జగన్ ను కలవనున్న కొండా సురేఖ

  తెలంగాణాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊపిరిపోసిన కొండ సురేఖ దంపతులు, పార్టీ అధిష్టానం తమ వ్యతిరేఖ వర్గానికి చెందినవారి మాటలు విని క్రమంగా తమ ప్రాధాన్యత తగ్గిస్తుండటంతో వారిరువురూ గత కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలు దూరంగా ఉంటున్నారు. ఇటీవల తమ నలుగురు అనుచరులపై పార్టీ వేటు వేయడంతో వారు పార్టీ వీడేందుకు దాదాపు సిద్దం అయ్యారు. పార్టీ అధిష్టానం ఆఖరి ప్రయత్నంగా వారిని బుజ్జగించేందుకు మొన్న సోమయాజులు, వైవీ సుబ్బారెడ్డిలను వారి వద్దకు పంపినప్పటికీ, వారు జగన్ మోహన్ రెడ్డితో తప్ప వేరేవారితో మాట్లాడమని తేల్చి చెప్పారు. కానీ, పార్టీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాస రెడ్డి సంప్రదిములతో వారు కొంచెం మెత్తబడి ఈ రోజు విజయమ్మతో భేటీ అయ్యారు. రేపు వారిరువురూ జగన్ మోహన్ రెడ్డితో ములాఖాత్ సమయంలో కలుస్తారు. విజయమం వారికి కొన్ని హామీలు ఇచ్చినప్పటికీ, వారు జగన్ మోహన్ రెడ్డితో స్వయంగా మాట్లాడి ఖాయం చేసుకొన్నాకనే తమ నిర్ణయం ప్రకటించవచ్చును. వారి డిమాండ్లలో ముఖ్యంగా తెలంగాణాలో తమ వ్యతిరేఖవర్గాన్ని నియత్రించడం, తమ నలుగురు అనుచరులపై పార్టీ విదించిన నిషేధం ఎత్తివేయడం, మరి కొందరిని పార్టీలో తప్పించడం వంటి షరతులున్నాయి. జగన్ మోహన్ రెడ్డి తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తేనే వారు పార్టీలో కొనసాగాలని భావిస్తున్నట్లు వారి అనుచరుల ద్వారా తెలిసింది. కానీ, జగన్ మోహన్ రెడ్డి వారి షరతులకు ఒప్పుకొంటారో లేదో రేపు వారి ములాఖాత్ తరువాతనే తెలుస్తుంది. దానిని బట్టే కొండ దంపతుల కధ ఏమలుపు తిరుగుతుందో అర్ధం అవుతుంది.

కడియం శ్రీ హరి రాజకీయ వ్యభిచారే

      పార్టీకి రాజీనామా చేసిన కడియం శ్రీ హరిని రాజకీయ వ్యభిచారిగా వర్ణించడం ఎంత మాత్రం తప్పులేదని వరంగల్లో పీఎసీ చైర్మన్ రావూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. కడియం వ్యాఖ్యలు ప్రజల్లో పార్టీనీ చులకన చేసే విధంగా..కార్యకర్తల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. కడియం శ్రీ హరిని పదవి కోసమే తప్ప..తెలంగాణాపై ప్రేమ తో వెళ్లలేదని రేవూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే ఎ పార్టీలో చేరకుండా...ఐకాసా లో చేరి ఉద్యమం చేస్తే నైతికంగా మద్దతిస్తామని తెలిపారు. తెలంగాణాపై మహానాడు లో స్పష్టతనిచ్చే౦త వరకు కడియం ఎ పార్టీలో చేరకుండా ఉండగలరా? అని ప్రశ్నించారు. మహానాడులో తెలంగాణపై స్పష్టతనిచ్చి పార్టీని కాపాడుకుంటామని రేవూరి అన్నారు. 2008 లో తెలంగాణాపై ఇచ్చిన తీర్మానానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.

రెబల్ ఎమ్మెల్యేల ధిక్కారం: వేటు వేయండి

      పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా విప్ ను ఉల్లంఘించి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ విచారణ ప్రారంభించారు. న్యాయవాదితో కలిసి ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి విచారణకు హాజరయ్యారు. అయితే విప్‌ను ధిక్కరించిన కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు దూరంగా ఉన్నారు. ఫ్యాక్స్ ద్వారా తమ వివరణను స్పీకర్ కార్యాలయానికి ఇద్దరు ఎమ్మెల్యేలు రాజేశ్, నాని పంపారు. తక్షణమే తమపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరారు. విచారణకు ఈ రోజు హాజరుకావాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే తమ మీద వేటు వేయాలని ఇంతకుముందే ఆయనను కలిసి కోరామని, ఇప్పుడు మళ్లీ విచారణకు హాజరు కావడం ఎందుకు ? అని వారు అంటున్నారు. నోటీసులతో కాలయాపన చేయకుండా విప్‌ను ధిక్కరించినందుకు తమై వేటు వేయండి అని ఎమ్మెల్యేలు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి స్పీకర్‌ను కోరారు. అవిశ్వాసానికి అనుకూలంగా స్పీకర్ సమక్షంలోనే ఓటు వేశామని గుర్తు చేశారు. మళ్లీ వివరణ ఎందుకని ప్రశ్నించారు. స్పీకర్‌కు వివరణ ఇస్తూ గతంలోనే బహిరంగ లేఖ రాశామని అన్నారు.

సీఎంగా సిద్దరామయ్య ప్రమాణ౦

        కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ భరద్వాజ్ ఆయనతో ప్రమాణం చేయించారు. బెంగళూరు కాంటీవ మైదానంలో జరిగిన కార్యక్రమానికి భారీ సంఖ్యలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. ఈ రోజు సాయంత్రం సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు.   తనకు మద్దతునిస్తున్న దాదాపు డెబ్బై మంది ఎమ్మెల్యేలతో సిద్దరామయ్య రహస్య సమాలోచనలు జరిపారు. పరమేశ్వర కూడా సిఎం రేసులో ఉన్నానని చెప్పారు. దళితుడికి ఈసారి సిఎం పదవి కట్టబెట్టాలనే వాదనను మల్లిఖార్జున ఖర్గే లేవనెత్తారు. ఆయన తనకు సిఎం పదవి కోసం పావులు కదిపారు. కర్ణాటక రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి డికె శివ కుమార్ కూడా చక్రం తిప్పారు. ఇంతమంది పోటీ నేపథ్యంలో అధిష్టానం కుల సమీకరణాలను అమలు చేసి సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఆయనతో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించాలని పార్టీ అధిష్టానం భావిస్తోందట.  

సోనియాగాంధీ లక్షలాది కోట్లు మింగేశారా!

        జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్య స్వామి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి హెచ్చరిక జారీ చేశారు! సోనియాను వదిలే ప్రసక్తి లేదని, ఆమె పని పడతానన్నారు. ఆమె లక్షలాది కోట్ల రూపాయాలను దేశం దాటించారని ఆరోపించారు. ఆ వివరాలను తాను త్వరలోనే బయటపెడతానని అన్నారు. యూపీఏ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ఎన్డీయే కూటమి అధికారం సాధించగలదన్నారు. ప్రధాని మూగబోయిన మొబైల్ ఫోన్ లా వ్యవహరిస్తున్నారు. తృతియ ఫ్రంట్ ఏర్పాటును తాను స్వాగతిస్తున్నానని స్వామి అన్నారు. దాని వల్ల కాంగ్రెస్ కు తీరని నష్టం జరుగుతుందన్నారు. ఏపీ పర్యటనకు వచ్చిన స్వామి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతూ…ఇక్కడ కాంగ్రెస్ పతనమేనని స్పష్టం చేశారు. 2014లో కాంగ్రెస్ స్థానాన్ని ఇతర పార్టీలు ఆక్రమిస్తాయన్నారు. జగన్ యూపీఏకు మద్దతునిచ్చే అవకాశం లేదని సుబ్రమణ్య స్వామి అభిప్రాయపడ్డారు. అలాగే. వైఎస్ఆర్ కాంగ్రెస్‌తో ఎన్డీయేకు వచ్చే ముప్పేమీ లేదని చెప్పారు.

