కాంగ్రెస్‌ది అవినీతి వాదం: బాలకృష్ణ

        మహిళలకు ఆస్తిహక్కు కల్పించిన ఘనత స్వర్గీయ నందమూరి తారకరామారావుదేనంటూ కొనియాడారు నందమూరి బాలకృష్ణ. అవినీతిని కాంగ్రెస్ మ్యానిఫెస్టోగా మార్చిందని, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అవినీతి సుడిగుండంలో చిక్కుకుందని హీరో నందమూరి బాలకృష్ణ దుయ్యబట్టారు. టీడీపీది అభివృద్ధి వాదం...కాంగ్రెస్‌ది అవినీతి వాదం అని ఆరోపించారు. టీడీపీ మహావృక్షం....దాని కింద వందల పురుగులు పుట్టాయని, అవి ఇప్పుడు వెళ్లిపోతున్నాయని బాలయ్య తెలిపారు. పార్టీ నేతలు గ్రూపులను ప్రక్కనబెట్టి పనిచేయాలని కోరారు. చంద్రబాబు పాదయాత్ర ఫలితం ప్రజలకు అందజేసే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ఎన్టీఆర్ తెలుగు గడ్డపై పుట్టడం మనందరి అదృష్ణమని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 1982 నాటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని బాలకృష్ణ పేర్కొన్నారు.

ప్రజల గుండెల్లో కొలువున్న పెద్దన్నకు 90 ఏళ్ళు

  తెలుగు చిత్ర సీమకి, తెలుగు జాతికి, రాష్ట్ర రాజకీయాలకి పెద్దన్నగా అరుదయిన గౌరవం స్వంతం చేసుకొన్నస్వర్గీయ నందమూరి తారక రామారావుగారి 90వ జయంతి నేడు. తీయనయిన తెలుగుకు పర్యాయపదంగా, తెలుగు వారి ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపంగా నిలచిన యన్టీఆర్ తెలుగు ప్రజల హృదయాలలో శాశ్వితంగా కొలువయ్యుంటారు.   యన్టీఆర్ కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923, మే 28న జన్మించారు. 1949లో ‘మన దేశం’ అనే సినిమాతో చిత్ర సీమలోకి ప్రవేశించిన యన్టీఆర్ చివరిగా 1993లో ‘శ్రీనాథ కవిసార్వభౌమ’తో తన 43 ఏళ్ల సుదీర్గ సినీ ప్రస్థానం ముగించారు. ఈ సుదీర్గ యాత్రలో ఆయన నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా తన బహుముఖ ప్రజ్ఞ కనబరిచి ప్రజల మెప్పు పొందారు.అనేక విశిష్ట గౌరవ పురస్కారాలను కూడా అందుకొన్నారు.   ఆయన మొత్తం 320 సినిమాలలో నటించారు. అంతే కాకుండా దేశంలో మరే ఇతర నటుడు చేయలేనన్ని విభిన్న పాత్రలు పోషించారు. ఆయన చేసిన సినిమాలలో ఎక్కువ సాంఘిక చిత్రాలే అయినప్పటికీ, ఆయనకు ఆచంద్రార్కం నిలిచిపోయే కీర్తి ప్రతిష్టలు ఆర్జించిపెట్టినవి మాత్రం ఆయన చేసిన పౌరాణిక సినిమాలేనని చెప్పవచ్చును. అలాగని ఆయన చేసిన కన్యాశుల్కంలో గిరీశం పాత్రను, రాముడు భీముడు సినిమాలో భీముడి పాత్రను, బడిపంతులు సినిమాలో బడిపంతులు పాత్రను తెలుగు ప్రజలు ఎవరూ ఎన్నటికీ మరిచిపోలేరు.   ఇక పౌరాణికాల్లో ఆయన చేసిన శ్రీకృష్ణుని పాత్ర గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 27 ఏళ్లలో నిర్మించిన 25పౌరాణిక సినిమాలలో ఆయన శ్రీకృష్ణుని పాత్ర పోషించారు. శ్రీకృష్ణుడు అంటే ఇలాగే ఉంటాడు అని ప్రజలు కూడా నమ్మేంతగా ఆయన ఆ పాత్రను పండించారు. రావణుడు, దుర్యోధనుడు వంటి దుష్టపాత్రలకు కూడా తన అభినయంతో ప్రాణ ప్రతిష్ట చేసి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత ఆయనకే చెల్లు.   కేవలం ద్విపాత్రాభినయం చేయడమే గొప్ప అనుకొంటున్న సమయంలో దాన వీర శూర కర్ణ సినిమాలో ఏకంగా మూడు పాత్రలు పోషించి ప్రజల చేత జేజేలందుకొన్నారాయన. ఇక, విజయవంతమయిన నిర్మాతగా, ప్రతిభగల దర్శకుడిగా, కధకుడిగా తెలుగు చిత్ర సీమలో ఆయన విజయకేతనం ఎగురవేశారు.   ఆయన నటించిన సినిమాలలో150కి పైగా శతదినోత్సవాలు, 50కి పైగా రజతోత్సవాలు, 7 స్వర్ణోత్సవాలు జరుపుకొన్నాయి. ఆయన మన దేశంలోనే తొలి వంద, రెండు వందల చిత్రాలు చేసిన హీరోగా, తొలి మూడొందల చిత్రాలు చేసిన తొలి తెలుగు హీరోగా నెలకొల్పిన రికార్డును ఇంతవరకు ఎవరూ అధిగమించలేకపోయారు. ఆయన తన స్వీయ దర్శకత్వంలో 18 సినిమాలలో నటించడమే కాకుండా వాటిలో అనేక సినిమాలు శతదినోత్సవాలు కూడా జరుపుకొన్నాయి.   ఒకవైపు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలిస్తూనే, మరో వైపు సినిమాలలో నటించిన ఘనత కూడా ఆయనకే చెల్లింది. ఆయన ప్రతిభకు పట్టం కడుతూ అనేక అవార్డులు, సన్మానాలు పొందారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మకమయిన పద్మశ్రీ అవార్డును 1968లోనే ఇవ్వడం జరిగింది. అయితే, చిత్రసీమకి ఇంతగా సేవలందించిన ఆయనకి జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు దక్కలేదనే భావన తెలుగు ప్రజలలో ఉంది. అందుకే ఆయనకు ప్రతిష్టాత్మకమయిన ‘భారత రత్న’బిరుదు ఇవ్వాలని ప్రజలు కోరుకొంటున్నారు. ఇటీవలే ఆయన విగ్రహం పార్లమెంటులో అవిష్కరింపబడటం యావత్ తెలుగు జాతికి గర్వ కారణం.   రాష్ట్రంలో ముఖ్యమంత్రులను ఆట బొమ్మలుగా చేసి ఆడుకొంటున్న కాంగ్రెస్ పార్టీ పద్ధతి చూసి చాలా బాధ పడిన ఆయన తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించారు. పార్టీ స్థాపించిన 9నెలలలోనే ఆయన తిరుగులేని మెజార్టీతో రాష్ట్రంలో తొట్టతొలి కాంగ్రెసేతర ప్రభుత్వం నెలకొల్పారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించిన ఆయన రాజకీయాలను, అధికార పద్దతులను పక్కన బెట్టి తన అంతరాత్మకే ఎక్కువ ప్రాదాన్యమిస్తూ ప్రజల సమస్యలకు మనసుతో స్పందిస్తూ పరిపాలన చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా నిలిచిపోయారు.   బహుశః ఆ కారణంగానే, టంగుటూరి ప్రకాశం పంతులు గారి తరువాత ఇంతవరకు మరే ముఖ్యమంత్రి ప్రజలకి చేరువకానంతగా ఆయన చేరువకాగలిగారు. కానీ, ఆయనలో రాజకీయాలకు అసలు నప్పని నిరాడంబరత, అధికారం దర్పం, రాజకీయాలు పక్కన బెట్టి మనసుతో స్పందించే తీరు, కపటమెరుగని భోళతనం, ముక్కు సూటితనం వంటి లక్షణాలే ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవితానికి అత్యంత విషాదకర ముగింపునిచ్చాయని మన అందరికీ తెలిసిన విషయమే. ఆయన 1996, జనవరి 18న గుండె పోటుతో మరణించారు. అయినప్పటికీ ఆయన తెలుగు చిత్ర సీమకు, తెలుగుజాతికి చేసిన మహోపకారం వల్ల ‘తెలుగు’ పదం సజీవంగా ఉన్నంతవరకూ ఆయన కూడా తెలుగు ప్రజల హృదయాలలో సజీవుడిగానే ఉంటారు. .

