బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి శంకర్రావు

      కోడలి వేధింపుల కేసులో అరెస్టయిన మాజీ మంత్రి శంకర్రావును సీసీఎస్ పోలీసులు ఈ ఉదయం ఉస్మానియా ఆసుపత్రి నుండి బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి తరలించారు. నిన్న అరెస్టయిన ఆయన స్పృహతప్పి పడిపోవడంతో ఆయనను పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఉదయం మరింత మెరుగయిన చికిత్స కోస్ కేర్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం వైద్యుల సూచన మేరకు శంకర్రావును మారేడుపల్లి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుస్తామని తెలిపారు. శంకర్‌రావు కుమారుడు శశాంక్‌కు, వంశీప్రియకు 2005లో పెళ్లి జరిగింది. ఆ తరువాత శంకర్రావు కూతురు భర్తతో విడిపోయి ఇంట్లోనే ఉంటోంది. అప్పటి నుండి  ఆమె వంశీప్రియను వేధింపులకు గురిచేస్తోంది. దీంతో ఆమె భర్త నుండి విడిపోయింది. ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విషయంలో శంకర్రావు సాక్షులను బెదిరించారని ఆరోపణలున్నాయి. ఇదే కేసులో శంకర్రావు కూతురు సుస్మితను అరెస్టు చేసిన పోలీసులు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఉంచారు.

సం’గ్రామం’

      పంచాయితీ ఎన్నికల ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. జిల్లాల వారీగా కలెక్టర్లు ఇవాళ ఎలక్షన్ నోటిఫికేషన్ జారీచేయనున్నారు. ఈ నెల 13 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మొత్తం మూడు విడతల్లో పంచాయితీ ఎన్నికలు జరుగనున్నాయి.   అయితే ఇప్పటికే కొన్ని చోట్ల ఏకగ్రీవాలు కాగా.. మిగతా చోట్ల ఎన్నికలకు రంగం సిద్దం అవుతుంది. దీనికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టి నుంచి మొదలుకానుంది. కలెక్టర్లు..  జిల్లాలవారీగా నోటిఫికేషన్లు జారీచేస్తారు. ఈ నెల 13 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 14న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 17 న ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. కాగా.. ఈ నెల  23, 27, 31న మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. నేటి నుంచి ఎన్నిక లకోడ్ అమలల్లో ఉండటంతో ఇక తెర వెనుక రాజకీయాలకు తెరలేవనుంది.. ఇప్పటికే చాలా చోట్ల బేరసారాలు మొదలవగా.. ఈ సారి రిజర్వేషన్ల ప్రక్రియ కూడా అస్థవ్యస్తంగా సాగింది.. చాలా చోట్ల రిజర్వేషన్‌ కేటాయించిన సామాజిక వర్గం నేతలు లేకపోవటం అభ్యుర్థల ఎంపిక కూడా కష్టమయింది.. కొన్ని చోట్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో అడుక్కునేవారిని కూడా అభ్యర్ధులుగా ప్రకటిస్తున్నారు.. ఏది ఏమైనా సాధారణ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న ఈ ఎలక్షన్స్‌ను అన్నిపార్టీల నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు..

పాపం పండింది

      మనదేశంతో పోలిస్తే అవినీతి విషయంలో అన్ని దేశాలు కఠినంగానే వ్యవహరిస్తున్నాయి.. ముఖ్యంగా చైనా లాంటి దేశాలలో ఎంత వారకైనా తీవ్రమైన శిక్షలు విధిస్తున్నారు.. ఆఖరికి మంత్రి స్థాయి వారికి కూడా మరణ శిక్ష విదించి సంచలనం సృష్టించింది చైనా.25 ఏళ్ల రాజకీయ జీవితంలో 65 కోట్ల అవినీతి పాల్పడ్డ మాజీ మంత్రికి... అక్కడి కోర్టు ఏకంగా మరణశిక్ష విధించింది. అవినీతి సొమ్ముతో అతను సంపాందించిన సొత్తును స్వాదీనం చేసుకుంది..   లియు ఝిజున్‌. చైనా మాజీ రైల్వే మంత్రి. దేశంలోనే అత్యధికంగా 8 ఏళ్ల పాటు రైల్వే మినిస్టర్‌ గా పని చేసి రికార్డ్ సృష్టించిన వ్యక్తి. దాదాపు 25 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేశారు. ఐతే దీపముండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా... మంత్రిగా ఉండగానే చేతివాటం చూపించాడు. దాదాపు 65 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడు. కరెప్షన్ వ్యవహారంలో ఇదీ చైనా వైఖరి. దేశంలోనే ఓ సీనియర్‌ రాజకీయ నాయకుడు... 65 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడితినే సహించలేదు. చైనా రైల్వే రంగంలో ఎన్నో సంస్కరణలకు కారణమైన లియు ను పాపం పోనీ అనలేదు. దేశ సంపద దుర్వినియోగం చేస్తే ఎవరినీ క్షమించేదీ లేదని ఈ సంఘటన ద్వారా మిగతా నాయకులకు హెచ్చరికలు పంపింది. కాని మనదేశంలో మాత్రం ఇలాంటి సంఘటనలు మచ్చుకు కూడా కనిపించవు.. వేల కోట్ల అవినీతి ఆరోపణలతో కంపు కొట్టే మన రాజకీయపార్టీల నేతలకు అసలు అలాంటి భయమన్నదే లేదు.. మన చట్టాల్లో ఉన్న లొసుగులను ఆసరాగా తీసుకున్న నాయకులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. . మన దేశంలో కూడా చైనాలో జరిగిన లాంటి సంఘటన ఒక్కటి జరిగితే చాలు.. ఒక్క అవినీతి నాయకునికి శిక్ష పడినా దేశంలో కొంత మంది అయినా మారతారు.. మరీ అవినీతి కుంభకోణాలతో భ్రష్టు పట్టిన మన దేశంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. వేల కోట్ల రూపాయల జాతి సంపద దోచుకున్న నాయకులు దర్జాగా చట్టసభల్లో దర్శనిమిస్తున్నారు. కామన్ వెల్త్ స్కాంలో 70 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినా... సురేష్ కల్మాడీ ఇంక ఎంపీగా కొనసాగుతున్నారు. పలు క్రీడాల సంఘాల్లో పోటీ చేసే అవకాశంతో పాటు పార్లమెంట్‌ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. 2జీ స్కాం లో నిందితురాలిగా ఉన్న కరుణానిధి కుమార్తె కనిమొళి మరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక రైల్వే మినిస్టర్‌ గా బాధ్యతలు చేపట్టిన 6 నెలల్లోనే 10 కోట్ల రూపాయల లంచం తీసుకునేందుకు ప్రయత్నించిన పవన్ కుమార్ బన్సాల్ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. సీబీఐ చార్ఝిషీట్ కనీసం ఈ మంత్రిగారీ పేరు లేదు. ఆదర్శ్ కుంభకోణంలో నిందితులకు ఇప్పటికీ శిక్షపడలేదు. బొగ్గు స్కాం లో వేల కోట్ల జాతి సంపదను మెక్కినా ప్రైవేట్ కంపెనీలకు ప్రభుత్వం రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతోంది. వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన ఏ నాయకుడి ఆస్తులను ప్రభుత్వం ఇంతవరకు స్వాధీనం చేసుకోలేదు. కనీసం ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరించిన దాఖలాలు లేవు. వాయిస్ అవినీతి విషయంలో ఇంత కచ్చితంగా వ్యవహారిస్తున్నందునే చైనా సూపర్ పవర్‌ గా ఎదిగింది. ఇకనైనా భారత్ కరెప్షన్ విషయంలో ఉదాసీన వైఖరి మార్చుకోవాలని పలువురు మేధావులు సూచిస్తున్నారు. లేదంటే దేశ భవిష్యత్ ప్రమాదంలో పడక తప్పదని హెచ్చరిస్తున్నారు.

దిగ్విజయ్: తెలంగాణ తేలికైన విషయం కాదు?

