస్.ను కలిసి వచ్చినప్పుడు ఎందుకు ప్రశ్నించ లేకపోయారని అడిగారు.   ఇక కేసీఆర్ నోటి దురుసుకి పార్టీలో సీనియర్ నేతలు సైతం చాల బాధ పడుతున్నారని, అందరూ ఆయన నోటికి బలయిన వారేనని తెలిపారు. కేసీఆర్ చివరికి ప్రొఫెసర్ జయశంకర్, కోదండరామ్ వంటి వారిని సైతం నోటికి వచ్చినట్లు దూషించేవారని అన్నారు. కోదండరామ్ ను జేయేసీ చైర్మన్ పదవి నుండి తప్పించి, దానిని తన వారికి కట్టబెట్టాలని ప్రయత్నించారని కానీ, అందరూ దానికి తీవ్రంగా వ్యతిరేఖించేసరికి కేసీఆర్ వెనక్కి తగ్గారని రఘునందన్ రావు తెలిపారు.   డబ్బు కోసం ఆశపడి హత్యలు చేసిన వారికి, తెలంగాణా ఉద్యమాలతో సంబంధం లేని వ్యాపారులకు పార్టీ టికెట్స్ అమ్ముకొంటూ, కేసీఆర్ ఇటు కార్యకర్తలని అటు తెలంగాణా ప్రజల్నీ కూడా మోసం చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. గ్రానైట్ వ్యాపారి గంగుల కమలాకర్ ని పార్టీలోకి తీసుకొని ఎంతో కాలంగా పార్టీకోసం కష్టపడిన నారదాసు లక్ష్మణరావు వంటి వారిని కూడా కేసీఆర్ మోసం చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. కేసీఆర్ కనుక తనకు క్షమాపణలు చెప్పకపోతే ఆతని రహస్యాలన్నీ బయట పెడతానని రఘునందన్ రావు హెచ్చరించారు.

ఒక్క దెబ్బకు అనేక పిట్టలు కొడుతున్న కేసిఆర్

  ఈ రోజు నుండి తెలంగాణా వ్యాప్తంగా తెరాస తన కార్యకర్తలకు రాజకీయ శిక్షణా తరగతులు ప్రారంబించనుంది. నేటి నుండి వచ్చే నెల రెండవ వారం వరకు ఇవి జరుగుతాయి. వీటి ప్రదానోదేశ్యం రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం ఎలా? మరియు సీమాంద్రా పార్టీలయిన తెదేపా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలను తెలంగాణా ప్రాంతం నుండి బయటకి పంపడం ఎలా? అనే రెండు అంశాలపై పార్టీ కార్యకర్తలకు తగిన విధంగా శిక్షణ ఈయడానికేనని ఆ పార్టీ నేత హరీష్ రావు స్వయంగా మీడియాకు తెలియజేసారు.   ఇక అనధికార సమాచారం ప్రకారం ఈ రాజకీయ శిక్షణ తరగతుల ఆలోచన చేసిన ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, ఈ కార్యక్రమానికి ఎవరయితే 10వేల మంది తక్కువ గాకుండా కార్యకర్తలను సమీకరిస్తారో వారినే ఆయా నియోజక వర్గ అభ్యర్ధులుగా ప్రకటిస్తానని హామీ ఇవ్వడంతో, రాబోయే ఎన్నికలలో పోటీ చేయలాని ఉవ్విళ్ళూరుతున్న అభ్యర్ధులు కేసీఆర్ పెట్టిన ఈ పరీక్షలో నెగ్గి, టికెట్ గెలుచుకోవాలని హుషారుగా కార్యకర్తల సమీకరణ మొదలుపెట్టారు.   ఇక కేసీఆర్ ఈ ఆలోచన చేయడం వెనుక మరొక ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, 10వేల మంది కార్యకర్తలని తరలించేందుకు, వారికి భోజన,వసతి సౌకర్యాలు కల్పించేందుకు కనీసం ఒక్కో అభ్యర్ధికి దాదాపు రూ.10 లక్షలు వరకు ఖర్చు అవుతుంది. ఇంత భారీ ఖర్చుకి సిద్దపడిన అభ్యర్ధులే పోటీలో మిగులుతారు గనుక, ఈవిధంగా కొంత మందిని వడకట్టవచ్చునని ఆయన ఆలోచన. అంతే కాకుండా అభ్యర్ధులు ఆర్ధికంగా బలంగా ఉన్నారో లేదో కూడా ఈ పరీక్షలో తేలిపోతుంది.   ఇక కేసీఆర్ మాటని నమ్ముకొని ఇంత శ్రమపడి, ఇంత భారీ మొత్తం ఖర్చుచేసిన తరువాత తమకి టికెట్ వస్తుందని నమ్మకం లేని వారు కూడా ఈ ప్రక్రియలో వడకట్టబడతారు. ఒకవైపు అభ్యర్ధులకు టికెట్ ఆశ చూపుతూ, మరో వైపు వారికి పరీక్ష కూడా పెడుతూ, పార్టీ కార్యకర్తలకి అభ్యర్ధుల ఖర్చులతో రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహణ చేయాలనుకోవడం కేసీఆర్ దూర(దురా)లోచనకి ఒక చక్కటి నిదర్శనం.   అంతేగాకుండా, ఇటువంటి కార్యక్రమంతో నిర్లిప్తత నెలకొన్న పార్టీ కార్యకర్తలలో మళ్ళీ సమరోత్సాహం కలిగించవచ్చును. అంటే కేసీఆర్ ఒక్క దెబ్బకు అనేక పిట్టలను కొట్టాలని ప్రయత్నిస్తున్నారన్న మాట.