టిడిపి మహానాడుకి ఆహ్వానించలేదు: జూ.ఎన్టీఆర్

  తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహిస్తున్న రెండు రోజుల మహానాడు సమావేశాలకు హరికృష్ణ హాజరు కావడం అందరికీ చాలా ఆశ్చర్యం కలిగించినా ఆయన అలక వీడి వచ్చినందుకు అందరూ సంతోషించారు. అయితే ఆయన కుమారుడు జూ యన్టీఆర్ సమావేశానికి రాకపోవడం గురించి మీడియాలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. అతను కోరుండే రాలేదని కొందరూ, తండ్రి వద్దని వారించడం వలెనే రాలేదని ఇంకొందరూ, సినిమా షూటింగ్ కోసం విదేశాలలో ఉండి పోవడం వలననే రాలేదని మరి కొందరు రకరకాలుగా చెప్పుకొంటున్నారు.   తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం తాము హరికృష్ణకు, జూ.యన్టీఆర్ ఇద్దరికీ కూడా ఆహ్వానాలు పంపినట్లు తెలియజేసారు.   కానీ, జూ.యన్టీఆర్ మామగారయిన నార్నే శ్రీనివాసరావుకి చెందిన స్టూడియో యన్ న్యూస్ చానల్లో “మహానాడుకి రమ్మని నాకు పార్టీ నుండి ఎటువంటి ఆహ్వానము రాలేదు. వచ్చి ఉంటే తప్పక హాజరయ్యేవాడిని. రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాదించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఎన్నికలలో నేను పార్టీ కోసం పని చేస్తాను,” అంటూ జూ.యన్టీఆర్ చెప్పినట్లు స్క్రోలింగ్ వస్తోంది.   మరి అదే నిజమయితే జూ. యన్టీఆర్, తెదేపా నేతలలో ఎవరు అబద్దమాడుతున్నట్లు? యన్టీఆర్ మాటలు నిజమనుకొంటే, మరి అతనికి ఆహ్వానం రానప్పుడు అతని తండ్రికి మాత్రమే తెదేపా ఆహ్వానం పంపిందా? అదే నిజమయితే అందుకు హరికృష్ణ ఏవిధంగా అంగీకరించారు? తనకి ఆహ్వానం పంపి తన కుమారుడుకి పంపకపోయి ఉంటే ఆయన అదే విషయం సభలోనే నిలదీసేవారు కదా? అలా జరుగాలేదంటే యన్టీఆర్ కి ఆహ్వానం అందినట్లే కదా. మరటువంటప్పుడు మామగారి న్యూస్ చానల్లో ఆవిధంగా స్క్రోలింగ్ ఎందుకు ఇచ్చినట్లు? జూ.యన్టీఆర్ తరపున అతని మామగారు కూడా ఇప్పుడు రంగంలోకి దిగారనుకోవాలా? ఈ ప్రశ్నలకు జూ.యన్టీఆర్ మాత్రమే సమాధానం చెప్పగలడు.

చంద్రబాబు నోట అవిశ్వాస తీర్మానం

  చంద్రబాబు మొన్న మీడియాతో మాట్లాడుతూ అవసరమయితే తమ పార్టీ వచ్చే నెల 10నుండి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలలో కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడుతుందని ఒక మాట అన్నారు. రెండు నెలల క్రితం తెరాస, వైకాపాలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పడు మద్దతు ఈయకుండా దూరంగా ఉండి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని పరోక్ష సహాయం చేసి కాపాడిన చంద్రబాబు, మరిప్పుడు ఎందుకు మళ్ళీ ఆ ఆలోచన చేస్తున్నట్లు అని అందరూ ప్రశ్నించడం మొదలుపెట్టారు.   నిజానికి ఇది అవిశ్వాసం పెట్టే సమయం కాదని చంద్రబాబుకి తెలియకపోలేదు. ఎన్నికలకి పూర్తి స్థాయిలో సిద్దం కాకుండా, ఇటువంటి సమయంలో అవిశ్వాసం పెట్టి ప్రభుత్వాన్నికూలిస్తే దానివల్ల తేదేపాకు లాభం కంటే నష్టమే ఎక్కువుతుందని ఆయనకీ తెలుసు. అయినా ఆవిధంగా మాట్లాడటం ఎందుకంటే తనకీ, కిరణ్ కుమార్ రెడ్డికి మద్య రహస్య ఒప్పందం ఉందని, తానే వెనుక నుండి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాననే వైకాపా ఆరోపణలను ఎదుర్కోవడానికి మాత్రమే. ఒకవేళ ఆయనకు నిజంగా ఆ ఆలోచన ఉండి ఉంటే అవిశ్వాస తీర్మానానికి అవసరమయిన మద్దతు కూడగట్టడానికి ఇప్పటికే ఆయన తగిన ప్రయత్నాలు మొదలు పెట్టి ఉండేవారు. కానీ, ఆయన అటువంటి ఆలోచన కూడా ఏమీ చేయట్లేదు కనుక ఈ అవిశ్వాస తీర్మానం కేవలం వైకాపా ఆరోపణలను ఎదుర్కోవడానికి మాత్రమేనని చెప్పవచ్చును.