డా. ఎబికె. ప్రసాద్ (సీనియర్ సంపాదకులు)         "చల్లకోసం వచ్చి ముంత దాచటం" సాధ్యం కాదన్న సామెతకు చాలా అర్థం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఎంత క్లిష్టమైనదో తెలిసి ఉండి కూడా, అందులోనూ ఏక భాషా సంస్కృతులు ఆధారంగా ఒక జాతిని రెండు రకాల పరాయి పాలకుల మధ్య (బ్రిటిష్, మొగలాయీ పాలకుల కింద), వాళ్ళ సామ్రాజ్య ప్రయోజనాల మధ్య పరాయి ప్రాంతాల్లో పుట్టకొకరు, చెట్టుకొకరుగా చెల్లా చెదరై ఉన్న తెలుగువారందరినీ భాషా ప్రయుక్త, రాష్ట్ర ప్రాతిపదికపైన ఒక్క గొడుగు కిందకు చేరుకోవటానికి అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ అవతరణ మౌలిక లక్ష్యానికే చేటు తెచ్చే విభజన వాదన వల్ల మొత్తం తెలుగు జాతి ఉనికికే రాగల నష్టమెంతో తెలిసి ఉండి కూడా - కేవలం ఎన్నికల్లో ఓట్లు, సీట్ల కోసం జాతీయ కాంగ్రెస్ నాయకత్వం 'రెండు ఆవుల దూడలా', రెండు నాల్కలతో తప్పుడు రాజకీయాలకు తెరలేపి కూర్చుంది. అయితే కాంగ్రెస్ అధిష్టానంలో ఒక ముఖ్యుడు, నిన్నమొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాలు చూస్తూ వచ్చిన కేంద్ర మంత్రి అజాద్ స్థానంలో, అంతకు ముందు కొన్నాళ్ళు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు చూసి చాలించుకున్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దౌత్య సంప్రదింపుల్లో మంచి లౌకికం ప్రదర్శించగల నేర్పుగల దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారకర్తగా నియమితులయిన తరువాత రాష్ట్రానికి వచ్చి, "రాష్ట్ర విభజన సమస్యపై" స్థానిక ప్రజల అవకాశవాద నాయకుల అభిప్రాయాలు తెలుసుకుని తిరిగి డిల్లీ వెళ్లారు. కాని ఏ "సమస్య" పరిష్కారం పేరుతో కేంద్రం తరపున (యు.పి.ఎ) దిగ్విజయ్ వచ్చారో, ఏ రకమైన తాత్కాలిక "మాండేట్"తో వచ్చారో, ఆ మాండేట్ లక్ష్యమేమిటో చెప్పకుండానే మళ్ళీ తిరుగు ప్రయాణం కట్టారు. అందరి మాటలూ వినడమైతే విన్నారు. విభజనకు అనుకూల ప్రతికూల వర్గాల కబుర్లు విన్నారు; ప్రాంతాల్లోని అవకాశవాదుల మాటలు విన్నారు; అధికారంలో ఉన్నా ఊడినా కూడా నిత్యం కొట్లాడుకునే ఏకైక జాతీయ రాజకీయ పక్షంగా కొన్ని దశాబ్దాలుగా మనుగడసాగించుకుంటున్న కాంగ్రేస్‌లోని రాష్ట్ర శాఖీయుల మధ్య కుమ్ములాటలూ చూశారు. కొందరి దృష్టిలో ‘సిద్దడు వేమారం వెళ్లనూ వెళ్లాడు, తిరిగి రానూ వచ్చాడ’న్న సామెత ప్రకారం దిగ్విజయ్‌ కనిపించవచ్చు! కాని, అసహజమైన రాష్ట్ర విభజన ప్రతిపాదనపైన ఈనాడు కాదు ముప్పయ్యేళ్లనాడే (1972లో) నాటి ప్రధానమంత్రి దివంగతురాలు కాకముందు ఇందిరాగాంధి భారత పార్లమెంటు నిండు పేరోలగంలో నిష్కర్షగా నీజాయితీతో చేసిన విస్పష్టమైన ప్రకటనకు విరుద్ధంగా వెళ్ళడం సాధ్యపడదన్న అవగాహన ఉన్న అగ్రనాయకుల్లో దిగ్విజయ్‌ ఒకరు. నేడు ఇందిరాగాంధీ సజీవురాలై ఉండి ఉంటే 1972 నాటి ప్రకటనకు విర్ధుంగా వెళ్ళదు. సోనియా మౌనం వీడితేగాని విషయాలు మరింత సుబోధికం కావు! ఆ మౌనాన్ని చేదించడానికే దిగ్విజయ్‌ యాత్ర. ఆ పూర్వా పరాలేగాదు, ఒక పెద్ద రాష్ట్ర (మధ్యప్రదేశ్‌) ముఖ్యమంత్రిగా విభజన వాదం వల్ల తన రాష్ట్రానికి కలిగిన కష్ట, నష్టాలన్నీ ఎలాంటివో కూడా ఆయనకు తెలుసు. అందుకనే తాజాగా మన రాష్ట్ర పర్యటన సందర్భంగా దిగ్విజయ్‌ అవకాశవాద రాజకీయాలకు పలు రకాల ప్రశ్నలను గుచ్చి గుచ్చి అడుగుతూ వచ్చారు. వాటిలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న, ఆదాయ వ్యయాలకు సంబంధించిన ప్రశ్న (వినతి పత్రాలను పక్కన పెట్టించి) ‘ప్రస్తుతం రాజధాని హైదరాబాద్‌ నగరం నుంచే ర్ఱాష్ట బొక్కసానికి అత్యధికంగా ఆదాయం వస్తోందని లెక్కలు సృష్టంగా నిరూపిస్తున్నాయి. హైదరాబాద్‌ నగరం ఏ ఒక్కరిదో కాదు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వారూ, ఇతర రాష్ట్రాలకు చెందినవారూ, అనేక పరిశ్రమలు, కంపెనీలు ఇక్కడ స్థిరపడిపోయి ఉన్నందున అది అందరికీ చెందిన రాజధాని అవుతుంది. ఈ సమస్యను పరిష్కరించడం ఎలాగో ఎవరైన ఆలోచించారా’’ అని దిగ్విజయ్‌ ప్రశ్నించారని పత్రికా వార్తలు! ఈ ప్రశ్నకు పదవీకాంక్షలో ఉన్న రాజకీయ నిరుద్యోగులెవ్వరూ సరైన సమాధానంయివ్వలేకపోయారు. ఎందుకంటే ‘ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు ఒకవైపు నుంచి తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం కారణం కాగా మరొకవైపు నుంచి ఆంధ్ర, హైదరాబాద్‌ స్టేట్‌ శాసనసభలు మెజారిటీ సభ్యుల సంయుక్త తీర్మానాలు కారణమయ్యాయన్న సత్యాన్ని మరవరాదు. కనుకనే దిగ్విజయ్‌ కూడా రాష్ట్రంలోనూ, దేశంలోనూ నెలకొని ఉన్న పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మాత్రమే రాష్ట్ర విభజన సమస్యపైన కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. అంతకు ముందు శ్రీకృష్ణ కమిటీ నివేదిక తన ప్రాధాన్యం సమైక్య రాష్ట్రమే ననీ, తెలుగు ప్రజల భావి భాగ్యోదయానికి అదే శ్రీరామరక్ష అని అభిప్రాయం ప్రకటిస్తూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోనూ (కోస్తా, రాయలసీమ, తెలంగాణా) అన్నింటి కంటే ఎక్కువగా వెనుకబడి ఉన్నది ఒక్క రాయలసీమ ప్రాంతమేననీ, అభివృద్ధికి సంబంధించి ఏ అంశాన్ని తీసుకున్నా రాయలసీమ వెనుకబాటు తనానికి లెక్కలన్నీ దాఖలాలుగా నిలిచాయనీ సృష్టం చేసినప్పుడు ‘మాకు లెక్కలతో, వాదనలతో పనిలేదు. మా (తెలంగాణా) రాష్ట్రం మాకిచ్చేయండి’’ అని రాజకీయ నిరుద్యోగ నాయకులు ఎదురు వాదించడం జరిగింది!  