కిరణ్ కుమార్ రెడ్డి నోట అధిష్టానం మాట

  ఇంతకాలం టీ-కాంగ్రెస్ యంపీల విషయంలో ఎన్నడూ కలుగజేసుకొని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఈరోజు వారు పార్టీ వీడి వెళ్లిపోతున్నట్లు ప్రకటించిన వెంటనే తనదయిన శైలిలో ప్రతిస్పందించడం విశేషం.   “ప్రజాస్వామ్యంలో వ్యక్తులకు పార్టీలు మారే స్వేచ్చ ఎప్పుడూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఆ స్వేచ్చ మరికొంచెం ఎక్కువగా ఉన్నందునే వారు నేడు వేరే పార్టీలోకి స్వేచ్చగా వెళ్ళగలుగుతున్నారు. గత 40-50 ఏళ్లుగా నలుగుతున్న తెలంగాణా అంశాన్ని, కొందరు రాత్రికి రాత్రే తేల్చమని చెప్పినంత మాత్రాన్న తేలిపోదు. దానిని వారంలో తేల్చేయమంటూ అధిష్టానానికి డెడ్ లైన్లు పెడితే దానికి పార్టీ తలొగ్గదు. పార్టీలో ఉన్నవారెవరయినా పార్టీ అధిష్టాన నిర్ణయానికి, పార్టీ క్రమశిక్షణకు లోబడి ఉండాల్సిందే,” అని అన్నారు.   ఆయన కాంగ్రెస్ అధిష్టానం మనసులో ఉన్న మాటలనే పలుకుతున్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపై తెలంగాణా అంశంపై పార్టీ నిర్ణయానికి లోబడి ఉండలేని వారు, పార్టీకి వ్యతిరేఖంగా మాట్లాడేవారు అందరూ కూడా వివేక్, మందా, కేశవ్ రావులు వెళ్ళినట్లే బయటకి వెళ్లవచ్చునని ఆయన చెప్పకనే చెపుతున్నారు. ఇది పార్టీలో మిగిలిన తెలంగాణా నేతలకి హెచ్చరిక వంటిదే. రేపటి నుండి బొత్స సత్యనారాయణ వంటివారు కూడా ఇటువంటి హెచ్చరికలే చేసినా ఆశ్చర్యపోనసరం లేదు.

కాంగ్రెస్ తో దోస్తీ కటీఫ్...ఇక కేసీఆర్ తో

  టీ-కాంగ్రెస్‌ యంపీలు వివేక్, మందా జగన్నాథం, కె. కేశవరావు ముగ్గురూ కేసీఆర్ తో సుదీర్గ మంతనాలు జరిపిన తరువాత కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలో చేరబోతున్నట్లు ప్రకటించారు. తాము విదించిన గడువులోగా పార్టీ అధిష్టానం స్పందించకపోవడంతో ఇక కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా ఇచ్చే ఉద్దేశ్యం లేదని భావించినందునే తాము పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. జూన్ 2న నిజాం కాలేజీ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో తెరాసలో అధికారికంగా జేరుతామని వారు ప్రకటించారు.   ఎంపీ వివేక్ ఇంట్లో తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌తో జరిగిన సమావేశంలో వివేక్‌, కే.కేశవరావు ఆయన కుమారుడు విప్లవ్, మంధా జగన్నాధం, ఆయన కుమారుడు కూడా పాల్గొన్నారు. వారి కుమారులకి కూడా టికెట్స్ విషయంలో కేసీఆర్ స్పష్టమయిన హామీ ఇచ్చినట్లు సమాచారం. రాజయ్యకు పార్టీ టికెట్ హామీ ఇవ్వనందున ఆయన తెరాసలో చేరేందుకు వెనుకడుగు వేయడంతో, కేసీఆర్ ఆయనతో కూడా ప్రస్తుతం చర్చిస్తున్నారు. ఆయనకు కూడా తగిన హామీ ఇచ్చి జూన్ 2న జరిగే సభలో పార్టీలో చేర్చుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.   ఇక కాంగ్రెస్ యంపీల రాకతో ఉద్యమం మరింత బలోపేతం అవుతుందని కేసీఆర్ అన్నారు. వారి చేరికని పార్టీలు మారడంగా చూడకుండా ఉద్యమంలో చేరుతున్నట్లే చూడాలని కేసీఆర్ కోరారు.   ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం తెచ్చినప్పటికీ, అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండని వారిపట్ల పార్టీ ఎటువంటి వైఖరి అవలంబిస్తుందో స్పష్టం చేసింది. తెలంగాణా పేరిట తమను ఎవరూ కూడా బ్లాక్ మెయిల్ చేయలేరని, పార్టీకి లోబడి ఉండలేని వారు నిరభ్యంతరంగా బయటకి వెళ్లిపోవచ్చునని స్పష్టం చేసినట్లయింది. తద్వారా ఇక ముందు మిగిలిన నేతలెవరూ కూడా తెలంగాణా అంశంపై పార్టీని ఇబ్బంది పెట్టే సాహసం చేయరు.   కేవలం ఇద్దరు యంపీలను వదులు కోవడం ద్వారా, కాంగ్రెస్ పార్టీ మిగిలిన అందరిపై గట్టి పట్టు సాదించినట్లు అర్ధం అవుతోంది. ఇది చదరంగంలో రాజును రక్షించుకొనేందుకు కొన్ని బంట్లను, సైన్యాన్ని వదులుకొన్నట్లుగానే భావించవచ్చును. అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి దీని వల్ల మేలే జరిగే అవకాశం ఉంది గనుకనే వారి గడువును పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించింది.   ఇక, తెదేపా నాగర్ కర్నూల్ ఇన్-చార్జ్ జనార్ధన్ రెడ్డి కూడా తెరాసలో చేరబోతున్నట్లు ప్రకటించారు. తెరాస నేత జితేందర్ రెడ్డి ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

కోర్టులో నీ చిట్టా విప్పుతా: దగ్గుబాటి

        టి. సుబ్బిరామిరెడ్డి కోర్టుకు వెళితే తనకు అభ్యంతరం లేదని కాంగ్రెస్ శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. టీఎస్ఆర్ ఈరోజు మీడియాతో మాట్లాడిన అంశాలపై స్పందించిన దగ్గుబాటి...మాట్లాడుతూ టీఎస్ఆర్‌పై మీడియాలో చాలా తక్కువగా మాట్లాడానని, ఇంకా చాలా విషయాలు ఉన్నాయని, కోర్టులో అన్ని అంశాలు బయట పెడతానని దగ్గుబాటి వ్యాఖ్యానించారు. నిన్నటితోనే అన్ని విషయాలు వదిలివేస్తారని అనుకున్నామని, ఈరోజు మళ్లీ మీడియాతో టీఎస్ఆర్ మాట్లాడారని దగ్గుబాటి అన్నారు. ఆయన సివిల్, క్రిమినల్ కేసులు పెడితే భయపడేది లేదని, గతంలో సుబ్బిరామిరెడ్డి ఎలాంటి అవకతవకలకు పాల్పడింది అన్ని విషయాలు కోర్టులో బయటపెడతానని దగ్గుబాటి అన్నారు. నిన్నటితోనే అన్ని వదిలివేద్దామని అనుకున్నామని, ఈరోజు మళ్ళీ బలవంతంగా మాట్లాడే పరిస్థితి టీఎస్ఆరే కల్పించారని ఆయన చెప్పారు.