టిడిపి మహానాడులో వారసుల ఎట్రాక్షన్

        టిడిపి పార్టీ నిర్వహిస్తున్న 32వ మహానాడులో పలువురు నేతల వారసులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనారోగ్యంతో గత కొన్నాళ్లుగా అమెరికాలో చికిత్స పొంది వచ్చిన దేవేందర్ గౌడ్, పార్టీకి దూరంగా చంద్రబాబు మీద కోపంతో ఉన్న హరికృష్ణలు మహానాడుకు వచ్చారు. ఇక టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ మరో ప్రత్యేక ఆకర్షణ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు రాకపోవడం చర్చకు తెరలేపింది. టీడీపీ నేతలు దివంగత పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరాం, ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడులు హాజరయ్యారు. ఇక దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేంద్ర గౌడ్, కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్, రమేష్ రాథోడ్ కుమారుడు నితీష్ రాథోడ్, దేవినేని కుమారుడు దేవినేని చంద్రశేఖర్, చింతకాయల అయ్యన్న పాత్రడి కుమారుడు విజయ్, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, దయాకర్ రెడ్డిల కుమారులు హల్ చల్ చేశారు. వీరిలో కొందరు వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగనున్నవారుంటే మిగిలిన వారు తండ్రుల వారసత్వాల కోసం ఎదురు చూస్తున్నారు.

మహానాడులో బాబు జోస్యం

  చంద్రబాబు పాదయాత్రలో ఉన్నప్పుడు ముందస్తు ఎన్నికలు ఏ క్షణానయినా రావచ్చునని అందుకు పార్టీలో అందరూ సంసిద్దంగా ఉండాలని చెపుతూ వచ్చారు. కానీ, పాదయాత్ర ముగించుకొని వచ్చిన తరువాత ఇప్పుడు ఆయన తన అభిప్రాయం మార్చుకొన్నారు. మొన్న మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ చరిత్ర గమనిస్తే ఆ పార్టీ ఏనాడు కూడా గడువుకి ఒక్కరోజు ముందు కూడా ఎన్నికలకి వెళ్ళినట్లు కనబడదు. అందువల్ల ఈ సారి కూడా ఏప్రిల్ 2014 వరకు ఎన్నికలకు వెళ్ళక పోవచ్చును. ఏమయినప్పటికీ, మేము ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ఎదుర్కొనేందుకు తయారుగానే ఉంటాము,” అని అన్నారు.   వచ్చే ఎన్నికలలో తమ పార్టీ కేంద్రంలో లెఫ్ట్ పార్టీలు మరికొన్ని ఇతర పార్టీలతో కలిసి 3వ ఫ్రంట్ ఏర్పరచి ప్రభుత్వం ఏర్పాటుకు కృషిచేస్తుందని ఆయన అన్నారు. రానున్న ఎన్నికలలో యుపీఏ ప్రభుత్వ అవినీతి, వెలుగు చూస్తున్న కుంభ కోణాలే ప్రధానాంశాలుగా ఉంటాయని ఆయన అన్నారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికలలో ప్రజలు అవినీతిని ఎంత మాత్రం సహించరని రుజువు చేసిందని అన్నారు. అయితే, కర్ణాటకలో ప్రజలకు బీజేపీ, కాంగ్రెస్ లకు అక్కడ సరయిన ప్రత్యామ్నాయం లేకపోవడం వలననే కాంగ్రెస్ పార్టీకి అవకాశం దక్కిందని ఆయన అభిప్రాయపడ్డారు.   వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ వైయస్సార్ కాంగ్రెస్ రెండూ విలీనమయి పోవచ్చును గనుక అప్పుడు రాష్ట్రంలో తాము కేవలం కాంగ్రెస్ పార్టీతోనే పోటీ పడవలసి ఉంటుందని ఆయన అన్నారు.   లోకేష్ వంటి విద్యావంతుడు రాజకీయాలలోకి రావడం ఆహ్వానించ దగ్గ పరిణామమే అని ఆయన అన్నారు. కేవలం అతను తన కుమారుడిగా కాక, వ్యాపార వ్యవహారాలను చక్కబెట్టి తన సమర్ధత నిరూపించుకొన్న వ్యక్తిగా, యువతకు ప్రతినిధిగా అతనిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని, అదే సమయంలో యువతరానికి తమ పార్టీ స్వగతం పలుకుతోందని ఆయన అన్నారు. ఒకవేళ అవసరమనుకొంటే తమ పార్టీ జూన్ 10నుండి మొదలయ్యే రెండవ విడత బడ్జెట్ సమావేశాలలో అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చునని ఆయన అన్నారు.

మెగాస్టార్..ఫెల్యూర్ స్టారేనా ?

        చిరంజీవి మాజీ మెగాస్టార్‌.. అవును ఇప్పుడు చిరు సినిమా హీరోకాదు ఓ రాజకీయనాయకుడు.. అతికొద్ది కాలం కొనసాగిన ఓ పార్టీకి మాజీ అధ్యక్షుడు.. కేంద్ర మంత్రి కూడా.. సినిమా హీరోగా ఎన్నో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన చిరంజీవి రాజకీయనాయకునిగా మాత్రం వరుస ఫెయిల్యూర్స్‌నే చవి చూస్తున్నాడు..   ఒకప్పుడు చిరంజీవి మైక్‌ పట్టుకుంటే జనాలు ఇలవేసి గోల చేసేవారు.. అభిమానులు సీట్లో కుదురగా కూర్చోలేకపోయేవారు.. ప్రజలు సునామీలా పొటేత్తేవారు.. కాని ఇప్పుడు అంత సీన్‌ లేదు.. పంచ్‌ డైలాగ్స్‌తో అభిమానులకు ఉత్సాహాన్నిచే చిరు ప్రసంగాల్లో ఇప్పుడు ఆ పస కనిపించడం లేదు..         చిరు ఇప్పుడు కేంద్ర మంత్రి హోదాలో ఎప్పుడు విదేశి పర్యటనల్లో బిజీ బిజీగా గడిపేస్తున్నారు.. టూరిజం సదస్సులతో పాటు, కేన్స్‌ లాంటి కలర్‌ఫుల్‌ వేదికల మీద కూడా అలరిస్తున్నాడు.. కాని ఏ వేదిక మీదా చిరులో మునుపటి మెగాస్టార్‌ చరిష్మా కనిపించటం లేదు.. మాటల్లో అప్పటి పవర్‌, పంచ్‌ మచ్చుకైనా కనిపించటం లేదు..             తాజాగా తానా సభల్లో ప్రసంగించిన చిరు. తన మాటల్లో వాడి తగ్గిందని మరోసారి నిరూపించాడు.. తొలిసారిగా కేంద్రమంత్రి హోదాలో తానాకు హాజరైన చిరంజీవికి అదేస్థాయిలో ఘనంగా స్వాగతం పలికారు తానా నిర్వాహకలు.. తెలుగు మాటలకు చాలా కాలంగా దూరంగా ఉంటున్న ప్రవాస భారతీయులు చిరు ఏం మాట్లాడతాడాని ఎదురు చూస్తుంటే వాళ్ల ఆశల మీద నీళ్లు చల్లాడు మెగాస్టార్‌..         హీరోగా ఏది మాట్లాడిన చెల్లుతుంది కాని.. ఓ మంత్రిగా రాజకీయనాయకుడిగా తనకంటూ కొన్ని పరిథులుంటాయని భావించిన చిరు.. తన మాటల్లో ఎక్కడ మునుపాటి వాడి వేడి కనిపించకుండ జాగ్రత్త పడుతున్నారు.. అయితే ఈ మాటలు చిరు రాజకీయ భవిష్యత్తుకు ఎంత వరకు ఉపయోగపడతాయోగాని ఆయన అభిమానులకు ఆయన రాకతో సభ మరింత సక్సెస్‌ అవుతుందనుకున్న నిర్వహకులకు మాత్రం నిరుత్సాహమే మిగిలింది..         చిరు మాటల్లో వాడి తగ్గడం కాంగ్రెస్‌ వర్గాల్లో కూడా కలవరం కలిగిస్తుంది.. ప్రస్థుతం రాష్ట్ర కాంగ్రెస్‌లో జనాలను ఆకర్షించే ఎకైక నేతగా ఉన్న చిరు ప్రసంగాల్లో కూడా పస తగ్గిపోతే ఎలా అని తలలు పట్టుకుంటున్నారట.. ఇదిలాగే కొనసాగితే చిరు మాజీ మెగాస్టార్‌ అన్నది నిజమౌతుందంటున్నారు విశ్లేషకులు..  

