తెలంగాణ వల్ల మెదక్ కు లాభం లేదు

      ప్రత్యేక తెలంగాణ వల్ల మెదక్ జిల్లాకు ఎలాంటి లాభం లేదని మెదక్ జిల్లా సంగారెడ్డి ఎమ్మెల్యే, విప్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. సింగూరు, మంజీరా రిజర్వాయర్ లకు కర్ణాటక నుండి నీరు రావాలి. అక్కడ డ్యామ్ లు కట్టడం వల్ల ప్రస్తుతం నీరు రావడం లేదు. తెలంగాణ వచ్చాక ఎక్కడ నుండి నీరు తెస్తారు ? రాష్ట్రం సమైక్యంగానే ఉండాలి అని అన్నారు. మరి తెలంగాణ వద్దంటున్న మీరు టీఆర్ఎస్ నుండే మొదటిసారి గెలిచారని అంటే అది కేసీఆర్ రాజకీయ అవసరాల కోసం పెట్టారని అన్నారు. మెదక్ జిల్లాకు నీరు రావాలంటే తమ జిల్లాను కర్ణాటకలో కలపాలని ఆయన కోరారు. మెదక్ నీటి గురించి అన్ని పార్టీలు నోరువిప్పి మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు.

మోడీ కోసం తవ్విన గోతిలో పడ్డ కాంగ్రెస్

    ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రత్యర్ధి పార్టీల కోసం త్రవ్విన గోతులో తరచూ తానే పడుతూ నవ్వుల పాలవుతోంది. బీజేపీ నరేంద్ర మోడీని ఇంకా తమ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించక ముందే అప్రమత్తమయిన కాంగ్రెస్ పార్టీ, దొరికిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగించుకొంటూ ఆయనని జాతీయ రాజకీయాలలోకి అడుగుపెట్టనీయకుండా చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.   గుజరాత్ లో 2004లో జరిగిన ఒక ఎన్కౌంటర్ లో ఇష్రాద్ జాన్ అనే 19ఏళ్ల యువతితో బాటు మరో ముగ్గురు ముస్లిం యువకులు కూడా మరణించారు. ఇది జరిగి దాదాపు 10సం.ల తరువాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ కేసును తిరగదోడి, దానిపై సీబీఐ విచారణకు ఆదేశించింది. అది భూటకపు ఎన్కౌంటరని బాధితుల కుటుంబాలు ఆరోపిస్తునందునే సీబీఐ విచారణకి ఆదేశించామని కాంగ్రెస్ చెపుతుంటే, ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్నమరో గూడఛార సంస్థ ఇంటలిజన్స్ బ్యూరో మాత్రం ఎన్కౌంటర్ లో మరణించిన వారు నలుగురు మోడీని హత్య చేసేందుకు బయలుదేరిన తీవ్రవాదులే అని, అందులో మరణించిన ఇష్రాద్ జాన్ అనే యువతి మానవబాంబుగా శిక్షణ పొందిందని, ఆ విషయాన్ని అమెరికాలో పట్టుబడ్డ డేవిడ్ హీడ్లీ స్పష్టంగా పేర్కొన్నాడని గట్టిగా వాదిస్తోంది.   కానీ, కేంద్రం ఆదేశంతో రివ్వుమని ఎగురుకొంటూ గుజరాత్ లో వాలిపోయిన సీబీఐ చిలుకలు, చాలా లోతుగా పరిశోధించిన తరువాత అక్కడ జరిగింది ముమ్మాటికి భూటకపు ఎన్కౌంటరేనని, ఈ కుట్రలో గుజరాత్ పోలీసు అధికారులతో బాటు ఇంటలిజన్స్ బ్యూరో అధికారులకి కూడా భాగం ఉందని పేర్కొంటూ, ఇంటలిజన్స్ బ్యూరోకి చెందిన రాజిందర్ కుమార్ అనే సీనియర్ అధికారితో బాటు,అతని క్రింద పనిచేసిన యం.కె.సిన్హా, పీ.మిట్టల్, రాజీవ్ వాన్కడే, అనే మరో ముగ్గురు అధికారుల పేర్లను కూడా తన చార్జ్ షీటులో చేర్చడంతో, కాంగ్రెస్ పని ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారయింది.   ఆ రెండు వ్యవస్థలు తన ఆధీనంలోనే పనిచేస్తున్నపుడు వాటిలో దేనిని ఇప్పుడు వెనకేసుకు వచ్చినా కేసు మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతే గాక, అది బీజేపీకి తనను తప్పు పట్టేందుకు మరో చక్కటి అవకాశం ఇస్తుంది. అలాగని, ఆ రెండు సంస్థలను దేనిపని దానిని చేసుకోనిస్తే రెండూ తమ తమ వాదనలు రుజువు చేసుకొనేందుకు కోర్టులను ఆశ్రయిస్తే పోయేది కాంగ్రెస్ పరువే. పైగా వాటిలో ఏదో ఒక సంస్థ పరిశోధనలో తప్పు జరిగినట్లు రుజువయినప్పుడు కాంగ్రెస్ దురాలోచనలు బయటపడక మానవు.   ఇంటలిజన్స్ బ్యూరో అధికారులు తమ పని కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఉగ్రవాదుల ప్రణాలికల గురించి హెచ్చరికలు జారీ చేయడం వరకే తప్ప వాటిపై ఆయా ప్రభుత్వాలు ఏవిధంగా ప్రతిస్పందించాయి, ఏవిధమయిన చర్యలు తీసుకొన్నాయి వంటి విషయాలతో తమకు ఎటువంటి సంబంధం లేదు గనుక సీబీఐ తమను దోషులుగా చూపాలనుకోవడం చాలా పొరపాటని హోం శాఖకు మోర పెట్టుకొంటోంది.   మరి కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐని ఇంటలిజన్స్ బ్యూరోకి వ్యతిరేఖంగా చార్జ్ షీట్ దాఖలు చేయకుండా ఆపుతుందా? లేక మోడీని ఈ కేసులో బిగించేందుకు ఇంటలిజన్స్ బ్యూరో అధికారులను బలి తీసుకొంటుందా? అనేది త్వరలో తేలవచ్చును. అయితే, కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యర్ధులను రాజకీయంగా దెబ్బ తీయాలనే దురాలోచనతో వేసిన ఈ ఎత్తుకి తానే చిత్తయిపోవడం విడ్డూరం. కాంగ్రెస్ పార్టీ తను తీసిన గోతిలో తనే పడి ఇప్పుడు బయటకి రాలేక విలవిలలాడుతోంది. కానీ ఈ రాజకీయ చదరంగంలో అసలు చనిపోయినవారు నలుగురు అమాయకులేనా? లేక నిజంగానే ఉగ్రవాదులా? జరిగింది నిజమయిన ఎన్కౌంటరా లేక గుజరాత్ పోలీసులే ఈ భూటకపు ఎన్కౌంటర్ కి తెగబడ్డారా? సీబీఐ చెపుతున్న మాటలను విశ్వసించాలా? లేక ఇంటలిజన్స్ బ్యూరో మాటలను విశ్వసించాలా? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని ఎవరూ చెప్పలేరు. రాజకీయ ప్రయోజనాల కోసం సాగుతున్న ఈ చదరంగం ఎప్పుడయినా అటకెక్కవచ్చును.