కాని అప్పుడు ‘మాకు లెక్కలతో, వాదనలతో’ నిమిత్తం లేదన్నవీరు, ‘రేపు ఏర్పడే రెండు రాష్ట్రాల రాజధానుల్లో ప్రభుత్వాలకు ఆధాయ వనరులు ఒకే విధంగా ఉంటాయనీ, ఆధాయ పంపిణీ విషయంలో విభజన ఇబ్బందీలేమీ ఉండవనీ’ ఏభరోసాతో, ఏలెక్కమీద, ఏ గణాంకాల మీద ఆధారపడి చెబుతున్నారో కనీసం ‘కాకిలెక్కల్ని’ అయినా చూపి దిగ్విజయ్‌ ముందు నిరూపించలేకపోయారు! అదే సమయంలో వీరు, తోటి తెలుగువారిపై విద్వేష ప్రభావాన్ని (వాళ్ల ఆస్తులన్నీ మనం ఆక్రమించవచ్చు, వాళ్లను హైదరాబాద్‌ నుంచి, తెలంగాణా నుంచి తరిమివేస్తే, వాల్ల ఇళ్లూ, భుమూలూ సర్వస్వం ఆక్రమించుకోవచ్చు, ఫలితంగా ఉద్యోగాలన్నీ తెలంగాణా యువతకే దక్కుతాయ’న్న ప్రచారం) ముమ్మరం చేసి, ఒక భయ కంపిత వాతావరణాన్ని సృష్టించడం ద్వారా కల్పించిన ఆశలు నెరవేరకపోయేసరికి, తెలంగాణా బిడ్డల్ని ఆత్మహత్యలవైపునకు రాజకీయ నిరుద్యోగులైన నాయకులు బలవంతంగా నెట్టారు. ఈ తమ నేరస్త మనస్తత్వాన్ని తోటి తెలుగు ప్రజలపైకి నెడుతూ ఇప్పుడు ‘కేంద్రం నుంచి తెలంగాణా ఏర్పాటు నిర్ణయం రావడం ఆలస్యమవుతున్న కారణంగా ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయ’ని కేంద్రంపైకి నిందను నెట్టడానికి కూడా జంకలేదు!   అంతే కాదు, ‘‘2009 డిసెంర్‌ 9’’ ప్రకటన గురించి ప్రస్తావించినప్పుడు కూడా దిగ్విజయ్‌ సింగ్‌ సమాధానమిస్తూ ‘‘ఆ ప్రస్తావనలో చర్చ ప్రక్రియ ప్రారంభమైనదని చెప్పడంతో పాటు ఆ ప్రకటనలో సమస్యను రాష్ట్రా అసెంబ్లీ నివేదించి, అక్కడ తీర్మానం చేయాలని కూడా ఉందని’’ గుర్తుచేశారు! అంటే, ఇన్నాళ్లూ ఏర్పాటు వాదులయిన రాజకీయ నిరుద్యోగులు ‘అసెంబ్లీ తీర్మానం’ అవసరమని ‘‘2009 డిసెంబర్‌ 9’’ ప్రకటనలో ఉన్న షరతును కావాలనే మభ్యపెడుతూ వచ్చారని గమనించాల్సి ఉంది! అంతేగాదు, గతంలో బిజెపి వారి వేర్పాటు రాజకీయంతో ఎన్‌.డి.ఎ` బిజెపి సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రాలను చీల్చి ఏర్పాటు చేసిన ఛత్తీస్‌ఘడ్‌, ఉత్తారాఖండ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలను సహితం అసెంబ్లీ తీర్మానాల ద్వారా ఏర్పాటయినవేనని దిగ్విజయ్‌ గుర్తు చేయాల్సి వచ్చింది. అలాగే తాను మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలోని బిజెపి సంకీర్ణ ప్రభుత్వం మధ్యప్రదేశ్‌ను విచ్చిన్నంచేసి ఛత్తీస్‌ఖడ్‌ను ఏర్పరచడం వల్ల తామెన్ని కష్ట, నష్టాలకు, వేదనకు గురి అయ్యామో ఆయన మన రాష్ట్రంలోని మందమతులకు పదవీ కాంక్షపరులకూ గుర్తు చేయాల్సి వచ్చిందని మరచిపోరాదు, అందుకే ‘విభజన’ అనేది ‘అతిక్లిష్టం, బాధాకరం’ అని ఆయన పాఠం చెప్పాల్సి వచ్చింది! అందుకే దిగ్విజయ్‌ మరొక హెచ్చరిక కూడా ఈ పర్యటనలో చేయాల్సి వచ్చింది. కేంద్రం ఇంతకూ ‘ఏ నిర్ణయం’ తీసుకోబోతోందన్న విలేకరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఇలా హెచ్చరించారు.   ‘రాష్ట్ర విభజన సమస్యపై చర్చించి త్వరలో నిర్ణయం తీసుకునేందుకు ప్రధాన వ్యక్తులతో (కోర్‌కమిటీ) కూడిన  సంఘం ప్రత్యేకంగా సమావేశమవుతుంది. అన్నీ ఆలోచించాకనే కమిటీ ఒక నిర్ణయానికి వస్తుంది. రాష్ట్రాన్ని విభజించినా, యధాతథంగా సమైక్యరాష్ట్రంగానే కొనసాగించినా అందుకు రాష్ట్ర నాయకులంతా కట్టుబడి ఉండాల్సిందే, ఆ తరువాత జరగబోయే పరిణామాలను ధైర్యంగా ముందుండి ఎదుర్కొవడానికి కూడా మీరంతా సిద్ధంగా ఉండాలని’’ ఆయన హెచ్చరించారు! ఎందుకంతగా దిగ్విజయ్‌ ముందస్తుగా హెచ్చరించాల్సి వచ్చింది? అందుకూ ఆయన స్వయానుభవంతో యిలా స్వష్టం చేయాల్సి వచ్చింది.   'రాష్ట్ర విభజన అనేది చాలా క్లిష్టమైనది, బాధాకరమైనదీ, ఆ బాధేమిటో నేను స్వయంగా అనుభవించాను. నేను మధ్యప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్ర విభజన జరిగి ఛత్తీస్‌గఢ్‌ ఏర్పడిరది. అప్పట్లో చాలా ఇబ్బందులు కళ్ళారా చూశాను. అందువల్ల రాష్ట్రాన్ని విభజించడం ఆషామాషీ వ్యవహారం కాదు. బల్లలు, కుర్చీలు మొదలుకుని నీళ్లు, విద్యుచ్చక్తి, అప్పులు, ఆదాయాల దాకా ఎన్నెనో పంపిణీ చేయాల్సి ఉంటుంది. సమస్యలు కూడా చాలా ఉంటాయి. మధ్యప్రదేవ్‌ విభజన జరిగినప్పుడు విద్యుత్‌ ప్రాజెక్టులన్నీ ఛత్తీస్‌ఖడ్‌లో ఉంటే వాడకందార్లందరూ మధ్యప్రదేశ్‌లో ఉండి పోయారు. అలాగే పంజాబ్‌ను వీడగొట్టినప్పుడూ ఈ బాధలనే ప్రజలు చావి చూడాల్సి వచ్చింది!      ఇదే (పంజాచ్‌ విభజన) సమస్యను ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ పర్యటన సందర్భంగాను ప్రసిద్ధ పాత్రికేయులు, ఇంగ్లాండ్‌లో భారత మాజీ హైకమిషనర్‌ అయిన కులేదీప్‌నయ్యార్‌ కూడా పంజాబ్‌ విభజనవల్ల హర్యానా, పంజాబ్ పూచిరువురూ ఎలా దెబ్బతిన్నావో వివరించి, ఆంధ్రప్రదేశ్‌కు అలాంటి పరిస్థితిని కోరికోరి కొని తెచ్చుకోవద్దని హెచ్చరించి పోయాడని మరవరాదు! ఇదే స్ఫూర్తితో బహుశా దిగ్విజయ్‌సింగ్‌ కూడా స్వీయానుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్ర పర్యటనలో ప్రాంతీయ రాజకీయ నిరుద్యోగుల్ని కూడా దృష్టిలో పెట్టుకుని ‘సమస్యను పరిశీలించబోమని’ ప్రత్యక్షంగా అనకుండా పరోక్షంగా విభజనవల్ల రాబోయే పరిణామాల గురించి పరోక్షంగా చెప్పక చెప్పక చెప్పాడు.   ఇంతకూ విచారకరమైన అసలు విషయం ` విజయాన్ని గాకుండా విషాన్ని పంచే విభజన సూత్రానికి 1969`71మధ్య కాలంలో తెలంగాణాలో భుస్వామ్య, జాగిర్దారీ దాష్టికాలతో పేద, మధ్యతరగతి ప్రజాబాహుళ్యాన్ని దోచుకు తినడంలో నిజాం ప్రభువుల కనుసన్నల్లో కీలకమైన పాత్రవహించిన కె.