ఉగ్రవాదులు నన్ను లేపేస్తారేమో: సంజయ్ దత్త్

  ఈ రోజు సుప్రీంకోర్టు బాలివుడ్ నటుడు సంజయ్ దత్త్ కు మరింత సమయం బయట ఉండేందుకు నిరాకరించడంతో, ఆయన వెంటనే టాడా కోర్టులో ఒక పిటిషను వేసారు. తనకు ముంబైలోని ప్రత్యేక కోర్టు వద్ద ఉగ్రవాదుల నుండి ప్రాణహాని ఉన్నందున తనకు పూణే జైలులో లొంగిపోయేందుకు పూణేలోని ఎరవాడ జైలులో లొంగిపోయేందుకు అనుమతి ఈయాలని ఆయన తన పిటిషనులో కోర్టుకు విజ్ఞప్తి చేసారు. గతంలో ఆయన అండర్ వరల్డ్ నేరస్తులతో సంబంధాలు కలిగి ఉండటంతో, 1993లో ముంబైపై ఉగ్రవాదుల దాడుల కేసుల్లో వారి నుండి అక్రమాయుధాలు సంపాదించారు. అందువల్ల ఇప్పుడు వారి నుండి తనకు ప్రాణ హాని ఉంటుందని సంజయ్ దత్త్ భయపడుతున్నారు.   గతంలో పోలీసులు తనను పూణే జైలుకి తరలిస్తున్నపుడు ముంబై నుండి పూణే వరకు దాదాపు 125కి.మీ. మీడియావారు వ్యానులలో వెంబడించిన విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకువచ్చి, ఈసారి వారు తనని వెంబడించకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేసారు. కోర్టు ఆయన పిటిషనుపై విచారణను రేపటికి వాయిదా వేసింది. సుప్రీం కోర్టులో సంజయ్ దత్త్ వేసుకొన్న రివ్యు పిటిషన్ను కోర్టు తిరస్కరించిన తరువాత ఆయనని ఈ నెల 16వ తేదీలోగా ప్రత్యేక కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఇక, ఆయనకి మూడున్నర ఏళ్ళు జైలులో గడపక తప్పదని రూడీ అయిపోయినట్లే.