షిండే మార్క్‌ స్టేట్‌మెంట్‌

      కాంగ్రెస్‌ హైకమాండ్‌ తెలంగాణకు అనుకూలంగా స్టేట్‌మెంట్‌ ఇస్తుందన్న తరువాత హోం మంత్రి షిండే మరో బాంబ్‌ పేల్చారు.. 12న జరిగే కోర్‌ కమిటీ బేటి ఏదో ఒక నిర్ణయం తప్పకుండా వెలువడుతుందని ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజల ఆశలై నీళ్లు చల్లారు..   తెలంగాణ అంశంపై చాలా రోజులుగా సంప్రదింపులు జరుగుతున్నప్పటికీ ఇంతవరకు అధిష్టానం ఎలాంటి నిర్ణయానికి రాలేదన్నారు.. ఇది చాలా సున్నితమైన అంశం అయినందున అంత త్వరగా నిర్ణయం ప్రకటించలేమన్నారు.. షిండే ప్రకటనతో టికాంగ్రెస్‌ నేతలు అయోమయంలో పడ్డారు.. కోర్‌ కమిటీ బేటిలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వస్తుందన్న ఆశతో ఉన్న టీ కాంగ్‌నేతలుకు కోర్‌ కమిటీలో కీలక వ్యక్తి అయిన షిండే ప్రకటన మింగుడు పడటంలేదు.. బయటికి ఇది షిండే వ్యక్తిగత అభిప్రాయమే అంటున్నా లోపల మాత్రం అసంతృప్తిగానే ఉన్నారు.  

పొలిటికల్‌ ఇఫ్తార్‌లు బంద్‌

      రాష్ట్రంలో రంజాన్‌ సందడి మొదలైంది.. అయితే ఈ సమయాన్ని క్యాష్‌ చేసుకోవటానికి పోలిటికల్‌ పార్టీలు కూడా రెడీ అవుతున్నాయి.. ప్రతి సంవత్సరం రంజాన్‌ మాసంలో ముస్లిం సోదరులకు పొలిటికల్‌ పార్టీల తరుపున ఇఫ్తార్‌ విందులు ఇవ్వటం ఆనవాయితిగా వస్తుంది.. అయితే ఈ సారి ఈ విందులకు దూరంగా ఉండాలి భావిస్తున్నారు ముస్లిం మత పెద్దలు.. చట్టవ్యతిరేఖ కార్యకలాపాల ద్వారా సంపాదించిన సోమ్ముతో రాజకీయనాకులు ఇచ్చే ఇఫ్తార్‌ విందులను బహిష్కరించాలని.. వరంగల్‌కి చెందిన జామాయత్‌ ఉల్మా ఐ హింద్‌ ముస్లిం సంస్థ ఫత్వా జారీ చేసే ఆలోచనలో ఉంది. అంతేకాదు కొంత మంది ముస్లిం తప్పని సరి పరిస్థితుల్లో అలాంటి ఇప్తార్‌ విందులకు హాజరు కావాల్సిన పరిస్థితులు వస్తే అక్కడ ఎలాంటి విందు స్వీకరించవద్దంటున్నారు.. ముస్లిం మత పెద్దల నిర్ణయంతో పొలిటికల్‌ పార్టీలన్ని ఆలోచనలో పడ్డాయి.

మెట్రో జాబ్‌ గోల

    రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ శరవేగంగా నడుస్తుంది. అయితే ఇంకా ప్రాజెక్ట్‌ పనులు పూర్తి కాకుండా మెట్రోట్రైన్స్‌లో జాబ్స్‌ కోసం అభ్యుర్దుల ఎదురు చూపులు మొదలయ్యాయి.. 2017 జూలై నుంచి మొదలు కానున్న 72 కిలోమీటర్ల ప్రాజెక్ట్‌ కోసం ఇప్పటికే దరఖాస్తూ చేసుకుంటున్నారు అభ్యర్ధులు..   ముఖ్యంగా ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌చ ఇండస్ట్రీయల్‌ టెక్నికల్‌ ఇన్సిస్టిట్యూట్స్‌కి సంభందించిన చాలా మంది ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసకుంటున్నారు.. అయితే ఇదే అదనుగా భావించిన బ్రోకర్‌లు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ జనం నుంచి అందినంత వరకు లాక్కుంటున్నారు.. ప్రాజెక్ట్‌ మొదలు పెట్టే సమయంలోనే 50000 ఉద్యోగాలిస్తామని ప్రకటించిన ఎల్‌ అండ్‌ టి ఇంతవరకు ఓలాంటి జాబ్‌ నోటిఫికేషర్‌ ఇవ్వలేదు.. అయినా  వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. దీంతో హెచ్‌ఎమ్‌ ఆర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌విఎస్‌ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.. ప్రస్థుతం మెట్రో ప్రాజెక్ట్‌ లో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేవని బ్రోకర్ల మాటలు నమ్మి మోసపోవద్దని చెపుతున్నారు..