కాంగ్రెస్ పాలనలో కష్టాల్లో ప్రజలు!

        ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వివిధ రకాల సమస్యలతో సతమతమవుతున్నారు... ఎటు చూసినా సమస్యలే... వీటి నుండి ఎలా బయటపడాలో అర్థం కాక మధ్య తరగతి ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. మే నెల ముగిసి జూన్ నెల ప్రారంభం కాబోతోంది, అయినా పాఠ్య పుస్తకాలు అందుబాటులో లేవు. దీనికి స్వయాన విద్యాశాఖ మంత్రే ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. అందుబాటులో లేని స్కూలు ఫీజులు... పెత్తందారీ తనంతో కార్పోరేట్ పాఠశాలల దౌర్జన్యం నానాటికి పెరిగిపోతోంది. ఆటో ఛార్జీల ధరలు చెప్పనవసరం లేదు. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగిపోయాయి. వైద్యం గురించి, కార్పోరేట్ హాస్పిటళ్ళ ధన దాహం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రభుత్వ ఆసుపత్రుల విషయం మరీ దారుణం. మనిషి అనే వాడు మనలేని పరిస్థితి.  విద్యుత్తు కోతలు ఎప్పటికి అదుపులోకి వస్తాయో తెలీదు. విద్యుత్తు ఛార్జీల మోత నుండి ఎప్పటికి ఉపశమనం ఉంటుందో అసలే తెలీదు. గ్యాస్ సిలిండర్ ధర పెరగటమే కాదు, సం.రానికి 9 సిలిండర్లు అంటూ మళ్లి అదో శరాగాతం.           ఇవన్ని ఇలా ఉంటె రెక్కలొచ్చిన బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు, పేద, మధ్యతరగతి ప్రజలను మరింతగా వణికిస్తున్నాయి.  ఇన్ని సమస్యలతో సామాన్య మానవుడు అత్యంత దయనీయమైన స్థితిని గడుపుతున్నాడు. ముఖ్యంగా కూరగాయల ధరలు చూస్తే ఎన్నడూ కనీ వినీ ఎరుగని విధంగా పెరిగిపోయాయి.          టమాటోలు కిలో 60/- రూపాయలు, బీన్స్ 100/- రూపాయలు, పచ్చిమిర్చి, బెండ, చిక్కుడు.... అన్ని కిలో 50/- రూపాయలు. అన్నిటికి మించి అల్లం 180/- రూపాయలకు చేరిపోయాయి. రైతు బజార్లలోను, బహిరంగ మార్కెట్లలోను ఒకే విధంగా రేట్లు ఉన్నాయి. దళారులు, అక్రమార్కులు రైతు బజార్లను, కూరగాయల మార్కెట్లను శాసిస్తున్నారు. అనూహ్యంగా రేట్లు పెంచేసి దండుకుంటున్నారు.          అరికట్టాల్సిన ప్రభుత్వం కళ్ళుమూసుకొని చోద్యం చూస్తోంది. వేసవిలో ధరలు పెరగటం సహజం. ఈ ధరలు పెరిగే సమయంలో ప్రభుత్వం రంగంలోకి దిగి మార్కెట్లో జోక్యం పథకం కింద ఆయా కూరగాయలను దిగుమతి చేసుకొని తక్కువ ధరలకు విక్రయించాలనే కనీసపు అవగాహన కుడా లేని పాలకులు మనల్ని పరిపాలించేది.            విద్య, వైద్యం, విద్యుత్తు, రైతు బజార్లు, మద్యం... ఇలా చెప్పుకుంటూ పోతే రాజకీయ నేతలు, కార్పోరేట్ వ్యక్తులు కలిసి మెలిసి మంచి అవగాహనతో ఒకరిని ఒకరు శాసించుకుంటూ పోతున్న ఫలితం సామాన్య ప్రజానీకం సమస్యల సుడిగుండంలో చిక్కుకొని అల్లాడిపోవడం.            ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు వస్తున్నా మీకోసం అంటూ... వైకాపా ని, కాంగ్రెస్ ని పనికిమాలిన విషయాల మీద, లేదా అందరికి తెలిసిన అవినీతి మీద తూర్పారాపడతారు. ఇంకా తన స్థాయిని దిగజార్చుకొని ఎవరో జైళ్లలో నీలి చిత్రాలు చూస్తున్నారంటూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ రోజున సామాన్య ప్రజానీకానికి కావాల్సింది ఈ పనికి మాలిన వ్యాఖ్యానాలా? లేక ప్రజాసమస్యలపై ప్రజల తరుపున  పోరాడి, వారి సమస్యలను ఒక కొలిక్కి తెచ్చి, తేగలిగిన సత్తా ఉన్న నేతా? ఎందుకంటే ప్రతి పక్ష నేత కర్తవ్యం అదే కదా!              మరో పార్టీ వైకాపా కి కావాల్సింది తమ జగన్ కు ఎప్పుడు బెయిల్ వస్తుందని. తల్లి, చెల్లి, ఆవిడ అని ముగ్గురు వివిధ చానెళ్ళకెక్కి తమ గోడు వెళ్ళబోసుకుంటారు.... లేదా రోడెక్కి యాత్రలు చేస్తూ చంద్ర బాబుని, కిరణ్ కుమార్ రెడ్డిని, ప్రభుత్వాన్ని విమర్శిస్తారు.... లేదా రోడ్డు మీద పడి రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తారు. అంతే కానీ సామాన్యుడు నేడు అనుభవిస్తున్న సమస్యలన్నిటికీ కారణం ఏమిటి?అనే విషయమై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సామాన్యుడికి సమస్యలనుండి ఊరటనివ్వాలనే ధ్యాస, బాధ్యత ఎంతమాత్రం లేదు.                ఇక మన ముఖ్య మంత్రి విషయానికొస్తే.... మన బియ్యం, అమ్మహస్తం, అభయహస్తం, అమృతహస్తం, సబ్ ప్లాన్ బిల్లు అంటూ పనికిమాలిన పథకాల మీద దృష్టి పెట్టారే కాని, సామాన్యుడికి అవసరమైన నిత్యావసర సరుకుల ధరలు, విద్యారంగం, వైద్యరంగం ఎలా దారి తప్పి పోతున్నాయో పట్టించుకొనే తీరిక లేదు. ఎంతసేపు ఆయన కుర్చీని గురించిన ఆలోచన.... లేదంటే ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టటం మినహా ఎవరి బాధలు ఆయనకు అవసరం లేదు.               ఇవీ నేడు రాష్ట్రంలో ఉన్న సమస్యలు. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మంచినీటి సమస్య, రహదారుల సమస్య, అంటూ వ్యాధుల సమస్య, ట్రాఫిక్ సమస్య, అధిక జనాభా.... ఇవన్నీ ఎప్పుడూ ఉండే సమస్యలే అని సదరు నేతలు తమని తాము చాలా హుందాగా సమర్ధించుకోవచ్చు. కాని ఈ సమస్యలు ఎప్పటికీ తీరని సమస్యలు గానే ఎందుకు ఉంటున్నాయి? ఈ సమస్యల తీవ్రత నానాటికి ఎందుకు పెరిగిపోతోంది? ఇది ఎవరి వైఫల్యం? తప్పు మీదంటే మీదని ఒకరినొకరు దుయ్యబట్టుకుంటారు. కాని ఇక్కడ తప్పు ప్రతి ఒక్కరిది. పాలనా సామర్థ్యం లేని పాలకులది. అధికార పార్టీలని నిలదీయలేని ప్రతిపక్షాలది. ఎవరికీ వారు రాబోయే ఎన్నికలలో మమ్మల్ని గెలిపించండి, మీకు మంచి చేస్తాం అంటారే కాని, గతం లో వారు ఎక్కడ వైఫల్యం చెందారో ప్రజల ముందు ఒప్పుకునే ధైర్యం చెయ్యరు. ప్రతి ఒక్కరికి కావాల్సింది అధికార పీఠం. మరి సామాన్య ప్రజానీకం సంక్షేమం.... గాలిలో దీపమేనా?