వి.రంగారెడ్డి కుటుంబీకుడు తెలంగాణా కాంగ్రెస్‌ నాయకుడు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ చెన్నారెడ్డి కాగా ఈసారి ప్రాంతీయ రాజకీయ నిరుద్యోగులుగా కోస్తాంధ్ర నుంచి వలసవచ్చిన ‘బొబ్బిలి దొర’ కె.సి.ఆర్‌ కుటుంబం మచిలీపట్నం పూర్వ రంగంగా తెలంగాణాలో తిష్టవేసిన కె.కే. (కేశవరావ్‌) ఉద్యమ శల్య సారధులు కావటం!   ‘ఛత్తీస్‌గడ్‌, ఉదాహరణ ‘వేరట, తెలంగాణా ‘సమస్య’ వేరట! కెసిఆర్‌ స్థానిక పార్టీతో పడని ‘తెలంగాణా సంయుక్త కార్యాచరణ సంఘం’ (టి.జె.ఎ.సి)లో మళ్లీ లుకలుకలు, ఆ రెండిరటికీ పడకపోగా, పరస్పరం అలకలు, ఖండన మండనలతో కాలక్షేపం చేస్తూ ఉస్మానియా విశ్వవిధ్యాలయ ఆచార్య పదవికి సెలవుపెట్టి, ఇన్నాళ్లుగానూ నెలవారీ జీతం సజావుగానే పొందుతూ మాత్రం ఢోకా లేకుండా పొందుతూ ‘టి’ జాక్‌ ఉద్యమానికి మాత్రం నాయకత్వం వహిస్తున్న కోదండరామరెడ్డితో దళిత, బహుజన వర్గాల నాయకులకు పడకపోవడం మరో ‘ఫార్సు’, ‘సామాజిక తెలంగాణా’ వాదులలో పెక్కుమందికి కెసిఆర్‌, కోదండరామ్‌ విభాగాల పొడగిట్టదు. అందుకని రాజకీయ ‘దుకాణాలు’ మారిపోతున్నాయి! వందలకోట్ల రూపాయలను కెసిఆర్‌ ‘ఉద్యమం’ పేరిట వసూళ్లు చేసుకుని కుటుంబాన్ని మల్టీనేషనల్‌ కంపెనీగా మార్చాడని దళిత వర్గ నాయకురాలు గజ్జెల కాంతం దండోరా వేస్తుండగా, కె.సి.ఆర్‌ ‘సకల జనుల సమ్మె’ను రూ.50 కోట్లకు అమ్మేశాడని స్వయాన కె.సి.ఆర్‌. సోదరుడి కూతురు రమ్య చాటుతోంది!   ఇక కోదండరామ్‌ తరపున వెలువడుతున్న విచిత్ర ప్రకటనల్లో తాజా వార్త - వాళ్లూ వీళ్లూ కాదు సరాసరి సోనియాగాంధీ నుంచే కోదండరామ్‌కు పిలుపు రానున్నదన్న ప్రచారం. ఇది ప్రధానంగా స్థానిక బడా పెట్టుబడిదారుడైన రాజాం నేతృత్వంలో నడుస్తున్న పత్రికలో తప్ప ఇతర పత్రికల్లో రాలేదు. ‘తెలంగాణా రాష్ట్రం’ ఏర్పాటుకోసం ఉద్యమాన్నిమోపుచేసే పేరిట ప్రస్తుతం కోదండరామ్‌ ఢిల్లీలో విభజన ప్రేమికులయిన కొన్నిచిల్లర పార్టీల నాయకులతో ఓ రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిపారు. ఇది ఇలా ఉండగానే లోకసభ మాజీ స్వీకర్‌ సంగ్మా రెండవ ఎస్‌.ఆర్‌.సి. (రాష్ట్రాల పునర్విభజన పరిశీలనా సంఘం)ని ఏర్పాటు చేయడం ఉత్తమమని ప్రతిపాదించారు. అయితే చరిత్ర తెలియని కొందరు ప్రాంతీయ రాజకీయ నిరుద్యోగనాయకులు పూర్వపు తెలంగాణా రాష్ట్రమే తమకు అభిలషణీయమని దిగ్విజయ్‌కు ఒక నివేదిక అందజేశారు! చారిత్రక అజ్ఞానానికి హద్దులుండవు. ఎందుకంటే తెలంగాణా ఏనాడూ రాష్ట్రంగా లేదు. అది హైదరాబాద్‌ సంస్థానపు పరాయి పాలకుల (మోగలాయిల`బహమనీల`నిజాముల)పాలనలో నలిగిపోయిన ప్రాంతాలలో ఒక భాగం మాత్రమే! ఈ విషయం కోదండరామ్‌ ప్రభృతులకు తెలియక పోవచ్చునేమోగాని, తెలంగాణా సాయుధపోరాటానికి నాయకత్వం వహించిన అగ్రశ్రేణి తెలంగాణా నాయకులయిన దేవులపల్లి వెంకటేశ్వరరావు, రావి నారాయణరెడ్డి ఎట్టి అనుమానాలకు తావులేకుండా స్పష్టం చేశారు. దేవులపల్లి వెంకటేశ్వరరావు ‘తెలంగాణా ఒక రాష్ట్రంగా ఏనాడూ లేదు. తెలంగాణా ఆంధ్రప్రదేశంలో ఒక భాగం. 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడేదాకా తెలంగాణా జిల్లాలు హైదరాబాద్‌ సంస్థానంలో ఉన్నాయి. భారతదేశంలో బ్రిటీష్‌ పాలన ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌ సంస్థానం ఎన్నడూ స్వతంత్ర రాజ్యంగా లేదనేది ఒక వాస్తవ విషయం. (అంతేగాదు) తెలంగాణా ప్రజలు ఆంధ్రజాతిలో ఒక భాగమే కాని, ప్రత్యేక జాతి కాదు. కనుక స్వయం నిర్ణయహక్కు ఉండేది ఆంధ్రజాతికే గాని, తెలంగాణా ప్రజలకు కాదు. పాలక వర్గాలలో తెలంగాణాకు చెందిన ఒక బలమైన భుస్వామ్య వర్గం, వర్తక వ్యాపారాలలో ఒక భాగం, ఉద్యోగస్తులు అంతా ఆంధ్రప్రజదేశ్‌ ఏర్పడడాన్ని వ్యతిరేకించారు. ప్రత్యేక తెలంగాణా కామ్‌, యిలాంటి చిన్న రాష్ట్రాల నిర్మాణానికేమీ నేటి పాలక వర్గాలు వ్యతిరేకమనే భావం తప్ప. తమ స్థానాన్ని బలపర్చుకోవటానికి ఒకే భాషా ప్రాంతాన్ని కూడా విడదీసి చిన్న రాష్ట్రాలు ఏర్పరచడానికి వారు ఎప్పుడూ వెనుకాడరు. ప్రత్యేకాంధ్ర, ప్రత్యేక రాయలసీమ నినాదాలను కూడా మరికొన్ని పాలక వర్గ ముఠాలు లేవనెత్తుతున్నారనేది గమనించాలి. బడా బూర్జారా వర్గం, విదేశీ పెట్టుబడి, భుస్వామ్య వర్గాల పాలనే సమస్యలన్నింటికీ మూలకారణమనేది స్పష్టం. దేశ సమస్యల నుంచి ఆంధ్రప్రదేశ్‌ సమస్యలను విడదీసి చూడటం అవాస్తవికమవుతుంది. అశాంతి, అలజడులకు ప్రాంతీయ అసమానతలు, నిరుద్యోగం మూల కారణాలు. ఈ సమస్యలు అటు ప్రత్యేక రాష్ట్రంలోగాని, ఇటు సమైక్య రాష్ట్రంలో గానీ పరిష్కరింపబడజాలవు. (‘జాతీయ సమస్య’ డాక్యుమెంటు నుంచి)! ఈ వివరణలకు తాజాగా ఇటీవల కాలంలో గులామ్‌నబీ అజాద్‌ అధికార హూదాలో చేసిన ఒక ప్రకటనలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు ఓటములన్నవి ‘విభజన’పైన ఆధారపడి వుండబోవని గుర్తు చేస్తూ లడక్‌ ప్రాంత అనుభవాన్ని ఇలా పూసగుచ్చి చెప్పారు.‘లడఖ్‌ ప్రాంతాన్ని మూడు జిల్లాలుగా విభజించాలని నాలుగు దశాబ్ధాలుగా డిమాండ్‌ ఉండేది. కాంగ్రెస్‌కు కలిసి వస్తుందని నేను ముఖ్యమంత్రిగా ఉండగా వాటిని ఏర్పాటు చేయించాను తీరా ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్‌కు ఒక్కటంటే ఒక్క సీటూ రాలేదు’’! అనుభవం అమృతం లాంటిదంటారు! అందుకేనేమో!