పాక్ లో నవాజ్ షరీఫ్ విజయం

        పాకిస్థాన్ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని పీఎంఎల్-ఎన్ పార్టీ విజయం సాధించింది. దిగువసభకు నిర్వహించిన ఈ ఎన్నికల్లో అధికార పీపీపీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. మొత్తం 272 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. వీటిల్లో 126 స్థానాల్లో పైగా పాకిస్థాన్ ముస్లీం లీగ్ – నేషనల్ విజయం సాధించి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రిక్-ఐ-ఇన్సాఫ్ 34 స్థానాల్లో విజయం సాధించగా ఇతరులు 71 స్థానాల్లో గెలిచారు. పీపీపీ పార్టీ కేవలం 32 స్థానాల్నే సాధించి ప్రధాన ప్రతిపక్షం హోదా కోల్పోయింది. ఎన్నికల్లో తాము విజయం సాధించామని, ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలకు రమ్మని భావ సారూప్యం గల ఇతర పార్టీలకు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆహ్వానం కూడా పలికారని ‘సమా’ టివి చానెల్ కథనం ప్రసారం చేసింది. ప్రజల కోసం ఏ పార్టీతోనైనా, నాయకుడితోనైనా చర్చలకు తాను సిద్ధమని ఆయన ప్రకటించినట్లు తెలిపింది. పంజాబ్‌లోని సర్గోధా స్థానంలో షరీఫ్ విజయం సాధించారు. పాకిస్థాన్ తెహ్రీక్-ఎ- ఇన్సాఫ్ (పిటిఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ పెషావర్-1 స్థానంలో 66,464 ఓట్లతో ఘన విజయం సాధించారు.

కాంగ్రెస్ లో చేరిన గజల్ శ్రీనివాస్

        ప్రముఖ గజల్ గాయకుడు శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన పీసీసీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్, పార్టీ ఇతర నేతలు పాల్గొన్నారు. తన తాత, తల్లి స్ఫూర్తితోనే కాంగ్రెస్ పార్టీ చేరినట్లు గజల్ శ్రీనివాస్ తెలిపారు. లగడపాటి రాజగోపాల్ కు సన్నిహితుడు అయిన గజల్ శ్రీనివాస్ తెలంగాణ – సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో లగడపాటి నిరహారదీక్ష చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఓ గీతం రచించాడు. దానిని లగడపాటి అన్ని ఛానళ్లలో ప్రత్యేకంగా ఉపయోగించుకున్నాడు. విజయవాడలో లగడపాటి సన్నిహితుడు మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ పార్టీని వీడి జగన్ పార్టీలో చేరడంతో ఆ లోటును భర్తీ చేసేందుకు గజల్ ను పార్టీలోకి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.

అల్పసంతోషంలో 'కర్ణాటక' ప్రియులు!

- ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]         కర్కాటకం 'బింది'స్తే కాటికముండదంటారు! కాని అదే కర్కాటకం 'వర్షిస్తేన'ట కాడీ, మోకూతడవనే తడవదట! ఈ రెండు సామెతలూ ఎందుకుపుట్టాయోగాని కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూసి, మరో ప్రత్యామ్నాయ దీటైన రాజకీయపక్షం లేని పరిస్థితులలో నిలువెల్లా అవినీతితో దేశావ్యాప్తితంగా భారీ 'గాయాల'తో కునారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీ వూపిరి పోసుకున్నట్టు భావిస్తోంది! కాని 'కర్కాటకం వర్షిస్తే కాంగ్రెస్ పాలనలో కాడీ, మోకూతడవవట! అసెంబ్లీలో మెజారిటీ సీట్లు సాధించుకున్నానన్న 'సంబరం'లో సీట్లసంఖ్యకు (122) దీటుగా ప్రజాబాహుళ్యం నుంచి వోట్ల శాతం లేదన్న సత్యాన్ని మభ్యపరచాలని ఆ పార్టీ విశ్వప్రయత్నం చేస్తోంది. కాని కాంగ్రెస్ కు పోలైన వోట్లు కేవలం 37 శాతం కాగా, మిగతా పెద్దా, చిన్నా చితక పార్టీలన్నింటికీ పోలైన మొత్తం వోట్లు 63 శాతం! వీటిలో చిన్నా, చితకా పార్టీలు పోనూ కాంగ్రెస్ కు ప్రధాన పోటీదారు, నిన్నటిదాకా అధికార పక్షంగా ఉన్న భారతీయ జనతాపార్టీ (బి.జె.పి.) గతంకన్నా 70సీట్లు కోల్పోగా, బిజెపితో సమానస్థాయిలో సీట్లు గెలుచుకున్న జనతాదళ్ (సెక్యూలర్)పార్టీకి ఈసారి అదనంగా 12 సీట్లు గుంజుకోగల్గింది. అయితే అన్నింటికన్నా ఇక్కడ గమనించవలసిన ప్రధాన విషయం, కర్ణాటక వరకు చాలా కాలంగా బరాబరి పోటీలో ఉంటూ వస్తున్నది [కొన్నాళ్ళపాటు దేవగౌడా పార్టీ తప్ప] సెక్యూలర్ వ్యతిరేకి అయిన "హిందూత్వ'' గ్రూపు బిజెపి మాత్రమే! అందువల్ల 'సెక్యూలరిజం' పేరిట మత రాజకీయం చేయడానికి సంకోచించని కాంగ్రెస్, బిజేపిల మధ్య మాత్రమే కర్ణాటక వరకూ ప్రధానమైన పోటీ గమ్మత్తేమంటే, ఈ రెండు పార్టీలను తోసిరాజనగల బలమైన మూడవ రాజకీయశక్తి ఏదీ ఎదిగి రాకపోవడంవల్ల కర్ణాటక మెజారిటీ ప్రజాబాహుళ్యానికి మరొక విశ్వసనీయమైన శక్తి కన్పించనందున ప్రధాన ఎన్నిక కాంగ్రెస్-బిజేపిల మధ్య పోటీకే పరిమితం కావలసివచ్చింది.   ఎన్నికల ప్రచార సభల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఒక అంశంపై కేంద్రీకరించింది - "బిజెపి అవినీతి పాలనను అంతం చేయండి'' అన్న నినాదంపైన!  అదే నినాదాన్ని కర్ణాటక కాంగ్రెస్ లంకించుకుంది. అక్కడ పోటీ వరకూ బిజెపి అవినీతిలో కాంగ్రెస్ అవినీతిని ప్రత్యామ్నాయంలేని దశలో వోటర్లు చూడగాలిగినా వోటర్లకు మరో దిక్కులేని పరిస్థితి. కాగా అసలు విషయం - కర్ణాటకలో తక్కువ శాతం వోట్లతో అధికారంలోకి వస్తున్న కాంగ్రెస్ ఫలితాన్ని చూసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లోని కొందరు 'చంకలు గుద్దు'కుంటూ అల్పసంతోషం వ్యక్తం చేసి, ఆంధ్రప్రదేశ్ లో కూడా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్సే 'పాగా'వేయగలదని భావిస్తున్నారు. "కర్నాట్టకలో బిజెపి పాలన (సోనియా మాటల్లో)అవినీతిమయం'' కాబట్టి అక్కడ బిజెపి వోడిపోయిందని కాంగ్రెస్ వారు భావించటం "గురువింద గింజ తన నలుపెరగదన్న''ట్టుగా దేశవ్యాపితంగా సంఖ్యాతీతమైన కుంభకోణాలతో తీసుకుంటూ 2014లో ప్రజలనుంచి పరాభవం చవిచూడబోతున్నదన్న స్పష్టమైన సంకేతాలను కూడా ఇక్కడి కాంగ్రెస్ పెద్దలూ, ఢిల్లీలోని అధిష్ఠానవర్గమూ గుర్తించలేకపోతున్నారు. ఇది "మేకపోతు గాంభీర్యమై''నా కావాలి, లేదా సుప్రీంకోర్టు కేంద్రంపైన, సిబీఐపైనా పదే పదే పెడుతున్న మొట్టికాయల పట్ల అంతరంగికంగా పెరిగిపోతున్న 'గుబులు' అయినా కావాలి!   కర్ణాటకలో "బిజెపి అవినీతికి నిరసనగా''నే అక్కడి ప్రజలు తీర్పు చెప్పిన పక్షంలో అంతకన్నా వందరెట్లు కాంగ్రెస్ పాలనావ్యవస్థలోని వేళ్ళమీద లెక్కించదగిన ఏ కొలదిమందో తప్ప మిగతా రాజకీయాలు, అధికార యంత్రాంగమూ పేకమోయ్యా (ప్రధానమంత్రిసహా) అవినీతి ఆరోపణలతో తీసుకుంటున్న దశలో కాంగ్రెస్ పార్టీ కూడా 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని లేదా ఘోర పరాజయాన్ని తప్పించుకోలేదు; తప్పించుకోగల అర్హతను రోజుకొక తీరులో ఎన్ని కొత్త చిట్కాలు పన్నినా కాంగ్రెస్ కోల్పోతుంది. కర్ణాటక "విజయం''పై కాంగ్రెస్ వర్గాల్లోని అల్పసంతోషం 'స్థాయి' ఎలాంటిదో ఫలితాలు వెలువడిన రోజున (8-05-2013) పి.చిదంబరం కాస్సేపు తన ఆర్థికమంత్రి పదవిని పక్కకు నెట్టుకుని "టీవీ రిపోర్టరు''గా అవతారమెత్తి తనకు ఎదురైనా బిజెపి సీనియర్ నాయకుడు మాజీ ఆర్థికమంత్రి జస్వంత్ సింగ్ నోటిముందు మైక్ పెట్టి కర్ణాటక ఫలితాలపై వ్యాఖ్యానించమని వ్యంగ్యం ప్రదర్శించాడు. అందుకు జస్వంత్ యిచ్చిన సమాధానం : "ప్రజలెప్పుడూ సరైన పాలనకే వోటేస్తారు. సరైన పాలన అందించకపోతే నిన్నూ ఓడించేస్తారు'' అన్నాడు! దాంతో పాలుపోని చిదంబరం "చూడండి, ఆయన (జస్వంత్) ఎంత పెద్దమనిషో'' అని మైక్ ను విలేఖరికిచ్చేశాడు!   కాని ఈ 'అల్ప'సంతోషం' లో చిదంబరం తిరిగి తనకే ఎదురుతిరిగే ప్రశ్నలేన్నింటినో మరిచిపోయాడు! "ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేసినా ప్రజలకు సుపరిపాలన అందించాల్సిందే''నని జస్వంత్ నోటనే పునరుక్తి దోషంతో వల్లెవేసినా, ఇంతకూ దేశంలో అవినీతి రహితమైన "సుపరిపాలన''ను కాంగ్రెస్ అందిస్తున్నదో లేదో నీళ్ళునమలకుండా చెప్పగల స్థితిలో చిదంబరం లేడు, ఆయనే కాదు, యు.పి.ఎ. ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న యావత్తు కాంగ్రెస్ అధిష్ఠానవర్గంలో ఎవరూ లేరనే చెప్పాలి. ఎందుకని? ప్రపంచబ్యాంకు "ప్రజావ్యతిరేక సంస్కరణల''ను ఆంగ్లో-అమెరికన్ సామ్రాజ్య పెట్టుబడివ్యవస్థకు, విదేశీ బహుళజాతి గుత్తసంస్థల (మల్టీనేషనల్ కంపెనీల)ను, వారితో మిలాఖత్తయి భారత పేద, మధ్యతరగతి వర్గాలను దోచుకుతినే స్థానిక గుత్తేదారులకు ప్రయోజనం చేకూర్చగల ఆర్థికవ్యవస్థను నిర్మూలించడానికే పాలనావ్యవస్థ కంకణం కట్టుకుంది కాబట్టి - కాంగ్రెస్, బిజెపిలు సుపరిపాలన అందించలేవని రుజువైపోయింది. అందుకే అమెరికాలో మాదిరే ఇక్కడ కూడా ప్రజాప్రయోజనాలకు అనుకూలమైన బలమైన మూడవ ప్రత్యామ్నాయ రాజకీయశక్తిని పెట్టుబడివ్యవస్థ ఎదగానివ్వదు. ఉన్న వామపక్షాల బలహీనతలను కాంగ్రెస్-బిజెపిలు ఇప్పటికే బాగా కాచివడపోశాయి!   ఈ పరిణామక్రమంలో భాగంగా దేశ ఆర్థికవ్యవస్థను కనీసం రాజ్యాంగ చటానికి ప్రాణప్రదంగా ఎంచుకున్న "ప్రియాంబుల్'' (ఉద్దీపన) మౌలికలక్ష్యానికి అనుగుణంగా తీర్చిదిద్దేదిపోయి ప్రకటిత సోషలిస్టు తరహా సంక్షేమ రాజ్యనిర్మాణానికి కట్టుబడకపోగా, ప్రజాస్వామ్య భావాలకు సహితం ఎసరు తెచ్చిపెడుతున్న పరిణామాలకు కాంగ్రెస్ పాలన దోహదం చేయటం 'సుపరిపాలన' ఎలా అవుతుందో చిదంబరం చెప్పాలి! దేశ పారిశ్రామిక, వ్యవసాయక, సంక్షేమ, వస్తూత్పత్తి, సహకార రంగాలన్నిటా ప్రపంచబ్యాంకు "సంస్కరణల''ద్వారా విషమ ఫలితాలకు తలుపులు తెరవడాన్ని 'సుపరిపాలన'గా ఎలా చెప్పగలం? చివరికి కార్మిక చట్టాలను, బహుళజాతి గుత్తసంస్థల ప్రయోజనాలకు, వాటిని దేశంలోకి యధేచ్చగా అనుమతించడానికి వీలుగా సవరించడానికి అనుమతిస్తూ న్యాయవ్యవస్థను కూడా అందుకు అనుగుణంగా మరల్చడానికి గజ్జెకట్టిన కాంగ్రెస్-బిజెపి పాలనావ్యవస్థలను 'సుపరిపాలన'గా ఎలా ప్రజాబాహుళ్యం గుర్తించగలదు? 'సంస్కరణల' పేరిట ప్రభుత్వరంగ విస్తరణను కుంచింపజేసి లాభాల వేటకు అర్రులు చాచిన ప్రయివేట్, కార్పోరేట్ రంగాలను అనేక రాయితీలు కల్పించేందుకు కాంగ్రెస్, బిజెపి పాలనావ్యవస్థలను ప్రపంచబ్యాంకు కేవలం 'బ్రోకర్ ల'పాత్ర ("ఫెసిలిటేటర్'')స్థాయికి ఆదేశాపూర్వకంగా దిగజార్చడాన్ని ఎలా 'సుపరిపాలన'గా భావించగలం?   రూ 5 1/2లక్షలకోట్ల ప్రజాధనం బడా వర్గాలనుంచి రుణాల రూపేణా రిజర్వుబ్యాంకికి మొండిబకాయిలుగా మారడాన్ని అవి ఎగవేతలుగా మారడాన్ని 'గుడ్లు అప్పగిస్తూ' కూచునే పాలనావ్యవస్థల్ని 'సుపరిపాలన'గా ఎలా పరిగణించగలం? ఆ మాటకొస్తే స్విస్ బ్యాంకుల్లో ఏళ్ళూ వూళ్ళుగా మూలుగుతున్న భారతీయ బడావర్గాల సామూహిక నల్లధనం (బ్లాక్ మనీ)రూ.24 లక్షల కోట్లను ముట్టుకోడానికి సాహసించలేకపోయిన పాలనా వ్యవతలు 'సుపరిపాలన' కింద ఎలా జమకట్టగలం? దేశ సహజసంపదైన రేడియో తరంగాలను తమ హక్కు భుక్తం చేసుకుని దేశీయ టెలికాం వ్యవస్థను ప్రజల వినియోగానికి అందుబాటులో లేని 'మూల్యం' వసూలు చేయడానికి వీలుగా 122 లైసెన్సులను విదేశీ, స్వదేశీ గుత్త సంస్థలకు బదలాయించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆ లైసెన్సులను రద్దుచేసే దాకా 'నాలిముచ్చుగా' మౌనముద్ర నటించే పాలనా వ్యవస్థను 'సుపరిపాలన'గా ఎలా నమోదవుతుందో జస్వంత్, చిదంబరంలే సమాధానం చెప్పగలరా?   పైన తెల్పిన బకాయిలు, గుప్తధనం సహా దేశంలో సుమారు మరో పదిలక్షల కోట్ల రూపాయల దాకా చెలామణిలో ఉన్న దొంగడబ్బును వెలికి తీయడానికి [పదేళ్ళనాదే రిజర్వుబ్యాంకు ముందు అఫిడవిట్ లో కేంద్రం, దేశంలో చెలామణిలో ఉన్న పోటీ ఆర్థిక వ్యవస్థ విలువ రూ.5 లక్షల కోట్లని వెల్లడించింది] ముందడుగు వేయడంలో విఫలమైన పాలనా వ్యవస్థ 'సుపరిపాలన', ఆదర్శ పరిపాలన ఎలా కాగల్గుతుంది?   దేశీయ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలలో భాగస్వాములు కావలసిన చిన్న చిన్న రిటైల్ వర్తక వ్యాపారసంస్థలను సహితం మింగివేసే వాల్ మార్ట్ లాంటి బడా మల్టీనేషనల్ కంపెనీలకు 'ఎర' చేయడానికి దారులు తెరిచిన పాలనావ్యవస్థను 'సుపరిపాలన' కింద జనం ఎలా పరిగణిస్తారు? చివరికి ఇప్పటికే దేశ పేద, మధ్యతరగతి అసంఖ్యాక ప్రజాబాహుళ్యం మూల్గుల్ని పీల్చడంలో అగ్రస్థాయి కార్పోరేట్ సంస్థలకు ప్రభుత్వం పన్నులు, సబ్సిడీల రూపంలో ఎన్ని రకాలుగానో రాయితీలు కల్పిస్తున్నా చాలవన్నట్టు, మరిన్ని రాయితీల కోసం వత్తిడి చేస్తూ "రాయితీలు అడిగిన మేరకు కల్పించకపొతే విదేశీ గుత్త పెట్టుబడులను రానిచ్చేది లేద''ని విదేశీ కార్పొరేట్లు అవే రాయితీలను 'మాకూ' కల్పించాలని దేశీయ కార్పోరేట్లూ అలిగి, భీష్మించుకుకొని కూర్చుంటే వాటి వైఖరిని దుమ్ముదులిపేది పోయి 'దువ్వి' దగ్గరకు తీస్తున్న పాలనావ్యవస్థ 'సుపరిపాలన' ఎలా అందివ్వగలదు? ప్రభుత్వ, ప్రయివేట్ రంగాలలోని 23 బ్యాంకులూ, భీమా కంపెనీలూ 'హవాలా' ధనంతో లావాదేవీలు మాదకద్రవ్య వ్యాపారాలు సాగించడానికి వీలు కల్పించిన సంస్కరణలను తలకెత్తుకున్న పాలనావ్యవస్థ ప్రజలకు ఎలాంటి 'సుపరిపాలన'ను అందించగలదో ప్రజలు తెలుసుకోగోరుతున్నారు?!   ఇటీవలనే ఒక బడా "ఈక్విటీస్'' సంస్థ విడుదల చేసిన సమాచారం ప్రకారం దేశంలోని 54 బడాసంస్థల వద్ద నగదు రూపంలోకి మార్చుకోగల రూ.4,30,000 కోట్ల కిమ్మతుగల క్యాషు, దానికి సమానమైన ద్రవ్య మాధ్యమ పత్రాలు [వీటిని "పేపర్ ఇన్ స్ట్రుమెంట్స్'' అంటారు. వీటిని తేలిగ్గా నగదుగా మార్చుకోవచ్చు] ఉన్నాయని వెల్లడయింది! అంటే, దేశప్రయోజనాలకు వినియోగపడగల ఉత్పత్తి రంగానికి చెందిన ఉత్పాదక కార్యకలాపాలలో పెట్టుబడులుగా పెట్టే బదులు అనుత్పాదక రంగాలకు మరలిపోతోంది. ఇలా మరలి తరలిపోయే పెట్టుబడి దేశ స్థూల జాతీయోత్పత్తుల [జి.డి.పి.] విలువలో 4.3 శాతం ఉందని సాధికార అంచనా! ఈ తరలింపును అడ్డుకోకుండా పేదసాదలపైన, మధ్యతరగతిపైన మోయలేని భారాన్ని మోపి, నియంత్రణ వ్యవస్థలోనూ, అక్కౌంటింగ్, న్యాయవాద వ్యవస్థల్లోనూ విదేశీసంస్థల జోక్యానికి బీజాలు నాటిన పాలనావ్యవస్థ నిర్వాహకుల్ని 'సుపరిపలకులు'గా ఎలా గుర్తించగలమో కర్ణాటక ఫలితంపై 'జబ్బలు' చరుచుకుంటున్న కాంగ్రెస్ నాయకులు గుండెలమీద చేయి వేసుకుని చెప్పగలగాలి! ఇది దేశవ్యాపిత దృశ్యం! కర్నాటకం, ఆంధ్రప్రదేశ్ లో ప్రతిఫలించదనుకోవడం భ్రమ!