టిడిపి కి జెసి బ్రదర్స్ షాక్

        మహబూబ్‌నగర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూల్ టీడీపీ ఇంఛార్జి జెసి బ్రదర్స్ అధినేత మర్రి జనార్థన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణపై టిడిపిలో స్పష్టత లేదని భావించిన మర్రి జనార్ధన్ రెడ్డి తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు పంపారు. జనార్ధన్ రెడ్డి ఈరోజు సాయంత్రం తన భవిష్యత్ కార్యాచరణను కటించనున్నారు. ఉప ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ టిడిపి అభ్యర్థిగా మర్రి జనార్ధన్‌రెడ్డి పోటీ చేశారు. ఆయన నాగం జనార్థన్ రెడ్డిపై పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే.

కేసీఆర్ తో రాజయ్య కటీఫ్

        కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు రాజయ్య టీఆర్ఎస్ లో చేరడంపై వెనక్కి తగ్గినట్లు సమాచారం. వరంగల్ ఎంపీ టిక్కెట్ కోసం ఆయన డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఎంపీ టిక్కెట్పై టీఆర్ఎస్ హామీ ఇవ్వకపోవటంతో వెనకాడుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఆయనకు మానకొండూరు అసెంబ్లీ టిక్కెట్ను ఆఫర్ చేస్తోంది. కాగా మరోవైపు పౌరసరఫరాల శాఖమంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ను వీడొద్దంటూ రాజయ్యకు నచ్చచెబుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరిన కడియం శ్రీహరికి వరంగల్ పార్లమెంటు స్థానంపై కెసిఆర్ హామీ ఇచ్చారు. మానకొండూరు సీటు కోసం పలువురు పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజయ్యకు కెసిఆర్ నుండి హామీ రాలేదని సమాచారం. దీంతో టీఆర్ఎస్ లోకి వెళ్తే వచ్చేదేమీ లేదని భావించిన రాజయ్య కాంగ్రెసులోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

దగ్గుబాటి..మీ భార్యను చూసి నేర్చుకో

        కాంగ్రెస్ పార్టీలో విశాఖపట్నం లోక్ సభ టికెట్ వివాదం అప్పుడే ముదురుతోంది. ఎన్నికల ఏడాది ముందే ఎలాగయినా ఈ స్థానం పోటీ చేయాలన్న ఆశతో సుబ్బరామిరెడ్డి దీని కోసం చేయని ప్రయత్నం లేకుండా పోయింది. పనిలేని నటులతో బిరుదులు ఇప్పించుకునే సుబ్బరామిరెడ్డి అని దగ్గుబాటి అనడంతో సుబ్బరామిరెడ్డి ఆగ్రహించారు. అక్కినేని నాగేశ్వర రావు, మోహన్ బాబు, బ్రహ్మానందం పనిలేని నటులా అని ఆయన ప్రశ్నించారు. దగ్గుబాటి వ్యాఖ్యలు అర్ధరహితమని, పురంధేశ్వరిని చూసి సంయమనం పాటించడం నేర్చుకోవాలని, ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. నర్సారావుపేట, లేదా ఒంగోలు నుంచి పోటీ చేయాలని పురంధేశ్వరికి తానే సూచించానని, ఇప్పుడు విశాఖపట్నం స్థానం నుండి తాను అయితేనే గెలుస్తానని, పురంధేశ్వరి ఓడిపోతుందని అన్నారు. విశాఖపట్నానికి తూర్పు పడమర తెలియన దగ్గుబాటి వెంకటేశ్వరరావు విశాఖ గురించి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. ఇక దగ్గుబాటి చేసిన అవినీతి ఆరోపణలను సుబ్బరామిరెడ్డి ఖండించారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, దగ్గుబాటి జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు.

మళ్ళీ మొదలవనున్న తెలంగాణా ఉద్యమాలు

  నిరంతరం ఉద్యమాలు, నిరాహార దీక్షలు చేయాలన్నా ఎవరికయినా కష్టమే. అందుకే అపుడప్పుడు పండుగ శలవులు, పరీక్షల శలవులు, వేసవి శలవులు వంటివి అప్రకటితంగా అమలు చేస్తుంటారు మన ఉద్యమ నేతలు. ఇక, కేసీఆర్ కూడా ఉద్యమాలకి గుడ్ బై చెప్పేసి ఓట్లు-సీట్లు జపం అందుకోవడంతో ఆచార్యుల వారు ముఖ్యమంత్రి పుణ్యామాని బయ్యారం గనుల వ్యవహారం అందిపుచ్చుకొని కాలక్షేపం చేస్తున్నారు.   నిన్న టీఎన్‌జీవో భవన్‌లో జరిగిన టీ-జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశానికి హాజరయిన కేసీఆర్‌, జి. కిషన్‌రెడ్డి తదితరులు వచ్చే నెల 14న ఛలో అసెంబ్లీ కార్యక్రమంతో మళ్ళీ ఉద్యమం రీ-స్టార్ట్ చేయాలని నిశ్చయించుకొన్నారు. అనంతరం ఛైర్మన్‌ కోదండరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అంశంపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకే తాము ఛలో అసెంబ్లీకి పిలుపునిస్తున్నామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఎక్కడా హింసకు తావివ్వకుండా శాంతియుతంగా, చట్టబద్దంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి అన్నిరాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు.   షరా మామూలుగానే చలో అసెంబ్లీ కార్యక్రమానికి ముఖ్య మంత్రి అనుమతి నిరాకరించడం, దానిని తెరాస, టీ-జేయేసీ నేతలు తప్పు పడుతూ మీడియా ముందుకొచ్చి మాట్లాడటం, కాంగ్రెస్ పార్టీలో తెలంగాణా మంత్రులు, శాసనసభ్యులు దద్దమ్మలని కేసీఆర్ తిట్ల దండకం అందుకోవడం, దానికి వెంటనే ముఖ్యమంత్రి అనుచరుడు జగ్గారెడ్డి దీటుగా జవాబు చెప్పడం వంటి కార్యక్రమాలు కూడా త్వరలో జరుగనున్నాయి. తెలంగాణా నుండి ఆంధ్రా పార్టీలను తరిమి కొట్టాలని ఒకవైపు కేసీఆర్ తన కార్యకర్తలకు ఉద్బోదిస్తుంటే, ప్రొఫ్. కోదండరాం అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరడం విశేషం.