హలీం బట్టీల వల్లనే కూలీన సిటీలైట్ భవనం

      హలీం బట్టీలే సిటీలైట్ కుప్పకూలడానికి కారణమా! అవుననే అంటున్నారు ప్రభుత్వ అధికారులు. సికింద్రాబాద్ లోని సిటీలైట్ హోటల్ 'హలీం' కి చాలా ఫేమాస్. రంజాన్ నెల ప్రారంభం అయింది అంటే 'హలీం' రుచి చూడడానికి ఈ హోటల్‌కు ప్రతి రోజూ భారీగా కస్టమర్లు వస్తుంటారు. దీంతో ప్రతి సంవత్సరం లాగే ఈ సారి హలీం బట్టీల కోసం పెద్దఎత్తున ఇటుకలను, ఇసుకను, మట్టిని బిల్డింగ్ పైకి తరలించారు. ఒక్కొక్క బట్టీ తయారీకి సుమారు 800 కిలోల సరుకులు అవసరమని అంచనా. దీని ప్రకారం.. ఎనిమిది బట్టీల బరువు దాదాపు 6.4 టన్నుల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఇప్పటికే తయారీ మొదలుపెట్టడంతో హలీం బట్టీలనుంచి వెలువడే తీవ్రమైన వేడికి పైకప్పు బలహీనపడింది. పురాతన భవనంపై ఇంత బరువు వేయడం.. బట్టీ నుంచి వెలువడిన వేడిమి కారణంగా భవనం కుప్పకూలి ఉంటుందని జీహెచ్ఎంసీ, పోలీసువర్గాలు చెబుతున్నాయి. భవనం పైభాగంలో బట్టీలను నిర్మించవద్దని వాటి నిర్మాణం సందర్భంగానే హోటల్లోని కొంతమంది సిబ్బంది యజమానిని వారించినట్లు చెబుతున్నారు. అయినా, పెడచెవిన పెట్టినట్లు సమాచారం. ఆదివారం రాత్రి నుంచే పెచ్చులు ఊడుతున్నా కూడా యాజమాన్యం గమనించలేదు. భవనానికి పిల్లర్లు కూడా లేకపోవడంతో ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు. సిటీలైట్ హోటల్ కూలి 13 మంది మరణించిన విషయం తెలిసిందే.  

ఉగ్రవాదుల కంటే కరుడుగట్టిన రాజకీయ నేతలు

  నరేంద్ర మోడీనీ సాకుగా చూపి, బీజేపీ నేతృత్వం వహిస్తున్నఎన్డీయే కూటమి నుండి నితీష్ కుమార్ కి చెందిన జేడీ(యు) తప్పుకొన్న తరువాత, ఆ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నానాటికి తీవ్రతరమవుతోంది. ఇక, జేడీ(యు)ని ఎలాగయినా తన కూటమిలోకి ఆకర్షించాలనే తాపత్రయంతో కాంగ్రెస్ పార్టీ, నితీష్ కుమార్ కి అండగా నిలబడుతూ తమ ఉమ్మడి శత్రువయిన బీజేపీపై విరుచుకు పడుతోంది.   మొన్న ఆదివారం నాడు బీహార్ రాష్ట్రం భోదగయ భౌద్ద క్షేత్రంలో జరిగిన ప్రేలుళ్ళను అవకాశంగా తీసుకొని బీజేపీ, జేడీ(యు)పై మాటలు రువ్వుతుంటే, అందులో కాంగ్రెస్ కూడా ప్రవేశించి బీజేపీపై ఎదురు దాడికి దిగింది. కాంగ్రెస్, జేడీ(యు)లు రెండు తీవ్రవాదుల దాడి గురించి ముందే సమాచారం ఉన్నపటికీ అలసత్వం చూపాయని బీజేపీ విమర్శిస్తే, బీజేపీ ఉగ్రవాదచర్యలను కూడా రాజకీయం చేస్తోందని నితీష్ కుమార్ విమర్శించారు. కొద్ది రోజుల క్రితం నరేంద్ర మోడీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కి బుద్ధి చెప్పమని బీజేపీ కార్యకర్తలకు పిలుపునీయడం, ఆ తరువాత ఆయన అనుచరుడు అమిత్ షా కూడా నితీష్ కి వ్యతిరేఖంగా వ్యాఖ్యలు చేయడం, వెన్వెంటనే గయలో బాంబు ప్రేలుళ్ళు జరగడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ, దిగ్విజయ్ సింగ్ ఇందులో బీజేపీ హస్తం ఉందేమోనని అనుమానం వ్యక్తం చేసారు.   బౌద్ధ ఆలయంలో బాంబు ప్రేలుళ్ళు జరిగిన తరువాత ఏఉగ్రవాద సంస్థ దానికి తామే బాధ్యులమని ఇంతవరకు ప్రకటించలేదు. అదేవిధంగా దర్యాప్తు సంస్థలు కూడా అవి ఎవరి పనో ఇంతవరకు నిర్దారించలేదు. కానీ, దాడి జరిగిన వెంటనే హోం మంత్రిత్వ శాఖ ‘అది ఇండియన్ ముజాహుదీన్ పనే అయి ఉంటుందని’ క్షణంలో తేల్చిపడేసింది. ఇప్పుడు బాధ్యతగల పదవులను నిర్వహిస్తున్న దిగ్విజయ్ సింగ్ అది బీజేపీ పనేమోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ అది ముస్లిం తీవ్ర వాదులచర్య అని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈవిధంగా దేశభద్రతకు సంబందించిన విషయాన్నీ కూడా అన్ని పార్టీలు రాజకీయం చేస్తూ ఉగ్రవాదులు నిశ్చింతగా మరిన్ని దాడులు చేసేందుకు అవకాశం ఇస్తున్నాయి.   దేశంలో ఇటువంటి బలహీనమయిన, ఐకమత్యంలేని రాజకీయ వ్యవస్థ ఉన్నపుడు, దేశ భద్రత విషయంలో కూడా అవి రాజకీయాలు చేస్తాయని తెలిసినప్పుడు, దర్యాప్తు సంస్థలపై అధికార పార్టీ ఒత్తిళ్ళు ఉంటాయని తెలిసినప్పుడు, మన దేశం ఉగ్రవాదులకు లోకువగానే కనిపించడంలో ఆశ్చర్యం ఏమి లేదు. దేశ భద్రత, జాతీయ భావం కంటే తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావించే రాజకీయ పార్టీలు, నేతల ధోరణి మారనంత కాలం ఉగ్రవాదులు ఈవిధంగా చెలరేగిపోతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూనే ఉంటారు.

తెలంగాణా అమరవీరుల కుటుంబీకులకు ఉద్యోగాలు

  పంచాయితీ మరియు స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో నిన్న వరంగల్ జిల్లా ఖాజీపేటలో నిర్వహించిన సభలో, ముందుగా ఆయన వేదికపై అమర్చిన అమర వీరుల స్థూపం నమూనా వద్ద ఘన నివాళులు అర్పించారు. తరువాత ఆయన మాట్లాడుతూ, రానున్న ఎన్నికలలో తెదేపాను గెలిపిస్తే తెలంగాణా కోసం బలిదానాలు చేసిన అమరవీరుల కుటుంబీకులకు ప్రభుత్వోద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసారు. తమ పార్టీ ఎప్పుడు కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి, చేసిన ప్రతీ వాగ్దానాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. తెదేపా హయంలో స్థానిక సంస్థలకు సకాలంలో నిధులు విదుదల చేస్తూ, ఎన్నికలు నిర్వహిస్తూ వాటిని బలోపేతం చేయగా, కాంగ్రెస్ అధికారం చెప్పటిన తరువాత వాటిని క్రమంగా బలహీనపరిచిందని ఆరోపించారు. తమ హయంలో సర్పంచులకు గౌరవ వేతనం కూడా ఏర్పాటు చేసిన విషయం ఆయన గుర్తు చేసారు. తెదేపా ప్రధానంగా కార్యకర్తల బలం మీదనే ఆధార పది ఉందని అందువల్ల రానున్న పంచాయితీ ఎన్నికలలో పార్టీని గెలిపించే బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొన్నట్లు తెలంగాణా పేరు చెప్పుకొని తెరాస నేతలు కోట్లు పోగేసుకొన్నారని, అటువంటి పార్టీ వల్ల ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని ఆయన అన్నారు.