దాడితో కలిసి పనిచేసే ప్రసక్తే లేదు: కొణతాల

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో ముందస్తు ఒప్పందం చేసుకోన్నాక, శాసనమండలికి పంపలేదనే వంకతో తెలుగుదేశం పార్టీలోంచి బయటపడ్డ దాడి వీరభద్రరావు, తన చిరకాల రాజకీయ ప్రత్యర్ధి అయిన కొణతాల రామకృష్ణతో చేతులు కలిపి పనిచేసేందుకు తానూ సిద్దం అని ఇటీవల ప్రకటించారు. అయితే, తనతో కలిసి పనిచేసేందుకు ఆయన సిద్దమేమో గానీ, తానూ మాత్రం ఆయనతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని కొణతాల రామకృష్ణ ఈ రోజు కూడా మరో మారు స్పష్టం చేసారు. తానూ పార్టీ అధిష్టానాన్ని గౌరవిస్తునట్లే, తన అభిప్రాయాలకు కూడా పార్టీ గౌరవించాలని ఆయన అన్నారు. జగన్ మోహన్ రెడ్డి, ఎలాగో కష్టపడి కొండా సురేఖ దంపతులను బుజ్జగించి దారికి తెచ్చుకోగలిగారు. కానీ, కొణతాల రామకృష్ణ-దాడి విషయంలో మాత్రం చిక్కు ముడి విప్పడం కష్టమే. ఎందుకంటే ఇద్దరు అనకాపల్లి నియోజకవర్గానికి చెందిన వారే అవడంతో, ఇద్దరికీ తమ నియోజకవర్గంపై పూర్తి పట్టు ఉండాలని భావించడం సహజమే. అయితే, పార్టీకి కష్టకాలంలో వెన్నంటి ఉండిన కొణతాల మాటకు విలువీయకపోతే, అతనితో బాటు అతని అనుచరులు కూడా వేరే పార్టీలోకి తరలిపోవడం ఖాయం. అప్పుడు ఆయనని ఎదుర్కోవడానికే పార్టీ శ్రమించాల్సి ఉంటుంది. అంతకంటే, ఆయన మాటను గౌరవిస్తూ, దాడికి వేరే ఇతర భాద్యతలు అప్పగిస్తే మేలేమో!

సంజయ్ దత్ కు ఎదురుదెబ్బ

        ప్రముఖ సినీ నటుడు సంజయ్ దత్ కు సుప్రింకోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ముంబై పేలుళ్ల కేసులో సంజయ్ దత్ కు ఐదేళ్ల జైలు శిక్షపడిన నేపధ్యంలో ఆయన రివ్యూ పిటిషన్ ను కొట్టివేసిన కోర్టు ఇప్పుడు దత్ లొంగిపోయే గడువు పొడిగించడానికి కూడా అంగీకరించలేదు. కొందరు నిర్మాతలు సంజయ్ దత్ లొంగిపోవడానికి మరింత గడువు కావాలని కోరగా కోర్టు ఆ పిటిషన్ ను తిరస్కిరించింది. దీనితో ఆయన ఈ నెల పదిహేనున జైలుకు వెళ్లక తప్పని సరి పరిస్థితి ఏర్పడింది. ముంబయి పేలుళ్ల కేసులో గతంలో సంజయ్ దత్ ఏడాదిన్నర జైలు శిక్ష అనుభవించాడు. ఇప్పుడు మరో మూడున్నేరేళ్లు జైలు జీవితం తప్పనిసరి.