టీ-కాంగ్రెస్ ఏంపీల రాజీనామాలు నేడే

  టీ-కాంగ్రెస్ యంపీలు తెలంగాణాపై స్పష్టమయిన ప్రకటన చేసేందుకు అధిష్టానానికి విదించిన గడువు ఈ రోజుతో ముగుస్తున్నపటికీ ఎవరూ కూడా పట్టించుకోలేదు. కనీసం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గానీ వారిని బుజ్జగించే ప్రయత్నం చేయకపోవడంతో అవమానకర పరిస్థితుల్లో వారు తెరాసలోకి వెళ్ళవలసి వస్తోంది. ఈ రోజు యంపీ వివేక్ ఇంటికి తెరాస అధ్యక్షుడు కేసీఆర్ వచ్చి వారితో టికెట్స్ ఖరారు చేసిన తరువాత, వారు పార్టీకి రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించవచ్చును.   కానీ, వారిలో రాజయ్యకు మాత్రం కేసీఆర్ టికెట్ ఖరారు చేయకపోవడంతో ఆయన మరికొంత కాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉండేందుకు నిశ్చయించుకొన్నట్లు తెలుస్తోంది. కే.కేశవ్ రావ్ మరియు టీ-కాంగ్రెస్ యంపీలు-వివేక్, మందా జగన్నాథం వచ్చే నెల 2న హైదరాబాద్ నిజం కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో అధికారికంగా తెరాసలో జేరుతారు.   టీ-కాంగ్రెస్ యంపీలు పార్టీ నుండి వెళ్లిపోతున్నా కూడా అధిష్టానం ఖాతరు చేయనట్లు నటిస్తున్నపటికీ, వారి వెనుక మరి కొందరు శాసన సభ్యులు కూడా వెళిపోతే, కిరణ్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోతుందని ఆందోళన చెందుతోంది.   ఇక, తెలుగుదేశం పార్టీ ఎంతో ఘనంగా మహానాడు సమావేశాలు నిర్వహించుకొని రెండు రోజులయినా కాక మునుపే మెహబూబ్ నగర్ జిల్లాలో నాగర్ కర్నూల్ ఇన్-చార్జ్ మర్రి జనార్ధన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసారు. గత ఉపఎన్నికలలో ఆయన నాగం జనార్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆయన కూడా తెరసాలోకి వెళ్లవచ్చునని సమాచారం.

తెదేపాలో చేరనున్న కొణతాల

  తెలుగుదేశం పార్టీలోంచి తన రాజకీయ శత్రువు దాడి వీరభద్రరావును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడంతో ఆగ్రహించిన వైకాపా రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణతాల రామకృష్ణ, గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ, జగన్ మోహన్ రెడ్డి, పార్టీని కష్టకాలంలో వెన్నంటి ఉన్న తనను కాదని దాడి వీరభద్రరావుకే ఎక్కువ ప్రాదాన్యం ఇవ్వడంతో ఆయన పార్టీ మారే ఆలోచన చేస్తున్నారు.   ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని మంత్రి గంట శ్రీనివాసరావు ప్రకటించారు. కొణతాల రామకృష్ణ మొదట కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నందున, ఆయన మళ్ళీ కాంగ్రెస్ గూటికే చేరు కొంటారని అందరూ భావించారు. కానీ, అయన త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు తాజా సమాచారం. ఇప్పటికే చంద్రబాబు నాయుడి దూతలతో ఆయన జరిపిన సంప్రదింపులు ఫలవంతమయ్యాయని ఇక నేడోరేపో ఆయన తెదేపాలో చేరడం ఖాయం అని సమాచారం.   అదే జరిగితే, వైకాపా ఒక బలమయిన నాయకుడిని కోల్పోతే, తేదేపాకు ఒక నమ్మకస్తుడయిన, బలమయిన నాయకుడు దొరికినట్లవుతుంది. కేవలం శాసన మండలి టికెట్ ఈయనందుకు పార్టీతో ఉన్న 30ఏళ్ల అనుబంధం పుటుక్కున తెంపుకుపోయిన దాడి వీరభద్రరావుని తీసుకొని వైకాపా ఏమి బావుకొంటుందో తెలియదు. కానీ, కొణతాల రామకృష్ణ వంటి చురుకయిన నాయకుడు దొరకడం వల్ల తెలుగుదేశం పార్టీ మాత్రం పూర్తి ప్రయోజనం పొందుతుందని చెప్పవచ్చును.   ఇక కర్నూల్ నుండి భూమానాగి రెడ్డి దంపతులు కూడా తెలుగుదేశం పార్టీతో పూర్తి ‘టచ్చులో’ ఉన్నట్లు తాజా సమాచారం. తమ జిల్లాలో తమ వ్యతిరేఖ వర్గానికి వైకాపా అధిష్టానం ప్రోత్సాహం ఇస్తోందని వారు పార్టీపై ఆగ్రహంతో వారు పార్టీ మరే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం ఇంకా సదరు నేతలే దృవీకరించవలసి ఉంది. ఏమయినప్పటికీ, త్వరలో వైకాపా నుండి తెదేపాలోకి కొన్ని వలసలు మాత్రం ఖాయమని స్పష్టంగా తెలుస్తోంది.