రాజన్న మంచోడే కానీ కొడుకు మాత్రం మహా కంత్రి: ఉండవల్లి

  రాజమండ్రీ లోక్ సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రతీ ఏటా రాజమండ్రీలో ఒక సభ నిర్వహిస్తూ, గత సం.కాలంలో తను చేసిన, చేపట్టిన వివిద కార్యక్రమాల గురించి, పార్టీ గురించి, రాష్ట్ర, దేశ వర్తమాన పరిస్థితులు, రాజకీయాల గురించి సవివరంగా ప్రజలకు తెలియజేస్తుంటారు. బుధవారం సాయంత్రం ఆయన తన వార్షిక నివేదిక సభను రాజమండ్రీలో నిర్వహించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “స్వర్గీయ రాజశేఖర్ రెడ్డికి కేవలం తన కొడుకు వలనే అప్రతిష్ట కలుగుతోంది తప్ప ఆయన ఏనాడు అవినీతికి పాల్పడలేదు. ఆయన రాజకీయాలలో పైకి ఎదిగేందుకు చాల శ్రమించారు. కానీ ఏనాడు అక్రమంగా డబ్బు పోగేసుకొందామని ప్రయత్నించలేదు. ఆయన సీబీఐని ప్రతిపక్షాలు కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని నిర్వచించడాన్ని చాల తీవ్రంగా ఖండించారు. (ఈ సందర్భంగా సీబీఐని తప్పుపట్టడాన్ని ఖండిస్తూ ఆయన శాసన సభలో మాట్లాడిన వీడియోని ప్రదర్శించారు.) కానీ, నేడు ఆయన కొడుకు మరియు ఆయన కుటుంబ సభ్యులే సీబీఐని తప్పు పడుతున్నారు. (ఈ సందర్భంగా ఒకనాడు జగన్ మోహన్ రెడ్డి తనపై వస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణకయినా సిద్దమని చెప్పిన వీడియోని ప్రదర్శించారు.)   “ఈ దేశంలో ఒక చట్టం, న్యాయ వ్యవస్థ ఉన్నాయి. దానికి ఎవరూ అతీతులుకారని జగన్ మోహన్ రెడ్డి గుర్తుంచుకోవాలి. అతను చేసిన ఆర్ధిక నేరాలే అతనిని జైల్లోకి పంపించాయి తప్ప కాంగ్రెస్ పార్టీయో మరెవరో కాదని ఆయన బాగా గుర్తుందుకోవాలి. క్విడ్ ప్రో క్రింద అక్రమాస్తులు కూడబెట్టిన జగన్ మోహన్ రెడ్డి తన సంపాదన అంతా సక్రమమేనని, ఒకవేళ క్విడ్ ప్రో క్రింద తానూ లాభాపడ్డానని ఎవరయినా భావిస్తే, అందుకు కారకులయిన మంత్రులందరినీ కూడా జైలుకి పంపాలని కోరడం గమనిస్తే, ఒకవేళ అతని తండ్రి గనుక బ్రతికి ఉంటే అతనిని కూడా జైలుకి పంపమని అడిగేవారేమో?"   "డబ్బై కోట్ల నుండి ఒకేసారి నాలుగు వందల కోట్లు ఆస్తులు పెరిగాయని స్వయంగా పేర్కొన్న జగన్ మోహన్ రెడ్డి, అదంతా సక్రమమని నిరూపించలేకపోవడం వలననే జైలు పాలయ్యాడు తప్ప దానికి ఎవరినో నిందించడం అనవసరం. అవినీతికి పాల్పడిన సత్యం రామలింగ రాజు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, అక్రమాయుధాలు కలిగిన నేరానికి సంజయ్ దత్ వంటి వారు అందరూ కూడా, దేశంలో న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంది గనుకనే చేసిన తప్పులకి శిక్ష అనుభవించారు. ఇది జగన్ మోహన్ రెడ్డి కూడా తెలుసుకోవాలి. ( రాజశేఖర రెడ్డి తన కొడుకు మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు, ఎవరయినా దైర్యంగా న్యాయ వ్యవస్థను ఆశ్రయింఛి న్యాయం కోరవచ్చునని చెప్పిన వీడియోని ఈ సందర్భంగా ప్రదర్శించారు.)