మోత్కుపల్లి హత్యకు రెక్కీ జరిగిందా

  తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు తమ పార్టీ నేత మోత్కుపల్లి నరసింహులుని హత్య చేసేందుకు మావోయిస్టులు ఇటీవల రెక్కీ నిర్వహించారని అందువల్ల ఆయనకు అదనపు భద్రత కల్పించమంటూ ముఖ్యమంత్రికి లేఖ వ్రాయడంతో పార్టీలోమరియు తెలంగాణావాదులలో కలకలం రేగింది. తెదేపాలో ఉంటూ తెలంగాణా వాదం బలంగా వినిపిస్తూనే మరో వైపు పార్టీపై వస్తున్న విమర్శలను కూడా బలంగా తిప్పికొడుతూ పార్టీని ఒక కాపు కాస్తున్నఅతనికి రాజకీయ శత్రువులు ఉండటం సహజమే. ఆయన తెలంగాణా వాదం వల్ల, ఇటు సీమంధ్ర నేతలకు కూడా ఆయన శత్రువయి ఉండవచ్చును. అయితే అది ఆయనను హత్య చేసేంత తీవ్రమయిన శత్రుత్వం అవడానికి ఆస్కారం లేదు. మరి మోత్కుపల్లిని హత్యచేసేందుకు ఎవరు రెక్కి నిర్వహించారు? సీమంధ్ర నేతలా లేక తెలంగాణా నేతలా? లేక ఆయనకి ఇంకెవరయినా వేరే శత్రువులున్నారా? దళితుడనయిన తనను రాజకీయంగా ఎదుర్కొనలేకనే కేసీఆరే తనను హత్య చేయించేందుకు కుట్ర పన్ని ఉంటాడని మోత్కుపల్లి ఆరోపించడంతో దీనికి రాజకీయ రంగు కూడా పులుముకోనుంది. పంచాయితీ, స్థానిక ఎన్నికలలోగెలిచేందుకే తెదేపా తమ పై ఈవిధమయిన నిరాధారమయిన ఆఅరొపణలు చేస్తున్నారని  తెరాస నేతలు ప్రత్యారోపణలు మొదలు పెట్టవచ్చును. ఏమయినప్పటికీ, ఇది తీవ్రమయిన విషయమే. ప్రభుత్వానికి లేఖ వ్రాసి సరిపెట్టుకోకుండా ఆయన తనకు తానుగా లేదా పార్టీ తరపున భద్రత ఏర్పాటు చేసుకోవడం మంచిది.

ఎవరు డబుల్ గేమ్ ఆడుతున్నారు

  రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సగం మంది ప్రత్యేక తెలంగాణా కోసం, మరి కొంత మంది సమైక్యాంధ్ర అంటూ మాట్లాడుతుంటే, కేంద్ర మంత్రి పదవులు పుచ్చుకొన్న మరి కొంతమంది తాము అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నమంటూనే, రాష్ట్ర విభజన పట్ల తమ అభిప్రాయంలో ఎటువంటి మార్పు లేదని చెపుతున్నారు. వారు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెపుతుంటే, వారి అనుచరులు మాత్రం సమైక్యాంధ్ర అంటూ సభలు సమావేశాలు నిర్వహించడం కూడా బహిరంగ రహస్యమే. అంటే కాంగ్రెస్ పార్టీలోనే నాలుగు రకాల వాదనలు చేస్తున్నవారున్నారన్నమాట.   అయితే, నెల్లూరు కాంగ్రెస్ శాసన సభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, ముఖ్యంగా వైకాపానేతలు ఈ విషయంలో డబుల్ గేమ్ ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు. విజయమ్మ ఆదేశాల మేరకే ఆ పార్టీ శాసన సభ్యులు రాజీనామా డ్రామా ఆడుతున్నారని ఆయన ఆరోపించారు.   ఒకవైపు ఆయన ప్రతిపక్షాలను నిందిస్తూనే, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరగదని, తెలంగాణా మ్యాపులు వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదని ఆయన స్పష్టం చేసారు. అయితే, మరి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ రోడ్డు మ్యాపులు తయారు చేయమని ముఖ్యమంత్రిని, పీసీసీ అధ్యక్షున్ని, ఉప ముఖ్యమంత్రిని ఎందుకు కోరినట్లు? అది ప్రజలను మభ్యపెట్టడానికేనని ఆనం వారి అభిప్రాయమా? అదే నిజమయితే మరి డబుల్ గేమ్ ఆడుతున్నధి కాంగ్రెస్ పార్టీనా లేక ప్రతిపక్షాలా? ఆయనే వివరిస్తే బాగుంటుంది కదా?

తెలంగాణ పై దిగ్విజయ్ కొత్త మెళిక

      రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలంగాణ పై మాట మార్చినట్లుగా కనిపిస్తోంది. ప్రత్యేక తెలంగాణపై నివేదిక ఇచ్చిన తర్వాతే నిర్ణయం జరుగుతుందని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. విభజన, సమైక్యాంధ్రల పైన రోడ్ మ్యాప్ ఇవ్వాలని తాము ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను అడిగామని, వారు నివేదిక ఇచ్చాకనే తెలంగాణపై నిర్ణయం ఉంటుందన్నారు. నివేదిక ఇవ్వడానికి ఓ గడువు అంటూ ఏమీ లేదని చెప్పారు నేతలు ఎప్పుడైనా వచ్చి  తమ నివేదికను తమకు ఇవ్వవచ్చునని ఆయన చెప్పారు. అయితే వారు నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే నిర్ణయం ఉంటుందన్నారు. నేతలు ఇచ్చే నివేదికకు గడువు లేదని చెప్పడం ద్వారా దిగ్విజయ్ తెలంగాణపై కొత్త మెలిక పెట్టినట్లుగా అనుమానిస్తున్నారు. కోర్‌కమిటీ సమావేశంలో తెలంగాణపై తుది నిర్ణయం ఉంటుందని దిగ్విజయ్ సింగ్ తెలిపారు.

సిటి లైఫ్ హోటల్ భవనం కూలి 6మృతి

      హైదరాబాద్, సికింద్రాబాద్ లలో కొన్ని ప్రాంతాలలో శిదిలైన పాత కట్టడాలలో ప్రజలు నివస్తున్న ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవం వల్ల తరచూ ప్రమాదాలు జరుతున్నాయి. ఈ రోజు ఉదయం సికింద్రాబాద్ లోని సిటి లైఫ్ హోటల్ కుప్పకూలడం వల్ల ఆరుగురు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతవరకు ఐదు మృతదేహాలను వెలికి తీసినట్లు జి.హెచ్.ఎమ్.సి. కమిషనర్ కృష్ణబాబు చెప్పారు.  కుప్పకూలిన భవనంలో రెండంతస్తులు ఉన్నాయి. కాలం చెల్లిన భవనం కావడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఆరు ప్రొక్లయిన్లతో శిథిలాల తొలగింపు ముమ్మరంగా కొనసాగుతోంది. నగరంలో 272 పురాతన భవనాలు కూలడానికి సిద్ధంగా ఉన్నట్లు గుర్తించినట్లు ఆయన వెల్లడించారు.వీటిలో పదిహేను భవనాలను కూల్చామని ఆయన చెప్పారు.

బుద్ధగయ పేలుళ్ళ పై నేతల స్పందన

      మహాబోధి ఆలయంలో పేలుళ్ల పట్ల పలువురు నేతలు స్పందించారు. శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్షే తీవ్రంగా దిగ్భ్రాంతి చెందినట్లు ఆయన మీడియా సమన్వయకర్త తెలిపారు. గుజరాత్ సీఎం నరేంద్ర మోదీ ఈ దాడులను ఖండించారు. భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులకు ఈచర్య తీవ్ర ఆవేదన మిగిల్చిందన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలను బెదిరించేందుకు జరిగిన 'గేమ్‌ప్లాన్'గా పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభివర్ణించారు.   ఆటవిక, అమానవీయ చర్యగా పంజాబ్ సీఎం బాదల్ దుయ్యబట్టారు. అంతర్గత, బహిర్గత భద్రతా లోపాలపై కేంద్రం వద్ద సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ఏమీ లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు. శాంతికి చిహ్నమైన బుద్ధగయలో ఉగ్ర వాదులు పేలుళ్లకు పాల్పడటాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఒక ప్రకటనలో ఖండించారు. బీహార్ భవిష్యత్తును ఈ పేలుళ్లే చెబుతున్నాయని ఎల్‌జేపీ అధ్యక్షుడు రామ్‌విలాస్ పాశ్వాన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. బీజేపీ సహా విపక్షాలన్నీ రాజకీయాలకు కులమతాల రంగు పూస్తున్నాయని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్ సహా పలు నగరాలకు ముప్పు పొంచి ఉందని ఐబీ వర్గాలు హెచ్చరించాయి.