సుబ్బిరామిరెడ్డి చరిత్ర చెప్పిన దగ్గుబాటి

  రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామి రెడ్డి రాబోయే ఎన్నికలలో విశాఖ నుండి లోక్ సభకు పోటీ చేయాలని పరితపిస్తున్నారు. అయితే సిట్టింగ్ యంపీ పురందేశ్వరి కూడ అక్కడి నుండే పోటీ చేయాలను కావడంతో సమస్య మొదలయింది. నాటి నుండి ఆమెకు పొగపెట్టే పనిలో పడ్డారు రెడ్డి గారు.   ఆమెకు ఆ సీటు పొందానికి తానూ ఏవిధంగా సహాయం చేసింది వివరిస్తూ, ఇప్పుడ తానూ పోటీ చేయాలను కొంటున్నందున ఆమె విశాఖ నుండి తప్పుకొని, నరసరావు పేట నుండి పోటీ చేసుకొంటే మంచిదని సలహా ఇచ్చారు. సిటింగ్ యంపీకే టికెట్ ఇవ్వాలని రూలేమీ లేదని మరో లాజిక్ పాయింటు కూడా చెప్పారు. ఇటీవలే సోనియా గాంధీని కలిసి, విశాఖ లో తానూ చేస్తున్న సేవా కార్యక్రమాల లిస్టు వివరించి తనకే విశాఖ టికెట్ ఇవ్వాలని నచ్చజెప్పి వచ్చారు. దానితో ఆమె తనకు హామీ ఇచ్చినట్లే భావించిన ఆయన టికెట్ పై వంద శాతం ఉండే తన నమ్మకం కాస్తా 1000 శాతానికి పెరిగినట్లు ఆయనే చాటింపు వేసుకొన్నారు. పనిలో పనిగా మళ్ళీ మరోసారి పురందేశ్వరికి నరసరావు పేటకు వెళ్ళిపొమ్మని చెప్పారు.   అయితే, పురందేశ్వరి మాత్రం అధిష్టానం ఎక్కడ నుండి పోటీ చేయమంటే అక్కడి నుండే పోటీ చేస్తానని ఒక చిన్న మాటతో సరిపుచ్చేసారు.   కానీ రాన్రాను పెరుగుతున్న రెడ్డి గారి ఒత్తిడి భరించడం మాత్రం కష్టంగానే ఉండటంతో పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు కూడా రంగంలో దిగక తప్పలేదు. ఆయన పీసీసీ కార్యాలయం నుండి మీడియాతో మాట్లాడుతూ ‘సుబ్బిరామి రెడ్డి ‘80ల్లో నాగర్జున్ సాగర్ ప్రాజెక్ట్ కాంట్రాక్టులు చేస్తూ బ్లాకులో సిమెంట్ అమ్ముకొంటున్నపటి నుండి ఏవిధంగా పైకి వచ్చిందీ నాకు బాగా తెలుసు. అటువంటి వ్యక్తి వద్దకు మేమేనాడు సహాయం కోసం వెళ్లలేదు. పైగా ఆయనే నా భార్యకి టికెట్ ఇవ్వొదంటూ హైకమండుకి లేఖ వ్రాసినట్లు కూడా మాకు తెలుసు. అయినా మేము అవన్నీపట్టించుకోలేదు. ఎందుకంటే హైకమండుకి ఎవరు ఎటువంటి వారో ఎవరికీ టికెట్ ఈయాలో బాగా తెలుసు. ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ, ఇతరులకి ఈ విధంగా ఉచిత సలహాలు ఇచ్చినపుడే సమస్య వస్తుంది, ”అని చురకలు వేసారు.   మరి శివ భక్తుడయిన రెడ్డిగారు ఇప్పుడు దగ్గుబాటి ఆరోపణలకు ఏవిధంగా శివ తాండవం చేస్తారొ చూడాలి.

మాట మార్చిన చంద్రబాబు

  కొద్ది రోజుల క్రితం చంద్రబాబు అవసరమయితే వచ్చే నెల 10వ తేదీ నుండి జరగనున్న శాసన సభ బడ్జెట్ సమావేశాలలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అసమ్మతి తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటింఛి ఒక కొత్త చర్చకు తెర తీసారు. కానీ, నిన్న జరిగిన మహానాడులో ఇప్పుడు అంత అవసరం లేదనట్లు మాట్లాడారు. వైకాపా నేతలు తనకీ కిరణ్ కుమార్ రెడ్డికి మద్య రహస్య ఒప్పందం ఉందంటూ చేస్తున్న దాడిని ఎదుర్కోవడానికే బహుశః ఆయన ఎత్తువేసి ఉండవచ్చును. కానీ, వైకాపా నేతలందరూ గత రెండు రోజులుగా జగన్ మోహన్ రెడ్డి జైల్లో నిర్బందించి ఏడాది పూర్తయిన సందర్భంగా నిరసన దీక్షలు ర్యాలీలతో బిజీగా ఉన్న సమయం చూసుకొని చంద్రబాబు మళ్ళీ ఈ ఉపసంహరణ ప్రకటన కూడా చల్లగా చేసారనుకోవచ్చును.

అన్నగారిని మరచిన వారసులు

  స్వర్గీయ యన్టీఆర్ పై సర్వ హక్కులు తమవేనని వాదించేవారు తెలుగుదేశం పార్టీలో చాల మందే ఉన్నారు. ఇక పార్లమెంటులో ఆయన విగ్రహం పెట్టే హక్కు తమదంటే తమదే అని ఆయన కుమార్తె పురందేశ్వరి, చంద్రబాబు నాయుడు ఏకంగా ఒక దశాబ్ద కాలం పాటు తీవ్ర యుద్దం చేసారు. ఎట్టకేలకు ఎలాగయితేనేమి యన్టీఆర్ విగ్రహం పార్లమెంటులో ప్రతిష్టించడం జరిగింది. అంతటితో ఆ కదా సమాప్తం అయిపోయినట్లు అందరూ చేతులు దులుపుకొని హైదరాబాద్ వచ్చేసారు. నిన్న యన్టీఆర్ 90వ జయంతి సందర్భంగా హైదరాబాదులో యన్టీఆర్ ఘాట్ వద్ద మూకుమ్మడిగా వచ్చిఘనంగా నివాళులు అర్పించిన నందమూరి వారు, తెలుగుదేశం పార్టీ నేతలు తాము పోటీలు పడి మరీ డిల్లీలో నెలకొల్పిన యన్టీఆర్ విగ్రహానికి ఈ సందర్భంగా ఒక దండ వేయించాలనే సంగతి మరిచిపోయారు.   ఇక అయినవారికే శ్రద్ధ లేనప్పుడు డిల్లీలో ఉండే రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు మాత్రం ఎందుకు పట్టించుకొంటారు? ఎవరూ పట్టించుకోకపోయినా పార్లమెంటు నియమావళి ప్రకారం లోక్ సభ స్పీకర్ అధికారికంగా వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించి అక్కడ నెలకొల్పిన మహానీయుల విగ్రహాలకు తప్పనిసరిగా పూలమాలలు వేసి ఒకసారి వారిని స్మరించుకోవడం ఆనవాయితీ. కానీ, అది కూడా నిర్వహించలేదు. కనీసం యన్టీఆర్ అసలయిన వారసులు తామేనని వాదులాడుకొనే తెలుగుదేశం పార్టీ, నందమూరి కుటుంబంలో ఏఒక్కరూ కూడా నిన్న ఆయన విగ్రహానికి ఒక దండ వేయించే ఏర్పాటు చేయలేకపోయారు.