వైకాపాలో దొంగలు పడ్డారు

  వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టయ్యి ఏడాది బట్టి జైల్లో ఉండగా, ఇటీవల ఆయన పార్టీలో చేరిన ఇద్దరు వ్యక్తులు శ్రీధర్ రెడ్డి, నాగ మల్లేశ్వరి వివిధ క్రిమినల్ కేసులలో అరెస్టవడం ఆ పార్టీలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.   రాజమండ్రీకి చెందిన శ్రీధర్ రెడ్డి, అదే ఊరిలో గల బ్యాంకు ఏ.టీ.యం. నుండి తన అనుచరులతో కలిసి రూ.7.32కోట్లు దోచుకోవడమే కాకుండా, ఒక హత్యా నేరంలో కూడా ప్రధాన నిందితుడు. అయితే, అతను ఇటీవలే వైకాపాలో చేరడంతో ఏ.టీ.యం. నుండి దోచుకొచ్చిన డబ్బుతో, రాజమండ్రీలో పార్టీ కార్యాలయం ఆరంభించడమే కాకుండా, షర్మిల పాదయాత్ర దారిపొడవునా బ్యానర్లు, భారీ కటవుట్లు ఏర్పాటు చేసాడు. అందుకోసం అతను విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసాడు. అప్పటికే అతని మీద కన్నేసిన పోలీసులు అతని జోరు చూసి విచారిస్తే నిజం బయటపడటంతో అతనిని అరెస్ట్ చేసారు. అయితే, ఆ వ్యక్తితో తమ పార్టీకెటువంటి సంబంధం లేదని వైకాపా నేతలు వెంటనే ప్రకటించారు.   కానీ, ఆ పార్టీకి చెందిన మరో కార్యకర్త నాగ మల్లేశ్వరి కూడా భారీ ఎత్తున దొంగనోట్లు చలామణీ చేస్తుండగా పోలీసులు పట్టుకోవడంతో వైకాపా మరోమారు ఇబ్బందికర పరిస్థితుల్లో ఇరుకొంది. ఆమెతో కూడా తమ పార్టీకి ఎటువంటి సంబంధము లేదని వెంటనే ప్రకటించవలసి వచ్చింది.   వైకాపాను మనస్పూర్తిగా ద్వేషించే కాంగ్రెస్ నేత వీ.హనుమంత రావు, తెదేపా నేత రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా వైకాపా దొంగలు బందిపోట్లు తో నిండిన పార్టీ అని ఎద్దేవా చేసారు. రేవంత్ రెడ్డి మరో అడుగు ముందుకు వేస్తూ షర్మిల పాదయత్రకి ఎవరెవరు ఎంత డబ్బు సమకూరుస్తున్నారు? అది ఎక్కడి నుంచి వస్తోంది? మొదలయిన విషయాలపై పోలీసులు విచారణ చేయాలని డిమాండ్ చేసారు.   ఈ రెండు సంఘటనలలో నిజానికి వైకాపా తప్పు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే పార్టీలో చేరే సాదారణ కార్యకర్తల గత చరిత్రలను ఏ రాజకీయ పార్టీలు లోతుగా విచారించావు. అందువల్ల ఇటువంటి నేర చరితులు అన్నిపార్టీలలో సభ్యులుగా చేరే అవకాశం ఉంది. అటువంటప్పుడు వైకాపాను అంత తీవ్ర విమర్శలు చేయవలసిన అవసరం లేదు. నిజానికి సామాన్య కార్యకర్తలకంటే ఉన్నత స్థానానికి ఎదిగిన రాజకీయ నేతలే ఎక్కువ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారనే సంగతి అందరికీ తెలిసిందే. అందువల్ల అటువంటి బడా నేతలు దొరకనంత కాలం దొరలుగా చలామణి అవుతున్నారు.

సుప్రీం కోర్టు సంచలనాత్మక తీర్పు

  ప్రజాప్రయోజన వ్యాజ్యం క్రింద దాఖలు చేయబడిన ఒక ప్రైవేట్ పిటిషను విచారణకు చేపట్టిన సుప్రీం కోర్టు ఈ రోజు సంచలనాత్మకమయిన తీర్పు వెలువరించింది. ఇంతవరకు క్రిమినల్ కేసుల్లో దోషులుగా నిర్దారించబడిన ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధ్య చట్టంలో సెక్షన్ 8(4) నిబందన క్రింద పై కోర్టులకి అప్పీలుకి వెళ్ళడం ద్వారా అనర్హత వేటు నుండి తప్పించుకొంటున్నారు. ఈ రోజు సుప్రీం కోర్టు తీర్పు వెలువరిస్తూ రాజ్యాంగంలో ఈ నిబంధన న్యాయ సమ్మతం కాదని తేల్చి చెప్పింది. నేరం జరిగిన సమయం నుండే ప్రజా ప్రతినిధులకు అనర్హత వర్తిస్తుందని పేర్కొంది. అంటే ఎవరయినా ఒక ప్రజాప్రతినిధి నేరం చేసినట్లు ప్రాధమికంగా రుజువయితే, కోర్టు కేసులతో సంబంధం లేకుండా అతను లేదా ఆమెపై అనర్హత వేటు వేయవచ్చునని విస్పష్టంగా చెప్పింది. న్యాయ మూర్తులు యస్.జే.ముఖోపాద్యాయ, ఏకే.పట్నాయక్ లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. అయితే, ఈ తీర్పు వెలువరించే నాటికి ఉన్నత న్యాయ స్థానాలను ఆశ్రయించిన ప్రజాప్రతినిదులకి ఈ తీర్పు వర్తించదని పేర్కొంది.