యువరాజుకు కోపమొచ్చింది..!

        రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యేక దృష్టిన కేంద్రికరించారు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాందీ.. ఇప్పటికే కేంద్రంలో రాష్ట్రంలో అంటుకున్న అవినీతి బురదను కడుక్కోలేక సతమతమవుతున్న పార్టీ అధిష్టానానికి.. జగన్‌ కేసులో సిబిఐ వేస్తున్న చార్జీ షీట్లు వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి..   అందుకే ఈ విషయంలో కాస్త కటువుగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాడు రాహుల్‌.. కేంద్రంలో అవినీతి ఆరోపణలు వచ్చిన వెంటనే మంత్రులు బన్సల్‌, అశ్వనీకుమార్‌లకు ఉద్వాసన పలికి కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలకు ఓ హెచ్చరిక చేశారు..             ఇందులో భాగంగానే జగన్‌ అక్రమాస్తుల కేసులో నింధితులుగా నమోదైన ధర్మాన, సభితలను మంత్రి వర్గం నుంచి తొలగించారు.. ఈ విషయంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంతగా మంత్రులకు వత్తాసు పలికినా కేంద్రం మాత్రం పట్టించుకోలేదు.. మంత్రులను తొలగించాల్సిందే అంటూ కరాఖండిగా చెప్పడంతో సియం కూడా మెట్టు దిగక తప్పలేదు..         అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు మిగతా మంత్రులకు వణుకు పుట్టిస్తుంది.. ఇప్పటికే మెపిదేవి జైలులో ఉండగా తాజా ధర్మాన, సభితలు రాజీనామాలు చేశారు.. వీళ్లేకాక పొన్నాళ లక్ష్మయ్య, కన్నా లక్ష్మీ నారాయణ, గీతారెడ్డిలపై అవినీతి, అధికార దుర్వినియోగ ఆరోపణలు వస్తున్నాయి.. దీంతో వీరి భవిష్యత్తు ఏంటి అని గుసగుసలాడుకుంటున్నారు కాంగ్రెస్‌ వర్గాలు..         మరో ఏడాదిలో ఎలక్షన్లు ఉండటంతో పార్టీపై ఎలాంటి అవినీతి మచ్చ పడకుండా ఉండేందుకు ఆరోపణలు ఎదుర్కొంటున్నారిని పదవుల నుంచి తొలగించాలని యువరాజు రాహులు స్పష్టమైన సందేశాలను పంపిచారు.. అంతేకాదు తను అమ్మ సోనియాలా సాఫ్ట్‌ కాదని నాన్నమ్మ ఇందిరలా కఠిన నిర్ణయాలను తీసుకుంటానని చెప్పకనే చెపుతున్నాడు.. దీంతో ఇప్పుడు రాష్ట్ర మంత్రి వర్గంలో కలకలం మొదలైంది..         ఈ నెల 29న సియం కిరణ్‌ కుమార్‌ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై వేటు తప్పదన్న టాక్‌ బాగా వినిపిస్తుంది.. సాక్ష్యాత్తూ ప్రదాన మంత్రే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న యూపిఏను ఇప్పుడు రాహుల్‌ మొదలెట్టిన ప్రక్షాలణా కార్యక్రమం ఎంతవరకు గట్టెక్కిస్తుందో చూడాలి..  

మహానాడుకి జూ.ఎన్టీఆర్ డుమ్మా

        తెలుగుదేశం పార్టీ మహానాడు గండిపేటలో ప్రారంభమయింది. 32వ మహానాడు కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు హరికృష్ణ, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ లు హాజరయ్యారు. పాదయాత్ర తరువాత జరుగుతున్న మహానాడు కావడంతో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు ప్రకటిస్తారని, ఇప్పటికే 14 తీర్మానాలను సిద్దం చేశారని, వీటితో పాటు అవినీతి మీద చంద్రబాబు కీలక ప్రకటన చేస్తారని, తెలంగాణ మీద మరింత స్పష్టత ఇస్తారని అంటున్నారు.గత కొన్నాళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్న హరికృష్ణ మహానాడుకు విచ్చేశారు. అయితే పార్టీ కండువా కప్పుకునేందుకు ఆయన ఒప్పుకోలేదు. మొదట పార్టీ వేదిక మీదకు రాని ఆయన తరువాత మీదకు వచ్చినా కండువా మాత్రం వేసుకోలేదు. ఆయనకు చంద్రబాబు మీద ఇంకా ఆగ్రహం తగ్గలేదని తెలుస్తోంది. మహానాడులో చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణల ఫ్లెక్సీలు కనిపించినా హరికృష్ణ, ఎన్టీఆర్ ల ఫోటోలు మాత్రం కనిపించలేదు.

కేసీఆర్ ల్యాంకోలో పెట్టుబడులా?