కొండా సురేఖ కోపం చల్లాబడింది

  మొత్తం మీద కొండా సురేఖ దంపతుల కధకి ఈ రోజు శుభం కార్డు పడింది. నిన్నపార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను కలిసిన తరువాత వారిరువురూ నేడు చంచల్ గూడ జైలుకు వెళ్లి ములాఖత్ సమయంలో జగన్ మోహన్ రెడ్డిని కలిసి మాట్లాడిన తరువాత ఇద్దరూ ప్రసన్నంగానే కనిపించారు. తరువాత వారు మీడియాతో మాట్లాడుతూ తాము వైయస్సార్ కుటుంబము వెంటే ఉంటామని, తమ మధ్య తలెత్తిన చిన్నపాటి మనస్పర్ధలను తాము ఈ సమావేశంలో తొలగించుకొన్నామని, అయితే వాటిని మీడియా గోరంతలను కొండతలుగా చేసి చూపడం వలననే సమస్య పెద్దదిగా కనిపించిందని అన్నారు. తమకి పార్టీ వీడే ఆలోచన ఏమి లేదని, పార్టీ మారుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలనీ నిజం కాదని వారన్నారు.   దీనిని బట్టి కొండా అనుచరులు నలుగురిని తిరిగి పార్టీలోకి తీసుకోవడానికి, వారు సూచించిన ఇతర విషయాలను, సలహాలను పాటించడానికి జగన్ మోహన్ రెడ్డి అంగీకరించినట్లుగా అర్ధం అవుతోంది. ఇప్పుడు ఆయన దాడి వీరభద్ర రావు విషయంలోతన పార్టీకి చెందిన నేత కొణతాల రామకృష్ణ వెలిబుస్తున్నఅభ్యంతరాలను పరిష్కరించవలసి ఉంది.

జగన్మోహన రెడ్డి కేసులో కీలక మలుపు

  అక్రమాస్తులకేసులో అరెస్ట్ అయిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి మరియు విజయసాయిరెడ్డిలపై దాల్మియా సిమెంట్స్ వ్యవహారంపై సిబిఐ దాఖలు చేసిన 5వ చార్జ్ షీట్ లో వారిరువురిపై ఐపియస్ 409 సెక్షన్ క్రింద మోపిన నమ్మకద్రోహం అభియోగాన్నివారికి వర్తించదంటూ సిబిఐ కోర్టు ఈ రోజు త్రోసిపుచ్చింది.   సాదారణంగా ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు లేదా ప్రభుత్వాధికారులు, ప్రజలను లేదా ప్రభుత్వాన్ని మోసగించినప్పుడు లేదా కుట్రలకు పాల్పడినప్పుడు మాత్రమే ఈ సెక్షన్ క్రింద నేరాభియోగం మోపుతారు. జగన్ మరియు విజయసాయి రెడ్డి ఇద్దరు కూడా ప్రభుత్వంలో ఏవిధంగా గాను పాలుపంచుకోలేదు గనుక వారికి ఈ అభియోగం వర్తించదని కోర్టు తిరస్కరించింది. అదేవిధంగా వారిపై సెక్షన్ 12 క్రింద సీబీఐ మోపిన మరో అభియోగం ‘క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్టు’ కూడా వారికి వర్తించదని కోర్టు తిరస్కరించింది. కానీ, అదే చార్జ్ షీటులో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏయస్ ఆఫీసర్లు శ్రీలక్ష్మి, రాజగోపాల్ మీద సీబీఐ మోపిన అభియోగాలను మాత్రం కోర్టు త్రోసిపుచ్చలేదు.   అయితే, ఇదివరకు సీబీఐ దాఖలు చేసిన నాలుగు చార్జిషీట్లలో ఇవే అభియోగాలను కోర్టు తిరస్కరించకపోవడం గమనించవలసిన విషయమే. అందువల్ల, ఇప్పుడు ఇదే కారణంతో జగన్ మోహన్ రెడ్డి తరపున వాదిస్తున్న న్యాయవాదులు హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. అంతే కాకుండా, ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించి, సీబీఐ కోర్టు తీర్పులో ఉన్న తేడాలను, లోపాలను కూడా ఎత్తి చూపి ప్రయోజనం పొందే ప్రయత్నం చేయవచ్చును.   నేటి సిబిఐ కోర్టు తీర్పు జగన్ మోహన్ రెడ్డికి కొంత ఊరట కలిగించిందని చెప్పవచ్చును. ముఖ్యంగా సుప్రీంకోర్టు అతనికి బెయిలు తిరస్కరించిన తరువాత, తీవ్రనిరాశ నిస్పృహలలో కూరుకు పోయున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలకి, సీబీఐపై దాడి చేసేందుకు స్వయంగా సీబీఐ కోర్టే ఒక గొప్ప ఆయుధం అందించినట్లయింది.   సీబీఐ మరియు ఈడీ శాఖలను కాంగ్రెస్ పెరట్లో కుక్కలని అభివర్ణించిన షర్మిల, ఇక నేటి నుండి సీబీఐపై తన దాడి మరింత తీవ్ర తరం చేయవచ్చును.