త్యాగమూర్తులకే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి

  దేవుడి దగ్గరకు వెళ్ళినా కూడా రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు మాత్రమే కోరుకొనే త్యాగామూర్తులయిన నేతలు మనకున్నారు. రాష్ట్రం విడిపోకుండా ఉండాలని, ప్రజలందరూ కలిసి మెలిసి సుఖంగా ఉండాలని కోరుకొన్నట్లు మన బొత్స బాబు శలవిచ్చారు.   “కొందరికి పదవులు ఏర్పరిచేందుకే రాష్ట్రం విడగొట్టబడుతున్నట్లయితే, నేను నా మంత్రి పదవిని, పీసీసీ అధ్యక్ష పదవిని కూడా త్యాగం చేసిపడేస్తానని” ఒకే ఒక పంచ్ డైలాగుతో, సమైక్యంగా ముఖ్యమంత్రి పదవి రేసులో ముందుకు దూసుకుపోతున్న లగడపాటి, రాయపాటి, వెంకటేష్, శైలజానాథ్ వంటి వారి కంటే అన్నివిధాల తానే పెద్ద త్యాగ మూర్తినని, అందువల్ల కొత్తగా ఏర్పడబోయే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కుర్చీకి తనే బాగా సూటవుతానని బొత్స చెప్పకనే చెప్పారు.   “ఇక రాష్ట్రం విడిపోయిన తరువాత నాకీ రాజ్యసభ సీటేందుకు, విశాఖ లోక్ సభ సీటు మాత్రం ఎందుకు? దాని మీద ముచ్చటపడుతున్న పురందేశ్వరికే నా సీటు ఇచ్చేస్తాను. ముప్పై ఏళ్లుగా దేశానికి, రాష్ట్రానికి, విశాఖ నగరానికి ఎనలేని సేవలందిస్తున్న నేను, కొత్తగా ఏర్పడుతున్న ఆంద్ర రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రి గా నావంతు సేవలు నన్ను చేసుకోనీయండి” అని సుబ్బిరామిరెడ్డి అంటే, “అసలు ఇంతపెద్ద సమైక్య రాష్ట్రాన్నిఒంటి చేత్తో ఏలుతున్న నా సంగతి మరిచిపోయి మీలో మీరే పోటీలుపడుతూ నా కుర్చీలో కర్చీఫ్ వేసేస్తానని ఈ ముసుగులో గుద్దులాటలేమిటి? అసలు నేనొకడిని ఉన్నానని మరిచిపోయారా?” అంటూ అప్పుడు ఒరిజినల్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ చిరాకు పడటం ఖాయం.   ఇక రాష్ట్రం విడిపోతే తెలంగాణా వారికి ఎవరు ముఖ్యమంత్రి కావాలనేదే ప్రశ్న. కానీ ఆంధ్ర రాష్ట్ర నేతలకి మాత్రం రాజధాని ఎక్కడ పెట్టుకొంటే తమ రియల్ వ్యాపారాలకు లాభసాటిగా ఉంటుందనే మరో పాయింటు కూడా ఉంది.   రాజధానిని విశాఖలో పెట్టుకొంటే ఉత్తర కోస్తా జిల్లాలలో తన వ్యాపార కార్యక్రమాలన్నీ మూడు పూలు ఆరు కాయలుగా చేసుకోవచ్చునని ఆ జిల్లాలకు చెందిన కొందరు నేతలు ఆలోచిస్తుంటే, “కొత్త రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న విజయవాడని, రాజమండ్రీని కాదని ఎక్కడో మారు మూల ప్రాంతంలో పెడితానంటే ఎలా?” అని అక్కడి రాజకీయ వ్యాపారవేత్తలు అభ్యంతరం చెప్పడం ఖాయం.   “అయినా అంగుళం భూమి కూడా ఖాళీ లేని ఆ ఊళ్లలో రాజధాని ఏర్పాటు చేయడం అసలు సాధ్యమేనా? మా ఒంగోలు నేతలు అమాయకులు, నిస్వార్ధపరులు గనుక ఇక్కడ ఇంకా ప్రభుత్వ భూములు కొన్ని మిగిలే ఉన్నాయి. గనుక ఇక్కడే బెస్ట్” అని అక్కడి నేతల వాదన. “ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు మా కర్నూలుకి హ్యాండిచ్చి హైదరాబాదుకి రాజధాని పట్టుకొనిపోయారు. అప్పటి నుంచి వేసిన గొంగళి వేసిన చోటనే పడి ఉంది. గనుక కనీసం ఇప్పుడయినా మా రాజధాని మాకిచ్చేస్తే మా ప్రాంతం కొంచెం డెవెలప్ అవుతుందని” కర్నూల్ నేతల వాదన.   “తిరుపతిలో పెట్టుకొంటే మన రాష్ట్రానికి ఆ స్వామివారి కృప బాగా ఉంటుంది. గనుక కొత్త రాజధాని ఇక్కడే ఏర్పాటు చేయాలని” మరికొందరి వాదన.   అందుకే రోడ్డు మ్యాపు చేతిలో ఉండగానే అన్నీ చక్కబెట్టుకోవలన్నారు పెద్దలు.

మిస్‌ అయిన వారి లెక్కతేల్చండి

  కేధారనాధుడి సాక్షిగా ప్రకృతి సృష్టించిన విలయం ఇంకా కన్నీళ్లు కురిపిస్తూనే ఉంది. వేల మంది ప్రాణాలు విడిచిన ఈ మహావిపత్తులో ఇంకా ఎంతో మంది సర్వం కోల్పోయారు.. ప్రాణాలకు తెగించి సైన్యం అందించిన సహాయక చర్యల్లో లక్షమందికి పైగా సురక్షిత ప్రాంతాలకు చేరినా ఇంకా వేల మంది జాడ తెలియ రావటం లేదు. అయితే ఈ విషయంలోనే అధికారులు నాయకులు ఇస్తున్న స్టేట్‌మెంట్‌కు పొంతన లేకుండా ఉంది.. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం 400 మంది మాత్రమే మిస్‌ అయ్యారని తెలుస్తుంది.. అయితే ఇందుకు భిన్నంగా నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ వైస్‌ చైర్మన్‌ శశిదర్‌రెడ్డి మాత్రం 11,600 మంది వరకు మిస్‌ అయ్యారని ప్రకటించారు. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం మాత్రం వివిధ రాష్ట్రాలనుంచి తమకు అందించిన సమాచారం ప్రకారం కోర్టుకు అందించిన ఎఫ్‌ ఐ ఆర్‌లో 4000 మంది మాత్రమే మిస్‌ అయ్యారని తేల్చింది.. కాని ఓ ప్రైవేట్‌ సంస్థ ద్వారా అందించిన సమాచారం ప్రకారం ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందంటున్నారు. వీలైనంత త్వరగా ఆ లెక్కలను తేల్చి సాయం అందిచాల్సిందిగా కోరుతున్నారు బాధితులు..