  రాజకీయ నాయకుడంటే కాంట్రాక్టులు చేసుండాలి. ఒకట్రొండు కుంభకోణాలలోనయినా పేరుండాలి. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లు తన స్థాయికి తగ్గట్లు లక్షల కోట్లో లేక వేల కోట్లో కనీసం వందల కోట్లయినా వెనకేసుకొని ఉండాలి. తన బందుగణమంతటికీ యధాశక్తిన పార్టీలో, ప్రభుత్వంలో పదవులు కట్టబెట్టగలగాలి. స్వచ్చమయిన తెల్లటి ఖద్దరు బట్టలే కట్టాలి. దాదాపు మన రాజకీయ నాయకులందరికీ ఈ ప్రాధమిక అర్హతలున్నాయని వారు ఏదో ఒక సందర్భంలో నిరూపించుకొంటూనే ఉన్నారు.   ఇక రఘునందన్ రావు వెర్సస్ కేసీఆర్ & కో మద్య ఏర్పడిన అవగాహన లోపం కారణంగా తెరాసా నేతల వసూల్ భాగోతాలు కొన్నిటిని మననం చేసుకొన్నపటికీ అవి ప్రస్తుతం తాత్కాలికంగా సీబీఐ గడప దగ్గర ఆగిపోయాయి. ఆంధ్రా పాలకుల కుట్రల వల్ల ఇటువంటి అభాండాలు మోస్తున్న కేసీఆర్ మీద ఇప్పుడు ఆయన గతంలో ‘తెలంగాణ జాతి రత్నం’ గా సర్టిఫై చేసిన మాధుయాష్కీ కూడా కొత్తగా కొన్ని అభాండాలు వేసారు.   కేసీఆర్ తనకు ఇచ్చిన సర్టిఫికేట్ ను మళ్ళీ ఇటీవలే రద్దు చేసి ఇప్పుడు ‘తెలంగాణ బుడ్డర్ ఖాన్’ గా మార్చడంతో ఆగ్రహించిన ఆయన తన దగ్గరున్నకేసీఆర్ ఫైల్ తెరిచి అందులో ఉన్న’పిట్టల దొర’ వివరాలను ఆయన మీడియాకు అందజేశారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, తెలంగాణా ను మనస్పూర్తిగా వ్యతిరేఖించే ఆయన బద్ద శత్రువు లగడపాటి రాజగోపాల్ కు చెందిన ల్యాంకో కంపెనీలో కేసీఆర్ భారీ పెట్టుబడులు పెట్టారు. ఇక, ఇండియాలో పెట్టుబడులకు రాజకీయ ఇబ్బందులేర్పడితే తట్టుకోవడానికి వీలుగా అమెరికాలో న్యూజెర్సీలో ‘స్ట్రిప్ మాల్’ను కూడా ఎందుకయినా మంచిదని ముందు జాగ్రత్తగా కొనుగోలు చేసి ఉంచుకొన్నారుట. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, బ్రతుకమ్మ పండుగ కలక్షన్లు వంటివి వీటికి అధనం అని ఆయన తెలియజేసారు.   తన వంటి తెలంగాణా జాతి రత్నాన్ని డీ-నోటిఫై చేసిన కేసీఆర్ ని, ఆయన కూడా డీ-నోటిఫై చేస్తూ ఇప్పుడు నోట్లు, సీట్లు, ఓట్లు అంటు ఎన్నికల పాట పాడుతున్న ‘పిట్టలదొర' అని ఈ సందర్భంగా కొత్త సర్టిఫికేట్ జారీ చేసారు.

ఆత్మహత్యలకు కేసీఆరే కారణం: మధుయాష్కీ

        కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ టీఆర్ఎస్ , కేసీఆర్ లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణపై టీఆర్ఎస్ నేతలే మోసం చేస్తున్నారని గౌడ్ విమర్శించారు. పార్టీ కోసం నిధులు సేకరించి సొంత ఆస్తులు కూడబెడుతున్నారని ఆరోపించారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కేసీఆరే కారణమని అన్నారు. కేసీఆర్ పిట్టలదొరలా కథలు చెబుతున్నారని విమర్శించారు. 2014 ఎన్నికలే లక్ష్యమయితే ఉద్యమాలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. ఉద్యమనేతకు సహనం ఉండాలి కాని అహంకారం ఉండకూడదన్నారు. తాను ఫామ్ హౌస్ లో పడుకోలేదని, తెలంగాణ కోసమే పనిచేస్తున్నానని తెలిపారు. వ్యక్తిగత రాజకీయ లబ్ది కోసమే టీఆర్ఎస్ లో చేరేందుకు కొంత మంది కాంగ్రెస్ ఎంపీలు ప్రయత్నిస్తున్నారని యాష్కీ అన్నారు.

సబితా, ధర్మాన ప్రసాద్ ఔట్

        రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావుల రాజీనామాల సస్పెన్స్ కు తెరపడింది. వారం రోజులుగా వారి రాజీనామాలను ఆమోదించకుండా ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం ఆదేశాలతో ఎట్టకేలకు వారి రాజీనామా లేఖలను గవర్నర్ కు ఈ ఉదయం పంపడం గవర్నర్ నరసింహన్ ఆమోదించడం వెంట వెంటనే జరిగిపోయింది. వాన్‌పిక్ కేసులో ఐదో నిందితుడుగా ధర్మాన ప్రసాదరావు ఉండగా, దాల్మియా సిమెంట్స్ కేసులో నాలుగో నిందితురాలుగా సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు.అయితే తాము నిర్దోషులమని, తమకు మరింత గడువు కావాలని, కోర్టు ఒప్పుకోకుంటే రాజీనామాలు ఆమోదించాలని వారు వాదిస్తున్నారు. ఇక అసేంబ్లీ సమావేశాలు, అవిశ్వాసం పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో వారి రాజీనామాలు ఆమోదించకుండా నెట్టుకురావాలని, అధిష్టానాన్ని కొన్ని రోజుల గడువు కోరాలని ముఖ్యమంత్రి యోచించారు. ఇదే విషయం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జి గులాంనబీ ఆజాద్ కు ముఖ్యమంత్రి ఇంతకుముందే చెప్పారు. అయితే సోనియా ఆదేశాల ప్రకారం రాజీనామాలు ఆమోదించాల్సిందేనన్న నిర్ణయంతో ఎట్టకేలకు వాటిని ఆమోదించారు.