చంద్రబాబు హర్టయ్యాడట!

        తెలంగాణకు అనుకూలంగా టీడీపీ స్పష్టమైన వైఖరి ప్రకటించిందని, పార్టీ వైఖరి పూర్తి అనుకూలంగా ఉందని కడియం శ్రీహరే బహిరంగంగా చెప్పారు. అప్పుడు కనిపించిన స్పష్టత ఇప్పుడు ఎటుపోయింది? ఇప్పుడు కొత్తగా కనిపించిన అస్పష్టత ఏమిటి' అని చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. తెలంగాణ నేతలు కొందరు బాబుతో భేటీ అయిన సందర్భంగా కడియం ప్రస్తావన వచ్చింది. కడియంకు పార్టీలో ఏం తక్కువ చేశామని ఇప్పుడు విమర్శిస్తున్నారని బాబు ఆవేదన వ్యక్తంచేశారు. 'తెలంగాణలో ఆయన కంటే ముందు నుంచీ పార్టీలో పనిచేస్తున్న సీనియర్లున్నా వారిని కాదని కడియంకు మంత్రి పదవి ఇచ్చాను. పొలిట్‌బ్యూరో సభ్యుడిని చేశాను. ఎందరో సీనియర్లు అడిగినా కాదని అఖిలపక్షానికి పార్టీ ప్రతినిధిగా ఆయననే పంపాను. మొన్న కూడా వచ్చి కలిసినప్పుడూ ఇలాంటి అభిప్రాయమేదీ వ్యక్తం చేయలేదు. గంటా రెండు గంటలు కూర్చుని అలా చేస్తే బాగుంటుంది.. ఇలా చేస్తే బాగుంటుందని సలహాలిచ్చి ఇంతలోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏమిటి? ఆయన చెప్పినవాటిలో పార్టీ ఏది కాదంది? ఆయనకు ప్రతి విషయంలో పార్టీ సహకరించింది. నాయకులు రావచ్చు.. పోవచ్చు. కానీ ప్రజలు అవినీతికి, ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమీకృతం అవుతున్న తరుణంలో ఇలా చేయడం బాధాకరం. పోయినవాళ్ల గురించి వదిలేసి యువనాయకత్వాన్ని ప్రోత్సహిద్దాం. వీళ్లంతా పార్టీలోకి వచ్చినప్పుడు యువకులే' అని వ్యాఖ్యానించారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భవితవ్యం

  కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వీ.హెచ్.హనుమంతరావు, చంచల్ గూడా జైలుని తన పార్టీ కార్యాలయంలా మార్చేసుకొన్న జగన్ మోహన్ రెడ్డిని, ఇతర రాష్ట్రంలో జైలుకి తరలించాలని డిమాండ్ చేసినప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తమ నేతను పార్టీకి దూరంచేసి ఎన్నికల ముందు తమ పార్టీని దెబ్బతీయాలనే ఈ విధమయిన కుట్రలు పన్నుతోందని వారు ఆరోపించారు. ఆ రెండు పార్టీ నేతల మద్య యుద్ధం సంగతి ఎలా ఉన్నపటికీ, కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడయిన ఆయన ఏదో కాకతాళీయంగా ఆవిదంగా డిమాండ్ చేయలేదని తెర వెనుక నడుస్తున్న కధ చూస్తే అర్ధం అవుతుంది.   జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆర్ధిక లావాదేవీలపై సీబీఐకి సమాంతరంగా దర్యాప్తు చేస్తున్న ఈ.డీ. అధికారులు జగన్ మోహన్ రెడ్డిని కొన్ని నెలల క్రితమే చంచల్ గూడా జైలులో విచారించారు. కానీ ఆయన వారికి సహకరించకపోవడంతో, ఆయనని విచారించేందుకు తమకి అనువుగా ఉండే తీహార్ జైలుకి బదిలీ చేయాలని కోరుతూ వారు తమపై అధికారులకు ఏప్రిల్ నెలలో ఒక లేఖ వ్రాశారు. దానికి వారి నుండి ఇంకా జవాబు రాలేదు. ఈనెలాకరులోగా కానీ లేదా వచ్చే నెల రెండవ వారంలోగా గానీ తమకి అనుమతి దొరకవచ్చునని వారు భావిస్తున్నారు.   అదే జరిగితే జగన్ మోహన్ రెడ్డిని వచ్చేనెలలో తీహార్ జైలుకి తరలించే అవకాశాలున్నాయి. ఈలోగా ఈ.డీ. అధికారులు విదేశాలలో వివిధ బ్యాంకులు, సంస్థల నుండి జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వివిధ కంపెనీలలోకి వచ్చిపడిన ‘నిధుల వరదల’ వివరాలు సేకరిస్తున్నారు. ఒకవేళ, జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కేసుల్లోంచి బెయిలుపై బయటపడితే, ఆయనని విదేశాల నుండి చట్టవిరుద్ధంగా పెట్టుబడులు రప్పించుకొన్న కేసులలో బిగించేందుకు ఈ.డీ. అధికారులు రంగం సిద్దం చేసుకొంటున్నారు. ఇప్పటికే, వారు జగన్ మోహన్ రెడ్డి మరియు అతనికి సంబంధించిన వివిధ కంపెనీలకు చెందిన రూ.122కోట్ల విలువయిన ఆస్తులను జప్తు చేసారు.   ఇక, తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డికి ఈసారి తప్పకుండా బెయిలు మీద విడుదల అవుతాడని గంపెడు ఆశలు పెట్టుకొన్న ఆ పార్టీనేతలు సుప్రీంకోర్టు తీర్పుతో తీవ్ర నిరాశ నిస్పృహలకి లోనయ్యారు. పైగా సుప్రీంకోర్టు ఆయనకి బెయిలు నిరాకరిస్తూ దేశంలో పెరిగిపోతున్న ఆర్ధిక నేరాల గురించి వ్యక్తం చేసిన అభిప్రాయలు వారిని మరింత కలవరపరిచాయి. కానీ, మరో నాలుగు నెలల తరువాత అయినా బెయిలు దొరికే అవకాశం ఉందని భావిస్తున్న వారందరికీ, రేపు ఈ.డీ.అధికారులు జగన్ మోహన్ రెడ్డిని తీహార్ జైలుకి తరలించి కొత్త కేసులు మొదలుపెడితే ఇక వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది.   సీబీఐ నుండి సుప్రీంకోర్టు వరకు అన్ని స్థాయిలలో ఆయన న్యాయ వాదులు చేస్తున్న న్యాయ పోరాటం సత్ఫలితాలు ఇవ్వకపోగా, ఆయనపట్ల కోర్టులకున్న అభిప్రాయలు వివిద రూపాలలో నిత్యం ప్రకటితమవుతునే ఉన్నాయి. అయినప్పటికీ, కోర్టులను తప్పుపట్టలేని వైయస్సార్ కాంగ్రెస్ నేతలు, ఆయా తీర్పులలోంచి తమకు అనుకూలమయిన అంశాలున్నాయంటూ తమను తాము మభ్యపెట్టుకొంటూ, "త్వరలోనే జగన్ మోహన్ రెడ్డి బయటకి వస్తాడు! రాజన్న రాజ్యం తెస్తాడు! అంటూ ప్రజలను కూడా మభ్యపెడుతున్నారు.   తమ నాయకుడు జైలు నుండి విడుదల కావాలంటే ఏమిచేయాలో కొందరు కాంగ్రెస్ నేతలే స్పష్టంగా చెపుతున్నారు. వారి సూచనలు పాటించి ఆయన తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి లొంగిపోయి, తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయక తప్పదు.   అయితే, ఈ మద్యనే ఆయనను జైల్లో కలిసి వచ్చిన దాడి వీరభద్ర రావు మాటల ప్రకారం ఆయన ఎన్నటికీ కాంగ్రెస్ పార్టీకి లొంగబోడని అర్ధం అవుతోంది. “ఇంత కాలం జైల్లో పెట్టి తనను వేధించిన కాంగ్రెస్ పార్టీ ఇంత కంటే ఏమి చేయలేదు గనుక ఆ పార్టీతో చేతులు కలిపే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేసినట్లు దాడి మాటల ద్వారా అర్ధం అవుతోంది.   దీనిని బట్టి అర్ధం అవుతున్నదేమిటంటే ఇటు జగన్ మోహన్ రెడ్డి కానీ, అటు కాంగ్రెస్ గానీ రెండూ వెనక్కి తగ్గే ఆలోచనలో లేవు గనుక, కాంగ్రెస్ పార్టీ తన చేతిలో ఉన్న ‘చిలకలకు’ జగన్ మోహన్ రెడ్డి కేసుల విషయంలో తగిన కార్యాచరణ నిర్దేశించవచ్చును. అప్పుడు ఆయన మరిన్నినెలలు లేదా ఏళ్ళు జైలుకే అంకిత మయిపోవలసి రావచ్చును. ఇది ఆయన పార్టీపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు కూడా మార్చే అవకాశం ఉంది.   కానీ, ఇంతవరకు ఆయన ధృడంగానే మాట్లడుతున్నపటికీ తనను చంచల్ గూడా జైలు నుండి డిల్లీకి తరలించేందుకు నిశ్చయమయితే, అప్పుడు ఆయన విధిలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో రాజీచేసుకోవచ్చును. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో పంతానికి పోయి తన వ్యక్తిగత, రాజకీయ జీవితాన్నిచేజేతులా నాశనం చేసుకొనే కంటే ఆ పార్టీతో రాజీపడి, ఈ కేసుల నుండి బయటపడి ప్రభుత్వంలో చేరగలిగితే, క్రమంగా కాంగ్రెస్ పార్టీనే ఆయన తన చెప్పుచేతలలోకి తెచ్చుకోవచ్చును. బహుశః త్వరలోనే ఈ చిక్కు ముడులన్నీ విడిపోయి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భవితవ్యం తేలిపోవచ్చును.