ఈ ప్రభుత్వాలకు జ్ఞానోదయం కలిగేదెప్పుడో

  బీహార్ రాష్ట్రం భోధగయలో గల ప్రపంచ ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రమైన మహాబోధి ఆలయ పరిసరాలలో ఆదివారం తెల్లవారు జామున 5.30-6.00గంటల మధ్య తొమ్మిది వరుస బాంబు ప్రేలుళ్ళు జరిగాయి. కానీ అవి అంత శక్తివంతమయినవి కాకపోవడంతో ఆలయానికి గానీ, బుద్ధుడు తపస్సు చేసి జ్ఞానోదయం పొందిన భోదీ వృక్షానికి గానీ ఎటువంటి హానీ జరుగలేదు. ఈ ఘటనలో ఇద్దరు బొద్ద సాధువులు మాత్రం తీవ్ర గాయాల పాలయ్యారు. దీనికి ఇండియన్ ముజాహుద్దీన్ తీవ్రవాద సంస్థే కారణం అయిఉండవచ్చునని హోంశాఖ భావిస్తోంది.   విచారకరమయిన విషయం ఏమిటంటే, ఇద్దరు తీవ్రవాదులు బౌద్ధ గయలో ప్రవేశించారని వారం రోజుల క్రితమే ఇంటలిజన్స్ విభాగం బీహార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. పోలీసులు వారి ఆచూకి కనిపెట్టేందుకు ప్రయత్నించారు కానీ సఫలం కాకపోవడంతో వారు ఆలయ అధికారులకు హెచ్చరికలు జారీ చేసి చేతులు దులుపుకొన్నారు. ఇది జరిగిన వారం రోజులకే ఇంటలిజన్స్ హెచ్చరికలను నిజం చేస్తూ ఆలయంలో ప్రేలుళ్ళు జరిగాయి.   దీనిని బట్టి ప్రభుత్వాలు, మన పోలీసు వ్యవస్థలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో అర్ధం అవుతోంది. ఇటువంటి సంఘటనలలో మనుషులు ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ ప్రభుత్వాలు, రక్షణ వ్యవస్థలు ఉదాసీనంగా వ్యవహరించడం, ఘటన జరిగిన తరువాత కూడా అంతే ఉదాసీనంగా వ్యవహరించడం చాలా అమానుషం. ప్రజాసేవే తమ జీవిత పరమావధి అన్నట్లు మాట్లాడే రాజకీయ నేతలు, పార్టీలు, ప్రభుత్వాలు ఎన్నికలలో ప్రజల ఓట్లు నొల్లుకొనేందుకు అనేక పధకాలు, వరాలు ప్రకటిస్తుంటాయి. కానీ, ఇటువంటి ఘటనలు జరుగకుండా నివారించి వారి ప్రాణాలు కాపాడాలని మాత్రం ఎన్నడూ ఆలోచించకపోవడం చాల అమానుషం.   ఇటువంటి ఉగ్రవాద దాడులు దేశంలో ఎన్నిసార్లు జరుగుతున్నా, ఎంతమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా కూడా చలించని జడత్వ స్థితికి చేరుకొన్నాయి మన వ్యవస్థలు. కనీసం వాటి నుండి పాఠాలు నేర్చుకోనప్పుడు, ఇటువంటి ఘటనలను నివారించాలనే ధృడ సంకల్పం అవి కలిగి ఉండాలని ఆశించడం కూడా అడియాసే అవుతుంది.   మన దేశంలో ఉగ్రవాదులు జొరబడి విచ్చలవిడిగా విద్వంసానికి పాల్పడుతుంటే దానిని సమర్ధంగా అడ్డుకోవలసిన ప్రభుత్వాలు, వారిని, వారి ఉగ్రవాద చర్యలను కూడా రాజకీయ కోణంలోంచే చూడటం వల్లనే ఇటువంటివి పునరావృతమవుతున్నాయి. దేశంలో ఉగ్రవాదులు జొరబడటం అంటే మనింట్లో దొంగలు జొరబడినట్లేనని ఈ ప్రభుత్వాలు గ్రహించనంత కాలం ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి.

విజయమ్మకు మమత ఫోన్

      వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై జాతీయ స్థాయి నేతల కన్ను పడింది. తమతో కలవాలంటూ అభ్యర్థనలు వస్తున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయమ్మతో ఫోన్లో మాట్లాడారు. 2014 జాతీయ ఎన్నికలు ముందుగా వచ్చేలా ఉన్నాయని చెప్పారట. అంతేకాదు.. తమతో పాటు కలిసి నడిస్తే మీకు భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మద్దతు కోరినట్టు సమాచారం. దీని గురించి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు బహిరంగంగా ప్రకటించారు. “జాతీయ స్థాయి నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరుతున్నారు. ఎన్నికలు ఎపుడు జరిగినా వాటిని పార్టీ సమర్థంగా ఎదుర్కొంటుంది. మేము కీలక పాత్ర పోషించాలని మమత ఆశిస్తున్నారు” అని చెప్పారు. జగన్ తో మాట్లాడిన అనంతరం ఈ విషయంపై పార్టీ ఒక అండర్ స్టాండింగ్ కు వస్తుందని ఆ తర్వాత మమతకు విజయమ్మ తమ మద్దతు ప్రకటించే విషయమై మాట్లాడతారని ఆ నేతలు తెలిపారు.

డిల్లీలో బొత్స బాబు హడావుడి

  పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రోడ్డు మ్యాపులు పట్టుకొని డిల్లీలో హడావుడి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రానికి చెందిన పనబాక, పురందేశ్వరి, శీలం, కావూరి, పల్లం, కోట్ల తదితర కేంద్ర మంత్రులందరూ కూడా సమైక్యవాదులే అయినప్పటికీ, రాష్ట్ర విభజనపై అధిష్టానం నిర్ణయానికి వారందరూ ఎప్పుడో కట్టుబడిపోయారు గనుక ఇక వారితో సమైక్యాంధ్ర ఉద్యమాలు చేయాల వద్దా? అని చర్చించే పనిలేదు. అందువల్ల, బొత్స బాబు వారినందరినీ కలుస్తూ వారి సలహా సంప్రదింపులు తీసుకొని తన రోడ్డు మ్యాపుకు ఫైనల్ టచ్ అప్స్ ఇస్తున్నట్లు భావించవచ్చును.     సంక్లిష్టమయిన రాష్ట్ర విభజన ప్రక్రియలో రోడ్డు మ్యాప్ గీసిచ్చే భాగ్యం ఆయనకి దక్కడం గొప్ప విషయమే అయినప్పటికీ, వోక్స్ వ్యాగన్ కార్ల కంపెనీని వైజాగ్ కి రప్పించే ప్రయత్నంలో ఎవరినీ సంప్రదించకుండా తమ్ముడ్ని వెంటేసుకొని విమానం ఎక్కి జర్మనీ వెళ్లి ముక్కు మొహం తెలియని వాడిచేతిలో రూ.11కోట్ల పెట్టి వచ్చి, ఆనక ‘సొమ్ములు పోనాయి నానేటి సేసేది?’అని అడిగినట్లు, తన మ్యాపులో గీతలు వంకరపోయి దానివల్ల సీమాంధ్ర ప్రాంతానికి ఏదయినా నష్టం జరిగితే ఆనక జనాలకి జవాబు చెప్పుకోవడం అంత వీజీ కాదని అర్ధమయినందువల్లనేమో, ఎందుకయినా మంచిదని ఆయన డిల్లీలో కనబడిన ప్రతీ తెలుగు మంత్రిని కలిసి తన మ్యాపుని చూపించి వారిచేత ఒకే చేయించుకొంటున్నారు. అందువల్ల రేపు రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎటువంటి సమస్య తలెత్తినా ఎవరూ తనను తప్పు పట్టకుండా ఉండాలని కొంచెం ముందు చూపుతో ఆయన వ్యవహరిస్తున్నట్లుంది. అది కూడా ఒకందుకు మంచిదేనని చెప్పవచ్చును. ఆయనొక్కడూ ఏదో తనకు తోచిన గీతలు గీసుకొని వెళ్లి అధిష్టానం చేతిలో పెట్టి చక్కారావడం కంటే అన్ని ప్రాంతాల నేతలను కలిసి రాష్ట్ర విభజన సమయంలో వారివారి ప్రాంతాలలో తలెత్తే సమస్యలను ముందుగానే గుర్తించగలిగితే విభజన జరిపే ముందుగానే వాటికి సరయిన పరిష్కార మార్గాలు కనుకొనే అవకాశం ఉంటుంది. మరి బొత్స బాబు ప్రస్తుతం అదే పని మీద ఉండి ఉంటే ఆయనని మెచ్చుకోక తప్పదు.