ఐపీఎల్ 6 ఛా౦పియన్‌ ముంబయి

        చెన్నయ్ సూపర్ కింగ్స్ మూడో టైటిల్ ఆశకు మరోసారి బ్రేక్ పడింది. ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ 6లో చాంపియన్‌గా నిలిచింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఫైనల్లో ముంబయి 23 పరుగులతో రెండుసార్లు చాంపియన్ చెన్నయ్‌కు షాకిచ్చింది. ముంబయి నిర్దేశించిన 149 పరుగుల లక్ష్యా న్ని ధోనీసేన ఛేదించలేకపోయింది. 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 125 రన్స్‌కే పరిమితమైంది. కెప్టెన్ ధోనీ 45 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 63 నాటౌట్ పోరాటం విజయాన్ని అందించలేకపోయింది. హర్భజన్ (2/14), జాన్సన్ (2/19), మలింగ (2/22) రెండేసి వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 148 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమైనా కీరన్ పొలార్డ్ (32 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. అంబటి రాయుడు (36 బంతుల్లో 4 ఫోర్లతో 37) రాణించాడు. దీంతో ముంబయి గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. డ్వెన్ బ్రావో 4 వికెట్లు పడగొట్టాడు. అల్బీ మోర్కెల్‌కు రెండు వికెట్లు దక్కాయి. పొలార్డ్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. 1-1, 2-2, 3-3... కష్ట సాధ్యంకాని లక్ష్య ఛేదనలో చెన్నయ్ వికెట్లు కోల్పోయిన తీరిది. ఈ సీజన్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్న మైకేల్ హస్సీ (1), సురేష్ రైనా (0) మలింగ మ్యాజిక్‌కు తొలి ఓవర్లోనే పెవిలియన్‌కు చేరారు. బద్రీనాథ్ (0) జాన్సన్‌కు చిక్కాడు. దీంతో చెన్నయ్ మూడు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. మురళీ విజయ్ (18), బ్రావో (15), జడేజా (0), మోర్కెల్ (10)తీవ్రంగా నిరాశపర్చారు. చివరిలో ధోనీ, అశ్విన్ (9) ఆశలు రేకెత్తించినా ఫలితం దక్కలేదు.

ధర్మాన, సబితా రాజీనామాలు ఆమోదం

        వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంలంధించి మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబిత ఇంద్రారెడ్డిలు చేసిన రాజీనామాలపై నెలకొన్న ఉత్కంఠ వీడింది. వారి రాజీనామాలను గవర్నర్ నరసింహన్ ఆదివారం ఆమోదించారు. ఈ ఇద్దరి మంత్రుల పేర్లను సీబీఐ చార్జీ షీటులో పేర్కొనడంతో వారు తమ పదవులకు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. సబిత, ధర్మానలు గతంలోనే రాజీనామా చేశారు. అయితే, వారు ఏ తప్పు చేయాలేదని చెబుతూ ముఖ్యమంత్రి వాటిని పక్కన పెట్టారు. కేంద్రంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులచే అధిష్టానం రాజీనామా చేయిస్తుండగా ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా ఉండటంపై సొంత పార్టీ నేతల నుండి విమర్శలు వచ్చాయి. మరోవైపు అధిష్టానం కూడా కిరణ్, బొత్సలను పిలిచి రాజీనామా చేయించాలని, వాటిని ఆమోదించేలా చూడాలని ఆదేశించింది. దీంతో అధిష్టానం ఆదేశాల మేరకే సబిత, ధర్మాన రాజీనామాలను ఇప్పటికిప్పుడు గవర్నర్ వద్దకు పంపడం, వాటిని నరసింహన్ వెంటనే ఆమోదించడం జరిగిందని అంటున్నారు.

ఛత్తీస్‌ఘడ్ పిసిసి చీఫ్ ను హత్య చేశారు

        కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయాణిస్తున్న బస్సును పేల్చి, కాల్పులు జరిపి సల్వాజుడం వ్యవస్థాపకుడు మహేంద్రకర్మను చంపిన మావోయిస్టులు కిడ్నాప్ చేసిన ఛత్తీస్గఢ్ పిసిసి అధ్యక్షుడు నందకుమార్ను, ఆయన కుమారుడు దినేష్ను మావోయిస్టులు హత్య చేశారు. ఈ ఇద్దరి మృతదేహాలు సుకుమా జిల్లా దర్భా వద్ద లభ్యమైయ్యాయి. మావోయిస్టులు నిన్న మందుపాతరతో కాంగ్రెస్ నేతల కాన్వాయ్ని పేల్చివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఘటనలో 25 మంది మృతి చెందారు. 30 మందికిపైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లా పరిస్థితి విషమంగా ఉంది. నందకుమార్, దినేష్లను కిడ్నాప్ చేసి హత్య చేశారు.

పవన్ కళ్యాణ్ తెదేపాలోకి!

    సినిమాలు, రాజకీయాలలో ఎప్పుడు ఏ వార్త ఎక్కడి నుంచి ఎందుకు పుట్టుకొస్తుందో ఎవరూ ఊహించలేరని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. ఇటీవల చంద్రబాబు పాదయాత్ర ముగించుకొని వచ్చిన తరువాత ఆయనను అభినందించడానికి పవన్ కళ్యాణ్ ఆయన సోదరుడు నాగబాబు ఇద్దరూ కలిసి వెళ్ళారనేది ప్రధాన వార్త అయితే, అప్పుడే దానిపై రకరకాల కోణాలలో వేడి వేడి విశ్లేషణలు కూడా వచ్చేస్తున్నాయి.   పవన్ కళ్యాణ్, నాగబాబు చంద్రబాబుని కలిసి ఆయనని అభినందించిన తరువాత వారు వచ్చే ఎన్నికలలో తెదేపా ఘన విజయం సాదించాలని కోరినప్పుడు, దానికి జవాబుగా ఆయన ‘మీ సహాయ సహకారాలుంటే మాపని మరింత సులువవుతుందని’ అన్నట్లు, అప్పుడు పవన్ కళ్యాన్ ‘తెదేపా టికెట్ ఇస్తే నేను కృష్ణాజిల్లా నుండి పోటీ చేయడానికి సిద్దం’ అని జవాబిచ్చారనేది దీనికి అనుబంధ వార్త.   ఇక ఇక్కడి నుండి విశ్లేషకుల బుర్రలకి పదును పెట్టి ఈ వార్తలకి తమ మేధా శక్తితో మరిన్ని సొబగులు అద్దారు.   1.చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్, నాగబాబు ఇద్దరూ ఆ పార్టీ విజయం కోసం చాలా కష్టపడ్డారు. ఎలాగయినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించి తమ పార్టీని అధికారంలోకి తెచ్చి, ఆదర్శవంతమయిన ఒక చక్కటి ప్రభుత్వం ఏర్పరచి రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలోకి తీసుకుపోవాలని కలలు కన్నారు. కానీ చిరంజీవి వారిరువురికి హ్యాండిచ్చి మంత్రి పదవికోసం ‘హ్యాండ్ పార్టీ’కి తమ కలల రాజ్యాన్నిఅమ్మిపడేసి వెళ్ళిపోవడంతో వారిరువురూ ఆగ్రహంతో ఉన్నారు. తమ మెగా జీవికి తగిన బుద్ది చెప్పాలనే ఆలోచనతోనే ‘సరయిన సమయంలో సరయిన మనిషిని’ కలిసారని ఒక విశ్లేషణ.   2.ఇక, పార్టీలో తనకు తల నొప్పిగా మారిన హరికృష్ణ, జూ.యన్టీఆర్ లకు చెక్ చెప్పాలంటే పవన్ కళ్యాన్, నాగబాబులని పార్టీలో ఆహ్వానించడమే తగిన మార్గమని చంద్రబాబు అభిప్రాయపడుతున్నట్లు విశ్లేషణ సాగింది. అందువల్ల పవన్ కల్యాణ్ కి మచిలీపట్నం నుండి టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు మరో విశ్లేషణ.   3.ఇక, ఈ రకంగా సాగుతున్న విశ్లేషణలకి మనం కూడా ఓ చేయి వేయదలిస్తే ఈ రకంగా వ్రాసుకోవచ్చును. మన లెక్క ప్రకారం తెదేపాలోకి పవన్ కళ్యాణ్, నాగబాబులను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో కేంద్రమంత్రిగా ఒకవెలుగు వెలుగుతున్నచిరంజీవిని రాబోయే ఎన్నికలలో తెదేపా ఎదుర్కోవడం సులువవుతుంది. చిరంజీవి కంటే మంచి వాగ్ధాటి, మంచి పేరూ ఉన్న పవన్ కళ్యాణ్ న్ని ముందుంచుకొని తెదేపా ఎన్నికలకి వెళితే ఆయన ప్రభావం తగ్గించడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకోవలనుకొంటున్న ఆయన కాపు కులస్తులను కూడా తెదేపా తనవైపు ఆకర్షించవచ్చును. తద్వారా ఆ కులస్థుల ఓట్లలో పెద్ద చీలిక తేగలిగితే అది కాంగ్రెస్, వైకాపాలా విజయావకాశాలను దెబ్బ తీసి తేదేపాకు విజయం తెచ్చిపెడుతుందని చంద్రబాబు భావిస్తున్నారని వ్రాసుకోవచ్చును.   ఇక, ఇంటర్నెట్ లో ఇంత జోరుగా ఈ వార్తలు, విశ్లేషణలు సాగుతుంటే, డేగ కళ్ళతో సంచలన వార్తల కోసం తెగ తిరిగేసే ప్రింట్ మరియు ఎలెక్ట్రానిక్ మీడియాకు ఇంకా ఈ వార్త గురించి ఉప్పందలేదంటే విశేషమే. లేకుంటే, ఈ పాటికి ఈ సంచలన వార్తని, మన యాంకరమ్మలు వచ్చీరాని తెలుగులో భయంకరమయిన బ్యాంక్ గ్రౌండ్ మ్యుజిక్కుతో, ఒకే క్లిప్పింగుని తిప్పి తిప్పి చూపిస్తూ, బ్రేకుల మద్య మనకి వడ్డించేసేవారేమో!