యమ్ సెట్ ... యమ టెన్షన్

        May 10 శుక్రవారం హైదరాబాద్ లో ఎంసెట్ ఎగ్జామ్ రాయవలసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నరకాన్ని చవిచూశారు. కారణం, ఎలాంటి ట్రాఫిక్ నిబంధనలు, ట్రాఫిక్ పరంగా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు పాటించకపోవటం ట్రాఫిక్ కమీషనర్ C.V. ఆనంద్ బాధ్యతారాహిత్యం తేటతెల్లమవుతుంది. నగరంలో ఎలాంటి మతసంబంధిత ఊరేగింపులు జరిగినా, ఎలాంటి రాజకీయ బహిరంగసభలు జరిగినా ట్రాఫిక్ డైవర్షన్ పెట్టి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే ఈ పోలీస్ యాజమాన్యం, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ట్రాఫిక్ నుండి వెసులుబాటు కల్పించక పోవటం కడు శోచనీయం. ఎంసెట్ ఎగ్జామ్ అంటే ఒక్క విద్యార్థికి రెండు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాల శ్రమ. పరీక్షహాలుకు ఒక్క నిమిషం లేటుగా వచ్చినా అనుమతించం అనే నిబంధన పెట్టిన ఈ అధికారులు అది వర్కింగ్ డే రోజు (శుక్రవారం) పెట్టకూడదు అనే ఇంగితజ్ఞానాన్ని మరిచారా? సెలవుదినాల్లో పెడితే కొంతవరకు ఈ ట్రాఫిక్ ఇబ్బందులు తప్పేవి. గతంకి ఎంసెట్ ఎలాంటి క్రేజ్ లేని రోజుల్లో పనిదినాల్లో ఈ ఎగ్జామ్ నిర్వహించేవారు కాని ఈనాటి పరిస్థితి అది కాదు. ఎంసెట్ ఎగ్జామ్ కి ఈనాడు attend అవుతున్నవారు  లక్షల్లో ఉన్నారు. మరి అలాంటప్పుడు ఈ ఎగ్జామ్ నిర్వహించ వలసినది సెలవు రోజున కదా! (ఆదివారం) హైదరాబాద్ లో ట్రాఫిక్ కంట్రోల్ అనేది రోజు రోజుకీ దిగజారి పోతోంది. దీనికి కారణం అధికారుల వైఫల్యం. ప్రజల యొక్క అలసత్వం. ఒక సెలబ్రిటి ఇంట్లో పెళ్ళి జరిగితే దానికి వందలమందితో పోలీస్ సెక్యూరిటీ. ఒక సినిమా ఆడియో ఫంక్షన్ జరిగితే దానికి విపరీతమైన పోలీస్ బందోబస్త్. కాని కష్టపడి చదివి పరీక్ష రాసే విద్యార్థికి మాత్రం ఎలాంటి సౌకర్యం పోలీస్ వ్యవస్థనుండి ఉండదు. నిన్న హైదరాబాద్ లో జరిగిన ఎంసెట్ ఉదంతాన్ని చూస్తే ఎంతో మంది విద్యార్థుల ఆశలు ఆవిర్లు అయిపోయాయి . ఇప్పటికే చాలామంది విద్యార్థులు ఇంటర్లో మార్కులు సరిగా రాలేదని ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు అనేకం. కాని ఎంసెట్ అంటే చాలామందికి రెండు, మూడేళ్ళ శ్రమ. ఇలా వారి భవితవ్యాన్ని మార్చేసే హక్కు ఎవరిచ్చారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా, హాల్ టికెట్ పై ఫోటో లేకపోయినా నిర్థాక్షిణ్యంగా పరీక్షకు అనుమతించని నిబంధనలు విధిస్తూ విద్యార్థులను శాసిస్తున్న సదరు యాజమాన్యం, ఈ ట్రాఫిక్ పట్ల కూడా దృష్టి సారించాల్సిన అవసరం లేదా? అంటే వీరి ప్రతాపం అంతా అమాయకులైన ప్రజలు, విద్యార్థుల పైనేనా? ఒక హనుమాన్ జయంతి శోభాయాత్ర,, ఒక శ్రీరామనవమి శోభాయాత్ర,, ఒక మినాదున్నబి ఇలాంటి వాటికి కల్పించే ట్రాఫిక్ బదలాయింపులు లక్షలాది మంది విద్యార్థుల విషయంలో కల్పించక పోవటం ఎంతవరకు సమంజసం. కూకట్ పల్లిలో ఉండే విద్యార్థికి పాతబస్తీలో ఎగ్జామ్ సెంటర్ కేటాయించడం అంటే, అసలు విద్యాశాఖ ఏ విధంగా పనిచేస్తోంది? ట్రాఫిక్ పట్ల చర్యలు అంటే! C.V. ఆనంద్ దృష్టిలో ఏమిటి? తాగి కారునడిపే సెలబ్రిటీలను పట్టుకొని పేపర్లో ఫోటోలు వేయించుకోవటమా! నగరంలో ఎలాంటి సందర్భాన్ని ఎదుర్కోవలన్నా ముందుగా ట్రాఫిక్ పరంగా భయానక వాతావరణాన్ని చవిచూడాలా ప్రజలు? మనమేమీ రాతియుగంలో లేము, మాటకి ముందు హైదరాబాద్ ను మెట్రోపాలిటన్ సిటీగా పేర్కొంటూ, నగరజీవికి ట్రాఫిక్ పరంగా నిత్యం నరకాన్ని చూపిస్తుంటే, దీనికి బాధ్యులెవరు? బాధ్యులైన ట్రాఫిక్ సిబ్బంది ప్రభుత్వం రెండేళ్ళ శ్రమను బూడిదలో పోసిన చందంగా చేసేసి, నిస్సహాయంగా చూస్తున్న విద్యార్థులకు ఏం సమాధానం చెప్తారు? రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో ట్రాఫిక్ పరంగా ప్రజలు ఇన్ని ఇక్కట్లు పడుతూ సదరు సిబ్బందిని ఎందుకు నిలదీయరు? ఈ పోలీస్ వ్యవస్థ, న్యాయవ్యవస్థ, ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ ఇవన్నీ ఉన్నది కేవలం V.I.P.లకు రక్షణ కల్పించటానికేనా? ఇన్ని అవస్థలు పడతారే కానీ ప్రజలు ఎలాంటి వ్యతిరేకతను చూపించరా? ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘనలు చేస్తూ పట్టుబడితే 100/- నుండి 1,000/- వరకు లంచం ఇచ్చి దర్జాగా వెళ్ళిపోవటం. మరి ఇక్కడ బాధ్యతారాహిత్యం ఎవరిది? ప్రజలది కాదా? ఇంతటి బాధత్యారాహిత్యంగా ఉండేవారు ప్రశ్నించే హక్కును ఎలా వినియోగించుకుంటారు? ఎన్నో ఆశలతో ఈ ఎంసెట్ ఎగ్జామ్ ద్వారా తమ భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం అనుకున్న విద్యార్థులను నిండా ముంచేసిన ఈ ట్రాఫిక్ కమీషనర్ C.V. ఆనంద్ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ వైఫల్యం కారణంగా విద్యార్థులు ఎంసెట్ సెంటర్ నుండి వెనుదిరిగిన వారు అనుచిత నిర్ణయం ఏదైనా తీసుకుంటే C.V. ఆనంద్ సమాధానం ఏమిటి? ఏ డిపార్ట్ మెంట్ వారైనా సరే విధి నిర్వహణలో వైఫల్యం చెందితే వారికి విధించాల్సిన సరైన శిక్ష ఏమిటి? నిన్న కేవలం ట్రాఫిక్ కమీషనర్ C.V. ఆనంద్ బాధ్యతారాహిత్యం మరియు విధి నిర్లక్ష్యం మరియు ట్రాఫిక్ పట్ల ఎంసెట్ కు వచ్చే విద్యార్థుల సంఖ్య పట్ల అవగాహనలేమి కారణం ఫలితంగా అనేకమంది విద్యార్థులు నిస్సహాయులైపోయారు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు?   చివరిగా చెప్పేది ఒక్కటే ప్రభుత్వం యొక్క ప్రతి వైఫల్యంలోను ప్రభుత్వం బాధ్యత ఎంత ఉంటుందో ప్రజల వైఫల్యం కూడా అంతే ఉంటుంది. అందుకే నిరాసక్తత, నిస్తేజం నిండిన ప్రజలారా మేల్కొనండి! మేల్కొని మీ పిల్లల భవిష్యత్తుకై గళమెత్తండి! C.V.ఆనంద్ గారికి … విద్యార్థుల తల్లిదండ్రుల అందరి తరుపున మా ఈ ప్రశ్నల పరంపరని పంపుతున్నాం. ఆయన సమాధానం ఏంటో చూద్దాం. అసలు సమాధానం వస్తుందో లేదో కూడా చూద్దాం.