ఫ్యాక్షనిస్ట్‌ల ఆస్తుల అటాచ్‌మెంట్‌

  దేశంలోనే మొట్టమొదటి సారిగా ఫ్యాక్షనిస్ట్‌ల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు రంగం సిద్దం అవుతుంది.. పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో ఈ సారి భారీగా నగదు చేతులు మారుతుందని భావించిన పోలీస్‌ యంత్రాంగం ఫ్యాక్షన్‌ ప్రబావిత ప్రాంతాలపై ప్రత్యేకం దృష్టి పెట్టింది. ముఖ్యంగా కర్నూల్‌ జిల్లా ఎస్పీ కె రఘురామిరెడ్డి అందుకు సంభందించిన ప్రణాలికను కూడా సిద్దం చేశారు.. అక్కడ జరగబోయే పంచాయతి ఎలక్షన్స్‌లో ఫ్యాక్షనిస్ట్‌ హావా తగ్గించి ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్స్‌ జరిపించటం కోసం వాళ్ల అక్రమాస్థులపై దృష్టి పెట్టారు.. అందుకోసం ఇప్పటికే సిబి సిఐడి నివేదిక పంపిన ఎస్‌పి మనీ లాండరింగ్‌ యాక్ఠ్‌ కింద ఆదాయానికి మించి ఆస్తులు వున్న వ్యక్తుల పై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. మరి ఎస్‌పి రఘురామి రెడ్డి చేయాలనుకుంటున్న ఈ అటాచ్‌మెంట్‌లు ఎంత వరకు సజావుగా సాగుతాయో చూడాలి..

బొత్స నాలుకకు నరం ఉందా?

  మూడు నాలుగు రోజుల క్రితం రాష్ట్ర విభజన కొరకు రోడ్డు మ్యాప్ చేతిలో పట్టుకొని డిల్లీలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులందరినీ కలుస్తూ హడావుడిగా తిరిగిన పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ, నిన్నతిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ “రాష్ట్రం విడిపోకుండా కలిసి ఉండాలని తానూ దేవుడ్ని ప్రార్దించినట్లు” తెలిపారు. “కేవలం కొంత మంది రాజకీయ నేతలకి మంత్రి పదవులు ఏర్పాటు చేసేందుకే రాష్ట్ర విభజన జరుగుతున్నట్లయితే, నేను నా మంత్రి పదవిని, పీసీసీ అధ్యక్ష పదవిని కూడా వదులుకోవడానికి సిద్దం. కుటుంబ పెద్ద తన కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉండాలని కోరుకొంటున్నట్లే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని నేను కోరుకొంటున్నాను. అయితే, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాను.” అని అన్నారు.   ఇంత కాలం “హిందీ వాళ్ళకు పది రాష్ట్రాలుండగా తప్పు లేనిదీ, తెలుగు వాళ్ళకు రెండు రాష్ట్రాలుంటే తప్పేమిటి?” అని వాదిస్తూ వచ్చిన బొత్స కధ క్లైమక్సుకు వచ్చిన తరువాత ఈవిధంగా రెండు నాలికలతో మాట్లాడటం అటు తెలంగాణా ప్రజలకు, ఇటు సీమంధ్ర ప్రజలకు కూడా ఆగ్రహం తెప్పిస్తోంది.   రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెపుతూనే అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పడం చూస్తే ఆయన ప్రస్తుతం సీమంద్రాలో క్రమంగా రగులుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాలను దృష్టిలో ఉంచుకొని చేసినవిగానే భావించవచ్చును. తద్వారా తనకు రాష్ట్రం విడిపోవడం ఇష్టం లేదని చెపుతూ వారి మనసులు గెలుచుకోవాలని ప్రయత్నిస్తూనే, మరో వైపు అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పడం ద్వారా తెలంగాణా నేతలని కోపం రాకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్ధం అవుతోంది. అయితే, ఇటువంటి రెండు నాల్కల ధోరణి వల్ల ఆయన ఆశించిన విధంగా ఎవరూ మెచ్చుకోకపోగా ఆయన ధోరణిని ఖండిస్తున్నారు.

బలంగా వినిపిస్తున్న సమైక్యగాణం

  కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రత్యేక తెలంగాణ దిశగా అడుగులు వేస్తుండటంతో రాష్ట్రంలో సమైఖ్యగాన్ బలంగా వినిపిస్తుంది.. ఇన్నాళ్లు ఎలాంటి స్టేట్‌మెంట్‌లు ఇవ్వని నాయకులే కాదు.. తెలంగాణ ఇచ్చిన పర్లేదు అన్న బోత్సా లాంటి నాయకులు కూడా ఇప్పుడు యు టర్న్‌ తీసుకున్నారు. తెలంగాణ ఎర్పాటుకు రోడ్‌ మ్యాప్‌ సిద్దం చేయాలంటూ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌ సియం,పిసిసీ చీఫ్‌లను కోనడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. చాలా రోజులు స్థబ్ధుగా ఉన్న సమైఖ్య వాదులు మళ్లీ గళం విప్పారు.. ఇప్పటికే రాయలసీమ వైఎస్‌ఆర్‌ సిపికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేయగా తాజాగా మరో ఎమ్మెల్సీ షేక్‌ హుస్సేన్‌ కూడా రాజీనామ చూశాడు.. రాష్ట్రం సమైఖ్యం ఉంచాలని కోరుతూ ప్రదర్శనలు చేపట్టిన విద్యార్థి జేఎసి, పురందరేశ్వరికి చీర సారే తో పాటు, సుబ్బిరామిరెడ్డికి కమండలం,రుద్రాక్షలు పంపి నిరసన తెలిపారు.. ఇదిలా ఉంటే టికాంగ్రెస్‌ నాయకులు తెలంగాణ ఏర్పాటుకు సర్వం సిద్దం అయిందంటుంటే.. సీమాంద్రనాయకులు మాత్రం రాష్ట్ర పరిస్థితుల్లోనూ విడిపోయే ప్రసక్తి లేదంటున్నారు.. ఈ నేపధ్యంలో సియం, పిసిసి చీఫ్‌లకు అధిష్టానం నుంచి పిలుపు రావడం ప్రదాన్యత సంతరించుకుంది.. ఈ నెల 12న జరగబోయే కోర్‌కమిటీ బేటిలో తెలంగాణ విషయాన్ని తేల్చేస్తాం అంటున్నా కాంగ్రెస్‌ ఎంత వరకు మాట నిలుపుకుంటుందో చూడాలి..