ఎండకి కెసిఆర్ మైండ్ బ్లాక్

      టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు పార్టీ నేత రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ భాష మార్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో వడగాడ్పుల వల్ల కేసీఆర్ ఉచ్ఛనీచాలు మర్చిపోయారని, మతిస్థిమితం కోల్పోయారని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ అసహనం ప్రదర్శిస్తున్నారన్నారు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న వారు టీఆర్ఎస్ వంద సీట్ల కోసం కాదని రేవంత్ తెలిపారు. తెలంగాణ ప్రజలు తమకు ఓట్లేస్తారని, మీ చేతుల్లో అదే పోస్తారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు తలదించుకునేలా కేసీఆర్ భాష ఉందన్నారు. టీడీపీపై పెత్తనం చెస్తే ఓప్పుకోమని హెచ్చరించారు. కుక్కకాటుకు చెప్పుదెబ్బ ఎలా కొట్టాలో తమకు తెలుసని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ బుడ్డిపెట్ట బుల్లోడు...తెలంగాణతో సంబంధంలేదన్నారు. వెయ్యి మంది తెలంగాణ విద్యార్థులను పొట్టనపెట్టుకుంది 100 సీట్ల కోసమేనా అని ప్రశ్నించారు. 16 ఎంపీ సీట్లతో తెలంగాణ ఎలా తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అసలు రంగు రఘునందన్ బయటపెట్టారన్నారు. కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరిగితే తెలంగాణ తీర్మానం ఎందుకు కోరలేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.  

'జయప్రద'కి ఆలీ చెక్

        సినీ నటుడు ఆలీ సడన్ గా రాజకీయ తెర పైకి వచ్చాడు. ఆయన కోసం రెండు ప్రధాన రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. రాజమండ్రి నుంచి కాంగ్రెస్ తరపున జయప్రద పోటి చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గత ఎన్నికల్లో గెలుపు అంచుల వరకు వెళ్లి ఓటమి పాలైన టిడిపి ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఆలీని ఇక్కడినుంచి పోటికి దింపాలని చూస్తున్నారు. మరోవైపు సినీ గ్లామర్ లేని వైఎస్సార్ కాంగ్రెస్ …అలీని వలలో వేసుకోవాలని చూస్తోంది. సినిమా విషయంలో కాస్త బలమైన లాబీయింగ్ ఉన్న పార్టీ టీడీపీయే కావడంతో ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పని అంత సులువు కాకపోవచ్చు. అలీ స్వంత ఊరు రాజమండ్రిలో నటుడిగా ప్రజల్లో పేరు పొందడమే కాకుండా సామాజిక సేవలో కూడా ఆయన తరిస్తున్నారు. జిల్లాలో పలు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయితే ప్రజా సేవను ఇంకా బాగా చేయొచ్చని ఆలీ భావిస్తున్నట్లు సమాచారం. ఏదమైనా అలీ రాజకీయాల్లోకి వస్తే టీడీపీ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.

తెలంగాణపై టిడిపి డబుల్ గేమ్?