కడియం టీఆర్ఎస్ కోవర్టు

        కడియం శ్రీహరి ఓ కోవర్టు ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయన టీఆర్ఎస్ కు కోవర్టులా పని చేశాడు. ఆయన పార్టీని వీడడం మూలంగా పార్టీకి వచ్చిన నష్టం ఏమీలేదని టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు తీవ్రంగా విమర్శించారు. రాజకీయ ప్రయోజనం కోసమే కడియం శ్రీహరి పార్టీని వీడుతున్నారని ఆయన అన్నారు. పక్కా తెలంగాణవాదిని అని చెప్పుకునే కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీ తెలంగాణపై అఖిలపక్షానికి ఇచ్చిన లేఖలో ఏమీ లేకపోతే అఖిలపక్ష సమావేశానికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే మోత్కుపల్లి నర్సింహులుతో ఏర్పడిన వివాదం కారణంగానే కడియం శ్రీహరి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అప్పటి నుంచే ఆయన తెలుగుదేశం పార్టీని వీడుతారనే ప్రచారం సాగుతోంది. ఇక శ్రీహరి రాజీనామా మీద పార్టీ నేత ఇనుగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణకు అడ్డు అని ఇన్నాళ్లు చెప్పిన శ్రీహరి ఇప్పుడు ఆయన వద్దనే చేరి ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కేసీఆర్ ఉచ్చులో పడొద్దని, పార్టీకి రాజీనామా విషయంలో పునరాలోచించుకోవాలని కోరారు.

ఏకుగా వచ్చి మేకయిన రామచంద్రయ్య

దేవాదాయశాఖ మంత్రి సి. రామచంద్రయ్య, ప్రజారాజ్యం పార్టీకి దగ్గరుండి తాళాలు వేయించిన తరువాత, ఆ పార్టీని కాంగ్రెస్ సముద్రంలో కలిపేసే వరకు చిరంజీవి వెనుక నిలబడి చక్రం తిప్పారు. ఆ తరువాత ఆయన చిరంజీవి చేయిపట్టుకొని కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టి ఆయనకి కేంద్ర మంత్రి పదవి, తనకి దేవాదాయశాఖ మంత్రి పదవి కూడా ఇప్పించుకొని వారు కలలు కన్న సామాజిక న్యాయం సాకారం చేసుకోగలిగారు.   తనకు మంత్రి పదవి దక్కితే అదే పదివేలనుకొన్న రామచంద్రయ్య మొదట్లో నిజంగా రాముడు మంచి బాలుడు లాగే వ్యవహరించేవారు. కానీ, కాంగ్రెస్ పార్టీలో పైకి రావాలంటే సోనియా, రాహుల్, అంటూ భజన చేయడమో లేక కొంచెం నోరు పెట్టుకొని బ్రతకడమో తప్పనిసరి అనే విషయాన్ని కనిపెట్టిన ఆయన, వీ.హనుమంత రావు వంటి వారు సోనియా, రాహుల్, అంటూ భజన ఎంత కాలం భజన చేసినా వారి పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుందని గ్రహించి, ఆయన రెండో మార్గం ఎన్నుకొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించడమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగిపోతున్న రామచంద్రయ్య పనిలోపనిగా తమ అమాయకజీవిని కూడా తెగ పొగిడేస్తూ, అతని ముందు కిరణ్ కుమార్ ఎందుకు పనికిరాడని మీడియాని పిలిచి మరీ చాటింపు వేస్తుంటాడు. రాబోయే ఎన్నికలలో ఆ తరువాత కూడా చిరంజీవే ప్రధాన పాత్ర పోషించబోతున్నాడని ఇటీవలే జోస్యం కూడా చెప్పారు.   ఇక, నిన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శ్రీశైలంలో ఒక కార్యక్రమానికి హాజరవుతున్నారని తెలిసినప్పటికీ, ఆలయ అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా దేవాదాయ శాఖా మంత్రి అయిన తనను ముందుగా ఆహ్వానించలేదంటూ ముఖ్యమంత్రి కార్యక్రమానికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొన్నారు. ఆయన ఈవిధంగా తనతో ఏదో వంకతో కయ్యానికి కాలు దువ్వుతుండటంతో ముఖ్యమంత్రి కూడా చాల అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి తనతో మరీ సఖ్యతగా ఉండనప్పటికీ కనీస మర్యాదలు పాటిస్తాడు గనుక కిరణ్ కుమార్ రెడ్డికి ఆయనతో ఎటువంటి సమస్యలు లేవు. అయితే ఆయన అనుచరుడయిన రామచంద్రయ్య మాత్రం చిరంజీవి కంటే ఎక్కువగా రెచ్చిపోవడం చూసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఈసారి డిల్లీవెళ్ళినప్పుడు ఆయన పదవికి కత్తెర వేయాలని నిశ్చయించుకొన్నారు.   అయితే, రామచంద్రయ్యని కత్తిరించే ముందు తనకి పోటీగా తయారవుతున్న చిరంజీవిని కత్తిరించాలని భావించినందువల్లనేమో, కిరణ్ కుమార్ రెడ్డి కూడా పావులు కదిపారు. చిరంజీవికి చెందిన ఒక ఇంటి స్థలం పైలును, బ్లడ్ బ్లాంక్ స్థలం ఫైలును సిఐడి అదికారులు మొన్ననే స్వాదీనం చేసుకొన్నారు. గతంలో ఆయన తన ఇంటి పక్కన ఉన్న 900 గజాల స్థలాన్ని, అలాగే బ్లడ్ బ్యాంక్ స్థలం పక్కన గల రెండువందల గజాల స్థలాన్ని కూడా ఆక్రమించారని విజిలెన్స్ విభాగం వారు చాలా ఏళ్ల క్రితమే ప్రభుత్వానికి ఒక నివేదికను కూడా ఇచ్చారు. అయితే, ఇంత కాలం ఆ విషయం పట్టించుకోని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడు హట్టాతుగా ఆ ఫైల్స్ అన్ని సిఐడి చేత వెలికిదీయించారు.   చిరంజీవి ఆక్రమించుకొన్న ఆ రెండు స్థలాలను తరువాత కాలంలో తన పేరిట రిజిస్టర్ కూడా చేయించుకొన్నట్లు సమాచారం. ఆయన అవినీతి భాగోతం ఈవిధంగా మీడియాకి లీక్ చేసి తన తడాఖా చూపించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నించినట్లున్నారు. ఒకవేళ రామచంద్రయ్య తనను ఇబ్బందిపెడితే ఇటువంటి అస్త్రాలు ప్రయోగించడానికి కూడా వెనుకాడనని కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టంగా తెలియజేసారు.

టీడీపీకి కడియం రాజీనామా

        టిడిపి సినీయర్ నేత కడియం శ్రీహరి చంద్రబాబు నాయుడుకి షాకిచ్చారు. తెలంగాణ గురించి పట్టుబట్టి..తెలంగాణ తెలుగుదేశం ఫోరం ఎలాంటి ఉద్యమం చేపట్టడం లేదని, కేవలం కేసీఆర్ తిట్టడానికే పరిమితమయిందని ఆగ్రహించిన కడియం శ్రీహరి ఈ రోజు టిడిపికి రాజీనామా చేశారు. పార్టీలో తనకు వ్యతిరేకంగా పావులు కదులుతున్నాయని అనుమానిస్తున్న కడియం శ్రీహరి విశాఖపట్నంలో జరిగిన చంద్రబాబు పాదయాత్ర ముగింపు సభకు దూరంగా ఉన్నారు. దీంతో ఆయన పార్టీ వీడుతున్నారని వార్తలు వచ్చాయి. ఆ తరువాత హైదరాబాద్ లో చంద్రబాబు ను కలిసి అవన్నీ వదంతులు అని తేల్చేశారు. కాని స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని తన అనుచరులతో ఆయన మండలాలవారీగా సమావేశం అయిన తరువాత టీడీపీకి గుడ్ బాయ్ చెప్పారు. ఈ నేపధ్యంలో కడియం ఎ పార్టీలో చేరుతారన్న దానిపై ఆసక్తి నెలకొంది.

చిరంజీవి పై సీఐడీ అస్త్రం!