కేరళ సియం చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

  కేరళ సీఎం ఊమెన్ చాందీని సోలార్ ప్యానెల్ స్కాం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం చాందీపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. చాందీ తక్షణమే సీఎం పదవి నుంచి తప్పుకోవాలంటూ ఎల్డీఎఫ్ సహా ప్రతిపక్షాలు అసెంబ్లీని స్తంబింపజేశాయి. ఊమెన్‌ చాందీ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అటు అసెంబ్లీని సైతం ప్రతిపక్షాలు అట్టుడుకించాయి. స్కాంలో నిందితులుగా ఉన్న సరితా నాయర్‌, రాధాక్రిష్ణన్‌, శాలు మీనన్‌తో సీఎం చాందీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించాయి. ఎల్డీఎఫ్‌ కార్యకర్తలు అసెంబ్లీ ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సీఎం చాందీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అసెంబ్లీలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జితో నిరసనకారులను చెదరగొట్టారు. అయితే పరిస్థితి చేయిదాటుతుందని గమనించిన చాందీ విచారణకు అంగీకరించారు.. దానితో పాటు తప్పని సరి అయితే రాజీనామకు కూడా వెనుకాడనని ప్రకటించారు. ఈ స్టేట్‌మెంట్‌ ఇచ్చిన కొద్ది సేపటికే చాందీ మళ్లీ మాట మార్చారు.. ఆ కుంభకోణంతో తనకెలాంటి సంభందం లేదని ప్రస్థుతానిక రాజీనామా యోచన లేదని తేల్చేశారు దీంతో మరోసారి ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్‌ హైకమాండ్‌తో పాటు మిత్రపక్షమైన యుడీఎఫ్‌ కూడా మద్దతుగా నిలవటంతో చాందీ మాటర్చినట్టుగా భావిస్తున్నారు..అయితే ప్రస్థుతానికి గండం గట్టెక్కినా చాందీ చుట్టూ ఉచ్చు మరింత బలంగా బిగుసుకునే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు..

వస్తున్నాయ్‌ వస్తున్నాయ్‌ జగన్నాధ్ రథచక్రాల్‌

  వస్తున్నాయ్‌ వస్తున్నాయ్‌ జగన్నాధ్ రథచక్రాల్‌ అన్నాడు మహాకవి శ్రీశ్రీ.. నిజంగా పూరి వేదికగా జరిగే ఉత్సవాలలో ఈ రోజు నుంచి జగన్నాథ రథ చక్రాలు కథలనున్నాయి.. అందుకు సంభందించిన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు కల్పిస్తోంది. తొమ్మిదిరోజుల పాటు కన్నులపండువగా వేడుకలను నిర్వహించనుంది. అటు అహ్మదాబాద్‌ లోనూ ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గుజరాత్‌ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.   ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ యాత్రకు సర్వం సిద్ధం అయ్యింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 18 వరకు తొమ్మిది రోజుల పాటు ఈ రథయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించేదుకు ప్రభుత్వం సిద్ధమయ్యింది.. ఆ వైభోగాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా పూరీ చేరుకుంటున్నారు. యాత్ర ప్రారంభమైన క్షణం నుంచి రథం గమ్యస్థానం చేరేవరకు ముందుకు సాగుతూనే ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆపరాదని ఆలయ నిబంధనలు చెబుతున్నాయి. జాతి, కుల, లింగ వివక్ష లేకుండా అందరూ రథోత్సవంలో పాల్గొంటారు. స్వయంగా భక్తులే రథాన్ని లాగే అవకాశం ఉండటంతో ఈ వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులు పోటిపడతారు. జగన్నాథుని సేవలో పాల్గొని పునీతులౌతారు. ఏటా ఆషాడ శుద్ద విదియనాడు ప్రారంభమయ్యే రథయాత్ర ఏకాదశి వరకు నిరంతరంగా కొనసాగుతుంది. స్థానిక రాజ వంశస్థులైన గజపతుల ప్రథమ హారతితో ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. బలభద్ర, జగన్నాథ, సుభద్ర వేర్వేరు రథాలపై భక్తులకు దర్శనమిస్తారు. ముగ్గురు దేవతలు జన్మించిన ప్రాంతంగా భావించే అడప మండపం వద్ద బస చేసి తొమ్మిదవ రోజున తిరుగు ప్రయాణం అవుతారు. ఇతర ఆలయాల్లో ఉత్సవ విగ్రహాలను ఆలయ వీధుల్లో ఊరేగిస్తే.. పూరీలో అందుకు విరుద్ధంగా మూల విగ్రహాలనే ఊరేగింపుగా భక్తుల వద్దకు తీసుకెళ్తారు. అటు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోనూ ఈ రథయాత్రను కన్నుల పండువగా నిర్వహించనున్నారు. ఈ మేరకు మోడీ సర్కారు భారీ భద్రతను ఏర్పాటు చేసింది. అలాగే హైదరాబాద్‌లోని పూరి జగన్నాధ్‌ స్వామి ఆళయంలో కూడా ఈ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.. పూరిని తలపించేలా రథాలను ముస్తాబు చేసిన జగన్నాథ స్వామి ఊరేగింపుకు సిద్దం చూశారు..