  కేసీఆర్ తెదేపా, దాని అధ్యక్షుడి ద్వంద వైఖరిని ఎండ గట్టారు. తెలంగాణాకి అనుకూలంగా లేఖ ఇచ్చామంటున్న చంద్రబాబు, ఇకనయినా తన ద్వంద వైఖరికి స్వస్తి చెప్పి త్వరలో హైదరాబాదులో నిర్వహించనున్న మహానాడు సమావేశాలలో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రానికి తమ పార్టీ అనుకూలమని స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేసారు. తెలంగాణపై తన అభిప్రాయం స్పష్టం చేయకుండా చంద్రబాబు ఎన్ని పాదయాత్రలు చేసినా కూడా ఆ పార్టీ వచ్చే ఎన్నికలలో తెలంగాణా ఒక్క సీటు కూడా గెలుచుకోలేదని ఆయన అన్నారు.   ఈ విషయంలో కేసీఆర్ చెప్పిన మాటలు చేదుగా అనిపించినప్పటికీ అవి నూటికి నూరు శాతం నిజమని అంగీకరించక తప్పదు. తెలంగాణాలో చంద్రబాబు పాదయాత్ర వల్ల పార్టీ బలపడినప్పటికీ, అది ఆపార్టీకి అవసరమయినన్నిఓట్లు రాల్చకపోవచ్చును.   తెదేపా, వైకాపాలు రెండూ కూడా తెలంగాణాకు పూర్తి అనుకూలం కానప్పటికీ, అలాగని వ్యతిరేఖం కూడా కాదనేది సుస్పష్టం. తెలంగాణా విషయంలో అవి ఇప్పటికీ స్పష్టత ఈయకపోవడానికి ప్రధాన కారణం, అవి స్పష్టత ఇస్తే దానిని బట్టి కాంగ్రెస్ పార్టీ తన వ్యూహం మార్చుకొని, తమను రాబోయే ఎన్నికలలో ఎక్కడ దెబ్బ తీస్తుదనో భయం తప్ప మరొకటి కాదు. ఒకవేళ తాము ప్రత్యేక తెలంగాణా అంటే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ సమర్దుడయిన తెలంగాణా వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించి ‘సమైక్య రాష్ట్రం’ గేం ఆడితే, అప్పుడు రెండు ప్రాంతాలలో తమ పార్టీలు ఓడిపోతాయనే భయంతోనే ఆ రెండు పార్టీలు ఇంతవరకు స్పష్టత ఈయలేకపోతున్నాయి.   ఈ బలహీనత గురించి తెరాసకు కూడా బాగానే తెలుసు. అయితే అది తెలియనట్లుగా ఉండటమే తమకి రాజకీయంగా మేలు చేస్తుంది గనుక, తెలంగాణా అంశంపై స్పష్టత ఇవ్వాలని పట్టుబడుతోంది. తెదేపా ఈ పరిస్థితుల్లో ఎలాగు నిర్ద్వంద ప్రకటన చేయలేదని కూడా బాగా తెలుసు గనుకనే, తెలంగాణాకి అనుకూలమని ప్రకటన చేయమంటూ ఆపార్టీపై ఒత్తిడి తెస్తూ, దానికి వారు చెప్పే డొంక తిరుగుడు సమాధానాలను కేసీఆర్ తన శైలిలో తెలంగాణా ప్రజల ముందు ఉంచుతూ తెదేపాను, చంద్రబాబుని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు కూడా.   అయితే, తెలంగాణా అంశంపై తెదేపా స్పష్టత ఇవ్వడం వలన జరిగే నష్టం కంటే, ఇవ్వకపోవడం వలననే జరిగే నష్టమే ఎక్కువని చెప్పవచ్చును. ఆ పార్టీకి చెందిన తెలంగాణా నేతలు ఇప్పటికీ ప్రజల మద్య దైర్యంగా తిరుగలేకపోవడానికి ప్రధాన కారణం పార్టీ అనుసరిస్తున్న ఈ ద్వంద వైఖరే. తెలంగాణాకి తాము వ్యతిరేఖం కాదని చెప్పినపటికీ, ‘జై తెలంగాణా!’ అని కూడా అనలేని కారణంగా తెదేపా అక్కడి ప్రజల నమ్మకం పొందలేకపోతోంది.   వారి అనుమానాలను కేసీఆర్ తన వాక్చాతుర్యంతో మరింత బలపరుస్తున్నారు. ఈ సంగతి చంద్రబాబు తో సహా అందరికీ స్పష్టంగా తెలుసు కానీ తమ బలహీనతే తమ కాళ్ళకి బంధంగా మారడంతో నోరు మెదపలేకపోతున్నారు. ఒకవేళ ఆ పార్టీ గనుక తెలంగాణాపై స్పష్టమయిన వైఖరి ప్రకటించి ఉంటే, ఇప్పుడు ఆ పార్టీకి అక్కడ ఉన్న బలం ఖచ్చితంగా రెట్టింపు అయ్యేది. కానీ, ఆ తరువాత కాంగ్రెస్ పన్నే పద్మవ్యూహంలో ఎక్కడ చిక్కడిపోతామనే భయంతోనే స్పష్టత ఈయలేకపోతున్నారు.   అయితే, ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాల ప్రజల మద్య కేసీఆర్ ఆయన అనుచరులు తమ విద్వేషా ప్రసంగాలతో ఎప్పుడో చిచ్చుపెట్టి, వారి మద్య దూరం పెంచారు. కనుక, ఇక ఈ రెండు ప్రాంతాల ప్రజలు మానసికంగా కూడా ఎప్పుడో విడిపోయారు. ఒకవేళ తెలంగాణా వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవిలో కూర్చొబెట్టి వారిని మళ్ళీ కలుపుదామని ప్రయత్నాలు చేసినా కూడా ఇటువంటి రాజకీయనాయకులు ఉద్యమాలలో ఉన్నంత కాలం తిరిగి కలిసే అవకాశం ఉండదు.   ఇటువంటి వాస్తవిక ధోరణిలో ఆలోచించి ఉంటే తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండూ కూడా తెలంగాణాకి అనుకూలంగా స్పష్టమయిన ప్రకటన చేసి, రెండు ప్రాంతాలలో ప్రత్యేక శాఖలు ఏర్పరుచుకొని, కాంగ్రెస్ తెరాసలకు దీటుగా నిలబడగలిగేవి.   కానీ, ముందే చెప్పుకొన్నట్లు కాంగ్రెస్ వ్యూహానికి బయపడుతూ, తెలంగాణా సమస్యను పరిష్కరించే బాధ్యతని కాంగ్రెస్ పార్టీపైకి నెట్టేసి దాని భుజాల మీద తమ తుపాకులు ఉంచి రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో విజయం సాదించాలని ఆలోచన చేస్తున్నాయి. అయితే, ఈ ద్వంద విధానం వలన ఆ రెండు పార్టీలకి తెలంగాణా ప్రాంతంలో లాభం కంటే నష్టమే ఎక్కువ కలుగుతుంది.   ఈ విషయంలో స్పష్టత ఇచ్చిన బీజేపీ మరియు కమ్యునిస్ట్ పార్టీలు రెండూ కూడా రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలలో ప్రజల నుండి వ్యతిరేఖత ఎదుర్కోనలేదనే సంగతిని ఆ రెండు పార్టీలు గమనిస్తే, తాము తెలంగాణాకి అనుకూలమని ప్రకటించినా కూడా ఆంధ్రా ప్రాంత ప్రజలు వ్యతిరేకించరనే సంగతి అర్ధం అవుతుంది.   ఒకవేళ వ్యతిరేకిస్తే వారి ప్రత్యర్ద రాజకీయ పార్టీల నేతలు, వారిచే ప్రేరింపబడిన అనుచరులే వ్యతిరేకిస్తారు తప్ప ప్రజలు కారు. అటువంటప్పుడు వారిని రాజకీయంగా ఏవిధంగా ఎదుర్కోవాలో ఆలోచించుకొని, ముందుకు సాగడం మేలు. ఏమయినప్పటికీ చంద్రబాబు తన ద్వంద విధానాల వల్ల రెండు ప్రాంతాల ప్రజల నమ్మకం పోగొట్టుకొంటున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చును.