కడియం వారి తెలంగాణ ప్రేమ!

        తెదేపాకి కడియం శ్రీహరి గుడ్ బాయ్ చెప్పేసారు. మే 15,16 తేదీలలో తెరాసలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యం. ఎవరికి నచ్చిన పార్టీలో వారు కొనసాగటం అనేది వారి స్వేచ్ఛ. కాని పార్టీని వీడే కారణాలలో ఏ పార్టీ నాయకులైనా నీతి, నిబద్ధతలు పాటించటం లేదు. ఎందుకని? మళ్ళీ వాళ్ళే చెబుతారు, ప్రజలు అంతా గమనిస్తున్నారు అని. మరి ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయని గ్రహించి కూడా ఇలా ఎలా బరితెగింపు నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఎందుకంటే ప్రజలు దేనినీ పట్టించుకునే తీరికలో లేరు కాబట్టి.   ఇక కడియం శ్రీహరి విషయానికి వస్తే ఆయన తెలంగాణ కోసం రాజీనామా చేసానని చెబుతున్నారు. తెరాస ఆవిర్భవించి 12 సంవత్సరాలు అయింది. గతంలో తెదేపా అధికారంలో ఉన్నప్పుడు విద్యాశాఖ, మార్కెటింగ్ శాఖ, నీటిపారుదల శాఖ, సాంఘిక సంక్షేమ శాఖవంటి పలు కీలకమైన మంత్రి పదవులు అనుభవించినప్పుదు గుర్తుకురాని తెలంగాణ అంశం, ఈ రోజున ఇంత హఠాత్తుగా ఎందుకు గుర్తుకు వచ్చింది? 2009 ఎలెక్షన్లలో తెరాస తెదేపాతో పొత్తు పెట్టుకునప్పుడు క్కూడా లేని తెలంగాణ ప్రేమ ఈ రోజు ఎందుకు పొంగి పొర్లుతుంది?      అన్నిటికీ మించి గత సంవత్సరం డిశంబరులో జరిగిన తెలంగాణపై అన్ని పార్టీల అఖిల పక్ష సమావేశానికి తెదేపా నుండి ఆ పార్టీ ప్రతినిధిగా యనమల రామకృష్ణుడు తో పాటు కడియం కూడా పాల్గొన్నారు.పాల్గోనటమే  కాదు, ఆ రోజు ఆయన 2008 లో ఇచ్చిన లేఖకు తమ పరి కట్టుబడే ఉందని అఖిలపక్ష సమావేశంలో వెల్లడించి తదుపరి ప్రెస్ మీట్లో తమ పార్టీ తెలంగాణ కి అనుకూలమే కానీ వ్యతిరేకం కాదు అని వెల్లడించారు. ఇప్పుడు కొత్తగా తెలంగాణ ప్రజల మనోభావాలకు పార్టీలో గుర్తింపు లేనందుకే తాను పార్టీకి రాజీనామా చేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు కడియం వెల్లడించటం వెనుక అతడి రాజకీయ ఆంతర్యం ఏమిటి? పార్టీ వేరు , అధిష్ఠానం వేరు కాదు కదా? అధిష్ఠానం సూచనల మేరకు, అధిష్ఠానం అభిప్రాయం మేరకు ఆ రోజు వెల్లడించిన నిర్ణయం ఈ రోజు ఎందుకు వ్యతిరేఖ నిర్ణయం అని వక్కాణిస్తున్నారు?        