జగన్ తీహార్ జైలుకు!

        ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వైఎస్ జగన్ ను తీహార్ జైలుకు తరలించేందుకు రంగం సిద్దం అయిందని, రాబోయే రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పుట్టగుతులుండవని” టీడీపీ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణపై టీడీపీ స్పష్టంగా ఉందని, 2008లో రాసిన లేఖకు కట్టుబడి ఉందని, తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని, మళ్లీ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని టిడిపి లేఖ రాసిందని నామా అన్నారు. రాష్ట్రం విడిపోయినా తెలంగాణ, సీమాంధ్రలలో టీడీపీ అధికారంలోకి వస్తుందని అన్నారు.   కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని, అది కలెక్షన్ పార్టీ అని మాటలు చెప్పి మూటలు తీసుకుంటారని, సోనియాను కలిసిన కేశవరావు మళ్లీ కేసీఆర్ ను కలిశారని, కేసీఆర్ పార్టమెంటుకు రారని, తెలంగాణ ప్రజల సమస్యలపై నోరు విప్పరని ఆరోపించారు. ప్రధాని మన్మోహన్ అసమర్ధుడని, అవినీతి, అసమర్ధ ప్రభుత్వానికి ఆయన నాయకత్వం వహిస్తున్నారని విమర్శించారు. టీడీపీ రాష్ట్రాన్ని అభివృద్ది చేసిందని, టీడీపీ చొరవవల్లనే కేంద్రంలో రెండు సార్లు కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయని అన్నారు. 2014 ఎన్నికల్లో కూడా టిడిపి కీలక పాత్ర పోషిస్తుందని, దేశానికి, రాష్ట్రానికి చంద్రబాబు అవసరమని అన్నారు.

తెదేపా సభ్యత్వం స్వీకరించిన లోకేష్

ఇంతవరకు తెరవెనుక నిలబడి తెలుగుదేశం పార్టీకి, తన తండ్రి చంద్రబాబుకి సహకరిస్తున్న నారా లోకేష్ మహానాడు సమావేశాలలో పార్టీ సభ్యత్వం స్వీకరించి అధికారిక సభ్యుడిగా మారారు. ఆయన తన తండ్రి స్థాపించిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ సంస్థకు ఎక్సిక్యుటివ్ డైరెక్టర్ హోదాలో కంపెనీని నిర్వహిస్తున్నారు. అయితే దాని నిర్వహణ బాధ్యతలను త్వరలో విదేశాల నుండి ఉన్నత విద్యలు ముగించుకొని స్వదేశం రానున్న తన భార్య బ్రహ్మాణీకి అప్పగించి, పూర్తి స్థాయిలో రాజకీయ ప్రవేశం చేయాలనే ఆలోచనతో నేడు పార్టీలో సభ్యత్వం స్వీకరించారు. అయన పార్టీలో తెలుగు యువత అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ఇకపై ఆయన కూడా చురుకుగా రాష్ట్ర రాజకీయాలలో పాల్గొంటూ, పార్టీని రాబోయే ఎన్నికలకి సిద్దం చేయడంలో కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు.   కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ, తెలుగుదేశం పార్టీలో లోకేష్ మరియు వైకాపాలో జగన్మోహన్ రెడ్డి ముగ్గురు యువనాయకులు రాబోయే ఎన్నికలలో డీ కొనబోతున్నారు. అందువల్ల లోకేష్ కూడా ఎన్నికల సమయానికి పార్టీలో మరింత కీలక బాధ్యతలు చెప్పటవచ్చును. అయితే, రాబోయే ఎన్నికలు తెలుగుదేశం పార్టీతో సహా అన్నిపార్టీలకు అగ్ని పరీక్షవంటివే గనుక, ఈ యువనాయకులు ముగ్గురికీ తమ శక్తి సామర్ధ్యాలు నిరూపించుకోవడానికి చక్కటి అవకాశం కల్పిస్తున్నాయి. ఇక వచ్చే ఎన్నికలలో తేదేపాను గట్టేకించగలిగితేనే లోకేష్ కు మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుంది. లేకుంటే ఓడిపోయిన సైన్యానికి ఆయన సైన్యాధ్యక్షుడిగా మిగిలిపోతారు.

నందమూరికి సిసలు వారసుడు జూ.ఎన్టీఆరేనా?

  కొందరు చెట్టుపేరు చెప్పుకొని కాయలు అమ్ముకొనే వారయితే, ఆ కాయలిస్తున్నచెట్టు తమపాలిట కల్పతరువని భక్తితో మొక్కేవారు మరి కొందరు. జూ.యన్టీఆర్ విషయానికి వస్తే ఆయన తన తాతగారయిన నందమూరి తారక రామారావుని తలవని రోజు లేదు, సినిమా లేదు. ఆయన నామ స్మరణ చేయని ప్రసంగమూ లేదు. యన్టీఆర్ తన స్వగ్రామమయిన నిమ్మకూరులో అడుగుపెట్టనని శపధం చేయడంతో, జూ.యన్టీఆర్ స్వయంగా ఆ ఊరులో తన తాతానాయనమ్మల విగ్రహాలు ప్రతిష్టించారు.   ఆయనకు అనేక మంది మనవలు, మనుమరాళ్ళు ఉన్నపటికీ, ఏకలవ్య శిష్యుడు వంటి జూ.యన్టీఆర్ అంటే ఆయనకు ఒక ప్రత్యేక అభిమానం. నటనలో, బాషలో, యాసలో అన్నివిధాల తనకు ప్రతిరూపంగా కనబడే తన జూనియర్ ని చూసి ఆయన చాలా ముచ్చటపడేవారు. నిజం చెప్పాలంటే నందమూరి కుటుంబంలో ఆ తాతా మనవళ్ళ మద్య ఉన్న మానసిక అనుబంధం మిగిలిన వారిలో అంతబలంగా కనబడదు. అలాగని వారికి ఆయనతో అనుబంధం లేదని కాదు కానీ వారంరికంటే జూ.యన్టీఆర్ ఏర్పరచుకొన్న అనుబంధం ప్రత్యేకమయినది.   అందుకే తన ప్రతీ సినిమాలో, ప్రసంగంలో జూ.యన్టీఆర్ తాత నామస్మరణ చేస్తుంటారు. అయితే, కొందరు గిట్టని వారు, లేదా ఆయనతో పోటీ పడలేని వారు, ఆయన కొంచెం అతి చేస్తున్నాడని, చెట్టుపేరు కాయలు అమ్ముకొంటున్నాడని ఆరోపణలు చేయడం వింటుంటాము.   అయితే, జూ.యన్టీఆర్ కేవలం తన స్వయం కృషితోనే పైకి వచ్చారు తప్ప, కనీసం ఆయన తన తండ్రి, తాతగారి పేరు, పలుకుబడిని కూడా ఏనాడు వాడుకోలేదు. నిజం చెప్పాలంటే, జూ.యన్టీఆర్ తన స్వయం ప్రతిభతో నంబర్ వన్ స్థాయికి ఎదిగిన తరువాతనే ఆయనను అందరూ గుర్తించడం ప్రారంబించారు. చివరికి నందమూరి కుటుంబ సభ్యులు సైతం ఆ తరువాత నుండే ఆయనను తమ కుటుంబములో ఒక సభ్యుడిగా అంగీకరించడం ప్రారంభించారు.   ఈ రోజు కూడా ప్రతీ ఏడులాగే ఈ ఏడు కూడా తాత 90వ జయంతి సందర్భంగా నందమూరి తారక రామారావు గారు శ్రీకృష్ణావతారంలో విశ్వరూపం తో ఉన్న ఒక ఫుల్ పేజ్ ప్రకటన ఇచ్చి ఘనంగా నివాళులు అర్పించారు.   ఇటువంటి నిష్కకళంక మనసుతో తాతని దైవ సమానుడిగా పూజించే జూ.యన్టీఆర్ కంటే, అవసరార్ధం స్వర్గీయ యన్టీఆర్ భజన చేసేవారు, ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసేవారు, పాలాభిషేకాలు చేస్తూ మీడియాకి ఫోజులిచ్చేవారే నేడు స్వర్గీయ యన్టీఆర్ పై పేటెంట్ హక్కులున్నట్లు మాట్లాడటం మనం చూస్తూనే ఉన్నాము. అటువంటి వారే జూ.యన్టీఆర్ ను నేడు నిలదీస్తున్నారు కూడా.   అయినప్పటికీ జూ.యన్టీఆర్ మాత్రం నిండు కుండలా తొణకలేదు, ఎవరి మీద మాట తూల లేదు. తనని మహానాడుకి పిలవనందుకు బాధపడినప్పటికీ ఎవరినీ నిందించలేదు. పిలిచి ఉంటే తప్పక వచ్చేవాడినని మాత్రమే అన్నారు. దానికే భుజాలు తడుముకొన్న తెదేపా యన్టీఆర్ వారసులకి మళ్ళీ ప్రత్యేకంగా పిలుపులెందుకు? అని అతితెలివిగా ఎదురు ప్రశ్నించి మహానాడుకి రాకపోవడం అతని తప్పేనని బుకాయించడం విశేషం. ఇంట్లో శుభాకార్యనికయినా కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించడం మన తెలుగు సంప్రదాయం. కానీ అది నందమూరి కుటుంబ సభ్యులకి మాత్రం వర్తించదని తెలుగుదేశం పార్టీ ఉవాచ.        

