విద్యార్దుల మనసులలో విషబీజాలు నాటుతున్న ఉద్యమాలు
posted on Jul 4, 2013 @ 8:10PM
సీమంధ్ర ప్రజలను ద్వేషిస్తున్న నోటితోనే, తెలంగాణా ఏర్పడితే అక్కడ స్థిరపడిన సీమాంధ్రా ప్రజల ధన,మాన, ప్రాణాలకి, ఉద్యోగాలకి, వ్యాపారాలకీ ఎటువంటి ముప్పు ఉండదని, అందుకు తాము పూచీ అని తెరాస నేతలు గట్టిగా చెపుతుంటారు. అయితే, వారు తెలంగాణా ఉద్యమం పేరిట నేర్పిన విద్వేష పాఠాలు బాగా వంట బట్టించుకొన్న కొందరు, స్థానికేతరుల మీద విషం చిమ్మడం మొదలుపెట్టారు.
మొన్న సోమవారం నాడు, నిజాం కాలేజీలో ఉస్మానియా పీజీ కోర్సులలో ప్రవేశం కొరకు జరిగిన ఓయు కామన్ ఏంట్రాన్స్ టెస్ట్ కౌన్సిలింగ్ కోసం వచ్చిన స్థానికేతర విద్యార్ధులను కొందరు తెలంగాణా విద్యార్దులు అడ్డగించి వెనక్కి తిప్పి పంపేసారు. ఏ విశ్వవిద్యాలయంలోనైనా స్థానికేతరులకు 15 శాతం కోటా ఉంటుంది. మెరిట్ ఆధారంగా ఈ సీట్లు భర్తీ చేయబడుతాయి. దానికి స్థానికులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చును. దానికి దరఖాస్తు చేసేందుకు వచ్చిన స్థానికేతర విద్యార్ధులను కొందరు తెలంగాణా విద్యార్దులు అడ్డుకొని తిప్పి పంపేసారు.
ఇది ఈ రోజు కొత్తగా మొదలయిన సమస్యేమి కాదు. గత మూడు నాలుగేళ్ల నుండి ఉస్మానియాలో ఇదే తంతు నడుస్తున్నా ఎవరూ పట్టించుకొనే నాధుడు లేదు. మొన్న సోమవారం నాడు కూడా మళ్ళీ అదే తంతు జరుగుతున్నపుడు అక్కడే ఉన్న పోలీసులు కానీ, విశ్వవిద్యాలయ అధికారులు గానీ కలుగజేసుకోలేదు. కళ్ళ ముందు జరుగుతున్నఅన్యాయాన్ని చూస్తూ కూడా, విద్యార్ధులెవరూ తమకు పిర్యాదు చేయలేదని చేసినట్లయితే తగిన చర్యలు తీసుకొంటామని ఉస్మానియా వైస్ చాన్సిలర్ ప్రొఫసర్.సత్యనారాయణ చెప్పడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.
అదే విధంగా మొన్న ‘నమస్తే తెలంగాణా పత్రిక’ సీమంద్రా లో ఆత్మీయ యాత్ర చేపట్టినపుడు, అమలాపురంలో కొందరు సీమాంధ్ర యువకులు వాహనాన్ని అడ్డుకొని, పత్రిక ప్రతులను తగుల బెట్టారు. ఈవిధంగా ఇతరుల అభిప్రాయాల పట్ల అసహనం చూపడం వలన మరింత విద్వేషం పెరుగుతుందే తప్ప వేరే ప్రయోజనం ఉండదు.
నేడు ఉస్మానియాలోనో లేక కాకతీయాలోనో లేక ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనో చదువులు పూర్తి చేసుకొన్నవిద్యార్ధులు రేపు ఉన్నత చదువులకి లేదా ఉద్యోగాలకి ఇతర రాష్ట్రాలకి, దేశాలకి వెళ్లి నప్పుడు వారికి అక్కడ ఇదే అనుభవం ఎదురయితే ఏవిధంగా ఉంటుందో ఆలోచించి ఉంటే వారు ఈవిధంగా చేయరు. స్వార్ధ రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం అనేక ఉపదేశాలు చేస్తుంటారు. అయితే, భావి భారతాన్ని నిర్మించాల్సిన విద్యార్దులు అటువంటి ఉపదేశాలకు లొంగిపోకూడదు.
వేయి మంది తెలంగాణా యువకులు తమ బలిదానాలతో కన్నవారికి ఆగర్భశోకం మిగిల్చితే, నేడు దానికి కారకులయిన మహానుభావులు ఎన్నికలు ఓట్లు, నోట్లు సీట్లు అని రాజకీయాలు చేసుకొంటున్నారు. అటువంటి స్వార్ధ రాజకీయ నేతల మాటలకి లొంగిపోయి విద్యార్ధులు బలిదానాలు చేసుకోవడం, సాటి విద్యార్ధులపట్ల విద్వేషం వెళ్ళగక్కడం సబబు కాదు. విద్యార్ధులు రాజకీయ నాయకులకి ఆదర్శంగా నిలవాలి తప్ప రాజకీయ నాయకులని ఆదర్శంగా తీసుకోరాదు.
ఉడుకు రక్తం గల విద్యార్దుల భావోద్వేగాలు రెచ్చగొట్టి ఉద్యమాల బాట పట్టించిన సదరు నేతలు తమ రాజకీయ భవిష్యత్ నిర్మించుకొంటుంటే, విద్యార్ధులు మాత్రం తమ చదువులను, భవిష్యత్తుని, చివరికి ప్రాణాలను కూడా త్యాగాలు చేస్తున్న సంగతి గుర్తుంచుకొంటే, తాము రాజకీయ నేతల చేతిలో పావులుగా వాడుకోబడుతున్నామని అర్ధం అవుతుంది.
నేడు రాష్ట్రం సమైక్యంగా ఉంది. రేపు విడిపోవచ్చును. కానీ, మనుషులు ఎక్కడ ఉన్నా మానవత వెల్లివిరియాలి. మానవత్వం, వివేకం లేని విజ్ఞానం ఎంత ఉన్నామనిషి మనిషిగా చెప్పుకోవడానికి అర్హత ఉండదు. భావి భారతాన్ని నిర్మించవలసిన విద్యార్దులు సంకుచిత భావాలు విడనాడి మనమంతా భారతీయులమనే విశాల దృక్పధం అలవరుచుకోవాలి.