1999 నుండి తెదేపాలో నిర్ణయాలన్నీ పారిశ్రామికవేత్తలూ, పార్టీలు మారి వచ్చిన వారే తీసుకుంటున్నారని వెల్లడిస్తున్న ఆయన, 1999 నుండి 2004 వరకు విభిన్న రకాల మంత్రి పదవులు ఎలా వెలగబెట్టారు? ఆ నాడు గుర్తుకురాని తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రజల మనోభావాలు ఈ రోజు ఎందుకు గుర్తుకు వస్తున్నాయి? ఐనా తెలంగాణ లో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది తెదేపా హయాంలోనే అన్న విషయం ఆయన మర్చిపోయారా? లేక అభివృద్ధి అసలు జరగలేదు అంటే మరి 9 1/2 ఏళ్ళు మంత్రిగా ఉండి కడియం ఎం చేసారు?        తెలంగాణ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకోవాల్సింది చంద్రబాబు నాయుడా? సోనియా గాంధీనా? మే 27న జరగబోయే తెదేపా మహానాడులో తెలంగాణ పై చంద్రబాబు నాయుడు ఎలాంటి ప్రకటనా చేసే ఆలోచనలో లేరని కడియం వ్యాఖ్యానిస్తున్నారు. మహానాడులో చంద్రబాబు నాయుడు తెలంగాణా పై నిర్ణయం ప్రకటిస్తే తెలంగాణ వచ్చేస్తుందా? ఆ మారం రాజకీయ పరిగ్న్యానం లేకుండా కడియం ఉన్నాడా? 9 1/2 ఏళ్లపాటు మంత్రిగా వెలిగినప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టినందునే తమ పతి అధికారం వేలగబెట్టిందని కడియం మర్చిపోయారా? సభ్యతా, సంస్కారం కలిగిన రాజకీయ అనుభావజ్ఞుడిగా కాక అధికార దాహంతో రగిలిపోతున్న  పక్కా స్వార్థ రాజకీయవేత్తగా మాట్లాడటం కడుశోచనీయం.         నేడు తెదేపాని, చంద్రబాబు నాయుడు వైఖరిని ఇంత ధైర్యంగా దుయ్యబడుతున్న కడియం శ్రీహరి అంతే ధైర్యంతో ఏ ప్రలోభాలకు లొంగి ఎలాంటి రుగ్మతలకు బానిసై తెరాస లో కేసీఆర్ పంచన చేరుతున్నాడో చెప్పే సత్తా ఉందా?

రామ్ చరణ్ 'ఎవడు' రిలీజ్ డేట్ న్యూస్

        ఈ వేసవిలో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల తుఫాన్ సృష్టించాలనుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కాని కోర్ట్ గొడవలతో జంజీర్ మూవీ వెనక్కి వెళ్ళడంతో..ఇప్పుడు ఎలాగైనా తన తరువాత సినిమాని వేసివిలోనే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడట. అందుకే తన ఫోకస్ అంతా 'ఎవడు' సినిమా మీద పెట్టాడు. ఈ సినిమాని జూన్ 28 న రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రామ్ చరణ్, అల్లుఅర్జున్ లపై కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రకరించాల్సి వుంది. ఇంకా ఒక పాట కూడా బ్యాలన్స్ ఉంది. ఇవన్ని త్వరగా పూర్తి చేసి, అనుకున్న తేదికి సినిమా ను విడుదల చేయడాని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మూవీ ఆడియో జూన్ మొదటి వారంలో విడుదల కానుంది.