జగన్ ను బయటకు రాకుండా ఆపలేరు: విజయమ్మ

        జగన్ అక్రమ నిర్బంధానికి నిరసనగా ఇందిరా పార్క్ వద్ద విజయమ్మ దీక్ష చేపట్టారు. ఇందులో జగన్ సతీమణి భారతి కూడా పాల్గొన్నారు. 'వైఎస్ జగన్ మీద ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. జగన్ కు ఖచ్చితంగా బెయిలు వస్తుంది. సీబీఐ ఇంకా ఎన్ని ఛార్జిషీట్లు వేస్తుంది. కుట్ర పూరితంగా చేసి ఎంతకాలం జగన్ ను బయటకు రాకుండా ఆపలేదు' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. విలువలు లేని చంద్రబాబుకు మమ్మల్ని విమర్శించే హక్కు లేదు. టీడీపీ, కాంగ్రెస్ కుట్రలు ప్రజలకు తెలుసు. వైఎస్ మరణించిన తరువాత మా కుటుంబాన్ని ఎన్నో బాధలు పెట్టారు. మా ఇబ్బందులను చూసి కొందరు ఆనందపడుతున్నారని విజయమ్మ అన్నారు. ప్రజల పక్షాన పోరాడే వారు ఉండకూడదనే జగన్ ను జైలుకు పంపారని, దేవుడు ఉన్నాడని, తప్పక న్యాయం జరుగుతుందని జగన్ సతీమణి భారతి అన్నారు. ఎలాంటి తప్పు చేయకుండా ఏడాదిపాటు జైలులో పెట్టడం అన్యాయం అని, వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లే కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిందని, అధికారం అనుభవిస్తున్న వారు వైఎస్ వల్లనే ఆ స్థానంలో ఉన్నారని, వైఎస్ కుటుంబ సభ్యులం అయిన తమకే ఈ పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అని ఆమె ప్రశ్నించారు.

ఎన్టీఆర్ కు ఆహ్వానం ఉండదు: టిడిపి

        మహానాడుకు రావాలని తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని, ఆహ్వానం అందితే ఇప్పుడయినా వెళ్లేందుకు సిద్దమని ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్ చెప్పడంతో టీడీపీ వెంటనే స్పందించింది. ''ఎన్టీఆర్ కుటుంబసభ్యులు తెలుగుదేశం పార్టీలోని ఏ కార్యక్రమానికయినా, ఎప్పుడయినా, నేరుగా రావచ్చు వారికి ప్రత్యేకంగా ఆహ్వానం అంటూ ఏమీ ఉండదు. వారు నేరుగా హాజరు కావచ్చు. వారికి ఆ హక్కు ఉంది. నారా లోకేష్, నందమూరి బాలకృష్ణలకు కూడా ఎలాంటి ఆహ్వానం పంపలేదు” అని తెలుగుదేశం పార్టీ నేత బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. ఇక చంద్రబాబు విషయంలో లక్ష్మీపార్వతి సానుకూలంగా మాట్లాడటం విశేషం. జూనియర్‌ ఎన్టీఆర్ కు ఆహ్వానం ఎందుకు పంపించలేదో చంద్రబాబు చెప్పాలని, కుటుంబ సభ్యులను కలుపుకొనిపోతేనే పార్టీ బలపడుతుందని అన్నారు. టీడీపీకి పూర్వవైభవం సంతరించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

