మన్మోహన్ విధానాలను తప్పు బట్టిన కిషోర్ చంద్ర దేవ్
posted on Jul 15, 2013 @ 2:06PM
కేంద్రమంత్రి గిరిజన శాఖా మంత్రి కిషోర్ చంద్ర దేవ్ ఒక ప్రముఖ దినపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యులో ప్రధాని మన్మోహన్ సింగ్ విధానాలను తప్పుబడుతూ మాట్లాడటం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. దేశంలోవివిధ రాష్ట్రాలలో మావోయిస్టులు వ్యాప్తి చెందడానికి ప్రధాని మన్మోహన్ ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాలే కారణమని ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు.
ఉదారవాద ఆర్థిక విధానాలు, పారిశ్రామికీకరణ పేరుతో కొంతమంది పెట్టుబడిదారులకు అనుకూలంగా ప్రభుత్వం విధివిధానాలు ఏర్పరచడంతో, కోటీశ్వరులయిన వ్యాపారవేత్తలు మరింత ధనికులుగా మారుతుంటే, వారి దోపిడీకి గురయిన గిరిజన ప్రాంతాలలో ప్రజలు ఆకలికి, రోగాలకు, రొప్పులకు, నిరుద్యోగంతో బాధలుపడుతూ చివరికి మావోయిస్టుల ప్రభావానికి లోనవుతున్నారని ఆయన ఆరోపించారు. కానీ, ప్రభుత్వం ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా మావోయిస్టులను కేవలం శాంతి భద్రతల సమస్యగా పరిగణిస్తూ వారిని అణచివేయాలని విఫలయత్నాలు చేస్తోందని ఆయన అభిప్రాయ పడ్డారు.
ప్రభుత్వాలు తనకు అనుకూలురయిన కొంత మంది పారిశ్రామికవేత్తలతో కలిసి అవలంభిస్తున్న ‘ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం’ నికి (క్రోనీ కేపిటలిజం) తాను మనస్పూర్తిగా వ్యతిరేఖిస్తున్నాని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ముఖ్యంగా గిరిజనుల, ఆదివాసిలా హక్కులను కాపాడవలసిన ప్రభుత్వాలు సదరు పారిశ్రామికవేత్తలతో కలిసి, వారికి చెందిన అటవీప్రాంతాలలో మైనింగ్ కార్యకలాపాలకు అనుమతులీయడాన్ని ఆయన తప్పు పట్టారు.
రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని ప్రమాణం చేసిన ప్రతీ ఒక్కరు దానికి కట్టుబడి ఉండాలి. కానీ, ఆ ప్రమాణాలు నీటి మీద రాతలుగానే మిగిలిపోతున్నాయి. కోట్ల మంది ఆదివాసీలు, గిరిజనుల కష్ట నష్టాలను, బాధలను పట్టించుకోకుండా ప్రభుత్వాలు కొందరు పారిశ్రామిక వేత్తలకి కొమ్ముకాస్తున్నాయి. అంతేకాక గిరిజనులు, బలహీన వర్గాలకోసం కేటాయించబడిన నిధులు కూడా వారికి చేరకపోగా, అవి వేరే ఇతర అవసరాలకు వినియోగించబడుతున్నాయి. కనీసం వారికి కేటాయించిన నిధులు వారికే సద్వినియోగం చేసినా నేడు సమస్య ఇంత తీవ్రంగా ఉండేది కాదు. కానీ ప్రభుత్వాలకి, మంత్రులకీ కూడా జవాబుదారీ లేకపోవడం వలన ఎన్నేళ్ళు గడచినా వారి జీవితాలలో మార్పు రాలేదు. తత్ఫలితమే నానాటికి మావోయిజం పెరుగుతోంది. త్వరలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారికత మంత్రిత్వ శాఖతో కలిసి జవాబుదారీ బిల్లును తీసుకు రానున్నట్టు ఆయన తెలిపారు.
కేంద్ర మంత్రిగా ఉన్న కిషోర్ చంద్ర దేవ్ ఇంత లోతుగా సమస్యని అధ్యయనం చేసి పరిష్కార మార్గాలు చెపుతున్నప్పటికీ, ఆయనే చెపుతునట్లు కొందరు బడా పారిశ్రామిక వేత్తల కనుసన్నలలో నడుస్తున్న ప్రభుత్వాల పనితీరుని మార్చడం ఆయన వలన సాధ్యమయ్యే పనేనా?