తెలంగాణా ఇస్తే గోర్ఖల్యాండ్ కూడా ఇవ్వాల్సిందే
posted on Jul 15, 2013 @ 10:26AM
ఇక వీలయినంత త్వరగా తెలంగాణ సమస్యని తేల్చేయాలని కృతనిశ్చయంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి భయపడినట్లుగానే, గోర్ఖల్యాండ్ ఉద్యమనేతలు నిన్న సమావేశమయి, ఒకవేళ కేంద్రం తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుచేసినట్లయితే, దానితో బాటు తమకు కూడా గోర్ఖల్యాండ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేయాలని నిర్ణయించుకొన్నారు. దాదాపు 5గంటల పాటు సాగిన సమావేశానంతరం గోర్ఖల్యాండ్ జనముక్తి మోర్చా అధ్యక్షుడు బిమల్ గురంగ్ మీడియాతో మాట్లాడుతూ, “ఒక వేళ కేంద్రం తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయదానికి సిద్దపడితే, అదే సమయంలో మాకు గోర్ఖల్యాండ్ రాష్ట్రం కూడా ఏర్పాటు చేయాలనీ కోరుతూ త్వరలో మేము కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, హోంమంత్రి సుషీల్ కుమార్ షిండేకి లేఖలు వ్రాస్తాము. అయినప్పటికీ, వారు మా విన్నపాలను పట్టించుకోకపోతే కేంద్రం తెలంగాణా ప్రకటన చేసిన వెంటనే మళ్ళీ మేము మా గోర్ఖల్యాండ్ రాష్ట్రం కోసం ఉద్యమాలు మొదలుపెడతాము,” అని చెప్పారు.
గోర్ఖల్యాండ్ రాష్ట్ర డిమాండ్ కూడా ఎప్పటి నుండో ఉన్నపటికీ దానిని పరిమిత అధికారాలు కలిగిన గోర్ఖల్యాండ్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం ద్వారా కేంద్రం సర్దుబాటు చేయగలిగింది. అయితే అది కేవలం తాత్కాలిక పరిష్కారమేనని అటు కాంగ్రెస్ ఇటు గోర్ఖల్యాండ్ జనముక్తి మోర్చ నేతలకి కూడా తెలుసు. ఇప్పుడు కేంద్రం తెలంగాణా అంశం పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నపటికీ, గోర్ఖల్యాండ్, విదర్భ వంటి ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్స్ మళ్ళీ తలెత్తుతాయని భయపడుతూనే ఉంది. అది భయపడుతున్నట్లుగానే గోర్ఖల్యాండ్ ఉద్యమనేతలు కేంద్రానికి అల్టిమేటం జారీ చేసారు.
ఇది తెలంగాణా అంశానికి బ్రేకులు వేసే అవకాశం లేకపోలేదు. అయితే, ఇటువంటి పరిణామాలను ముందు నుండే ఊహిస్తున్న కాంగ్రెస్ దైర్యంగా తెలంగాణపై నిర్ణయం తీసుకొంటుందా లేక ఈ సమస్యలన్నిటినీ తప్పించుకొనేందుకు రెండవ యసార్సీ వేసేసి చేతులు దులుపుకొంటుందా? అనే విషయం త్వరలోనే తేలిపోవచ్చును. బహుశః కాంగ్రెస్ తనకు కొంత వెసులుబాటు కల్పించే రెండవ యసార్సీకే మొగ్గు చూపవచ్చును.