      కేంద్ర పర్యాటక శాఖమంత్రి చిరంజీవికి సీఎం కిరణ్ ఝలక్ ఇచ్చారు. చిరంజీవే లక్ష్యంగా సీఐడీ అధికారులు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కార్యాలయంపై దాడిచేసి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ప్లాట్ల కేటాయింపులో పలు అక్రమాలు జరిగాయని చాలా కాలం కిందటే ఆరోపణలొచ్చాయి. కొన్ని ప్లాట్లను అనర్హులకు కేటాయించారని, పార్కింగ్ స్థలాలను కూడా ప్లాట్లుగా మార్చేశారని అప్పట్లో అన్నారు.   ప్రస్తుత డీజీపీ దినేష్‌రెడ్డి విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న కాలంలోనే ఈ వ్యవహారాలన్నింటిపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అప్పటి నుంచి అది ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. ఉన్నట్లుండి సీఐడీ అధికారులు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కార్యాలయంలో సోదాలు చేశారు. ఎప్పుడో ఏళ్ల క్రితంనాటి వ్యవహారాల్లో సీఐడీ ఇప్పుడు ఎందుకు హడావుడి చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి చిరంజీవికి జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ పరిధిలోనే సొంత ఇల్లు, బ్లడ్‌బ్యాంకు ఉన్నాయి. చిరంజీవి ఇంటివద్ద కొంత భూమిని ఆయన కబ్జా చేసి ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. సొసైటీ కార్యాలయంపై దాడిచేసిన అధికారులు ఆ ఫైలునే ప్రధానంగా టార్గెట్ చేసినట్టు సమాచారం. సీఎం కిరణ్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న చిరంజీవి వర్గాన్ని ఇబ్బంది పెట్టాలనే ఈ చర్యలకు పాల్పడి ఉంటారని పుకార్లు వినిపిస్తున్నాయి.  

న్యాయశాఖా మంత్రి అశ్వినీ కుమార్ రాజీనామా

  రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సాల్ రాజీనామా సమర్పించిన కొన్ని గంటలలోనే న్యాయ శాఖా మంత్రి అశ్వినీ కుమార్ కూడా రాజీనామా చేయడంతో ఈ సారి ప్రజలలే కాకుండా మీడియా కూడా ఆశ్చర్య పోకతప్పలేదు. రేపు ఆదివారం నాడు కాంగ్రెస్ పెద్దలు మరో మారు సమావేశం అయిన తరువాత ఆయన చేత కూడా రాజీనామా చేయించవచ్చునని అందరు భావిస్తున్న సమయంలో హత్తాతుగా ఆయన కూడా తన రాజీనామా పత్రాన్ని ప్రధానికి అందజేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.   కర్ణాటక ఎన్నికలలో బీజేపీ అవినీతిని కడిగి పారేసిన తరువాత, ఇప్పుడు తన పెరట్లోనే అవినీతి మర్రి చెట్టులా శాఖోపశాఖలుగా విస్తరించి తన ఉనికికే ప్రమాదం తెచ్చిపెట్టడంతో కాంగ్రెస్ పార్టీ తప్పనిసరి పరిస్థితుల్లో న్యాయశాఖా మంత్రికి కూడా ఉద్వాసన పలకాలని నిశ్చయించుకొన్నాకనే ఆయన రాజీనామా చేసారు.   ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తాము అవినీతిని సహించమని డప్పుకొట్టుకొనే అవకాశం పొందడమే కాకుండా ఎన్నాళ్ళుగానో చేప్పట్టాలనుకొంటున్న మంత్రివర్గ విస్తరణ లేదా మార్పులు చేర్పులు కూడా జరుపవచ్చునని ఆలోచన. దీనివల్ల మరో ప్రయోజనం ఏమిటంటే, పార్టీలో అసంతృప్తి నేతలకు కూడా ఏవో ఒక పదవులు కల్పించగలిగితే ఎన్నికల ముందు పార్టీలో ఐకమత్యం సాదించవచ్చును.   అయితే కాంగ్రెస్ పార్టీ ఒత్తిళ్ళకి లొంగి ఇద్దరు మంత్రులను తప్పించినంత మాత్రాన్నఅదేమి నిష్కళంక పార్టీ అయిపోదని అందరికీ తెలుసు. ఇద్దరు మంత్రులు రాజీనామా చేయవలసి వచ్చిందంటే దానర్ధం వారిద్దరూ తమ అవినీతిని సమర్ధంగా దాచుకోలేకపోయారని అర్ధం. అంతే తప్ప మిగిలిన మంత్రులందరూ పరిశుద్దాత్మలని చెప్పలేము. దొరికితే దొంగలు లేకుంటే ఎర్రబుగ్గ కార్లలో తిరిగే దొరలు.

రైల్వే మంత్రి బన్సాల్ రాజీనామా

  రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సాల్, తన మేనల్లుడు విజయ్ సింగ్లీ రూ.90లక్షలు లంచం తీసుకొంటూ పట్టుబడటంతో, తప్పని పరిస్థితుల్లో ఈ రోజు తన పదవికి రాజీనామా చేసారు. నిన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరియు ప్రధాని మన్మోహన్ సింగ్ సమావేశం అయిన తరువాత ఆయనను పదవి నుండి తొలగించాలని నిర్ణయం జరగడంతో ఈ రోజు ఆయన తన రాజీనామా పత్రాన్ని ప్రదానికి సమర్పించారు.   ఇక, ఒకవైపు మంత్రుల రాజినామాలకై ప్రతిపక్షాల ఒత్తిడి, మరో వైపు సుప్రీంకోర్టులో చివాట్లు, ఇంకోపక్క తరుముకొస్తున్న ఎన్నికలు అన్ని కలిసి మొత్తం మీద కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి పెంచి చివరికి  రైల్వే మంత్రి రాజీనామాకు దారితీసింది. ఇక మరో బలమయిన కారణం ఏమిటంటే, సుప్రీంకోర్టు చేత చివాట్లు తిన్న తరువాత, అటు సీబీఐలోను, ఇటు ప్రభుత్వంలోను కూడా కొంచెం చలనం వచ్చిందని చెప్పవచ్చును. ఆ కారణంచేతనే సీబీఐ నేరుగా రైల్వేశాఖా మంత్రి కార్యాలయ అధికారులను ప్రశ్నించడానికి దైర్యంగా తన వద్దకు రప్పించుకోంగలిగింది. బహుశః ఆ కారణంగానే ప్రభుత్వం కూడా సీబీఐకి అడ్డు చెప్పలేకపోయింది.   సీబీఐ ఎప్పుడయితే తన అధికారులను ప్రశ్నించడానికి పిలిపించుకొందో, అప్పుడే బన్సాల్ మంత్రిగారికి కూడా జ్ఞానోదయం అయింది. సీబీఐ తీగలాగడం మొదలు పెట్టింది కనక డొంకంతా కదలక తప్పదని ఆయన ముందుగానే అందులోంచి బయటపడాలని రాజీనామా చేసారు. అయితే ఆ డొంకలో తీగలు ఈ రోజు కాకపోతే రేపయినా ఆయన కాళ్ళకు చుట్టుకోకమానావు. రైల్వే బోర్డులో సభ్యుడిగా నియమానికి రూ.10కోట్లు లంచం ఇవ్వబడుతోందంటే, దానిని బట్టి రైల్వే శాఖలో అవినీతి ఏస్థాయిలో వేళ్ళూనుకొని ఉందో అర్ధం అవుతోంది.  

కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య పేరు ఖరారు

  కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య పేరు ఖరారయింది. కొత్తగా ఎన్నికయిన 121 కాంగ్రెస్ శాసన సభ్యులలో 102మంది ఆయనకు మద్దతు పలకడంతో ఆయన పేరు ఖరారు అయింది. బెంగళూరులో కంటీరవ స్టేడియంలో సోమవారం ఉదయం 11.15 గంటలకి ఆయనతో బాటు 15మంది మంత్రులు కూడా పదవీ ప్రమాణం చేస్తారు. సిద్దరామయ్య ఆగస్ట్ 12, 1948వ సం.లో మైసూరులో గల సిద్దరామ హుండీ అనే గ్రామంలో జన్మించారు. 1978లో రాజకీయాలలోకి ప్రవేశించిన ఆయన మొట్ట మొదటిసారిగా 1983లో బీయల్.డీ. అనే పార్టీ తరపున పోటీ చేసి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత జనత పార్టీలో చేరి మళ్ళీ జనతాదళ్(యస్) లో చేరి కొద్ది కాలం దేవగౌడ మంత్రివర్గంలో మంత్రిగా కూడా పని చేసారు.2006లో కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పటి నుండి పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి చేపడుతున్నారు.