లోకేష్ భవిష్యత్ కోసం చంద్రబాబు ఆరాటం

    జూ.యన్టీఆర్ ఈ రోజు తాతాగారి 90వ జయంతి సందర్భంగా సతీ సమేతంగా నివాళులు అర్పించడానికి యన్టీఆర్ ఘాట్ కి వచ్చారు. అయితే, ఊర్లోనే జరుగుతున్న మహానాడు సమావేశాలకి మాత్రం తనని ఎవరూ పిలవనందున వెళ్ళలేదని చెప్పారు. ఒకవేళ పిలిచి ఉంటే తప్పకుండా వచ్చేవాడినని అన్నారు కూడా. అతని తండ్రి హరికృష్ణ మహానాడుకి వెళ్ళినప్పటికీ అక్కడ అందరూ ఆయనతో అంటీ ముట్టనట్లే వ్యవహరించడంతో ఆయన కూడా ఏదో మొక్కుబడిగా వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోయారు.   చంద్రబాబు తన కొడుకు లోకేష్ రాజకీయ రంగ ప్రవేశం గురించి మాట్లాడుతూ, “లోకేష్ వంటి విద్యావంతుడు, వ్యవహార దక్షుడు పార్టీలోకి వస్తే మంచిదేనని అన్నారు. ఇక ముందు తమ పార్టీ యువతకి ఎక్కువ ప్రాదాన్యత ఇస్తుందని, మున్ముందు వారే పార్టీలో ప్రధాన పాత్ర పోషిస్తారని అన్నారు. లోకేష్ తో బాటు , చాలా మంది యువనాయకులు కూడా మహానాడులో హడావుడి చేయడం చూస్తే చంద్రబాబు మాటలు నిజమేనని అనిపించకమానవు.   కానీ మరి లోకేష్ ఈడువాడే అయిన జూ.యన్టీఆర్ ను మాత్రం మహానాడుకి ఆహ్వానించకపోవడం గమనిస్తే, అతను తన కొడుకుకి పోటీగా తయారవుతాడనే భయంతోనే చంద్రబాబు అతనిని దూరం పెట్టినట్లు అర్ధం అవుతోంది. ఒకవేళ జూ.యన్టీఆర్ కనక మహానాడుకి వస్తే అందరి దృష్టీ అతని మీదే ఉంటుంది తప్ప లోకేష్ మీద ఉండదని తెలుసు.   లోకేష్ ని ఒక పద్ధతి ప్రకారం ముందుకు తీసుకువస్తున్న చంద్రబాబు ఇటువంటి ముఖ్యమయిన సమయంలో అందరి దృష్టీ తన కొడుకు మీదే ఉండాలని కోరుకోవడం సహజం. అందువల్లే జూ.యన్టీఆర్ ను ఆహ్వానించలేదేమో. కానీ, మరి రేపు ఎన్నికల సమయంలో కేవలం లోకేష్ ప్రసంగాలతో నెగ్గుకు రావడం సాధ్యమేనా అని ఆలోచిస్తే, అప్పుడు యన్టీఆర్ అవసరం తప్పదని తెలుస్తుంది. మరి అతనిని ఇప్పుడు దూరంగా పెట్టి అప్పుడు అవసరానికి రమ్మంటే అతను వస్తాడా?   లోకేష్ ను తన రాజకీయవారసుడిగా చంద్రబాబు ప్రకటించుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టలేరేమో కానీ తేదేపాకు వారసుడని ప్రకటిస్తే మాత్రం పార్టీలోఅలజడి కలగడం ఖాయం. అయితే, ఆయన చాలా తెలివిగా హరికృష్ణకి క్రమంగా పార్టీలో ప్రాదాన్యత తగ్గించడంతో, ఆయనతో బాటు జూ.యన్టీఆర్ కూడా వెనక్కి తగ్గక తప్పలేదు. ఇక పార్టీలో ప్రస్తుతం వారిరువురూ తప్ప నందమూరి కుటుంబంలో చంద్రబాబుని వేలెత్తి చూపగలిగేవారెవరూ లేరు గనుక, చంద్రబాబు ఇక తన కొడుకు లోకేష్ పట్టాభిషేకానికి రంగం సిద్దం చేసుకోవడానికే ఉన్న ఒక్క నందమూరి వారసుడు బాలకృష్ణని దగ్గర చేసుకొన్నట్లు అర్ధం అవుతోంది.   బాలకృష్ణకి కూడా పార్టీ పగ్గాలు చెప్పట్టాలని మనసులో కోరిక ఉన్నపటికీ, ఎన్నికలను ఎదురుగా పెట్టుకొని అటువంటి పెద్ద బాధ్యత తలకెత్తుకోవడం తన వల్ల కాదని గ్రహించడం వలననే, లోకేష్ విషయంలో అడ్డు చెప్పడం లేదనుకోవచ్చును. పైగా అతను స్వయాన్న అల్లుడే గనుక ఇక బాలకృష్ణ అతనికి పోటీగా నిలబడే ఆలోచన కూడా చేయక పోవచ్చును. చంద్రబాబుకి కూడా ఈ విషయం తెలుసు గనుకనే బాలకృష్ణ విషయంలో నిశ్చింతగా ఉండగలుగుతున్నారు. ఇక తరువాత అంకం లోకేష్ ను ఎన్నికలలో నిలబెట్టడమే తరువాయి.   అయితే, రాబోయే ఎన్నికల ఫలితాలు ఎలావుంటాయో ఇప్పుడే అంచనా వేయడం కష్టం గనుక, ముందుగా పార్టీ శ్రేణులకి లోకేష్ తమ తదుపరి నాయకుడనే భావం కలిగేలా తగిన కార్యక్రమాలు రూపొందించి, ఎన్నికల సమయానికి అప్పటి పరిస్థితులు అనుకూలంగా ఉంటే నేరుగా సురక్షితమయిన కుప్పం నియోజక వర్గం నుండి పోటీ చేయించడమో లేక తానే కుప్పంతో బాటు మరో చోట నుండి (శేరిలింగంపల్లి) కూడా పోటీ చేసి, ఆ తరువాత కుప్పంకు రాజీనామా చేసి కొడుక్కి చోటు కల్పించడమో చంద్రబాబు చేయవచ్చును.   ఒకవేళ రాబోయే ఎన్నికలలో పార్టీ విజయం సాదించి అధికారంలోకి వస్తే, అప్పుడు ఇక తన మాటకు ఎలాగు తిరుగు ఉండదు కనుక తాను ముఖ్యమంత్రి పదవిలోకి మారి తన సీట్లో లోకేష్ బాబుని కూర్చోబెట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ పార్టీ గనుక ఎన్నికలలో ఓడిపోతే, అప్పుడు కూడా తన సీట్లో లోకేష్ బాబుని కూర్చోబెట్టి ఇక తను రాజకీయాల నుండి రిటైర్ మెంట్ తీసుకోవచ్చును. అయితే ఈ కార్యక్రమమంతా వచ్చే ఎన్నికలలోగా ఒక పద్ధతి ప్రకారం జరగాల్సి ఉంటుంది గనుక, ముందుగా లోకేష్ బాటలో ఉన్న ముళ్ళను ఏరి పారేసి ఆ తరువాత కార్యక్రమానికి చంద్రబాబు నడుం బిగిస్తున్నట్లు అర్ధం అవుతోంది.   మరి సినిమాలతో బిజీగా ఉన్న జూ.యన్టీఆర్ ఇప్పుడప్పుడే రాజకీయాలలోకి వచ్చే అవకాశం లేదు గనుక అతను రాజకీయాలలోకి వచ్చే నాటికి లోకేష్ కి పట్టాభిషేకం చేసేస్తే ఇక చంద్రబాబు నిశ్చింతగా ఉండవచ్చునని ఆలోచిస్తున్నారేమో. ఏమయినప్పటికీ, రాబోయే ఎన్నికల తరువాత తెదేపాలో కీలక మార్పులు జరగడం మాత్రం తధ్యం.