తెలంగాణ మొదటి ముఖ్యమంత్రులము మేమే

  కాంగ్రెస్ తెలంగాణా ఇస్తుందో లేదో తెలీదు గానీ, అటు కొత్త రాష్ట్రం ఏర్పడితే ఎవరు ముఖ్యమంత్రి కావాలని టీ-కాంగ్రెస్ నేతలు ముసుగులో గుద్దులాట మొదలయిపోయింది.   ఖాళీగా పడున్న హోంమంత్రి మంత్రి సీటులో కూర్చొని ముచ్చట తీర్చుకోవాలనుకొంటే అడ్డుపడిన ఈ కిరణ్ కుమార్ కి బుద్ది చెప్పాలంటే, ఒక మంచి రోడ్డు మ్యాపు గీసుకొని ఏకంగా ముఖ్యమంత్రియి పోవడమే బెటరు అనుకొంటూ దామోదర చేతిలో ఉన్న రంగు పెన్సిళ్ళతో గడ్డం గోక్కొంటూ మ్యాపులు గీసుకొంటున్నాడు.   రేపు రాష్ట్రం ఏర్పడితే అప్పుడు ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయమన్నపుడు టైము ఉంటుందోలేదోనని ముందుగానే సూటు కూడా కుట్టించుకొని వేసుకు తిరుగుతున్నాను.అసలు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణా ఉద్యమాన్నిబ్రేకులు వేస్తూ ముందుకు, వెనుకకి, పక్కకి అన్ని డైరెక్షన్లలో తీసుకువెళ్తున్న వాడిని నేనే. అయినా ఎవరికీ నేను కనబడటం లేదు. ఇక నా ప్రయత్నాలేవో నేను చేసుకోక తప్పేలా లేదనుకొంటూ జానారెడ్డి మీడియా వాళ్ళని పిలిచి “ముఖ్యమంత్రి పదవి కంటే తెలంగాణాయే నాకు ముఖ్యం’ అని ఒక స్టేట్మెంటు ఇచ్చేరు. అప్పుడు మీడియా వాళ్ళ ‘అయితే మీకు ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తి లేదా?’ అని అడిగితే, ‘ముందు తెలంగాణా రానీయండి’ అని తన మనసులో మాట చెప్పేశారు.   ‘హోంమంత్రి పదవి ఇస్తారంటే ఆశపడి ఇన్ని రోజులు తెలంగాణా గురించి మాట్లాడకుండా ఆ ఆంధ్రా ముఖ్యమంత్రి నించోమంటే నించొన్నాము, కూర్చోమంటే కూర్చోన్నాము. కానీ మాయమాటలు చెపుతూ చివరికి అది కూడా తన దగ్గిరే అట్టేపెట్టేసుకొన్నాడు. మా రాష్ట్రం మాకొస్తే అప్పుడు నేను ముఖ్యమంత్రినయినప్పుడు గానీ అతనికి నా గొప్పదనం తెలిసిరాదు, అని బాబ్డ్ హెయిర్ సవరించుకొంటూ గీతా రెడ్డమ్మ చరచరా వెళ్లిపోతుంటే, ఆమెని చూసి మూతులు తిప్పుకొన్నారు మిగిలిన రెడ్డమ్మలు.   ముఖ్యమంత్రి పదవికి ప్రధాన అర్హతలయిన ‘దళిత కోటా’, ‘మహిళా కోటా’ ‘ఉద్యమ కోటా’ లేదా ఈ మూడింటి కాంబినేషనులో ‘దళిత మహిళా ఉద్యమ నేత’లుగా ఏవిధంగా చూసుకొన్నా కూడా అన్ని విధాల అర్హతలున్న తమకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే తామేమి (మట్టి) గాజులు తొడుకొని కూర్చోబోమని, (మొన్నబంగారం ధర తగ్గినప్పుడు కొనుకొన్న) కొత్త బంగారు గాజులను సవరించుకొంటూ రుసరుసలాడుతున్నారు మిగిలిన రెడ్డమ్మలు.   ఆంద్రోళ్ళ ఇస్టోరీ తరువాయి భాగంలో....  

ప్రధాని అభ్యర్ధి మోడినే

      మోడి పట్టాభిషేకానికి ఒక్కటొక్కటిగా అడ్డంకులు తొలగుతున్నాయి.. ఇటీవల ప్రచార సారధిగా బాధ్యతలు చేపట్టి మోడి పార్టీలో తన పట్టును మరింత పెంచుకోవటానికి పావులు కదుపుతున్నారు.. అందుకు తగ్గట్టుగానే పార్టీ పెద్దలు చాలా మంది మోడికి మద్దతుగా నిలుస్తున్నట్టు సమాచారం..   అయితే చాల రోజులుగా ఎన్డీఏ ప్రదాని అభ్యర్థి మోడినే అన్న వాదం బలంగా వినిపిస్తున్న ఇంత వరకు పార్టీ వర్గాలు మాత్రం ఆ విషయాన్ని ద్రువీకరించలేదు.. అయితే ఎన్నికల సమయం మరింత దగ్గరపడుతుండటంతో ఈ నెలాఖరు వరకు మోడినే ప్రదాని అభ్యర్థిగా ప్రకటిస్తారంటున్నాయి పార్టీ వర్గాలు..         అంతే కాదు వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో మోడి ఎంపిగా పోటి చేయనున్నారని కూడా అంటున్నారు. అందుకోసం ఇప్పటికే నియోజిక వర్గాన్ని కూడా ఎంచుకున్నారట.. బలమైన హిందూ వాదిగా పేరున్న మోడి ఏదైనా హిందూ దార్మిక స్థలం నుంచి పోటి చేయాలనుకుంటున్నాడట..         ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం వారణాసి నుంచి మోడి పోటి చేయాలని భావిస్తున్నాడట. బిజెపి కంచుకోటగా భావించే ఈ ప్రాంతం నుంచి ప్రస్థుతం మురళి మనోహర్‌ జోషి ప్రతినిధ్యం వహిస్తున్నారు..         ప్రస్థుతానికి ఇవన్నీ ఊహాగానాలుగా కొట్టిపారేసిన ఎన్డీఎ భవిష్యత్తు దృష్ట్యా త్వరలోనే మోడిని ప్రదాని అభ్యర్థిగా ప్రకటించటం మాత్రం కాయం అంటున్నాయి పార్టీ వర్గాలు..