ఆ అర్హత ఉండబట్టే జీవన్ రెడ్డికి తెరాస టికెట్

  విపక్ష పార్టీ నేతలకు ఏప్రిల్ 27లోగా వచ్చి తమ పార్టీలో చేరితే ‘టికెట్స్ గ్యారంటీ’ అంటూ కేసీఆర్ ప్రకటించిన ‘బంపర్ ఆఫర్’ కు దాదాపు నెలరోజులవుతున్నాఇంతవరకు ప్రత్యర్ధి పార్టీ నేతల నుండి ఏమాత్రం స్పందన రాలేదు. ఇక నేడో రేపో వచ్చి తెరాసలో చేరిపోతారనుకొన్నమందా జగన్నాధం, కే.కేశవ్ రావు వంటి కాంగ్రెస్ నేతలు కూడా మొహం చాటేయడంతో, అటువంటి బలమయిన అభ్యర్ధులు ఎంపిక ప్రక్రియకి కేసీఆర్ ఇటీవలే అవసరమయిన ప్రాధమిక అర్హత నిర్దేశించారు.   “ఆర్ధికంగా బలంగా ఉండి, ఎన్నికలలో డబ్బు విరివిగా ఖర్చు పెట్టగలవారికి మాత్రమే పార్టీ టికెట్స్” అని విస్పష్టంగా ఆయన ప్రకటించారు. ఆయన ఆవిధంగా బహిరంగంగానే ప్రకటించడంతో తెరాస శ్రేణుల్లో కలకలం చెలరేగింది. ఆయన ఇంతకాలం ఇతర పార్టీల నేతల వెంట ఎందుకు పడుతున్నాడో ఆ ప్రకటన కళ్ళకి కట్టినట్లు చూపించింది. అంతే కాకుండా, కేవలం ఉద్యమాలలో పాల్గొనందునో లేక ఇంతకాలం పార్టీ జెండాలు మోసినందుకో ఎవరికీ పార్టీ టికెట్స్ కేటాయించలేమని, అందుకు ‘ఆ అర్హత’ తప్పని సరి అని స్పష్టం చేసారు. ‘ఆ అర్హతలు’ ఉన్న కాంట్రాక్టర్లు, విద్యా సంస్థల అధిపతులు, పారిశ్రామిక వేత్తలు ఎవరయినా కూడా టికెట్స్ కు అర్హులేనని ఆయన చెప్పకనే చెప్పారు.   ఈ నేపద్యంలో గతనెల 27న ఆర్మూరులో పార్టీ 12వ వార్షికోత్సవ మహా సభలను ఘనంగా నిర్వహించిన ఆశన్నగారి జీవన్‌డ్డికి ‘ఆ అర్హతలన్నీ’ ఉండటంతో కేసీఆర్ ఆయన పేరును ఖరారు చేసారు. నిన్న ఆర్మూరులో జీవన్ రెడ్డి ఇంటికి వచ్చిన కేసీఆర్, అక్కడే ఆయనను తమ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించారు. ఆర్మూరు సభకు ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేసి సభను విజయవంతం చేసినందుకు కేసీఆర్ ఆయనను అభినందించారు. రాబోయే ఎన్నికలలో ఘన విజయం సాదించాలని ఆయనని కేసీఆర్ ఆశీర్వదించారు. టీఆర్‌ఎస్ ఎన్నికల కమిటీ అధ్యక్షుడిగా తాను కమిటీలో సభ్యుల ఆమోదంతో జీవన్‌డ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లుచెప్పారు.