కేసీఆర్ ఇంట్లో ఈ లొల్లేంది

  ఇప్పటికీ అనేక సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న కేసీఆర్ కి ఇప్పుడు స్వయాన్నతన అన్న కూతురే తనపై మానవహక్కుల కమీషన్ లో పిర్యాదు చేయడం ఇబ్బందికరంగా మారింది. తెలంగాణ రాష్ట్రీయ లోకదళ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలయిన వేగులపాటి రమ్య కొద్ది వారాల క్రితం తెలంగాణ మాదిగ దండోరా నాయకుడు చింతా స్వామి ఆధ్వర్యంలో, కేసీఆర్ ఇంటి ముందు 'వెయ్యి డప్పులు-లక్ష చెప్పులు' అనే ఒక నిరసన కార్యక్రమం చెప్పట్టాలనుకొన్నారు. దానికోసం ఒక పోస్టర్‌ కూడా సిద్దం చేసి దానిని విడుదలకు జరిపిన ఒక సభలో, ఆమె తన పెదనాన్న కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించారు. దానికి ఆగ్రహించిన తెరాస మహిళా నేతలు కరీంనగర్ లో రమ్యకు చెందిన ఒక ఫంక్షన్ హాలుపై దాడి చేసి అక్కడి వస్తువులను ధ్వంసం చేశారు.   రమ్య మొన్ననే ఈ విషయంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి పిర్యాదు కూడా చేశారు. ఈ రోజు ఆమె మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించి, తనకు తన కుటుంబానికి కెసిఆర్ మరియు తెరాస కార్యకర్తల నుంచి ప్రాణహాని ఉందని, అందువల్ల తమకు తగిన రక్షణ కల్పించాలని కోరారు. ఆమె పిర్యాదుని స్వీకరించిన మానవ హక్కుల సంఘం ఈ అంశంపై వచ్చే నెల 8వ తేదీ లోగా నివేదిక ఇవ్వాలని కరీంనగర్ పోలీసు సుపరెండేంట్ కు ఆదేశాలు జారీ చేసింది.   ఇది టీకప్పులో తుపానులా త్వరలోనే సమసిపోవచ్చును, కానీ ఈ సంఘటన కేసీఆర్ కుటుంబకలహాలను బయట పెట్టింది.

తెలంగాణకు కట్టుబడి ఉన్నాం: బాబు

      తెలంగాణపై మహానాడులో తీర్మానం చేశామని, తెలంగాణకు టీడీపీ కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణ అమరులైనవారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో తెలుగుదేశం పార్టీ తెలంగాణ విషయంలో మరింత స్పష్టత ఇస్తున్నట్లుగానే భావించాల్సి ఉంటుంది. తాము అధికారంలోకి రాగానే రూ10వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. కేటీఆర్ వసూళ్లపై టీఆర్ఎస్ ఎందుకు నోరు విప్పదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అరాచకాలను ఎండగడతామని బాబు తెలిపారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కలుస్తాయని వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చాక రైతు రుణమాఫీ చేసి చూపిస్తామని బాబు వెల్లడించారు. టీడీపీ హాయంలో హైదరాబాద్ ఆదాయం పెరిగిందని తెలిపారు.

మోడీ కోసం తవ్విన గోతిలో కాంగ్రెస్

  గుజరాత్ లో 2004లో జరిగిన ఒక ఎంకౌంటర్ లో ముంబై కి చెందిన ఇష్రాద్ అనే 19 ఏళ్ల యువతి కూడా మృతి చెందింది. అది భూటకపు ఎన్కౌంటర్ అని ఆరోపణలు వెల్లువెత్తడంతో, కేంద్రం సీబీఐని దర్యాప్తుకి ఆదేశించింది. సీబీఐ కూడా చాలా చురుకుగా దర్యాప్తు చేసి, ఇది ఖచ్చితంగా భూటకపు ఎన్కౌంటరేనని తేల్చి చెప్పడమే కాకుండా దీనితో సంబంధం ఉందని భావించిన అనేక మంది గుజరాత్ పోలీసు అధికారులను కూడా అదుపులోకి తీసుకొంది. దాదాపు 1200 పేజీల చార్జ్ షీట్ కూడా తయారు చేసింది.   అయితే, ఇష్రాద్ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని హత మార్చేందుకు మానవబాంబుగా శిక్షణ తీసుకొన్నయువతి అని ఇంటలిజన్స్ బ్యురో 2009 లోనే నాటి హోంమంత్రి చిదంబరానికి ఒక లేఖ వ్రాసింది. అదే విధంగా అమెరికాలో పట్టుబడ్డ డేవిడ్ హెడ్లీ కూడా ఇష్రాద్ పేరుని ప్రస్తావించాడు. అయితే ఇంటలిజన్స్ బ్యూరో (ఐ.బీ.) హోంమంత్రికి వ్రాసిన లేఖ గురించి, హెడ్లీ చెప్పిన అంశాల గురించి కేంద్రానికి పూర్తి సమాచారం ఉన్నపటికీ, సీబీఐ ను విచారణకు ఆదేశించడం, సీబీఐ అది భూటకపు ఎన్కౌంటర్ అని తేల్చి చెప్పడం జరిగిపోయింది.   కానీ, సీబీఐ అధికారులు తమను కూడా వేదిస్తున్నారంటూ ఇంటలిజన్స్ బ్యూరో (ఐ.బీ.) డైరక్టర్ హోంశాఖకు వ్రాసిన లేఖ బయటపడటంతో, ఒక్కసారిగా ఈ తెర వెనుక భాగోతం కూడా బయటపడింది.   మోడీని ప్రధాని అభ్యర్ధిగా ముందుకు తీసుకు వచ్చి రాహుల్ గాంధీకి సవాలు విసురుతున్న తమను కట్టడి చేయడానికే, కేంద్రం, సీబీఐ రెండూ కలిసి ఈ నాటకమంతా ఆడాయని గ్రహించిన బీజేపీ కాంగ్రెస్ కు, సీబీఐకి ఈ విషయంలో అనేక ప్రశ్నలు సందించింది. కానీ వాటికీ జవాబు ఇవ్వకుండా, త్వరలోనే మోడీ అసలు రూపం బయటపడుతుందని కాంగ్రెస్ బీజేపీని ఇంత కాలంగా ఎద్దేవా చేస్తూ వచ్చింది. కానీ, ఇప్పుడు అకస్మాతుగా ఐ.బీ. వ్రాసిన లేఖ బయటపడటంతో కాంగ్రెస్ పని కుడితిలో పడిన ఎలుకలా తయారయింది.   సుప్రీంకోర్టు ఇటీవలే సీబీఐని ‘అనేక యజమానుల చేత ఆడించ బడుతున్న పంజరంలో చిలుక’గా అభివర్ణించిన కొద్ది రోజులకే, సీబీఐ మళ్ళీ అత్యుత్సాహానికి పోయి మరో మారు కోర్టు తనకిచ్చిన పేరుని సార్ధకం చేసుకొంది.   ఐబీ అధికారులు చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఇస్తూ సిబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా తాము హైకోర్టు ఆదేశాల మేరకే వారిని విచారణ చేస్తున్నామని, ఇష్రాత్ కేసులో ఐబి ప్రమేయం కూడా ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని చెప్పడం విశేషం. అంటే, ఐబీని కూడా ఈ కేసులో దోషిగా భావిస్తున్నదా? అనే సంగతి ఇంకా సీబీఐ స్పష్టం చేయవలసి ఉంది.   ఈవిధంగా రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇంత తీవ్రమయిన కేసులో ఇంత తీవ్రమయిన ఆరోపణలు ఒకరిపై మరొకరు గుప్పించుకోవడంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. మోడీ కోసం తవ్వుతున్న గోతిలోనే తాను కూడా నిలబడి ఉన్నట్లు కాంగ్రెస్ కాస్త ఆలస్యంగా గుర్తించింది. ఇప్పుడు ఆ గోతి లోంచి ఎవరు బయటపడుతారో కాలమే చెపుతుంది.