హోంమంత్రి సబితకు సిబిఐ సమన్లు

  ఈ రోజు జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ ఐదో చార్జీషీట్‌ దాఖలు చేసింది. దానిని విచారణకు చెప్పటిన సీబీఐ కోర్టు ఈ కేసులో నాలుగవ నిందితురాలిగా పేర్కొనబడిన హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి వచ్చేనెల 7వ తేదీన కోర్టుకు హాజరుకమ్మంటూ సమన్లు జారీ చేసింది. ఇంతవరకు ఆమెను వెనుకేసుకు వస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇది చెంపపెట్టు అని ప్రతిపక్షాలు అభివర్ణించాయి.   సబితా రెడ్డితో బాటు, ఈ కేసులో ఏ1-నిందితుడుగా ఉన్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి, విజయసాయి రెడ్డి, దాల్మియా సిమెంట్స్ అధినేత పునీత్ దాల్మియా, ఈశ్వర్ సిమెంట్స్ అధినేత సజ్జల దివాకర్ రెడ్డి, ఐఏయస్ ఆఫీసర్స్ శ్రీ లక్ష్మి, రాజగోపాల్ మరియు మరో ఆరుగురికి అదే రోజున కోర్టుకి హాజరుకమ్మంటూ సమన్లు జారీ చేసింది.   కేంద్రంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు మంత్రులు పదవులనుండి తప్పుకొన్న తరువాత, రాష్ట్రంలో కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నమంత్రులను ప్రభుత్వం నుండి తొలగించాలని ప్రతిపక్షాల ఒత్తిడి పెరుగుతున్న నేపద్యంలో రేపు డిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి వారి విషయంలో అధిష్టానం సలహా తీసుకొందామని ఆలోచిస్తుండగానే సీబీఐ కోర్టు సమన్లు జారీ చేయడంతో మరింత ముఖ్యమంత్రిపై ఒత్తిడి పెరుగుతుంది.   ఇంతవరకు కిరణ్ కుమార్ రెడ్డి కూడా కేంద్రం అనుకరించిన వైఖరినే అనుకరిస్తున్నందున, ఇప్పుడు అదేవిధంగా ఇక్కడకూడా కళంకిత మంత్రులు స్వచ్చందంగా తప్పుకోనేలా చేస్తారని మాత్రం భావించలేము. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో ప్రతిపక్షాల నుండి అంత ఒత్తిడి లేదు.   పైగా ఇంతకాలం వెనకేసుకు వచ్చిన తరువాత, ఇప్పుడు వారిని తొలగిస్తే, కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా తప్పు అంగీకరించినట్లవుతుంది. మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకే చెందినవారు గనుక, వారి మద్య ఇంత వరకు ఉన్నసన్నటిగీత కూడా తొలగిపోయి అంతా ఆ తానులో ముక్కలే అనే భావన ప్రజలలో కలుగుతుంది. బహుశః ఈ భయంతోనే ఇంతకాలం ముఖ్యమంత్రి కళంకిత మంత్రులను కాపాడుకొంటూ వచ్చారు. కానీ, ఇప్పుడు సీబీఐ కోర్టు సాక్షాత్ రాష్ట్ర పోలీసులకు అధినేత అయిన హోంమంత్రిని దోషిగా కోర్టు బోనులో నిలబడేందుకు సమన్లు జారీ చేయడంతో, అటువంటి అవమానకర పరిస్థితులను భరించి ఆమెను అదే పదవిలో కొనసాగించాలో లేక ఆమెకు ఉద్వాసన చెప్పి తన ప్రభుత్వంపై మరక పడకుండా జాగ్రత్త పడటమో చేయాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి డిల్లీ పర్యటనలో ఏ విషయమూ తెలిపోవచ్చును.   యాదృచ్చికంగా ఈ రోజే చంద్రబాబు తన అనుచరులతో కలిసి గవర్నర్ నరసింహన్ కు కళంకిత మంత్రులను ప్రభుత్వం నుండి తొలగించాలని వినతి పత్రం ఇచ్చారు.